»   » అజ్ఞాతవాసి మూవీ రివ్యూ: త్రి‘వక్ర’మ్ సినిమా

అజ్ఞాతవాసి మూవీ రివ్యూ: త్రి‘వక్ర’మ్ సినిమా

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  Rating:
  2.5/5
  Star Cast: పవన్ కల్యాణ్, కీర్తీ సురేష్, అను ఇమ్మాన్యుయేల్, ఆది పినిశెట్టి
  Director: త్రివిక్రమ్ శ్రీనివాస్

  'అజ్ఞాతవాసి' మూవీ రివ్యూ

  పవన్ కల్యాణ్ అంటే అభిమానులకు మాటల్లో చెప్పలేనంత క్రేజ్. ఇక పవర్ స్టార్ సినిమా అంటే ఇక మామూలుగా ఉండదు పరిస్థితి. పవన్ కల్యాణ్‌కు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జత కలిస్తే ఆ మ్యాజిక్ చెప్పలేం. వారిద్దరి కలయిక జల్సా, అత్తారింటికి దారేది లాంటి బ్లాక్‌బస్టర్లకు ప్రాణం పోసింది. తాజాగా పవన్, త్రివిక్రమ్ జోడి హ్యాట్రిక్ విజయాన్ని అందుకొనేందుకు అజ్ఞాతవాసి చిత్రంతో జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే ఎన్నో సంచలనాలకు వేదికగా నిలిచిన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకోవాలంటే కథ గురించి తెలుసుకోవాల్సిందే..

  అజ్ఞాతవాసి కథ ఇదే

  విందా భార్గవ్ (బోమన్ ఇరానీ) ఓ పెద్ద పారిశ్రామికవేత్త. ఏబీ అనే సంస్థకు అధిపతి. భాగస్వాముల కుట్ర కారణంగా తన కుమారుడితోపాటు విందా భార్గవ్ చనిపోతాడు. దాంతో ఏబీ కంపెనీ బాధ్యతలు విందా భార్య ఇంద్రాణి (ఖుష్బూ) చేతికి వస్తాయి. అయితే సీతారాం (ఆది పినిశెట్టి), శర్మ (మురళీ శర్మ) వర్మ (రావు రమేష్) అడ్డుపడుతారు. వీరందరిని ఎదుర్కోవడానికి ఎక్కడో అసోంలో ఉన్న బాలు అలియాస్ బాలసుబ్రమణ్యం (పవన్ కల్యాణ్)ను రప్పించుకొంటారు.

  తెరపై ప్రశ్నలకు సమాధానమే..

  ఇంద్రాణి కోరిక మేరకు రంగంలోకి దిగిన బాలు ఏ విధంగా పరిస్థితిని చక్కదిద్దారు? ఏబీ కంపెనీని తమ చేతుల్లోకి తీసుకోవడానికి బాలుతో కలిసి ఇంద్రాణి ఏమి చేసింది. సీతారాం, శర్మ, వర్మలకు ఏ విధంగా బుద్ధి చెప్పింది. చిన్నస్థాయి ఉద్యోగిగా కంపెనీలోకి ప్రవేశించిన బాలు కంపెనీ సీఈవోగా మారేందుకు అభిషిక్త్ భార్గవ్‌గా ఎందుకు మారాడు? ఏబీ కంపెనీకి సూర్యకాంతం (అను ఇమ్మాన్యుయేల్), సుకుమారి (కీర్తి సురేష్) ఏమిటి సంబంధం అనే ప్రశ్నలకు సమాధానమే అజ్ఞాతవాసి చిత్ర కథ.

  ఫస్టాఫ్ ఎలా ఉందంటే..

