»   » తెలంగాణ శకుంతల అంత్యక్రియలు(ఫొటోలు)

తెలంగాణ శకుంతల అంత్యక్రియలు(ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :తెలంగాణ శకుంతలకి తెలుగు చిత్ర పరిశ్రమ ఘన నివాళి అర్పించింది. అభిమానుల సందర్శనార్థం శనివారం ఆమె భౌతికకాయాన్ని చలన చిత్ర వాణిజ్య మండలి ఆవరణంలో కాసేపు ఉంచారు. పలువురు సినీ ప్రముఖులు అక్కడికి చేరుకొని నివాళులర్పించారు. అనంతరం అల్వాల్‌ శ్మశాన వాటికలో అంత్యక్రియల్ని నిర్వహించారు.

ప్రముఖ నటి తెలంగాణ శకుంతల (65) శుక్రవారం రాత్రి 12 గం|| సమయంలో గుండె పోటుతో హైదరాబాద్‌లో మరణించారు. నగర శివార్లలోని కొంపల్లిలో నివాసముంటున్న ఆమె 11 గంటల సమయంలో తీవ్ర గుండెపోటుకి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హుటాహుటిన ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ అక్కడే తుదిశ్వాస విడిచారు.

తెలంగాణ శకుంతలకు కె.ఎస్‌.ఆర్‌.ప్రసాద్‌తో పాటు కొడుకు తేజశ్‌, కూతురు సుశీల ఉన్నారు. శకుంతల హఠాన్మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. ఒక మంచి నటిని కోల్పోయామనీ, ఆమె మరణం చిత్ర పరిశ్రమకు తీరని లోటని పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు.

అంత్యక్రియలు ఫోటోలు స్లైడ్ షోలో...

ఇంటి పేరుగా...

ఇంటి పేరుగా...

250కిపైగా చిత్రాల్లో నటించిన తెలంగాణా శకుంతల ఎక్కువగా తెలంగాణ యాసతో ప్రాచుర్యం పొందారు. అలా ఇంటిపేరు కూడా తెలంగాణగా మారిపోయింది. ఆమె సొంత పేరు కడియాల శకుంతల.

తెలుగు కాదు కానీ..

తెలుగు కాదు కానీ..

తెరపై ఎలాంటి యాసనైనా అలవోకగా మాట్లాడే శకుంతల తెలుగువారు కాదంటే నమ్మగలరా? కానీ అది నిజం. తెలంగాణా శకుంతల పుట్టి పెరిగింది మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో. తండ్రి ఉద్యోగ రీత్యా ఆమెకి పన్నెండేళ్ల వయసున్నప్పుడు కుటుంబం హైదరాబాద్‌కి మారిపోయింది. అప్పట్నుంచి హైదరాబాద్‌లోనే స్థిరపడ్డారు.

అలా...

అలా...

తొలినాళ్లల్లో తెలుగు మాట్లాడటం కాదు కదా.. కనీసం అర్థమయ్యేది కూడా కాదు. తన తండ్రి ఆఫీసులోనే పనిచేసే జయరామారావు ఓ నాటకంలో హీరోయిన్ పాత్ర కోసం శకుంతలని రిహార్సల్స్‌కి తీసుకెళ్లారట. ఆ నాటకం కోసమే ఆమె తెలుగు మాట్లాడటం నేర్చుకొన్నారు.

తొలిపాత్ర...

తొలిపాత్ర...

తొలిగా నాటకంలో శకుంతల పోషించిన పాత్రని చూసి ప్రేక్షకులు చప్పట్లు కొట్టడంతో ఆమెకి నాటకాలపై ప్రేమ పెరిగింది. అప్పట్నుంచి నాటకాల్నే జీవితంగా మార్చుకొన్నారు. కొళాయిల దగ్గర, బస్సుల్లో వెళ్లేటప్పుడు ఆడవాళ్లు మాట్లాడుకొనే మాటల్ని పదే పదే వింటూ తెలంగాణ యాసపై పట్టు పెంచుకొన్నారు శకుంతల.

అందుకే...

అందుకే...

