»   » అవార్డులు వచ్చినా అమ్ముడుపోవటం లేదు

అవార్డులు వచ్చినా అమ్ముడుపోవటం లేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

నా చిత్రానికి అవార్డులు వస్తున్నందుకు సంతోషంగానే ఉంది. అయితే మా చిత్రాన్ని కొనేందుకు ఇంకా ఎవరూ ముందుకు రాకపోవడమే ఇబ్బందిగా ఉంది'' అంటున్నారు '1940లో ఒక గ్రామం'తో జాతీయ అవార్డు సాధించిన దర్శకుడు నరసింహ నంది. 2008కిగాను ఉత్తమ ప్రాంతీయ చిత్రం (తెలుగు)గా '1940లో ఒక గ్రామం' ఎంపికైంది. ఈ సందర్బంగా ఆయన్ని కలిసిన మీడియాతో తన ఆవేదన వెళ్భబుచ్చారు.

ఆయన మాటల్లనే...నేను మొదటి నుంచీ నలుగురూ నడిచే దారికి విరుద్ధం. నాకంటూ గుర్తింపు రావాలంటే ఓ ప్రత్యేక పంథా ఉండాలనుకున్నాను. అందుకే 1940 నాటి ఓ కథాంశంతో ఈ సినిమా తీశాను. ప్రముఖ రచయిత చలం రాసిన 'నాయుడు పిల్ల' అనే చిన్న కథ నా మనసులో రేకెత్తించిన సంచలనమే ఈ సినిమాకు పునాది వేసింది. గురజాడ అప్పారావు రచనలు నాకు ప్రేరణనిచ్చాయి. ఈ కథ తయారీకి ఆరు నెలలకు పైగా శ్రమించాను. ఒక్క రూపాయి వ్యాపారం జరగదని సన్నిహితులంతా భయపెట్టారు. కాన్సెప్ట్‌ మీద నమ్మకంతో మొండి ధైర్యం చేశా. అప్పు దొరికినప్పుడల్లా షూటింగ్‌ చేసేవాళ్లం. ఆ విధంగా సినిమా పూర్తి కావడానికి రెండేళ్లు పట్టింది. అరవై లక్షలు మొత్తం ఖర్చయింది. ముఫ్పైసార్లు ప్రొజెక్షన్లు వేసినా కొనడానికి ఎవరూ రాలేదు. దాంతో ఈ సినిమా విడుదల కాలేదు.

ఈ చిత్రం మన సమాజంలోని కుల వ్యవస్థను ప్రశ్నించే కథాంశంతో రూపొందింది. అగ్రవర్ణాలు, నిమ్న కులాల మధ్య ఉన్న అంతరాలూ, దురాచారాలను ప్రస్తావిస్తూ కథను నడిపించాను. ఈ కథ విని నా మిత్రులే చిత్ర నిర్మాణానికి సన్నద్ధమయ్యారు. వాళ్ల ప్రోత్సాహంతోనే ఆ సినిమాను అనుకున్న విధంగా తెరకెక్కించాను. నంది పురస్కారాల్లో నాలుగు అవార్డులొచ్చాయి. చూసినవాళ్లు మంచి కథాంశం అని ప్రశంసించారు. అయితే వాణిజ్యపరమైన లెక్కలతో పంపిణీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇప్పుడు జాతీయస్థాయిలో అవార్డు రావడం ఇంకోసారి ఉత్సాహాన్నిచ్చింది'' అన్నారు. ఇక ఈ దర్శకుడు ప్రస్తుతం కిరణ్‌ రాథోడ్‌ ప్రధాన పాత్రధారిగా 'హైస్కూల్‌' అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu