»   » కామిడీగా ముగిసింది ('అలా మొదలైంది' రివ్యూ)

కామిడీగా ముగిసింది ('అలా మొదలైంది' రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

-సూర్య ప్రకాష్ జోశ్యుల
చిత్రం: అలా మొదలైంది
సంస్థ: శ్రీ రంజిత్‌ మూవీస్‌
నటీనటులు: నాని, నిత్య మీనన్‌, స్నేహ ఉల్లాల్‌, కృతి కర్బందా,
ఆశిష్‌ విద్యార్థి, రోహిణి, ప్రగతి, ఉప్పలపాటి నారాయణరావు తదితరులు.
సంగీతం: కల్యాణి మాలిక్‌
నిర్మాత: కె.ఎల్‌.దామోదర్‌ ప్రసాద్‌
దర్శకత్వం: బి.వి.నందిని రెడ్డి

మహిళా దర్శకురాలు, అందులోనూ తొలి చిత్రం అంటే రకరకాల అంచనాలు, ఆలోచనలు అలవోకగా మదిలో మొదలైపోతాయి. అయితే ఆ అపోహలను ఒంటిచేత్తో చెదరకొట్టి, కామిడీతో అదరకొట్టి ప్రేక్షకుల నాడిని పట్టే ప్రయత్నం చేసిందీ చిత్రం. స్క్రిప్టు పరంగా చూస్తే రొమాంటిక్ కామిడీ అని మొదలుపెట్టిన ఈ చిత్రం స్క్రీన్ టైమ్ గడిచే కొలిదీ రొమాన్స్ తగ్గిపోయి, కేవలం కామిడీకే పరిమితమతవటమే కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే రొమాంటిక్ కామిడీ కాకపోతే కామిడి...ఏదైతే ఏంటి టిక్కెట్ డబ్బులు గిట్టుబాటు కావటానికి అని ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకుల మౌత్ టాకే ఈ చిత్రాన్ని నిలబెడుతుందనిపిస్తుంది.

గౌతమ్(నాని) ఇష్టపడ్డ అమ్మాయి సిమ్రాన్(కీర్తి కర్బంధ) అతనికి హ్యాండిచ్చి ఓ డాక్టర్ ని పెళ్ళి చేసుకుంటుంది. ఆ పెళ్ళికి ప్రెండ్స్ బలవంతం మీద వెళ్ళిన గౌతమ్ కి అక్కడ నిత్య(నిత్య మీనన్) పరిచయం అవుతుంది. నిత్య ది కూడా సేమ్ సమస్యే. ఆ పెళ్ళికొడుకు(డాక్టరు) ఆమెకు హ్యాండిచ్చి సిమ్రాన్ ని పెళ్ళి చేసుకుంటూంటాడు. దాంతో ఒకే సిట్యువేషన్ లో ఇరుక్కున్న ఇద్దరూ ఒకరినొకరు ఓదార్చుకుని ప్రెండ్స్ అవుతారు. అక్కడనుంచి రకరకాల సంఘటనలతో వీరిద్దరి మధ్యా ప్రేమ మొలకెత్తుతుంది. అయితే వీళ్ళు ఒకరికి ఒకరు ప్రేమను వ్యక్తం చేసుకునేలోగా వీరికి రకరకాల మలుపులు, మనుష్యులు అడ్డంగా నిలుస్తారు. ఈ క్రమంలో వీటిన్నటినీ అధిగమించి వీరిద్దరూ ఎలా కలుస్తారనేది సరదాగా చూడదగ్గ కథ...కాదు కాదు..కథనం.

నిజానికి ఇలాంటి కథలు కత్తిమీద సాము లాంటివి. వీటిల్లో ప్రత్యేకమైన కథ ఉండదు. కేవలం సన్నివేశాల బలంతో, డైలాగులతో, నటీనటుల హావ భావాలతో కథనం నడవాలి. అందులోనూ ఈ తరహా చిత్రాల్లో కనపడే...కలవటం...విడిపోవటం..పొందటం అనే రొమాంటిక్ కామిడీ బీట్స్ సగటు సినిమా ప్రేక్షకుడుకి పరిచయం అయినవే. దాంతో తెరపై తర్వాత ఏం జరుగుతుందనేది ప్రేక్షకుడు ఇట్టే ఊహించేస్తాడు. దాంతో ఇలాంటి కథను నెలబెట్టాలంటే...స్క్రీన్ ప్లేని ఎంత ఆసక్తికరంగా మలిచాము, ఎంత కొత్తగా చెప్పామన్నదే చివరిదాకా కూర్చోబెట్టే అంశం. ఈ విషయంలో దర్శకురాలు పూర్తిగా కాదు కానీ..దాదాపు సఫలీకృతమైనట్లే.

