twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవన్ తో చేస్తున్న 'కోబలి' అదే :త్రివిక్రమ్ (ఇంటర్వూ)

    By Srikanya
    |

    హైదరాబాద్: 'అత్తారింట్లో...' సూపర్ హిట్టైంది. ఇప్పుడు ఎక్కడ విన్నా త్రివిక్రమ్ గురించి ఊసులే. ఆయన డైలాగులు, కథలు, దర్శకత్వం దేనికదే విభిన్నంగా ఉండి యూత్ ని పట్టుకుంటాయి. ఆయన స్వయంవరం (1999)ద్వారా మాటల రచయితగా తెరంగేట్రం చేసాడు. ఆయన ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి న్యూక్లియర్ ఫిజిక్స్ లో బంగారు పతకం సాధించాడు. ఆయన సిరివెన్నెల సీతారామశాస్త్రి తమ్ముడి కూతుర్ని వివాహం చేసుకున్నాడు. తెలుగు సినీ నటుల్లో ఆయనకు సునీల్ ఆప్తమిత్రుడు.

    ఇక పదునైన సంభాషణలకి త్రివిక్రం పెట్టింది పేరు. ఏ రసమైనా, సంభాషణ క్లుప్తంగా, ఆలోచన రేకెత్తించే విధంగా ఉంటుంది. అతని కలంలో నుండి ఎన్నో ఆణిముత్యాలు వెండితెరపైకి జారాయి. నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం, నాకు బ్రతకటం రాదు పూరీ, ఇప్పుడిప్పుడే నేర్చుకొంటున్నాను, నువ్వడిగావు కాబట్టి చెప్పలేదు, నేను నమ్మాను కాబట్టి చెప్పాను, వీడు చూడటానికి కాంప్లాన్ బాయ్ లా ఉన్నాడు, కాని చాలా కాంప్లికేటెడ్ బాయ్ అని ఎవరికీ తెలియదు. ఇంట్లో ఉన్న పూరి నచ్చదు గాని ఆ చపాతి మొహం కావాలంట... వంటి డైలాగులు పిచ్చ పిచ్చగా ఎక్కేసాయి.

    రచయితగా నిలదొక్కుకున్నాక... 'అతడు', 'జల్సా', 'జులాయి', 'అత్తారింటికి దారేది'... ఈ సినిమాలతో దర్శకుడిగానూ తన శైలిని చూపించారు. 'అత్తారింట్లో..' మరోసారి వినోదాల జల్లులు కురిపించారాయన. ఈ సందర్భంగా త్రివిక్రమ్ తెలుగులో పాపులర్ డైలీ (ఈనాడు) తో ప్రత్యేకంగా సంభాషించారు. ఈ మాటల మాంత్రికుడు ఆ ఇంటర్వూలో చెప్పుకొచ్చిన ముచ్చట్లు ఇవీ...

    'అత్తారింట్లో...' 'వంద కోట్ల సినిమా' అంటున్నారు

    'అత్తారింట్లో...' 'వంద కోట్ల సినిమా' అంటున్నారు

    (నవ్వుతూ) తెలుగులో తొలి రూ.వంద కోట్ల సినిమా ఇదే అంటుంటే వినడానికి బాగుంది. తెలుగు సినిమా మార్కెట్‌ ఇలానే పెరుగుతూ ఉండాలి. ఇంకొకరెవరో వచ్చి ఈ రికార్డును కొల్లగొట్టాలి. అయితే ఈ విజయంతో నేనేమీ సంబరాలు చేసుకోవడం లేదు. చూస్తున్నారుగా... ఇలాగే సింపుల్‌గా ఉంటాను.

    'అత్తారింటికి దారేది' పైరసీ వంటి క్లిష్టపరిస్థితుల్లోనూ...

    'అత్తారింటికి దారేది' పైరసీ వంటి క్లిష్టపరిస్థితుల్లోనూ...

