twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బోరు కొట్టించావుబాసూ!

    By Staff
    |

    Balevadivi Basu
    ఓ మెగా హిట్‌ అనంతరం ఏ హీరో సినిమా అయినా అంచనాలు ఎక్కువై పొరపాట్లు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. ఆ కోవకు చెందిన చిత్రమే భలేవాడివి బాసూ!. నరసింహనాయుడు అనంతరం విడుదలైన ఈ చిత్రం కథ నుంచి హీరోయిన్ల ఎంపిక వరకూ అంతా లోపభూఇష్టమే. సినిమాటిక్‌ ఎంత ఉన్నప్పటికీ కొంతైనా సహజత్వం లేకుంటే ఆ సినిమాలను ప్రేక్షకులు తిప్పి కొడుతున్న రోజులివి. ఈ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రాన్ని 80లో వచ్చిన మాస్‌ ఫార్ములా చిత్రాలకు దగ్గరగా ఉన్న చిత్రంగా చెప్పుకోవచ్చు. 6 పాటలు, 6 ఫైట్స్‌తో అర్థం పర్ఢంలేని కథ, కథనంతో కూడిన ఈ సినిమా గురించి చెప్పుకోవాల్సింది శూన్యం.

    బాలకృష్ణ ఫారెస్ట్‌ ఆఫీసర్‌. అతని కారు డ్రైవర్‌ సుధాకర్‌. వీరు వచ్చి రావటంతోనే అడవిలోని ఆటవికులలో నాగరికతను పెంపొందించి వారికి విద్య, వైద్య, నీటి సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తారు. ఆటవిక యువతి అంజలా జావేరి బాలకృష్ణను మావ అని ఆటపట్టిస్తూ ఉంటుంది. అదే ప్రాంతానికి పై అధికారిణిగా శిల్పాశెట్టిని నియమిస్తారు. హీరో హీరోయిజాన్ని, మంచి తనాన్ని చూసి అతనిపై మనసుపడుతుందామె. రొమాన్స్‌తో నిండిన పాటలు సరేసరి. ఇంతలోఈ ప్రాంతానికి వచ్చిన ఓ అమ్మాయి సాగర్‌గా నటిస్తున్న హీరో అసలు ఫారెస్ట్‌ ఆఫీసర్‌ కాదని నకిలీ అని వెల్లడిస్తుంది.

    ఇక్కడనుంచి ఫ్ల్యాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ మొదలవుతుంది. ఓ విధంగా చెప్పాలంటే సినిమా పట్టు ఇక్కడ నుంచే జారిపోయింది. సాగర్‌ (వెంకట్‌) చూపిన సోదర ప్రేమను తట్టుకోలేక దొంగతనాల్ని మాని వేసి, ఓ ఇన్‌స్పెక్టర్‌ పన్నిన కుట్ర నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నంలో అడవిదారి పడతారు బాలకృష్ణ(ప్రభు), సుధాకర్‌లు. మార్గంలో ఫారెస్ట్‌ ఆఫీసర్‌గా నియమితుడైన(వెంకట్‌) యాక్సిడెంట్‌కు గురై చనిపోతూ తన తల్లి, చెల్లి బాధ్యతల్ని స్వీకరించాల్సిందిగా బాలకృష్ణను కోరతాడు. ఈ నిజాన్ని వెల్లడించిన తర్వాత అతనిపై మరింత గౌరవాన్ని పెంచుకుంటారందరూ.

    అయితే ఇతని రాకతో తన స్మగ్లింగ్‌ కార్యకలాపాలకు గండి పడ్డ ప్రకాష్‌రాజ్‌ బాలకృష్ణను అంతమొందించే ప్రయత్నం మొదలు పెడతాడు. సాగర్‌ చెల్లెలు పెళ్ళి నిమిత్తం సిటీకి వచ్చిన బాలకృష్ణ అక్కడ ఆటవికుడిగా నటిస్తున్న ఓ వ్యక్తిని చూసి వెంటాడటంతో కథ క్లయిమాక్స్‌కు చేరి హీరో విజయం సాధించటంతో సినిమా ముగుస్తుంది.

    కథ విన్న ఎవరైనా ఈ తరహాలో వందలాది సినిమాలు వచ్చిన విషయాన్ని పేర్లతో సహా చెప్పేస్తారు. దర్శకుడు అరుణ్‌ప్రసాద్‌ ఎందుకు తప్పటడుగు వేశాడో అర్థం కాని విషయం. అందులోనూ నరసింహనాయుడు తర్వాత విడుదలవుతున్న చిత్రంగా విపరీతమైన అంచలున్న నేపథ్యంలో కనీసం కథనంలో కూడా ఎటువంటి ప్రత్యేకలు లేకుండా తీశాడాయన. హీరోగా బాలకృష్ణకు ఈ తరహా పాత్రలు కొట్టిన పిండే. ప్రత్యేకించి పాటలలో ఆయన అద్భుతమైన ఈజ్‌ను ప్రదర్శించారు. పాటలు, వాటి చిత్రీకరణ ఎంత బాగున్నప్పటికీ సినిమాలో విషయం లేకపోవటంతో సంగీత దర్శకుడు మణిశర్మ పడ్డ శ్రమ వృధా అయిందనే పేర్కొనాలి.

    దీనికి తోడు పాటలపై చూపెట్టిన శ్రద్ధను ఆయన నేపథ్య సంగీతం విషయంలో చూపించలేదు. అలానే ఈ సినిమాకు అతిపెద్ద మైనస్‌ పాయింట్‌గా హీరోయిన్లను పేర్కొనాలి. శిల్పాశెట్టి, అంజలాలిద్దరి పాత్రలు, వాటిని మలచిన విధానం అసలు బాగోలేదు. ప్రత్యేకించి అంజలాని ఈ సినిమా చూసిన వారెవరూ మరో చిత్రానికి అవకాశం ఇవ్వరన్నది నొక్కి చెప్పవచ్చు.

    బ్రహ్మానందం, సుధాకర్‌, మల్లిఖార్జున రావు కామెడీ ట్రాక్‌ కూడా సో...సో..నే. మాటల గురించి చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. పేవలంగానూ, బోరుగాను ఉన్నాయి. నిర్మాత పెట్టిన ఖర్చు మాత్రం తెరపై కనిపిస్తుంది. అయితే అదంతా వృధాయే. ప్రధమార్థాన్ని భరించగలిగిన ప్రేక్షకులకు ద్వితీయార్థం బోరు కొట్టడం ఖాయం. పూర్తిగా చూసిన ప్రేక్షకులు ఇంత బోరు కొట్టావేం 'బాసూ!' అనుకొంటూ తిరుగుముఖం పట్టే చిత్రం ఈ భలేవాడివి బాసూ!.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X