twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో ప్రేమ కథా చిత్రం

    By Staff
    |

    Bagunnara
    -జలపతి గూడెల్లి
    చిత్రం: బాగున్నారా
    నటీనటులు: నవీన్, ప్రియాగిల్‌, సురేష్‌, శ్రీహరి, విజయ్‌ కుమార్‌
    సంగీతం: దేవా
    ఫోటోగ్రఫీ: శ్యాం.కె.నాయుడు
    నిర్మాత: పిల్లి ఆనందరావు
    దర్శకత్వం: బక్రుద్దీన్‌

    పెళ్ళి పాటలు, అన్యోన్య కుటుంబం, ప్రేమ, దానికి కొంత ట్విస్ట్‌ లు రంగరించి తీసిన మామూలు ప్రేమకథా చిత్రమిది. హీరో, హీరోయిన్‌ లు ప్రేమలో పడడం, కొన్ని రీళ్ళ రోమాన్స్‌, ఆ తర్వాత వారి రోమాన్స్‌ కు బ్రేకులు పడడం, చివరికి వాళ్ళిద్దరు ఎలాగెలాగో కలవడం-వంటి సగటు సినిమా ప్రేమకథలో ఉండాల్సిన అన్నీ సన్నివేశాలూ 'బాగున్నారా' చిత్రంలోనూ ఉన్నాయి. కాకపోతే ఈ చిత్రంలో హీరో, హీరోయిన్ల ప్రేమను అడ్డుకునే విలన్‌ లు ఉండరు. ఐనా వారి ప్రేమకు అడ్డంకులు ఎదురవుతాయి. వీటిని ఎలా అధిగమిస్తారనేదే ఈ చిత్రంలోని వెరైటీ అన్నమాట.

    పారిశ్రామిక వేత్త విజయ్‌ కుమార్‌ కు ఇద్దరు కుమారులు, ఒక కూతురు. పెద్ద కొడుకు చిన్నా- ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుంటాడు. చిన్న వాడు సురేష్‌ తండ్రికి బిజినెస్‌ లో సాయం చేస్తుంటాడు. కూతురు ప్రియాగిల్‌. కాలేజీ అయిపోయ్యాక ఏం చెయ్యాలో తోచక అన్నయ్యకు సంబంధాలు వెతకడమే పనిగా పెట్టుకుంటుంది. ఆస్తిపాస్తుల కన్నా మంచి అమ్మాయిని తన కోడలుగా చేసుకోవాలన్నది విజయ్‌ కుమార్‌ ఆశ. గిరిబాబు కూతురును చూసిన ప్రియా- వెంటనే తన అన్నయ్యకు సరైన జోడి అనుకుంటుంది. ఇరుపక్షాల వారిని ఒప్పించి పెళ్లి చేయిస్తుంది. నవీన్‌- గిరిబాబు ఏకైక పుత్రరత్నం. పెళ్ళిలో టీజ్‌ చేసుకోవాడాలు, హిందీ సినిమాల తరహాలో ఓ పాట అయిన తర్వాత నవీన్‌, ప్రియా ఒకరి ప్రేమలో ఒకరు పడుతారు. అయితే కుండల మార్పిడి పెళ్ళికి తను చస్తే ఒప్పుకోనని కుండబద్దలు కొట్టినట్లు విజయ్‌ కుమార్‌ చెప్పడంతో వీరి ప్రేమకు బ్రేకులు పడుతాయి. దీనికి విజయ్‌ కుమార్‌ ఓ ఫ్లాష్‌ బ్యాక్‌ చెపుతాడు.

    విజయ్‌ కుమార్‌ కూడా కుండల మార్పిడి పెళ్ళే చేసుకుంటాడు. విజయ్‌ కుమార్‌ చెల్లెలు యమున శ్రీహరిని పెళ్ళిచేసుకుంటే, శ్రీహరి చెల్లెలు కల్పనను విజయ్‌ కుమార్‌ చేసుకుంటాడు. శ్రీహరి రోజూ తాగుతూ యమునను చావబాదుతుంటాడు. దాంతో శ్రీహరికి బుద్ది చెప్పేందుకు కల్పనను ఇంట్లోనుంచి విజయ్‌ కుమార్‌ వెళ్లగొడుతాడు. తన అన్న ఎంతకీ మారకపోవడంతో కల్పన ఆత్మహత్య చేసుకుంటుంది. ఈ ఘటన చూసి యమున అదే పని చేస్తుంది. ఇలా ఇద్దరు బలవ్వడంతో కుండల మార్పిడి పెళ్ళి అంటేనే విజయ్‌ కుమార్‌ కు వ్యతిరేకత కలుగుతుంది. తన సంతానం కూడా ఆ ఊబిలోకి దిగడం ఇష్టం లేదని అతను చెపుతాడు. ఆయన ఆగ్రహానికి గురికావడం ఇష్టం లేని నవీన్‌ ప్రియను పెళ్ళి చేసుకునేందుకు నిరాకరిస్తాడు. ప్రియా మాత్రం- తన పెళ్ళి నవీన్‌ తోనే అని తెగేసి చెపుతుంది. చివరికి నవీన్‌ మంచితనం గ్రహించిన విజయ్‌ కుమార్‌ వీరి పెళ్ళకి, చిత్రానికి శుభం పలుకుతాడు.

    దర్శకుడు బక్రుద్దీన్‌ కు ఇది తొలి చిత్రం. దర్శకుని ప్రతిభ ఏమాత్రం లేకున్నా ఈ సినిమా ప్రేక్షకులు చూడగలిగే స్థాయిలోనే ఉంది. పాటల చిత్రీకరణ బావుంది. మూడు పాటలు వినసొంపుగా ఉన్నా, గాయకుల ఉచ్ఛారణ దోషాలు ఇబ్బంది కల్గిస్తాయి. నవీన్‌, సురేష్‌, విజయ్‌ కుమార్‌, శ్రీహరిల నటన బావుంది. ప్రియాగిల్‌ అందంగా కనిపించడం తప్ప నటించిందేమీ లేదు. నవీన్‌ ఫ్రెండ్‌ గా సుధాకర్‌ పాత్ర చెప్పుకోదగ్గదికాదు. మొత్తమ్మీద ఫర్వాలేదనిపించే చిత్రం. కాస్త మెలోడ్రామా తగ్గిస్తే బావుండేది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X