సల్మాన్ ' ప్రేమ్ రతన్ ధన్ పాయో' కథ ఇదే (ప్రివ్యూ)
హైదరాబాద్: సల్మాన్‌ఖాన్, సోనమ్ కపూర్ జంటగా రూపొందిన చిత్రం ప్రేమ్ రతన్ ధన్ పాయో. ఈ చిత్రాన్ని తెలుగులో 'ప్రేమ లీల' టైటిల్ తో విడుదల చేస్తున్నారు. తెలుగులో సల్మాన్ ఖాన్ కు రామ్ చరణ్ డబ్బింగ్ వాయిస్ ఇస్తున్నారు. సూరజ్ భాటియా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ రోజుఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
తెలుగులో 'ప్రేమలీల', తమిళంలో 'మెయ్ మరన్‌దాయో అన్బే' పేరిట తీసుకొస్తున్నారు. అమెరికన్ రచయిత మార్క్ ట్వెయిన్ రాసిన 'ది ప్రిన్స్ అండ్ ది పాపర్' కథ ఆధారంగా దీన్ని తెరకెక్కించినట్లు సమాచారం. ఈ చిత్రం పాకిస్థాన్‌లోనూ విడుదలవుతోంది.
చిత్రం కథ ఏమిటంటే.... ప్రేమ్(సల్మాన్) డ్రామా కంపెనీలో పనిచేసే సామాన్యుడు. సేవాగుణమున్నోడు. సంపాదన తక్కువైనా ఉన్నదాంట్లోనే ఓ దాతృత్వ సంస్థకు విరాళమిస్తుంటాడు. ఆ సంస్థను నిర్వహిస్తున్నది యువరాణి మైథిలి (సోనమ్ కపూర్) అని తెలుస్తుంది. ఆమెను ఇష్టపడిన ప్రేమ్ మైథిలిని చూడాలన్న కోరికతో అంతఃపురానికి వెళ్తాడు.

ఆ రాజ్యాన్ని పాలించే రాజు విజయ్(సల్మాన్) అచ్చు ప్రేమ్ పోలికలతో ఉంటాడు. రాజు సవతి సోదరులిద్దరు సింహాసనం చేజిక్కించుకోవాలని కుట్రలు పన్నుతుంటారు. మైథిలిని కలుసుకున్నాక ప్రేమ్‌కు తను కూడా ఆ రాజవంశానికి చెందినవాడేనన్న నిజం తెలుస్తుంది. మరి ప్రేమ్ తన కుటుంబానికి ఎలా దూరమయ్యాడు? దానికి కారకులెవరు? నిజం తెలిసిన తర్వాత విజయ్, ప్రేమ్ ఏం చేశారు? మైథిలి ప్రేమను ప్రేమ్ గెలిచాడా? ఈ విషయాలను 'ప్రేమ్ రతన్ ధన్ పాయో'లో చూడాల్సిందే.
1989లో విడుదలైన 'మైనే ప్యార్ కియా'తో రాజ్‌శ్రీ ప్రొడక్షన్స్, దర్శకుడు సూరజ్ బర్జాత్యా, సల్మాన్‌ల కాంబినేషన్‌కు శ్రీకారం జరిగింది. బర్జాత్యాకు తొలి చిత్రం, సల్మాన్‌కు రెండో చిత్రమిది. ఈ చిత్రం ఘనవిజయం సాధించింది. ప్రేమ్ పాత్రలో అద్భుతమైన నటన కనబర్చిన సల్మాన్ లవర్‌బోయ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత ఐదేళ్లకు ఇదే కాంబినేషన్‌లో 'హమ్ ఆప్కే హై కౌన్' వచ్చింది.
కుటంబ అనుబంధాల కోసం తన ప్రేమనే వద్దనుకునే ప్రేమ్‌గా సల్మాన్ మెప్పించాడు. ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం గెలుచుకుందీ సినిమా. 1999లో వచ్చిన 'హమ్ సాథ్ సాథ్ హై'తో ఈ కాంబినేషన్ హ్యాట్రిక్ విజయం సాధించింది. 16 ఏళ్ల విరామం తర్వాత ఇప్పుడు 'ప్రేమ్ రతన్ ధన్ పాయో'తో మరోసారి కలిశారు.
నటీనటులు: సల్మాన్‌ఖాన్, సోనమ్ కపూర్, నీల్ నితీన్ దేశ్ముఖ్, అనుపమ్ ఖేర్, స్వర భాస్కర్, సంజయ్ మిశ్రా తదితరులు
సంగీతం: హిమేష్ రేష్మియా,
నేపధ్య సంగీతం: సంజయ్ చౌదరి,
చాయాగ్రహణం: వి.మణికందన్,
ఎడిటర్: సంజయ్ సంక్ల,
పంపిణీ: ఫాక్స్ స్టార్ స్టూడియోస్,
నిర్మాణం: రాజశ్రీ ప్రొడక్షన్స్,
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: సూరజ్ బరజాత్య
విడుదల తేదీ: 12, నవంబర్ 2015


Click it and Unblock the Notifications