ఇక ఫస్టాఫ్ పూర్తయ్యి ఇంటర్వెల్ కు వచ్చేసరికే కథ ఓ కొలిక్కి వచ్చేసింది. ఇద్దరి మధ్యా ప్రేమ పుట్టిన తర్వాత వేరే ఏ సమస్యా వారిద్దమరి మధ్య లేకపోవటంతో కాంఫ్లిక్ట్ లేకుండా పోయింది. దాంతో సెకెండాఫ్ ని రన్ చేయటం కోసం..అపార్ధాలు, ఫేక్ బ్యాంగ్ ల మీద ఆధారపడ్డారు. అలాగే ఇక హీరోయిన్ కి సెల్ ఫోన్ పెడితే కథ ఆగిపోతుందని పెట్టకపోవటం, కథ డిమాండ్ చేయకపోయినా కావాలని డైలీ సీరియల్ తరహా ట్విస్ట్ లు కథలోకి తీసుకురావటం, మైనస్ లు గా ఈ చిత్రంలో పంటిక్రింద రాయిలా కనపడతాయి.

అలాగే హీరో తల్లిని చంపటం అనవసరం అనిపిస్తుంది. ఎందుకంటే దానివల్ల ఎక్కడా కథలో డెప్త్ పెరగలేదు... కథలో చిన్న మార్పు కూడా రాలేదు. అలాగే ఆశిష్ విధ్యార్ధి పాత్ర క్లైమాక్స్ లో కామిడి చేసినా నిజానికి అదీ కథను ఏ మాత్రం ముందుకు తీసుకువెళ్ళదు. ఇవన్ని ప్రక్కన పెట్టితే కథలో ఎక్కడో ప్లాంటింగ్ చేసి మరెక్కడో పే ఆప్ చేయటం(గే సీన్ వంటివి) అనే టెక్నిక్ ని చాలా చోట్ల వాడినా ఎక్కడా దొరక్కుండా మ్యానేజ్ చేయటం మాత్రం బాగా చేసారు. వీటితో పాటు టైటిల్స్ పడేటప్పుడు ఆ టెక్నీషియన్స్, ఆ ఆర్టిస్టులు చిన్నప్పటి ఫోటోలు వెయ్యటం కూడా చాలా బాగుంది. ముఖ్యంగా క్లైమాక్స్ కామిడీనే ఈ చిత్రం సక్సెస్ కు ప్రాణమై నిలుస్తుంది.

నటీనటుల్లో నాని, నిత్య పోటీ పడిచేసారు. నిత్య నటనకన్నా నవ్వు బాగుంది. ఆ నవ్వుతో చాలా మంది ప్రేమలో పడే ప్రమాదం కూడా ఉంది. డైలాగులు కూడా ఎన్నుకున్న జెనర్ కి తగ్గట్లే పంచ్ లతో పేలాయి.అయితే కథకు సంభంధం లేని సన్నివేశాల్లోనే అవి పేలటం విచిత్రం. ఇక డైరక్షన్ పరంగా గా దర్శకురాలు నీట్ గా ప్రెజెంట్ చేసింది కానీ తనదైన ప్రత్యేకమైన ముద్ర వేయలేకపోయింది. టెక్నికల్ గా కెమెరా వర్క్ మరింత బావుండాల్సింది. మిగతా డిపార్టమెంట్ లు ఓకే అనిపిస్తాయి. రెండు పాటలు తప్ప మిగతావి ఎక్కవు.

ఏదైమైనా ఈ చిత్రం ఓ కామిడీ గా చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు. అలాగే ఓ కొత్త దర్శకురాలు తడబడకుండా చేసిన ప్రయత్నాన్ని అభినందించటానికి వెళ్ళొచ్చు. ఉన్నంతలో ఆహ్లాదంగా తీయటానకి ప్రయత్నంచిన ఈ చిత్రంలో అసభ్యత, శృంగారం లేవు కాబట్టి ఫ్యామిలీలు నిరభ్యంతరంగా వెళ్ళి చూసి రావచ్చు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu