twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బావని భరించటం కష్టం('బావ' రివ్యూ)

    By Srikanya
    |
    Bava
    Rating
    -జోశ్యుల సూర్య ప్రకాష్
    బ్యానర్: శ్రీ కీర్తి కంబైన్స్
    తారాగణం: సిద్దార్థ్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, ప్రణిత, తణికెళ్ళ భరణి, ఆహుతి ప్రసాద్, సామ్రాట్.
    సంగీతం: చక్రి
    డైలాగులు: వీరపోతన
    కూర్పు: కె.వి.కృష్ణా రెడ్డి
    సినిమాటోగ్రఫీ: అరవింద్ కృష్ణ
    నిర్మాత: ఎమ్.ఎల్.పద్మకుమార్ చౌదరి
    దర్శకత్వం: రాంబాబు

    విడుదల తేదీ: 28, అక్టోబర్ 2010

    అచ్చ తెలుగు టైటిల్, అందమైన పల్లె లొకేషన్స్, ఫ్యామిలీలను ఎట్రాక్ట్ చేసే హీరో ఓ హిట్ సినిమాకు ఇంకే కావాలి అనిపిస్తోంది కదూ...అయితే వీటిన్నటినీ ముడిపెట్టడానికి ఎమోషన్స్ తో నిండిన అధ్బుతమైన కథ కూడా అవసరమే అనే విషయమే దర్శకుడు మర్చిపోయాడు. దాంతో సినిమా ఎంత దారుణంగా తయారైందంటే...సినిమా సగం అయ్యేసరికి ప్రేక్షకుడికీ, సినిమాకి కనెక్షన్ తెగిపోయి..తెరపై చావుని చూపినా అదేదో కామిడీలా ధియోటర్ లో విజిల్స్ ఘొల్లున నవ్వులు. రొటీన్ కథ అనే కత్తికి బావ బలైపోయాడు. ఈ క్రమంలో సిద్దార్ద, ప్రణీత,రాజేంద్రప్రసాద్ ఎంత చక్కగా తమను తాము తెరపై ఆవిష్కరించుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. కొత్త దర్శకుడు చాలా పాత వాసనలతో, పక్కా ఫార్ములా చిత్రాన్ని తీసి అందరినీ నిలువునా ముంచాడు.

    మోతుబరి సీతారామ్(రాజేంద్రప్రసాద్)కి ఓ కోరిక. అది తన కొడుకు వీరబాబు(సిద్దార్ద్)కి అన్ని విధాలుగా అల్లుడిని జాగ్రత్తగా చూసుకునే కుటుంబంలోని పిల్లను తెచ్చి పెళ్లి చేయాలని(అలాంటి సంభంధం తేవాలని ఏ ప్రయత్నం చేయడు). అయితే ఇదేమీ పట్టించుకోని వీరబాబు.. ఎప్పుడూ నలుగురు కుర్రాళ్ళను వేసుకుని తిరుగుతూ పనిలో పనిగా ప్రక్కవూరి అమ్మాయి వరలక్ష్మి(ప్రణీత) తో ప్రేమలో పడతాడు. పడిందే తడువుగా ఆమెను ఇంప్రెస్ చేయటానికి నానా తిప్పలూ పడి ప్రేమను ఓకే చేయించుకుంటాడు. అంతే ఇదేదో తెలిసినట్లుగా ఆమెకు ఇంట్లో వాళ్ళు కంగారుగా నిశ్చితార్ధం ఏర్పాటు చేసేస్తారు. దాంతో ఆమె ఏడుస్తూ వీరబాబు దగ్గరకు వస్తుంది. ఆమె భాధను చూడలేని వీరబాబు ఆవేశంగా, అత్యంత రహస్యంగా ఆమె మెడలో మూడు ముళ్ళూ వేసేసి ఓదారుస్తాడు. ఈ విషయం తెలుసుకున్న వీరబాబు నాన్న...నేనేం తీసిపోయానా అన్నట్లు మరింత ఆవేశంగా ఓ ప్లాష్ బ్యాక్ వివరిస్తాడు. ఆ ప్లాష్ బ్యాక్ లో ఏముందీ అంటే..పాతికేళ్లనాడు వరలక్ష్మి మేనత్తను తాను పెద్దలకు ఇష్టం లేకపోయినా పెళ్ళి చేసుకున్నానని, అందుకే ఆ రెండు కుటుంబాలకు మాటలు లేవని, మళ్లీ ఆ తప్పు రిపీట్ చేయవద్దని చెప్తాడు. వరలక్ష్మి తన మరదలు అని తెలుసుకున్న వీరబాబు అప్పుడు ఏం చేసాడు. ఎలా వరలక్ష్మిని తనదాన్ని చేసుకున్నాడు అనేది తెరపై చూడాల్సిందే.

    అక్షయ్ కుమార్ "సింగ్ ఈజ్ కింగ్" లోని ఓపినింగ్ ఎపిసోడ్(ఊరి నుంచి హీరోని తరిమేయాలని జనం ప్లాన్ చేయటం)తో ప్రారంభమైన ఈ చిత్రం ఆ తర్వాత "చాందినీ చౌక్ టు చౌనా" లోని కామిడీని, ఇంటర్వెల్ తర్వాత "లవ్ ఆజ్ కల్" లోని ప్లాష్ బ్యాక్ ని ముడేసికొని, రక రకాల తెలుగు సినిమాల్లోని సెంటిమెంట్ ని కలుపుకుని రంగంలోకి దిగింది. ఇంత కష్టపడి ఇన్ని సినిమాలు వడబోసి వడ్డించిన సినిమా కధ కదా అనుకుంటే మళ్ళీ మూస ఫార్ములా చక్రంలోనే కథ తిరుగుతూంటుంది. అనవరసం అనిపించే ఎమోషన్స్ తో, కథ డిమాండ్ చేయని ట్విస్ట్ లతో ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తుంది. ఫస్టాఫ్ కామిడీతో కొట్టుకుపోయినా సెకెండాఫ్ మరీ పేలవంగా మారిపోయింది. దానికి కారణం ఖచ్చితంగా కథన సమస్యే. ఇంటర్వెల్ అయిన కాస్సేపటిదాకా (ఫ్లాష్ బ్యాక్ పూర్తయ్యేదాకా) కథ సెటెప్ పూర్తి కాదు. కథలో సమస్య ప్రవేశించదు. పోనీ అప్పటి నుంచైనా హీరో ఆ సమస్య పోరాట దిశగా ప్రయాణం పెట్టుకుంటాడేమో అనుకుంటే మరో విలన్ వచ్చి కథని కలగాపులగం చేసేస్తాడు. దాంతో అస్సలు విలన్ ఎవరు..కొసరు విలన్ ఎవరు..వీరిలో ఎవరితో హీరో పోరాడాలి అనేది హీరోకే కాదు...చూస్తున్న మనకీ సమస్యే. ఇక సెకెండాఫ్ లో కథ లేకపోవటంతో...అల్లు అర్జున్ చిత్రం వరుడు ని బ్రహ్మానందం పేరడి చేసి నవ్వించే ప్రయత్నం చేసారు. అదీ పేలలేదు.అలాగే రాజేంద్రప్రసాద్ వంటిసీనియర్ ఆర్టిస్టునీ వాడుకోలేదు. అలాగే అలీ, రఘుబాబు వంటి సీనియర్ కమిడెయన్ లు ఉన్నా కూడా ఉపయోగించుకోలేదు.

    ఇక ప్లస్ ల్లోకి వస్తే అల్లు అర్జున్ ఆర్య-2 లో రింగ రింగ పాటతో హీరోయిన్ ని పరిచయం చేయటం బాగా పేలింది. అలాగే టైటిల్ సాంగ్ బాగుంది..బాగా పిక్చరైజ్ చేసారు. ఇక గోదావరి అందాలను వంశీ సినిమాల తరహాలో చాలా బాగా చూపించి కెమెరామెన్ మంచి మార్కులు కొట్టేసారు. అలాగే ఎడిటింగ్ కూడా సినిమా మూడ్ ని చాలా వరకూ ముందుకు తీసుకెళ్ళింది. ఇక డైలాగులు రచయిత సీన్ కి విజువల్ గా ప్లేస్ ఇవ్వకుండా కంటిన్యూ డైలాగులు రాసినా కొన్ని చోట్ల పేలి నవ్విస్తాయి. సిద్దార్ధ ఎప్పటిలాగే చేస్తూ..కొన్ని సీన్స్ లో కమల్ హాసన్ ని అనుకరిస్తూ చేసాడు. హీరోయిన్ ప్రణీత మాత్రం చక్కటి ఈజ్ తో చేసింది. ఆహుతి ప్రసాద్, తణికెళ్ళ వంటి ఆర్టిస్టులు కొత్తగా చేయకపోయినా నిండుతనం తీసుకొచ్చారు.

    ఫైనల్ గా ఈ చిత్రంలో లక్ష్మీ కళ్యాణం,సీతారాముల కళ్యాణం వంటి చిత్రాలలో ఉన్న రెండు ఊళ్ళు దేముళ్ళులను పంచుకోవటం ఉంది(అంటే హీరో వీరిద్దరని కలపాలన్నమాట. అదేమిటి ఆ ఊరివారు మరో సీతో, రాముడో విగ్రహం తెచ్చుకుని కళ్యాణం చేసుకోవచ్చు కదా అని అడగొద్దు). అలాగే లక్ష్మీ కళ్యాణం, ఆవకాయ బిర్యాని చిత్రాల తరహాలో చివర్లో విలన్ కీ, హీరోకి సైకిల్ రేసు ఉంది. కాబట్టి ఆనాటి మధుర స్మతులు మళ్ళీ గుర్తుచేసుకోవాలనుకునే వారు మిస్సవకుండా చూడాల్సిన చిత్రమిది. మిగతావారు ఓపిక, సహనం అనే పాళ్ళు తమలో ఎంతఉన్నాయి అనేదాన్ని బట్టి ఈ చిత్రానికి వెళ్ళటం మేలు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X