  అజ్ఞాతవాసి చిత్రం ఓ యాక్సిడెంట్‌తో ప్రారంభం కావడంతోపాటు బోమన్ ఇరానీ హత్య చకచకా జరిగిపోతాయి. ఆ తర్వాత పవన్ ఎంట్రీ, ధగధగమనే పాటతో సినిమా సరైన దిశలోనే వెళ్తుందనే భావన కలుగుతుంది. ఎప్పుడైతే ఏబీ కంపెనీలోకి పవన్ ప్రవేశించడానికి జరిగే నాటకం మొదలైన తర్వాత సినిమా గ్రాఫ్ దారుణంగా పడిపోతుంది. కథ ఎటువైపు వెళ్తుంది? పవన్ క్యారెక్టర్ ఏమిటనే ఆలోచన మొదలవుతుంది. మధ్యలో అను ఇమ్మాన్యుయేల్, కీర్తీ సురేష్ ఎపిసోడ్స్ చాలా నాసిరకంగా ఉంటాయి. తొలిభాగంలో ఎలాంటి లాజిక్స్ లేకుండా విచ్చలవిడిగా సీన్లు వచ్చిపోతుంటాయి. అలా ఏదో ఒకటి జరుగుతున్న అనే ఫీలింగ్స్ మధ్య ఓ ట్విస్టుతో ఇంటర్వెల్ బ్యాంగ్ పడటంతో రెండో భాగంపై ఆసక్తి పెరుగుతుంది.

  సెకండాఫ్ ఎలా ఉందంటే..

  రెండో భాగంలో విందా జీవిత కథ ఫ్లాష్‌బ్యాక్‌లో ఓపెన్ కావడంతో అసలు కథ మొదలవుతుంది. పవన్ క్యారెక్టర్ ఏంటో రివీల్ అవుతుంది? ఇక రెండో భాగంలో ఏదైనా మంచి సన్నివేశాలు ఉంటాయని భావించిన ప్రేక్షకులకు నిరాశే మిగిలుతుంది. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేవిధంగా ఆఫీస్ ఎపిసోడ్స్ చాలా దారుణంగా చిత్రీకరించడం సినిమాకు మైనస్‌గా మారుతుంది. రొటీన్ పవన్ కల్యాణ్ తరహా కామెడీతో సినిమా క్లైమాక్స్‌కు వెళ్తుంది. అయితే అత్తారింటికి దారేది తరహా క్లైమాక్స్ ఉంటుందేమోనని ఆశించిన ప్రేక్షకులకు మరో షాక్ తగులుతుంది. సినిమా చాలా నీరసంగా, నిస్సారంగా ముగుసుంది.

  కథ, స్క్రీన్ ప్లే విశ్లేషణ

  పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌కు ఆమడదూరంలో అజ్ఞాతవాసి చిత్రం కథ ఉంటుంది. చిన్న పాయింట్‌తో స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేద్దామనే ఆలోచన బెడిసికొట్టిందనే చెప్పవచ్చు. పాత్రల క్యారెక్టరైజేషన్, కథలో లింకులు, అనేక లోపాలు కొట్టవచ్చినట్టు కనిపిస్తాయి. లాజిక్‌ లేకుండా ఊహకు అందని సన్నివేశాలు ఉంటాయి. అనేక లోపాలు ఉన్న కథను ప్రేక్షకుడి దగ్గరికి తీసుకెళ్లడానికి పెద్ద యుద్ధమే చేసినట్టు కనిపిస్తుంది. వెరసిగా హ్యాట్రిక్ కొట్టే సినిమాకు కథ, కథనాలు ఓ శాపంగా మారాయని చెప్పవచ్చు.

  దర్శకుడు త్రివిక్రమ్ ప్రతిభ

  అజ్ఞాతవాసి చిత్రం చూస్తే ఇప్పటి వరకు చూసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎక్కడ కనిపించడు. కథ, కథనాలు, డైలాగ్స్, సన్నివేశాలు, పాత్రల రూపకల్పన లాంటి విషయంలో త్రివిక్రమ్ పూర్తిగా తడబడినట్టు కనిపిస్తుంంది. పవన్ కల్యాణ్ ఇమేజ్‌పై భరోసా పెట్టి ఏది తీసినా చూస్తారులే అనే మొండి ధైర్యమే కనిపిస్తుంది. విచక్షణతో కాకుండా విచ్చలవిడిగా తీసినట్టు త్రివిక్రమ్ తీరు కనిపిస్తుంది.