    సినిమాను నిలబెట్టింది మేం కాదు... ప్రేక్షకులే. మేం ధైర్యంగా ఉండగలంగానీ అంతిమంగా తీర్పు చెప్పాల్సింది, సినిమా చూడాల్సింది ప్రేక్షకులే. ప్రతి ఒక్కరికీ దొరికేంత దగ్గర్లోనే సీడీ ఉంది. హైదరాబాద్‌లోనే కాస్త తక్కువేమో? మిగతా చోట్ల విపరీతంగా బయటకు వచ్చేసింది. చేతిలో ఉన్నా చూళ్లేదు. 'ఓహో... సినిమా బయటకు వచ్చేసిందా..?' అనుకొన్నారు. ఎవరి పనిలో వాళ్లు పడిపోయారు. సినిమా విడుదల అయిన తరవాత థియేటర్‌కే వెళ్లి చూశారు. అది వాళ్ల గొప్పతనం. అందుకే వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు.

    పైరసీ తో సినిమా ఏమైపోతుందో అనే భయం వేయలేదా?

    పైరసీ తో సినిమా ఏమైపోతుందో అనే భయం వేయలేదా?

    అప్పుడు నిజంగానే భయం వేయలేదు. తెల్లవారుజామున నాలుగింటికి నాకు అమెరికా నుంచి ఫోన్‌ వచ్చింది. 'ఫస్టాఫ్‌ అంతా బయటకు వచ్చేసింది' అన్నారు. 'సెకండాఫ్‌ ఉంది కదా..?' అనిపించింది. అప్పటికి కల్యాణ్‌గారు గోవాలో ఉన్నారు. అంత పొద్దుటే లేపి చెప్పడానికి అదేమైనా శుభవార్తా...? అందుకే తెల్లారే వరకూ చెప్పలేదు.

    ప్రసాద్ గారిని చూస్తేనే భయమేసింది

    ప్రసాద్ గారిని చూస్తేనే భయమేసింది

    నిర్మాత భోగవల్లి ప్రసాద్‌గారికి మాత్రం 'ఏం అవసరం అయితే అది చేస్తాం. ఎవరైనా కొనుక్కోకపోతే మేం కొంటాం' అని కూడా చెప్పాం. కాకపోతే ప్రసాద్‌ గారిని చూసి భయం వేసింది. ఇదివరకే ఆయనకు రెండుసార్లు గుండెపోటు వచ్చింది. ఈ వార్త తట్టుకోగలరా? అనేదే మా ఆందోళన. చాలా వరకు సమస్యల్ని ఆయన వరకూ వెళ్లనీయలేదు.

    ఫ్యాన్స్ సహకారం..

    ఫ్యాన్స్ సహకారం..

    పైరసీకి గురి అయినప్పుడు అభిమానులైతే బాగా స్పందించారు. తండ్రిని పట్టించిన కూతుళ్లున్నారు. కాబట్టే పైరసీకి త్వరగా కళ్లెం వేశాం. ఈ విషయంలో నిర్మాతల మండలి అందించిన సహకారాన్ని మర్చిపోలేం.

    పైరసీని అరికట్టే మార్గం

    పైరసీని అరికట్టే మార్గం


    ఏ ఒక్కరో పైరసీని ఆపలేరు. అందరిలో మార్పు రావాలి. ప్రతీ కిళ్లీ కొట్టులోనూ సిగరెట్‌ ఉంటుంది. కాల్చాలా? వద్దా..? అనేది ఎవరికి వారు వ్యక్తిగతంగా తీసుకోవల్సిన నిర్ణయం. పైరసీ కూడా అంతే.

    అత్తపై అంత ప్రత్యేకమైన మమకారం ఎప్పటి నుంచి?

    అత్తపై అంత ప్రత్యేకమైన మమకారం ఎప్పటి నుంచి?

    మనకో సామెత ఉంది. 'తల్లి తరవాత పినతల్లి, తండ్రి తరవాత మేనత్త' అని. అందుకే ఆమెకు అంత గౌరవం ఇచ్చాం. ఉత్తర భారతదేశంలో అత్తని 'మాజీ' అంటారు. సినిమాల్లో చూపిస్తున్న సంస్కృతి సమాజంలో లేదు. బయట అత్తల్ని బాగానే గౌరవించుకొంటున్నాం. నేనేదో కొత్తగా కనిపెట్టింది కాదు.

    పవన్ ఇమేజ్ ఇబ్బంది కాలేదా

    పవన్ ఇమేజ్ ఇబ్బంది కాలేదా

    వీలైనంత వరకూ కథను కథగా చెప్పాలని ప్రయత్నించాను. ఆయన అభిమానులు ఏం కోరుకొంటారో అవన్నీ ఉండేలా జాగ్రత్తపడ్డాం. అయితే 'గబ్బర్‌సింగ్‌'లోలా హీరోయిజం గుమ్మరించడానికి కుదరదు. పతాక సన్నివేశాల్లో భారీ బ్లాస్టులు, ఐటెమ్‌ పాటలూ పెట్టే అవకాశం లేదు. మొదటి నుంచీ మేం నమ్మింది ఒక్కటే. అత్త పాత్ర చుట్టూ భావోద్వేగాలు బలంగా పండించాలని. అందుకే ఫ్లాష్‌బ్యాక్‌ల జోలికి వెళ్లలేదు. పతాక సన్నివేశాల్లో అత్తని వాటేసుకొని ఏడ్చేయడంలాంటివి చేయలేదు. నిజ జీవితంలో కుదరదు అనుకొన్నదేదీ చూపించలేదు. లేని డ్రామాని బలవంతంగా ఇరికించేసి రుద్దేసే ప్రయత్నం అస్సలు చేయలేదు.

    పవన్ తో సాన్నిహిత్యం...

    పవన్ తో సాన్నిహిత్యం...


    మేమిద్దరం వీలైనంత నిజాయతీగా ఉండడానికి ప్రయత్నిస్తాం. మనమందరం దైనందిన జీవితంలో కొన్ని అబద్దాలు ఆడతాం. అయితే నా విషయంలో వాటి నిష్పత్తి చాలా తక్కువగా ఉంటుంది. అనవసరమైన చోట కూడా ఆడేసి... ఎందుకు నాటకాలు ఆడాలి? నాకు సౌకర్యం ఉన్న చోటే పనిచేస్తా. అదే సమయంలో ఎదుటివాళ్లకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసుకొంటా. చాలా సింపుల్‌గా బతికేద్దాం. భీమవరంలో బతకలేదా? అక్కడికీ ఇక్కడికీ తేడా ఏంటి? కాస్త గెడ్డం పెరిగిందంతే. మనసులో ఒక ఎజెండా పెట్టుకొని దాని కోసం ఎవ్వరితోనూ నేను స్నేహం చేయలేదు.. చేయను కూడా! బహుశా... అదే ఆయనకి నచ్చి ఉంటుంది.

    ఆ కథే మహేష్ తో తీసా

    ఆ కథే మహేష్ తో తీసా

    పవన్‌కి మొదటిసారి కథ చెప్పినప్పుడు ఆయన నిద్రపోయారని చాలాసార్లు చెప్పారు.. 'మళ్లీ ఆ ఆఫీసు గుమ్మం తొక్కకూడదు' అని కఠిన నిర్ణయాలేమీ తీసుకోలేదా? అంటే...నిజానికి ఆ విషయం నేను మర్చిపోయాను. వ్యక్తుల విషయంలో నాకు ఎలాంటి కోపాలూ ఉండవు. నా దృష్టి పనిమీదే ఉంటుంది. మహేష్‌బాబుతో తీసిన 'అతడు' అదే (నవ్వుతూ).

    ప్రతీసారీ పంచ్‌లంటే కష్టమే కదా..?

    ప్రతీసారీ పంచ్‌లంటే కష్టమే కదా..?


    పంచ్‌ రాస్తాననే విషయం నిజంగా నాకు తెలీదు. 'ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు గొప్పోడు' అనే డైలాగ్‌ భలే ఉందే అన్నారు. నేనేం కావాలని రాయలేదు. అక్కడ అలాంటి వాక్యం పడాలి అనిపించి రాశాను. 'కంటికి కనపడని శత్రువుతో బయటికి కనిపించని యుద్ధం చేస్తున్నా' అని రాశాను. ఆ డైలాగ్‌ వెనక ఉన్న నా దృక్పథం వేరు. రావుగోపాలరావు, కోట శ్రీనివాసరావులాంటి ప్రతినాయకులు సినిమాల్లోనే ఉంటారు.. బయట ఉండరు. మన శత్రువు మన కంటికి కనిపించడు. ఓ వరదొచ్చి ఇంట్లోవాళ్లంతా కొట్టుకుపోయారు. నీటిపై కోప్పడతామా? తాగడం, స్నానం చేయడం మానేస్తామా? చిన్నప్పుడు ఓ అగ్ని ప్రమాదం జరిగింది. ఇంట్లో వాళ్లంతా ఆహుతైపోయారు. అలాగని నిప్పుతో వంట వండుకోవడం వదిలేస్తామా? శత్రువులు, మనం చేసే యుద్ధాలూ బయటకు కనిపించవు. ఆ సంభాషణలో ఉన్న ఆంతర్యం అది.

    'కోబలి' గురించి...

    'కోబలి' గురించి...

    పవన్‌తో కలిసి ఓ సినిమా నిర్మిస్తున్నాను. అవును.. అదే 'కోబలి'. రాయలసీమ ప్రాంతంలో ఈ పదం వినిపిస్తుంటుంది. అంటే అమ్మవారికి బలివ్వడం అన్నమాట. ఈ కథపై పరిశోధన జరుగుతోంది. కొంచెం కష్టంతో కూడిన కథ. ఆ సాహసమేదో మేమిద్దరమే చేయాలనుకొన్నాం. 'కోబలి' సమాంతర చిత్రం అనుకోలేం. అలా అనలేం. అవార్డు సినిమా, సమాంతర సినిమా అంటూ విడగొట్టి చూడడం నాకు ఇష్టం లేదు. మంచి సినిమా, చెడ్డ సినిమా అంతే.వీలైనంత తొందర్లోనే ఈ సినిమాను మొదలుపెడతాం. 'గబ్బర్‌ సింగ్‌ 2'కి సంభాషణలు రాయటం లేదు. తరవాతి సినిమా ఇంకా ఏమీ అనుకోలేదండీ. తొందర్లోనే ఆ విషయాలు చెబుతాను.

    దర్శకుడు కావాలనే...

    దర్శకుడు కావాలనే...

    ''దర్శకుడిని కావాలనే పరిశ్రమకు వచ్చాను. దానికి రచయితగా మారడమే దగ్గర దారి అని నమ్మాను. ఒకరి దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేయడం నాకు ఇష్టం లేదు. మనం ఒకరి దగ్గర పని నేర్చుకొని వారి దగ్గర జీతం తీసుకోవడం ఏమిటి? అర్థశాస్త్రానికి అది పూర్తి వ్యతిరేకం కదా..? అదే రచయిత అయితే నేను రాసింది మరొకరికి ఉపయోగపడుతుంది. సినిమాను దగ్గరుండి చూసే అవకాశం దక్కుతుంది. అందుకే రచయితగా ప్రస్థానం మొదలు పెట్టాను. నా సినిమాకి సంబంధించి కథ, మాటలూ ఒక్కడినే రాసుకొంటాను. మనం ఏం రాశామో.. మనకు తెలిసిపోతుంది. మనం ఎంత బాగా పనిచేశామో ఆ క్షణమే అర్థమైపోతుంది. ఫలానా సన్నివేశం పండిందో లేదో తెలుసుకోవాలంటే ఎదుటివాళ్ల కళ్లలోకి చూడాల్సిన అవసరం లేదు''

    కొత్త గా....

    కొత్త గా....

    ''కళలు విస్తృతమవుతున్నాయి. కొత్తగా ఆలోచించకపోతే.. మనిషి ఎలా ఎదుగుతాడు? ఏడాది వయసున్న పిల్లాడు 'అమ్మా.. నాన్నా' అంటే వినడానికి బాగుంటుంది. పాతికేళ్లు వచ్చాక కూడా ఆ రెండే మాట్లాడతానంటే ఎలా..? చాలా విషయాలు ధారాళంగా మాట్లాడగలగాలి. కళ కూడా అంతే. వృద్ధి చెందాలి. అందులో భాగంగా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. అవన్నీ పక్కన పెట్టాలి. చిత్రలేఖనం తీసుకోండి. ఉన్నది ఉన్నట్టుగా గీయడంలో సంతృప్తి లేదు. ఇంకా ఏదో చెప్పాలి. మోనాలీసా చూసి 'అంత అందం ఏముందీ బొమ్మలో' అని అడిగేవాళ్లుంటారు. ఆ బొమ్మలో చూడాల్సింది అందం కాదన్నమాట. లోపల ఏదో ఉంది. చూస్తూ చూస్తూ లీనమైపోతేనే అందులో ఉన్న అంతర్‌సౌందర్యం అర్థం అవుతుంది. ఎం.ఎఫ్‌.హుస్సేన్‌ హార్స్‌ సిరీస్‌లో గుర్రాలు పరుగెడుతుంటాయ్‌. మనకేం అర్థం కాదు. అవి చూసి వదిలేయాల్సినవి కావు. చూస్తూ చూస్తూ అర్థం చేసుకోవాల్సినవి. లోలోపల ఓ జిజ్ఞాసను రేకెత్తిస్తాయి. అదీ కళలో ఉన్న గొప్పతనం. యూరోపియన్‌ ఆర్ట్‌ గ్యాలరీకి వెళ్లండి. ప్రతి బొమ్మ ముందూ కూర్చోడానికి స్థలం ఉంటుంది. కాసేపు కూర్చుని కాఫీ తాగుతూ ఆ బొమ్మని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే ఎన్నో ఆలోచనలు రేకెత్తుతాయి''

    వేదాల్లో అదే ఉంది

    వేదాల్లో అదే ఉంది

    ''కళ ఏదైనా సరే.. అది సమాజం కంటే పెద్దది కాదు. వేదాల్లోంచే కదా... కళలొచ్చాయి. రుగ్వేదంలో ఆంత్రోపాలజీ ఉంటుంది. నీరు నిప్పు ఆకాశం వీటితో ఎలా మసలుకోవాలో చెప్పింది. యజుర్వేదం మన జీవన విధానాన్ని ఇంకాస్త సరళీకృతం చేసింది. వ్యవసాయం, వ్యాపారంలాంటి వృత్తులు కనిపెట్టారు. దాంతో కడుపు నిండిపోయింది. ఆ తరవాత కావల్సింది వినోదం. అప్పుడు సామవేదం వచ్చింది. సంగీతం, నాట్యం... పుట్టాయి. అలా కావల్సిన కాలక్షేపం దొరికింది. ఆ తరవాత ఈర్ష్య, ద్వేషం పుట్టాయి. గొడవలు మొదలయ్యాయి. ఆధిపత్య పోరులో అధర్వణ వేదం పుట్టింది. యుద్ధాలూ, ఆస్త్రాల గురించి చెప్పింది. ఈ రకంగా చెప్పినా కళ మూడో స్థానంలో ఉంది. అది సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? కాకపోతే సమాజం తాలూకూ ప్రతిబింబంగా నిలుస్తుంది''.

    English summary
    In an interview given to Eenadu, this is what Trivikram had to say “Kobali is a tough subject to handle. We are doing some research about it. Pawan and I will produce this film and we want to start this as soon as we can”, he said. Trivikram also revealed that he is not involved with ‘Gabbar Singh 2′. But the star director and Pawan Kalyan are doing some pre-production work for ‘Kobali’, which is expected to be a Rayalaseema based story.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X