‘మహానటి’ టీంను సత్కరించిన మంచు ఫ్యామిలీ
ప్రముఖ నటి సావిత్రి జీవితంపై తెరకెక్కిన 'మహానటి' చిత్రంపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉంది. ఇండస్ట్రీ బిగ్ షాట్స్ చిత్ర బృందాన్ని సన్మానాలు, సత్కారాలతో ముంచెత్తుతున్నారు. తాజాగా మంచు ఫ్యామిలీ స్టార్స్ మోహన్ బాబు, మంచు లక్ష్మి, విష్ణు టీంను సన్మానించారు.
'మహానటి'లో మోహన్ బాబు కూడా కీలకపాత్ర పోషించారు. సినిమాలోని మాయాబజార్ ఎపిసోడ్లో ఎస్వీ రంగారావు పాత్రలో డైలాంగ్ కింగ్ నటించారు. సినిమా గొప్ప విజయం అందుకోవడం, తెలుగు సినిమా చరిత్రలో ఒక క్లాసిక్‌గా కీర్తికెక్కడం, ఇలాంటి సినిమాలో తాను కూడా భాగం కావడం ఆనందంగా ఉందని మోహన్ బాబు తెలిపారు.
ఇంతకు ముందు మెగాస్టార్ చిరంజీవి, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ వీరిని సన్మానించిన సంగతి తెలిసిందే. చిరంజీవి చిత్ర బృందాన్ని తన ఇంటికి పిలిపించి సన్మానించగా, అల్లు అరవింద్ గీతాఆర్ట్స్ తరుపున గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేశారు.
మహానటి విడుదలైన అన్ని చోట్లా మంచి వసూళ్లు సాధిస్తోంది. కమర్షియల్ సినిమాల రేంజిలోకాక పోయినా అన్ని ప్రాంతాల్లో సంతృప్తికరమైన వసూళ్లు సాధిస్తోంది. తొలి 5 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 16.2 కోట్ల షేర్ సాధించింది. అధిక భాగం వసూళ్లు యూఎస్ఏలో రావడం విశేషం.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'మహానటి' చిత్రం మే 9న విడుదలై సూపర్ పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లు సాధిస్తోంది. కీర్తీ సురేష్ టైటిల్ పాత్రలో నటించగా దుల్కర్ సల్మాన్ సావిత్రా భర్త జెమినీ గణేశన్ పాత్రను పోషించారు. సావిత్రి చిన్నతనం నుండి మహానటిగా ఆమె ఎలా ఎదిగారు, 45 ఏళ్ల వయసులోనే ఆమె జీవితం ఎలా ముగిసింది అనే విషయాలన్నీ ఈ సినిమాలో చూపించారు.

Recommended Video

స్టార్ హీరోయిన్ సమంత ఈ మూవీలో జర్నలిస్టు మధురవాణి పాత్ర పోషించారు. ఆమెతో పాటు ఉండే ప్రెస్ ఫోటోగ్రాఫర్ పాత్రలో విజయ్ దేవరకొండ నటించారు. వీరితో పాటు మోహన్ బాబు ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్, మాళవికా నాయర్, భానుప్రియ, దివ్యవాణి, శ్రీనివాస్ అవసరాల, దర్శకులు క్రిష్, తరుణ్ భాస్కర్ ముఖ్యపాత్రల్లో మెరిశారు.


Click it and Unblock the Notifications











