»   » పవన్ 'ఇజం' లాంచ్ డేట్ ఖరారు

పవన్ 'ఇజం' లాంచ్ డేట్ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: జనసేన పార్టీ ఐడియాలజీతో ఆపార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ పుస్తకం రాసిన సంగతి తెలిసిందే. 'ఇజం' పేరుతో రెడీ అయిన ఈ పుస్తకాన్ని పవన్‌కల్యాణ్‌ ఈ నెల 25 న విడుదల అవుతున్నట్లు సమాచారం. తన మిత్రుడు రాజు రవితేజతో కలిసి పవన్‌ కల్యాణ్‌ ఇజం పుస్తకం రాసారు. జనసేన పార్టీ భావజాలంతో పవన్ కళ్యాణ్ ఈ పుస్తకం రాసినట్టు తెలుస్తోంది. అన్ని పుస్తకాల షాపుల్లో ఈ పుస్తకాన్ని దొరికేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

మరోవైపు పార్టీ పనుల్లో పవన్ కళ్యాణ్ తీరిక లేకుండా ఉన్నారు. సామాజిక, రాజకీయ ఎజెండాతో ఆయన ముందుకు సాగనున్నారు. పార్టీలో చేరతామంటూ తమకు వేలాది ఫోన్లు వస్తున్నాయని జనసేన పార్టీ కార్యాలయం వెల్లడించింది. అయితే పవన్ కళ్యాణ్ పార్టీ విధి విధానాలు ఏవిధంగా ఉండబోతున్నాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Pawan Kalyan’s book to be launched on 25th

పవన్‌ కల్యాణ్‌ తన కొత్త రాజకీయ పార్టీ పేరును 'జన సేన'గా అధికారికంగా ప్రకటించారు. పలు అంశాలపై తన హృదయాన్ని ఆవిష్కరించారు. 'కాంగ్రెస్‌ కో హఠావ్‌...దేశ్‌ కో బచావ్‌' అని ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన జరిగిన తీరుపై విరుచుకుపడ్డ పవన్‌... కాంగ్రెస్‌పై, ఆ పార్టీ అధిష్ఠాన పెద్దలపై నిప్పులు చెరిగారు. అయిదేళ్ల పాటు ఏం చేయకుండా... ఆఖర్లో 23 నిమిషాల్లోనే ప్రత్యక్ష ప్రసారాలను ఆపి మరీ లోక్‌సభలో రాష్ట్ర విభజన బిల్లుకు ఆమోదం తెలిపారని, ఏ ప్రాంతానికి సంతృప్తి కలిగించలేదని విమర్శించారు. తెలంగాణ ఇవ్వదలుచుకుంటే 2009 లోనే సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలు రాష్ట్ర ప్రజలను అందుకు సిద్ధం చేసివుంటే తెలంగాణలో ఇంత మంది తల్లులకు గుండెకోత ఉండేది కాదన్నారు.

తెలంగాణకూ న్యాయం చేయలేదని, హైదరాబాద్‌ను పదేళ్ల పాటు ఉమ్మడి రాజధాని అన్నారని, ఖమ్మం జిల్లాలోని కొన్ని మండలాలను లేకుండా చేశారని ప్రస్తావించారు. ఆర్థిక సంస్కరణలు తెచ్చి దేశాన్ని అభివృద్ధి చేసిన పీవీ నర్సింహరావు చనిపోతే... ఆయన మృతదేహాన్ని ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం లోపలికి రానివ్వలేదని, హైదరాబాద్‌కు పంపేస్తే ఇక్కడా కాలీ కాలకుండా సంస్కారం చేశారని చెప్పారు. పీవీ అంటే అధిష్ఠానానికి అంత కోపమన్నారు. ప్రతీ తెలుగువాడూ పీవీ నరసింహారావులా అధిష్ఠానానికి కనిపించాడో ఏమో రాష్ట్రంపై ఇంతటి కోపం ప్రదర్శించారని వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ పార్టీకి ఢిల్లీలో ఒక పవిత్ర నాయకత్వం ఉంటుందని ఎద్దేవా చేసిన పవన్‌ కల్యాణ్‌... కేంద్ర మంత్రులు జైరాం రమేష్‌, సుశీల్‌కుమార్‌ షిండే, చిదంబరం, వీరప్ప మొయిలీ, అధిష్ఠానం పెద్దలు అహ్మద్‌ పటేల్‌, దిగ్విజయ్‌సింగ్‌లను పేరుపేరున ప్రస్తావిస్తూ విమర్శించారు. 'తెలుగు ప్రజలను మోసం చేశారు. గాయపడ్డాం. మా హృదయాలు రక్తమోడుతున్నాయి. మిమ్మల్ని నమ్మాం. వెన్నుపోటు పొడిచారు. జనం తరఫున, జనసేన తరఫున ఒకటే పిలుపునిస్తున్నా. కాంగ్రెస్‌ కో హటావ్‌...దేశ్‌ కో బచావ్‌' అని ఉద్ఘాటించారు. సభకు హాజరైన వారితో 'కాంగ్రెస్‌ కో హటావ్‌...దేశ్‌ కో బచావ్‌' అని రెండుసార్లు చెప్పించారు. కాంగ్రెస్‌ ఒక్క స్థానమూ గెలవదన్నారు.

అది గెలవకుండా చేసేందుకు తాను పోరాడతానని ప్రకటించారు. తెలంగాణకు తాను వ్యతిరేకం కాదని, అలాగని సీమాంధ్ర ప్రాంతపు ఆత్మగౌరవం, తెలుగు ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటే వూరుకోబోనని చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవానికి భంగం కలిగిస్తే సోనియాతో సహా ఎవర్నీ వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు. జాతి సమగ్రతను చెడగొట్టే వీరిని అంగీకరించ బోనని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తానా? చేయనా? అన్నది ఇప్పుడే చెప్పలేనన్నారు. పార్టీ నిర్మాణం చేస్తానని...జంపింగ్స్‌ నేతలను, జోకర్స్‌ను తీసుకోబోనని స్పష్టం చేశారు. జనసేన సిద్ధాంతాలు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని ప్రకటించారు.

English summary
Pawan Kalyan has penned a book titled ‘ISM’ and this book is going to serve as the political reference point for his Janasena Party.
 This book will be released on the 25th of this month and it will be available across all leading book stores in the state
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu