ఓటీటీ హిస్టరీలోనే సెన్సేషన్.. స్టార్ హీరో మూవీని డిలీట్ చేసిన నెట్‌ఫ్లిక్స్.. ఎన్ని కోట్ల నష్టమంటే?
కరోనా సమయంలో భారతదేశంలో అందుబాటులోకి వచ్చిన ఓటీటీ ప్లాట్‌ఫాంలు భారతీయ ప్రేక్షకుల ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. వరల్డ్ వైడ్‌గా అన్ని దేశాలు, భాషలకు చెందిన ఒరిజినల్ కంటెంట్, వెబ్ సిరీస్, సినిమాలను జనం ఆస్వాదించారు. థియేటర్‌కి వెళ్లి వేలకు వేలు వదిలించుకునే బదులు.. కుటుంబం మొత్తం ఇంట్లోనే హాయిగా సినిమాలు చూసేందుకు అలవాటు పడుతున్నారు. అంతేకాదు.. కంటెంట్ పైనా ప్రేక్షకులకు అవగాహన వస్తోంది. సరైన కంటెంట్ లేకపోతే ఎంత పెద్ద స్టార్ హీరో నటించిన సినిమా అయినా తిప్పికొడుతున్నారు.
ఇండియన్ సినిమాను ఏలుతున్న ఓటీటీలు
ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఓటీటీలు రూల్ చేస్తున్నాయి. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ కావాలి? ఓటీటీలోకి ఎప్పుడు తీసుకురావాలన్నది కూడా ఆ సంస్థలే డిసైడ్ చేస్తున్నాయి. ఈ పరిణామాలపై కొందరు నిర్మాతలు బాహాటంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే థియేట్రికల్‌గా నష్టాలు ఎదురయ్యే క్రమంలో ఓటీటీ ఒప్పందాలు నిర్మాతలను ఒడ్డున పడేస్తుండటంతో చాలా మంది ఓటీటీలకు సరెండర్ అయిపోతున్నారు. ఒక్కసారి సినిమా ఓటీటీ సంస్థల చేతుల్లోకి వెళ్లిందంటే? దానిని తొలగించడం అసాధ్యం. అలాంటిది ఓటీటీ చరిత్రలోనే.. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ తన యాప్ నుంచి ఓ సూపర్‌స్టార్ సినిమాను తొలగించింది. ఈ వివరాల్లోకి వెళితే..

సమ్మర్ కానుకగా గుడ్ బ్యాడ్ అగ్లీ
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్, త్రిష కృష్ణన్ నటించిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజైంది. ఈ సినిమాకు అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించగా.. జీవీ ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూర్చారు. ప్రభు, అర్జున్ దాస్, ప్రసన్న, సునీల్, రాహుల్ దేవ్, యోగి బాబు, ప్రియా ప్రకాష్ వారియర్, టామ్ చాకో తదితరులు కీలకపాత్రలు పోషించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి గుడ్ బ్యాడ్ అగ్లీకి దాదాపు రూ.270 కోట్లకు పైగా బడ్జెట్‌తో టాలీవుడ్ బడా నిర్మాణ సంస్ధ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది. ప్రపంచవ్యాప్తంగా గుడ్ బ్యాడ్ అగ్లీకి రూ.114 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని కోలీవుడ్ వర్గాలు తెలిపాయి.
నిరాశ పరిచిన అజిత్
మిక్స్‌డ్ టాక్ కారణంగా గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఇండియాలో 154 కోట్ల రూపాయల నెట్, 182 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న అజిత్ చిత్రం ఓవర్సీస్‌లో 66 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. దాంతో గుడ్ బ్యాడ్ అగ్లీ తన థియేట్రికల్ రన్ ముగించేనాటికి వరల్డ్ వైడ్‌గా 248 కోట్ల రూపాయలు మాత్రమే రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే 115 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్, 230 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు చేయాల్సి ఉంది. దీంతో 18 కోట్ల రూపాయల స్వల్ప లాభంతో గుడ్ బ్యాడ్ అగ్లీ తన థియేట్రికల్ రన్ క్లోజ్ చేసింది.
నా పాటలు వాడుకున్నారన్న ఇళయరాజా
ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ని ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు 95 కోట్ల ధరకు సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత మే 8 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అజిత్ సినిమా స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. అయితే తాను గతంలో మ్యూజిక్ కంపోజ్ చేసిన పాత పాటల్లోంచి మూడు పాటలను తన అనుమతి లేకుండా వాడుకున్నారని దిగ్గజ సంగీత దర్శకుడు ఇళయరాజా ఆరోపించారు. దీనికి నిర్మాతలు క్షమాపణలు చెప్పడంతో పాటు 5 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు.
నెట్‌ఫ్లిక్స్‌కి మద్రాస్ హైకోర్ట్ ఆదేశాలు
అయితే మ్యూజిక్ కంపెనీ అనుమతితోనే తాము ఈ చిత్రంలోని పాటలను వాడుకున్నామని మైత్రీ మూవీ మేకర్స్ స్పష్టం చేసింది. అయితే ఇందుకు సరైన ఆధారాలు చూపించలేని కారణంతో కాపీ రైట్ యాక్ట్ ప్రకారం.. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను ప్రసార మాధ్యమాల నుంచి తొలగించాలని మద్రాస్ హైకోర్ట్ ఆదేశించింది. దీంతో నెట్‌ఫ్లిక్స్ సంస్థ తన ఓటీటీ ప్లాట్ ఫాం నుంచి అజిత్ సినిమాను తొలగించింది. అయితే తుది తీర్పు వెలువడే వరకు న్యాయస్థానం తీర్పు అమలు చేయాల్సి ఉంది.. ఒకవేళ అప్పటికీ సరైనా ఆధారాలు చూపని పక్షంలో నెట్‌ఫ్లిక్స్‌కు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.


Click it and Unblock the Notifications











