ఆ సీఎం సైకో.. చిరంజీవికి అంత సీన్ లేదు.. అసెంబ్లీలో బాలయ్య వివాదాస్పదంగా
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. రిలీజ్ సమయంలో బెనిఫిట్ షోలు, స్పెషల్‌లకు అనుమతులు రద్దు చేయడంతో పాటు టికెట్ ధరల పెంపును నాటి జగన్ సర్కార్ తీవ్రంగా వ్యతిరేకించింది. దీని ప్రభావం భారీ బడ్జెట్ సినిమాలపై పడటంతో మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో హీరోలు మహేశ్ బాబు, ప్రభాస్, ఎస్ఎస్ రాజమౌళి, ఆర్ నారాయణ మూర్తి తదితరులు తాడేపల్లి చేరుకుని జగన్‌ను కలిసి తమ ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
హీరోలను అవమానించారంటూ పవన్ ఫైర్
అయితే ఆ సమయంలో హీరోలకు తగినంత గౌరవం దక్కలేదని వారి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న పవన్ కళ్యాణ్ సైతం ఈ విషయాన్ని తన బహిరంగ సభలలో ప్రముఖంగా ప్రస్తావించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టాలీవుడ్ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. తాజాగా ఈ ఘటనపై ఏపీ అసెంబ్లీలో వాడి చర్చ జరగ్గా సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

కామినేని వ్యాఖ్యలతో కలకలం
గురువారం ఏపీ అసెంబ్లీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో లా అండ్ ఆర్డర్, జగన్ మనస్తత్వం గురించి బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. అప్పట్లో తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై జగన్‌ను చిరంజీవి గారు కొంచెం గట్టిగానే అడిగారు. మీరు తండ్రి లాంటి వారు సినీ పరిశ్రమను జాగ్రత్తగా చూసుకోమ్మని చిరంజీవి రిక్వెస్ట్ చేస్తూ అన్న మాటలను బయటకు రిలీజ్ చేసి జగన్ ఆయనను అవమానించారు. ఇంతకన్నా శాడిస్ట్ మెంటాలిటీకి ఏం ఎగ్జాంపుల్ అక్కర్లేదంటూ కామినేని అన్నారు. ఆయన కూర్చొన్న వెంటనే నందమూరి బాలకృష్ణ మాట్లాడతారని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు చెప్పగానే సభలో కలకలం రేగింది.
జగన్‌ని సైకో అన్న బాలయ్య
బాలయ్య మాట్లాడుతూ.. ఇండస్ట్రీ పెద్దలు ఆ సైకోగాడిని కలవడానికి వెళ్లినప్పుడు, చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడన్నది అబద్ధం. గట్టిగా ఎవడూ అడగలేదు, అవమానించడం మాత్రం నిజం, చిరంజీవి గట్టిగా చెబితే ఆయన దిగొచ్చాడట, సినిమాటోగ్రఫి మంత్రిని కలవమన్నాడట అంటూ సీరియస్‌గా మాట్లాడారు బాలయ్య. అదే సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు కూడా తనకు అవమానం జరిగింది అనేలా బాలకృష్ణ బాంబు పేల్చారు.
నా పేరు 9వ స్థానంలో వేశారు
ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ సమావేశానికి నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది, అందులో నాది 9వ పేరు వేశారు.. దీని మీద కందుల దుర్గేశ్ గారిని కూడా అడిగాను, ఎవడు ఈ లిస్ట్ తయారు చేసిందని అంటూ బాలయ్య సీరియస్ అయ్యారు. గట్టిగా ఎవరూ అడగలేదని, అడిగితేనే పంపించారా లోపలికి అంటూ కామినేని వంక ఆగ్రహంతో చూశారు బాలయ్య. ఆ వెంటనే సారీ చెప్పిన ఆయన క్లారిఫై చేయాలని అనుకున్నానని అన్నారు. అలా చేయడమే కరెక్ట్ అని డిప్యూటీ స్పీకర్ రఘురామ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం బాలయ్య వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. బాలయ్యకు వైసీపీ నాయకులు కౌంటర్ వేస్తుండగా.. ఈ ఇష్యూలో చిరంజీవిని కూడా బాలయ్య లాగడం చర్చనీయాంశమైంది. దీనిపై మెగా క్యాంప్ ఎలా స్పందిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











