»   » అమ్మమ్మగారిల్లు రివ్యూ: ఫీల్‌గుడ్ ఫ్యామిలీ డ్రామా

అమ్మమ్మగారిల్లు రివ్యూ: ఫీల్‌గుడ్ ఫ్యామిలీ డ్రామా

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  Rating:
  3.0/5
  Star Cast: నాగ శౌర్య, షామిలి, రావు రమేష్, చలపతిరావు, సుమన్
  Director: సుందర్ సూర్య

  'ఛలో' సినిమాతో హిట్ అందుకున్న హీరో నాగశౌర్య ఈ సారి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టెనర్ 'అమ్మమ్మగారిల్లు'తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2009లో వచ్చిన 'ఓయ్' తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న హీరోయిన్ షామిలీ ఈ సినిమా ద్వారా తెలుగులో హీరోయిన్‌గారీ ఎంట్రీ ఇచ్చింది. సుందర్ సూర్య దర్శకత్వం వహించిన ఈ సినిమాపై టీజర్, ట్రైలర్ విడుదలైనప్పటి నుండే ఒక పాజిటివ్ బజ్ ఏర్పడింది. ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మమ్మగారి ఇల్లు అనేది ఒక మధుర జ్ఞాపకం. ఆ తీపి జ్ఞాపకాలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకునే విధంగా ఈ సినిమా ఉంటుందనే అంచనాలు ఏర్పడ్డాయి. మరి సినిమా ఏ మేరకు ప్రేక్షకులను అంచనాలను రీచ్ అయింది అనేది రివ్యూలో చూద్దాం.

  కథ విషయానికొస్తే.....

  పిఠాపురంలో పేకేటి రంగారావు(చలపతిరావు) 100 ఎకరాల ఆసామి. ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు, అల్లుళ్లతో సంతోషంగా ఉండే కుటుంబం. అయితే రంగారావు పెద్ద కొడుకు బాబూరావు(రావు రమేష్)కు ఆస్తి పంచుకుని ఆ డబ్బుతో సిటీకి వెళ్లి ఏదైనా వ్యాపారం చేసుకోవాలని ఉంటుంది. ఆస్తి పంచమని అడుగుతాడు. అయితే రంగారావుకు ఇది ఇష్టం ఉండదు. ఈ క్రమంలో జరిగిన వాదనలో తన బావ(సుమన్)పై చేయిచేసుకుంటాడు బాబూ రావు. అల్లుడిని తన కొడుకు అవమానించడాన్ని భరించలేక రంగారావు మనస్థాపంతో చనిపోతాడు. ఆస్తి కోసం తండ్రి చావుకు కారణమయ్యాడని ఊర్లో అంతా అనడంతో కోపంతో ఈ ఆస్తి వద్దు, ఈ కుటుంబంతో సంబంధం వద్దు అంటూ బాబు రావు తన భార్య, కూతురుతో కాకినాడ వెళ్లిపోతాడు. తర్వాత మిగిలిన కొడుకులు, కూతుళ్లు ఎవరి దారి వాళ్లు చూసుకుని వివిధ ప్రాంతాల్లో సెటిలైపోతారు. ఊర్లో రంగారావు భార్య సీతమ్మ (సుమిత్ర) ఒంటరిగా ఉండిపోతుంది.

  20 ఏళ్లుగా అంతా ఇంటికి దూరంగా...

  పంతాలు, పట్టింపులు, వ్యాపారాలు, ఉద్యోగాల్లో పడి అంతా ఇంటి మొహం చూడటమే మానేస్తారు. కనీసం తండ్రికి పిండం పెట్టడానికి కూడా ఎవరూ రావు. తన కొడుకులు, కూతుళ్లు, మనవళ్లు తనను చూడటానికి వస్తారని ఎదురు చూసీ చూసీ సీతమ్మ అలిసి పోతుంది. తన ఆరోగ్యం కూడా పాడవ్వడంతో ఆస్తులు పంచితే వాటిని తీసుకోవడానికైనా అంతా తనను చూడటానికి వస్తారని ఆశ పడుతుంది. ఈ విషయమై అందరికీ కబురు పెడుతుంది. ఆస్తి పంపకం అనగానే అంతా ఎగేసుకుని వస్తారు. ఒక్కరోజులో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుని వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. ఇక్కడి వరకు వచ్చిన వారు కనీసం తనతో నాలుగురోజులు కూడా ఉండటం లేదనే అమ్మమ్మ మనసులోని బాధను అర్థం చేసుకున్న మనవడు సంతోష్ (నాగ శౌర్య) వారిలో మార్పు తేవడానికి ఏం చేశాడు? వారి బాధ్యతను వారు తెలుసుకునేలా ఎలాంటి ప్లాన్స్ వేశాడు అనేది తెరపై చూడాల్సిందే.

  నాగ శౌర్య పెర్ఫార్మెన్స్ అదుర్స్

  సీతమ్మ మనవడు సంతోష్ పాత్రలో నాగ శౌర్య సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఎమోషన్ సీన్లలో చాలా నేచురల్ గా నటించాడు. కుటుంబం మొత్తాన్ని కలిపి అమ్మమ్మ ముఖంలో సంతోషం చూడటానికి నాగ శౌర్య చేసే ప్రయత్నాలు ప్రేక్షకులను మెప్పిస్తాయి.

  గ్లామర్‌కు దూరంగా షామిలి

  అంజలి చిత్రంతో బాలనటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న షామిలి.... ఆ మధ్య ‘ఓయ్' సినిమా ద్వారా హీరోయిన్ గా తెరంగ్రేటం చేసింది. అయితే లుక్ పరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా ఆకట్టుకున్నది. కథ అంతా నాగశౌర్య మీదే నడవడం, మిగితా పాత్రలకు కూడా ప్రాధాన్యం ఉండటంతో షాలిని పాత్రను కొంత నిర్లక్ష్యం చేసినట్టు కనిపిస్తుంది. గ్లామర్‌కు స్కోప్ లేకపోవడం షామిలి ఫ్యాన్స్‌కు కొంత నిరాశే.

  రావు రమేష్ ఇతర తారాగణం

  సినిమా ఏదైనా అందులో ఒక విలన్ షేడ్స్ ఉన్న పాత్ర ఉండాల్సిందే. ఆ బాధ్యత ఈ చిత్రంలో రావు రమేష్ చేపట్టారు. రావు రమేష్ పెర్ఫార్మెన్స్ పరంగా అదరగొట్టారు. శివాజీ రాజా, సుధ, హేమ, పోసాని, సుమన్ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. హీరో పక్కన ఉండే కమెడియన్ పాత్రలో శకలక శంకర్ అక్కడక్కడ నవ్వులు పూయించాడు.

  టెక్నికల్ అంశాల పరంగా...

  టెక్నికల్ అంశాల పరంగా చూస్తే ఈ చిత్రానికి రసూల్ ఎల్లోర్ అందించిన సినిమాటోగ్రఫీ మేజర్ ప్లస్ పాయింట్. కళ్యాణ కోడూరి అందించిన పాటలు, సాయి కార్తీక్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. జెపి ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉంటే బావుండేది.

  సుందర్ సూర్య దర్శకత్వం

  సుందర్ సూర్య దర్శకత్వం బావుంది. కథలో ఎక్కడా కూడా ఎమోషన్స్ డౌన్ కాకుండా చివరి వరకు దాన్ని మెయింటేన్ చేయడంలో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా ఎజ్ లాక్ గేమ్ సీన్ ప్రేక్షకలను బాగా ఎంటర్టెన్ చేస్తుంది. అయితే స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త శ్రద్ధ పెడితే బావుండేది. కొన్ని చోట్ల సినిమా కాస్త బోరింగ్ అనిపిస్తుంది. ఆ గ్యాపును కాస్త వినోదాత్మకంగా ప్లాన్ చేస్తే సినిమా మరింత బావుండేది.

  కాన్సెప్టు పాతదే అయినా ఎమోషన్స్ పండించడంలో సక్సెస్

  సినిమా కాన్సెప్టు పాతగా, రోటీన్ గా అనిపించినా..... ఆయా సీన్లలో దర్శకుడు కోపం, నవ్వులు, భావోద్వేగం లాంటి ఎమోషన్లు పండించడంలో సక్సెస్ అయ్యాడు. సినిమాలో రెండు మూడు చోట్లు ప్రేక్షకులు సైతం భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకునే విధంగా సీన్లు చిత్రీకరించిన విధానం బావుంది.

  ప్రతి ఒక్కరినీ ఆ మధుర జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లే మూవీ

  ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మమ్మగారిల్లు అనేది ఒక మధుర జ్ఞాపకం. స్కూళ్లకు సెలవులు వస్తే చాలు చిన్నతనంలో అంతా అమ్మమ్మగారింట్లో వాలిపోయేవారం. ఇందులో ఆ సరదాలు, సంతోషాలు పరిమితంగానే చూపించినప్పటికీ..... ప్రేక్షకులను అప్పటి జ్ఞాపకాల్లోకి తీసుకెళ్లడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

  ఫైనల్‌గా

  అమ్మమ్మగారింటికి ఎన్నిసార్లు వెళ్లినా బోర్ కొట్టదు. అక్కడ ఉండే అప్యాయతలు మనల్ని అటు లాగేస్తూ ఉంటాయి. ఈ సినిమా కాన్సెప్టు కాస్త పాతగా అనిపించినా అందులో ఎమోషన్స్ కట్టిపడేస్తాయి. మీ చిన్ననాటి మధుర జ్ఞాపకాలను ఈ సినిమా గుర్తు చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

  ప్లస్ పాయింట్స్

  నాగ శౌర్య పెర్ఫార్మెన్స్
  అమ్మమ్మ పాత్రలో సుమిత్ర
  సంగీతం, కెమెరా, బ్యాగ్రౌండ్ స్కోర్
  దర్శకుడు ఎమోషన్స్ క్యారీ చేసిన విధానం

  మైనస్ పాయింట్స్

  రోటీన్‌‌గా అనిపించే సినిమా కాన్సెప్ట్
  హీరోయిన్ శామిలి పెర్ఫార్మెన్స్
  రొమాన్స్, కామెడీ తగ్గడం

  అమ్మమ్మగారిల్లు

  తారాగణం: నాగ శౌర్య, షామిలి, రావు రమేష్, చలపతిరావు, సుమన్, సుధ, హేమ, సుమిత్ర, శకలక శంకర్, పోసాని తదితరలు
  కెమెరా: రసూల్ ఎల్లోర్
  సంగీతం: కళ్యాణ కోడూరి
  బ్యాగ్రౌండ్ స్కోర్: సాయి కార్తీక్
  లిరిక్స్: సిరివెన్నెల, భాస్కరభట్ల
  బేనర్: స్వావిజ్ మూవీస్
  సమర్పణ: స్వప్న
  నిర్మాత: రాజేష్
  సహ నిర్మాత: కేఆర్
  ఎడిటింగ్: జేపీ
  కథ-కథనం-మాటలు-దర్శకత్వం: సుందర్ సూర్య

  English summary
  Director Sundar Surya's Telugu movie Ammammagarillu starring Naga Shaurya and actress Shamilee, is about a youngster (Naga Shaurya) who shares a warm relationship with his grandmother (played by Sumitra). The movie shows the incidents that occur and the various circumstances he faces while visiting his grandmother's village.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more