స్టార్ సినీ ఫొటోగ్రాఫర్ జి.ఎన్.భూషణ్ మృతి

హేమామాలిని, కాంచన, జమున లాంటి ప్రముఖ కథానాయికలుగా వెలిగిన వాళ్ల తొలి ఫొటోలు తీసింది భూషణే. ఆయన ఫ్లాష్ పడిందంటే పెద్ద హీరోయిన్ అవ్వాల్సిందే అని అప్పట్లో చెప్పుకొనేవారు. ఎన్టీఆర్, ఏఎన్నార్‌లతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తరవాత.. మద్రాస్‌లో ఉన్న భూషణ్‌ని హైదరాబాద్ తీసుకొచ్చారు. ఎన్నికల సమయంలో ప్రచారానికి కావల్సిన అన్ని ఫొటోలనూ భూషణ్ చేతే తీయించారు.
చలన చిత్ర రంగానికి చెందిన ప్రముఖుల అరుదైన ఫొటోలు ఇప్పటికీ ఆయన దగ్గర భద్రంగా ఉన్నాయి. భూషణ్ స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు. పూర్తిపేరు గొల్లపల్లి నాగభూషణం. కుటుంబంలో అందరూ న్యాయవాదులే. అయితే ఫొటోగ్రఫీపై ఉన్న మక్కువతో ఈ రంగంలోకి వచ్చారు. చదువుకొనే రోజుల్లో నిర్మాత ఎన్.ఎస్.మూర్తితో పరిచయమైంది. ఆయనే భూషణ్‌ని మద్రాస్ తీసుకెళ్లారు. అక్కడ ఫొటోగ్రఫిపై పట్టుసాధించి సినిమాల్లోకి అడుగుపెట్టారు.
'సాక్షి' సినిమా నుంచీ బాపుతో ఆయన ప్రయాణం ప్రారంభమైంది. ''ఫొటో అంటే నాలుగు ఫ్రేముల మధ్య ఇరుక్కొన్న బొమ్మ కాదు.. అదో అందమైన జ్ఞాపకం. ఓ పెయింటింగ్‌లా ఉండాలి'' అనేవారాయన. ఎన్నో సినిమాల్లో, వేవేల ఛాయా చిత్రాల్ని తన మూడో కంటితో బంధించి, వాటికి సజీవ రూపం ఇచ్చిన కెమెరా మాంత్రికుడు భూషణ్ ఆ చెదిరిపోని జ్ఞాపకాలను మనకు మిగిల్చి వెళ్లిపోయారు. బుధవారం సాయింత్రం అంబర్‌పేట్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన మృతికి ధట్స్ తెలుగు సంతాపం తెలియచేస్తోంది.


Click it and Unblock the Notifications











