బాలకృష్ణ VS చిరంజీవి వివాదంలో ట్విస్ట్.. ఆర్ నారాయణ మూర్తి షాకింగ్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మెగాస్టార్ చిరంజీవిలను ఉద్దేశించి సినీనటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. దీంతో బాలయ్యపై మెగా అభిమానులతో పాటు వైసీపీ కేడర్ విరుచుకుపడుతోంది. చిరంజీవి సైతం పత్రికా ప్రకటన విడుదల చేసి ఆ రోజు తాను చొరవ చూపడం వల్లే తెలుగు చిత్ర పరిశ్రమకు ప్రయోజనం కలిగిందని క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వివరాల్లోకి వెళితే..
జగన్‌ను కలిసిన సినీ ప్రముఖులు
ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ సమస్యలు పరిష్కరించాల్సిందిగా మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ప్రభాస్, మహేశ్ బాబు, ఆర్ నారాయణ మూర్తి, ఎస్ఎస్ రాజమౌళి తదితరులు హైదరాబాద్ నుంచి తాడేపల్లిలోని జగన్ అధికారిక నివాసం వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా చిరంజీవితో పాటు మిగిలిన సినీ ప్రముఖులను జగన్ అవమానించారంటూ ఎప్పటి నుంచో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. పలువురు సినీ పెద్దలు కూడా పలుమార్లు ఈ విషయంపై మీడియా ఎదుట భగ్గున్నారు.

జగన్‌పై బాలయ్య వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలో రెండ్రోజుల క్రితం ఏపీ అసెంబ్లీ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ.. జగన్‌ని చిరంజీవి గట్టిగా అడిగారని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న టీడీపీ ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సైకోగాడిని కలవడానికి నేను వెళ్లలేదని, చిరంజీవితో పాటు ఎవరూ జగన్‌ను గట్టిగా అడగలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూడా ఓ సమావేశానికి సంబంధించి తన పేరును ఎక్కడో 9వ నెంబర్‌లో వేశారని బాలయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
బాలయ్య వ్యాఖ్యలపై చిరు క్లారిటీ
దీనిపై దుమారం రేగడంతో చిరంజీవి వెంటనే స్పందిస్తూ ప్రకటన విడుదల చేశారు. జగన్ తనతో పాటు ఏ సినీ ప్రముఖుడిని అవమానించలేదని, తమ సమస్యలను పరిష్కరించేలా చొరవ చూపారని అన్నారు. తాను చెప్పడం వల్లే వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య సినిమాలకు టికెట్ రేట్లు పెరిగాయని చిరంజీవి తెలిపారు. దీంతో టీడీపీ, నందమూరి అభిమానులకు.. వైసీపీ కేడర్, మెగా అభిమానులకు మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్‌ను, చంద్రబాబును ఈ వివాదం ఇబ్బందికరంగా మారింది.
నేను కూడా చిరంజీవితో వెళ్లా
ఈ నేపథ్యంలో బాలకృష్ణ - చిరంజీవి వివాదం అనూహ్య మలుపు తిరిగింది. నాడు జగన్‌ను కలిసిన సినీ ప్రముఖుల బృందంలో ఒకరైన సీనియర్ నటుడు ఆర్ నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది విలేకరులు ఆయనను ఈ వివాదంపై ప్రశ్నించగా నారాయణ మూర్తి మాట్లాడుతూ.. ' ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కొంతమంది పెద్దలు చేసిన కామెంట్స్‌పై మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించిన విధానం సత్యం. నూటికి నూరుపాళ్లు సత్యం. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, పేర్ని నాని గారు సినిమాటోగ్రఫి మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారితో పాటు చాలామందిని వారు ఆహ్వానించినప్పుడు నేను కూడా ఒకడిని' అన్నారు.
చిరంజీవి స్వయంగా ఫోన్ చేశారు
'చిరంజీవి గారు మాట్లాడుతూ.. ఆర్ నారాయణ మూర్తి కూడా వచ్చాడని చెప్పినప్పుడు నేను కూడా మాట్లాడాలి. ఆరోజు ఏం జరిగిందో చెప్పాల్సిన బాధ్యత నా మీద కూడా ఉంది కాబట్టి సత్యం చెబుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మా సినిమా కళాకారులను కానీ, చిరంజీవి గారిని కానీ ఎవరినీ కూడా అవమానించలేదు. ఇది సత్యం. ఎందుకంటే కోవిడ్ కష్టకాలంలో సినిమా రంగం ఏమైపోద్ది అనే భయం ఉన్న దశలో పరిశ్రమ పెద్దలంతా కలిసి చిరంజీవిని పెద్దగా భావించి ఆయన దగ్గరికి వెళ్లాం. నన్ను ఆహ్వానించారు.. చిరంజీవిగారు స్వయంగా నాకు ఫోన్ చేశారు. అది ఆయన సంస్కారం, అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా. నారాయణ మూర్తి ఇండస్ట్రీ క్లిష్ట పరిస్ధితుల్లో ఉంది.. అందరూ కూడా రావాలి, మనమంతా ప్రభుత్వాన్ని కలవాలి, ప్రభుత్వం నుంచి ఏ సహాయ సహకారాలు వస్తాయో మనం స్వీకరించాలి అని చిరంజీవి గారు చెప్పారు.
చిరంజీవికి సెల్యూట్
'అప్పుడు మా అభిప్రాయాలను సీఎం గారికి చెప్పారు.. చిరంజీవి గారు సీఎంతో మాట్లాడారు. నేను కూడా పేర్నినాని గారికి బందర్‌లో విజ్ఞప్తి చేశారు. చిరంజీవి గారు తీసుకున్న రోల్‌కి నా సెల్యూట్.. ఆయనను ఆరోజు ఎవరూ అవమానించలేదు, చాలా గౌరవించారు. మేం అందరం అక్కడికి వెళ్లాం.. సమస్యలన్నీ చెప్పాం, సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు. పేర్నినాని గారితో మాట్లాడి ఏమేం కావాలో అన్ని తెలుసుకుంటే మనం చేద్దామని చెప్పారు. ఇది జరిగింది అని ఆర్ నారాయణ మూర్తి క్లారిటీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











