సోనమ్ కపూర్ వీడియోతో ఇబ్బందుల్లో దుల్కర్ సల్మాన్... పోలీసుల వార్నింగ్!
'కార్వాన్' సినిమా ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మలయాళం యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ తన సెకండ్ బాలీవుడ్ ఫిల్మ్ 'ది జోయా ఫ్యాక్టర్' షూటింగులో బిజీ అయిపోయాడు. ఇందులో సోనమ్ కపూర్‌తో కలిసి దుల్కర్ నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఇద్దరిపై ముంబై సిటీలో సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది.
అయితే షూటింగ్ సెట్స్‌కు సంబంధించిన ఓ వీడియో దుల్కర్ సల్మాన్‌ను ఇబ్బందుల్లో పడేసింది. దీంతో అతడు రోడ్ సేఫ్టీ నిబంధనలు పాటించడం లేదంటూ ముంబై పోలీసులు హెచ్చరించారు. ఈ వీడియో పోస్ట్ చేసింది మరెవరో కాదు.... సోనమ్ కపూర్.
ఆ వీడియోలో ఏముందంటే..?
ఆ వీడియోలో దుల్కర్ సల్మాన్ డ్రైవింగ్ సీట్లో కూర్చుని కారు నడుపుతున్నట్లు ఉంది. అయితే కారు డ్రైవ్ చేస్తూ మొబైల్ వాడుతుండటంపై మందలిస్తూ సోనమ్ ఈ వీడియో తీశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ముంబై పోలీస్ విభాగం ట్విట్టర్ ద్వారా స్పందించారు.
రీల్ లైఫ్‌లోనూ ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్స్ అంగీకరించబోము
ముంబై పోలీసులు స్పందిస్తూ.... దుల్కర్ సల్మాన్ కారు డ్రైవ్ చేస్తూ ఫోన్ వాడటాన్ని తప్పుబట్టారు. సినిమాల్లో కూడా తాము ఇలాంటివి అంగీకరించబోమని, దీని వల్ల మీ ప్రాణాలు మాత్రమే కాదు, మీ నిర్లక్ష్యపూరితమైన డ్రైవింగ్ వల్ల ఇతరుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి అని హెచ్చరించారు.

అసలు విషయం చెప్పిన సోనమ్
అయితే ముంబై పోలీసులు ఎంటరవ్వడంతో సోనమ్ కపూర్ అసలు విషయం వెల్లడించారు. దుల్కర్ కారుడ్రైవ్ చేయలేదని, ట్రక్కుతో లాగబడుతున్న కారులో తాము ఇద్దరం కూర్చున్నామని, ఇదంతా షూటింగులో భాగమని, మీరు ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉన్నందుకు ధన్యవాదములు అంటూ రిప్లై ఇచ్చారు.

అభిమానులకు సందేశం ఇచ్చేందుకేనా?
అయితే దుల్కర్ సల్మాన్, సోనమ్ కపూర్, ముంబై పోలీసుల మధ్య జరిగిన ట్విట్టర్ కన్వర్జేషన్ చూస్తుంటే.... రోడ్ సేఫ్టీ విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు మెసేజ్ ఇవ్వడంలో భాగంగా ఇదంతా చేసినట్లు స్పష్టమవుతోంది.


Click it and Unblock the Notifications