  పవన్ కల్యాణ్ పవర్ గురించి

  పవన్ కల్యాణ్‌కు అభి లాంటి పాత్రలు కొట్టిన పిండి. ఇంకా తమ్ముడి చిత్రంనాటి తరహా ఫార్మాట్‌తో నెగ్గుకొస్తామని ఆలోచన నుంచి పవన్ బయటపడినట్టు కనిపించలేదు. గత చిత్రాల మాదిరిగానే పరిణతి చెందని క్యారెక్టరైజేషన్‌లో పవన్ ఇమడలేకపోయాడనిపిస్తుంది. బెల్టు సీన్లు, బాత్రూం సీన్లు చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తాయి. పవన్ స్టామినాకు తగిన విధంగా అభి పాత్ర లేకపోవడం, బాధ్యతారహితంగా ఆ పాత్ర ఉండటం అజ్ఞాతవాసి చిత్రానికి ప్రధాన లోపం.

  కీర్తీ సురేష్, అను ఫెర్ఫార్మెన్స్

  రావు రమేష్ కూతురిగా సుకుమారి పాత్రలో కీర్తీ సురేష్ కనిపించింది. పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రను పోషించారు. పాటలు, ఆరకొరా సన్నివేశాలకు పరిమితమైంది. ఇక సూర్యకాంతంగా అను ఇమ్మాన్యుయేల్ ఆఫీస్ పర్సనల్ మేనేజర్ నటించింది. పవన్ పాత్ర కోసం అల్లిన పాత్రలుగానే కీర్తీ, అను పాత్రలు కనిపిస్తాయి. అంతే తప్ప వారికి నటించడానికి పెద్దగా స్కోప్ లేకపోయింది.

  ఖుష్బూ పాత్ర నామమాత్రంగానే

  సీనియర్ నటి కుష్భూ పవన్‌కు సవతి తల్లి పాత్రలో నటించింది. ఆమె పాత్ర కూడా పెద్దగా ఎలివేట్ అయినట్టు కనిపించదు. అత్తారింటికి దారేది చిత్రంలో నదియా పాత్రతో పోలిస్తే ఖుష్బూ పాత్ర నామమాత్రంగానే కనిపిస్తుంది.

  ఇతర నటీనటుల నటన

  అజ్ఞాతవాసి చిత్రంలో ప్రధానంగా కనిపించేవి ఆది పినిశెట్టి, మురళీ శర్మ, రావు రమేష్, తనికెళ్ల భరణి పాత్రల మాత్రమే. ఆది పినిశెట్టి పాత్రలో పవర్ కనిపించదు. విలనిజానికి పెద్దగా స్కోప్ లేదు. రావు రమేష్, మురళీ శర్మ పాత్రలు నెగిటివ్ షేడ్ ఉన్న కామెడీ పాత్రలుగా మారిపోయాయి.

  కామెడి విషయానికి వస్తే.

  ప్రధానంగా రఘుబాబు, వెన్నెల కిషోర్ పాత్రలపైనే కామెడీ ట్రాక్ నడిపించే ప్రయత్నం జరిగింది. అమ్మాయిలను వేధించే కోటేశ్వరరావుగా రఘుబాబు, ఉద్యోగం కోసం వచ్చి పవన్ గ్యాంగ్ చేతిలో బందీ అయిన నిరుద్యోగిగా వెన్నెల కిషోర్ నటించారు. వెన్నెల కిషోర్ పాత్ర ద్వారా చిత్రంలో ప్రేక్షకులు మొహంలో నవ్వులు పూస్తాయి. అంతేకాకుండా రావు రమేష్పాత్ర మంచి హాస్యాన్ని పండించింది.

  అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్

  అజ్ఞాతవాసి చిత్రానికి ప్రధాన లోపం అనిరుధ్ మ్యూజిక్. ఆడియో వినడానికి బాగున్నప్పటికీ.. తెర మీద ఆకట్టుకోలేకపోయాయి. పాటలకు కోరియోగ్రఫీ కూడా నాసిరకంగా ఉన్నాయి. కొడకా కోటేశ్వరరావు పాటలో పూనకం తప్ప ఎలాంటి జోష్ కనిపించలేకపోయింది.