కుటుంబం హైదరాబాద్‌కి వచ్చిన రెండేళ్లకే తండ్రి మరణించారు. దీంతో కుటుంబ పోషణభారం తల్లిపై పడింది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం కావడంతో శకుంతల నాటకాలపై దృష్టిపెట్టారు.

తొమ్మిది వేల ప్రదర్శనలు

తొమ్మిది వేల ప్రదర్శనలు

మూడేళ్లలో తెలుగు పూర్తిస్థాయిలో నేర్చుకొన్నారు. నాటక పరిషత్తులు ఎక్కడ జరిగినా... శకుంతల రెండు మూడు సమాజాల్లో హీరోయిన్ గా నటించేవారు. అలా సుమారు తొమ్మిది వేల ప్రదర్శనలు ఇచ్చారు. రెండు వేలకుపైగా పురస్కారాలు సొంతం చేసుకొన్నారు.

తొలి సినిమా...

తొలి సినిమా...

నాటకాల్లో హీరోయిన్ గా విశేషమైన గుర్తింపు సాధించడంతో తెలంగాణ శకుంతలకి సినిమా అవకాశాలు వెదుక్కొంటూ వచ్చాయి. అప్పట్లో పరిశ్రమ మద్రాసులో ఉండటంతో కుటుంబ బాధ్యతల రీత్యా శకుంతల అక్కడికి వెళ్లడానికి ఇష్టపడలేదు. హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకొన్న కొన్ని సినిమాల్లో మాత్రమే నటించారు. 'మాభూమి' చిత్రంతో తొలిసారిగా తెరప్రవేశం చెశారామె.

ఎన్నో చిత్రాలు..

ఎన్నో చిత్రాలు..

'కుక్క' చిత్రంతో ఉత్తమ సహాయనటిగా నంది పురస్కారం సొంతం చేసుకొన్నారు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకొనే అవసరం రాలేదు. 'సీతారామయ్య గారి మనవరాలు', 'ఎర్రసైన్యం', 'గులాబి', 'స్వర్ణక్క', 'ఒసేయ్‌ రాములమ్మ', 'కొండవీటి సింహాసనం', 'తప్పు చేసి పప్పు కూడు', 'ఇంద్ర', 'ఒక్కడు', 'నరసింహనాయుడు', 'నువ్వు నేను' తదితర చిత్రాల్లో నటించారు.

కామెడీ సైతం...

కామెడీ సైతం...

'ఎవడిగోల వాడిదే', 'లక్ష్మీ' చిత్రాల్లో ఆమె నటన ప్రేక్షకుల్ని పొట్టచెక్కలయ్యేలా నవ్వించింది. చివరిగా ఆమె 'పాండవులు పాండవులు తుమ్మెద'లో కనిపించారు. తెలుగుతో పాటు తమిళంలో కూడా నటించి పేరు తెచ్చుకొన్నారు శకుంతల. ఆమె కెరీర్‌లో మొత్తం నాలుగు నంది పురస్కారాలు అందుకొన్నారు.

నివాళి...

నివాళి...

ఆడ్ని సంపుండ్రీ... అంటూ తెరపై తెలంగాణ జులుం ప్రదర్శించింది. తమ్ముడూ... ఎయ్యండి నా కొడుకిని... అంటూ కడప రెడ్డెమ్మ అవతారంలో భయపెట్టింది. కత్తి చేతపట్టి ఉత్తరాంధ్ర యాసనూ తన గొంతులో పలికించింది. అందుకే ఆమె అందరికీ సొంత మనిషైపోయింది. తనదైన నటనా పటిమతో తెలుగు ప్రేక్షకుల మనసుల్ని గెలచుకొంది తెలంగాణ శకుంతల. క్రూరత్వంతో పాటు ఇటు వినోదం, అటు భావోద్వేగాల్ని సమర్థంగా పండించి తెలుగు తెరపై తనదైన ముద్రవేశారు. ఆమెకు వన్ ఇండియా తెలుగు నివాళులు సమర్పిస్తోంది.

English summary
Telangana Shakuntala, popular comedian and character artiste died following a cardiac arrest in the wee hours of Saturday. She was 63 and survived by two children. Several members of the film industry paid last respects to her and many of them recollected their association with the actress. The final rites were performed at Alwal crematorium on Saturday evening.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu