twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సగటు 'అతడు'- సమీక్ష

    By Staff
    |

    Atadu
    సినిమా: అతడు
    విడుదల తేదీ: 10-8-2005
    నటీనటులు: మహేష్‌బాబు, త్రిష, శాయాజీ షిండే, కోట శ్రీనివాసరావు,
    రాహుల్‌దేవ్‌, బ్రహ్మానందం, రాజీవ్‌ కనకాల, ప్రకాష్‌రాజ్‌, బ్రహ్మాజీ, చరణ్‌రాజ్‌,
    సునీల్‌, కె విశ్వనాధ్‌, తనికెళ్ళ భరణి, నాజర్‌, గిరిబాబు, ధర్మవరపు సుబ్రమణ్యం తదితరులు
    సంగీతం: మణిశర్మ
    ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్‌
    కళ: తోట తరణి
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: త్రివిక్రం
    నిర్మాత: జయభేరి కిషోర్‌

    'అర్జున్‌' సినిమా తర్వాత చాలా ఆలస్యంగా వచ్చిన మహేష్‌బాబు సినిమా 'అతడు'. స్క్రీన్‌ప్లే లోపం కారణంగా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోని యావరేజి సినిమా ఇది.‌

    కథ: నందు (మహేష్‌బాబు) చిన్నప్పటినుంచి నేర ప్రవృత్తిలో పెరుగుతాడు. అతనో ప్రొఫెషనల్‌ కిల్లర్‌. ఒక రోజు శివారెడ్డి (శాయాజీ షిండే) అనే ప్రతిపక్ష రాజకీయ నాయకుడు సానుభూతి ఓట్ల కోసం తనపై దాడి కోరుకుంటాడు. తన సహచరుడు కోట శ్రీనివాసరావుతో ఆలోచించి ప్రొఫెషనల్స్‌తో అయితే ప్రమాదం లేకుండా దాడి జరుగుతుందని నమ్మి నందుని సంప్రదిస్తారు. కాంట్రాక్టు ప్రకారం నందు దాడికి దిగే సమయానికి శివారెడ్డిపై ఎవరో దాడి చేస్తారు. వారి కాల్పుల్లో శివారెడ్డి మరణిస్తాడు.‌

    చరణ్‌రాజ్‌ నేతృత్వంలోని పోలీసు బృందం నందుని వెంటాడుతుంది. నందు తప్పించుకుని ఒక రైలు ఎక్కుతాడు. అక్కడ పార్దు (రాజీవ్‌ కనకాల) నందుకు పరిచయమవుతాడు. పార్దు తన సొంత ఊరైన పాశర్లపూడి వెళ్తుంటాడు.‌

    చిన్నప్పుడే ఇంట్లో నుంచి పారిపోయిన పార్దు 'కనబడుట లేదు' ప్రకటన చదివి తన వారిని కలుసుకోడానికి వెళ్తున్నాడు. ఆ విషయాలు నందుకి పార్దు చెబుతుండగా పోలీసుల దాడి ప్రారంభమవుతుంది. ఆ దాడిలో పార్దు కాకతాళీయంగా చనిపోతాడు. పార్దు వాళ్ళ ఊరు పాశర్లపూడికి నందు చేరుకుంటాడు. తానే పార్దుగా మారుతాడు. పార్దు మేనమామ కూతురు పూరి (త్రిష) అతనికి పరిచయమవుతుంది.‌

    ఈలోపు సిబిఐ అధికారి ప్రకాష్‌రాజ్‌ నేతృత్వంలో శివారెడ్డి హత్యకేసు దర్యాప్తు ముమ్మరమవుతుంది. పార్దుగా నందు ఆ కుటుంబ సమస్యలు తీరుస్తూ త్రిషతో ప్రేమలో పడతాడు. అసలు శివారెడ్డిని చంపిందెవరు? పార్దుగా నటిస్తున్న నందు ఎలా ఆ ఇంటివారి అభిమానాన్ని సంపాదిస్తాడన్నది తెర మీద చూడాల్సిందే.‌

    టెక్నికల్‌గా 'అతడు' సినిమా బాగుంది. త్రివిక్రం పదునైన మాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. 'నీతో చెప్పనా', 'అవును నిజం నువ్వంటే నాకిష్టం' పాటలు వినసొంపుగా ఉండడమే గాక పిక్చరైజేషన్‌ కూడా బాగుంది. ప్రొఫెషనల్‌ కిల్లర్‌గా మహేష్‌బాబు మంచి ఈజ్‌తో నటించాడు. బ్రహ్మానందం హాస్యం కథలో ఇమడకపోయినా చూడడానికి బాగుంది.‌

    హీరో కృష్ణ 'రౌడీ అన్నయ్య', బాలకృష్ణ 'సమరసింహారెడ్డి' వంటి స్టోరీలైన్‌ ఇది. ఫ్లాష్‌బ్యాక్‌ లేకుండా క్లాసిక్‌ నేరేషన్‌లో చూపించడం కొత్తగా ఉంది. కథలో మహేష్‌బాబు రాజీవ్‌ కనకాల ఇంటికి రావడం తనను తాను రక్షించికోడానికా, రాజీవ్‌ కుటుంబాన్ని ఆదుకోడానికా అన్న విషయం స్పష్టం కాదు. దానితో హీరో లక్ష్యం స్పష్టంగా తెలియదు. ఆ ఇంటితో హీరో పూర్తి స్దాయి అనుబంధం ఏర్పరచుకున్నట్టు కూడా కనిపించదు. ఇంటర్వల్‌ సమయంలో సిబిఐ అధికారి వచ్చినప్పుడు తప్పుకునే ప్రయత్నం చేయడు. పైగా నాజర్‌కి పది లక్షల రూపాయల చెక్‌ ఇస్తాడు. తనను వెంటాడుతున్న సిబిఐ అధికారులు ఆ చెక్‌ ఆధారంగా తనను పట్టుకుంటారన్న స్పృహ ఉండదు. తనికెళ్ళ భరణితో ఉన్న సీన్లు ఫైట్స్‌కే తప్ప కథకి సంబంధం లేదు. త్రిషకు ఆట పాటలకు తప్ప కథలో ప్రాధాన్యం లేదు. తనని శివారెడ్డి హత్య కేసులో ఎవరు ఇరికించారో తెలుసుకునే ప్రయత్నం హీరో చేయకపోవడంతో హీరో పాత్ర పాసివ్‌గా మారిపోయింది. నాజర్‌ చెప్పే వరకు ఆ విషయం హీరోకి తెలియదు. ఇంటర్వల్‌ తర్వాత స్క్రీన్‌ప్లే పట్టు తప్పడంతో కథ నార సాగుతున్న ఫీలింగ్‌ ప్రేక్షకుడికి కలుగుతుంది. ఆ నలభై అయిదు నిముషాలు సినిమాకు పెద్ద మైనస్‌ పాయింట్‌. చరణ్‌రాజ్‌ పాత్రకు ముగింపు చూపలేదు. క్లెయిమాక్స్‌ భారీ ఎత్తున తీశామని ప్రచారం చేసుకున్నారు తప్ప స్క్రీన్‌ మీద అది తేలిపోయింది. అసభ్యత లేకపోవడం సినిమాకున్న ఒక ప్లస్‌ పాయింట్‌.‌

    గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X