  మణి సినిమాటోగ్రఫీ

  అజ్ఞాతవాసి చిత్రం సినిమాటోగ్రఫి విషయానికి వస్తే సినిమాలో అంతో ఇంతో మాట్లాడుకోవడానికి ఆస్కారం ఉన్న అంశమది. ప్రతీ ఫ్రేమ్ చక్కగా రూపొందించారు. కానీ సన్నివేశాల్లో దమ్ము లేకపోవడంతో మణికందన్ శ్రమ వ‌ృధా అయిపోయిందనే ఫీలింగ్ కలుగుతుంది.

  వెంకీ, అనిరుధ్ కనిపించరే..

  ఈ చిత్రంలో వెంకటేష్, అనిరుధ్ అతిథి పాత్రలను పోషించారనే వార్త మీడియాలో వైరల్ అయింది. వీకిపీడియాలో కూడా వారి పేర్లు కనిపించడంతో వారి పాత్రలు గ్యారెంటీ అని అనుకొన్నారు. కానీ వీరిద్దరూ సినిమాలో కనిపించకపోవడం కూడా ఫ్యాన్స్ నిరాశ చెందారని చెప్పవచ్చు.

  నిర్మాణ విలువలు

  అజ్ఞాతవాసి చిత్రం నిర్మాణ విలువలు బాగున్నాయి. కెమెరా వర్క్, లైటింగ్ ఇతర అంశాలను చాలా రిచ్‌గా తెరకెక్కించారు. అన్నివిభాగాల పనితీరు చక్కగా ఉంది. కానీ కథ, కథనాలు, డైలాగ్స్‌, పాత్రల రూపకల్పనపై మరికొంత దృష్టిపెట్టి పెట్టిన ప్రతీపైసాకు న్యాయం జరిగేది.

  ఫైనల్‌గా

  పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో అజ్ఞాతవాసి సినిమా అనగానే జల్సా, అత్తారింటికి దారేది సినిమా రేంజ్‌లో ఉండటం ఖాయమనే ఫీలింగ్ సాధారణ ప్రేక్షకులతోపాటు ఫ్యాన్స్ కూడా కలిగింది. హ్యాట్రిక్ విజయం తప్పదు అనే ధీమా పెరిగింది. కానీ ఇలాంటి భావనలకు భిన్నంగా అజ్ఞాతవాసి చిత్రం తెరకెక్కింది. విచక్షణతో తీస్తే అత్తారింటికి దారేది.. విచ్చలవిడిగా తీస్తే అజ్ఞాతవాసి అవుతుందని నిరూపించింది. ఏది ఏమైనా పండుగ సెలవులు ఈ సినిమాకు కొంత కలిసివచ్చే అంశం. ఓపెనింగ్ కలెక్షన్లు రికార్డు స్థాయిలో నమోదు కావొచ్చు. బీ, సీ సెంటర్లలో సినిమా నిలబడితే పవన్‌ ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్ చేరవచ్చు.

  మైనస్, ప్లస్ పాయింట్స్

  ప్లస్ పాయింట్స్
  పవన్ కల్యాణ్.. పవన్ కల్యాణ్.. పవన్ కల్యాణ్
  కథ, కథనం, పాటలు
  డైరెక్షన్
  సినిమాటోగ్రఫీ
  ఆఫీసులో కామెడీ

  తెర ముందు, తెర వెనుక

  నటీనటులు: పవన్ కల్యాణ్, కీర్తీ సురేష్, అను ఇమ్మాన్యుయేల్, ఆది పినిశెట్టి, బోమన్ ఇరానీ, కుష్బూ, పరాగ్ త్యాగి, రావు రమేష్, సంపత్ రాజ్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, అజయ్, సమీర్
  రచన, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్
  నిర్మాత: ఎస్ రాధాకృష్ణ
  సంగీతం: అనిరుధ్ రవిచందర్
  సినిమాటోగ్రఫీ: వీ మణికందన్
  ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
  బ్యానర్: హారిక అండ్ హాసిని క్రియేషన్
  రిలీజ్ డేట్: జనవరి 10, 2018

  English summary
  Agnyaathavaasi movie review: Pawan Kalyan and Trivikram Srinivas fail to create another magic
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more