twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కొత్త రీళ్ళలో పాత పాళ్ళు 'చంటి'

    By Staff
    |

    Chanti
    -జోశ్యుల సూర్యప్రకాష్‌
    చిత్రం: చంటి
    నటీనటులు: రవితేజ, చార్మి, అంజలి, అతుల్‌ కులకర్ణి,
    ఎమ్మెస్‌ నారాయణ ధర్మవరపు సుబ్రమణ్యం,వేణు మాధవ్‌ తదితరులు
    సంగీతం: శ్రీ
    సాహిత్యం: వేటూరి, సిరివెన్నెల
    దర్శకత్వం: శోభన్‌
    నిర్మాత: కృష్ణ కిషోర్‌

    హీరో తండ్రిని చంపిన విలన్‌. హీరో కోసం పరితపించే ఇద్దరు హీరోయిన్లు. అన్నగారి అనురాగంలో తడిసి ముద్దయ్యే హీరో గుడ్డి చెల్లెలు. ఇది మన తెలుగు సినిమా సాదాసీదా పాపులర్‌ ఫార్ములా. మళ్ళీ అదే ఫార్ములాను అటక మీద నుంచి తీసి దుమ్ము దులిపి తీసిన చిత్రం 'చంటి'. వర్షం వంటి సూపర్‌హిట్‌ సినిమా తీసిన దర్శకుడు శోభన్‌, 'నా ఆటోగ్రాఫ్‌' తర్వాత మళ్ళీ మాస్‌ ఇమేజి సాధించాలనుకుంటున్న రవితేజ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రమిది.‌

    కథంటూ పెద్దగా లేని ఈ సినిమాలో ఊపు తెప్పించే పాటలు, డ్యాన్సులకు కొదవలేదు. రిటైర్డ్‌ మేజర్‌ మాధవరావు (రంగనాథ్‌) కొడుకు చంటి. చంటి కూడా తండ్రి బాటలో మిలిటరీలో చేరి రాష్ట్రపతి పతకం సాధిస్తాడు. తండ్రి మరణ వార్త విని పల్లెకు తిరిగివచ్చి తండ్రి అంత్యక్రియలు జరిపిస్తాడు. ఆ పల్లెలోనే అతని గుడ్డి చెల్లెలు, వసంతలక్ష్మి(చార్మి) అనే వాగుడు కాయ ఉంటారు. తండ్రికి ప్రభుత్వం ఇచ్చిన ఐదెకరాల స్ధలంలో సమాధి కడతాడు.‌

    సమాధే ఈ కథకు పునాది. ఆ ఊళ్ళోనే సర్వారాయుడు (అతుల్‌ కులకర్ణి) అనే ఎమ్మెల్యే ఉంటాడు. ఎమ్మెల్యే కొనుక్కున్న ఫ్యాక్టరీకి అడ్డదారిలో రోడ్డు నిర్మించడానికి చంటి తండ్రి సమాధి ఉన్న స్ధలం అవసరమవుతుంది. ఎమ్మెల్యే ఆ స్ధలాన్ని అమ్మమంటే తండ్రి మీద ఉన్న సెంటిమెంట్‌తో చంటి ససేమిరా అంటాడు. ఎమ్మెల్యే సామ దాన దండోపాయాలు ప్రయోగించినా చంటి లొంగడు. తన తండ్రి హార్ట్‌ ఎటాక్‌తో చనిపోలేదని, ఎమ్మెల్యే దురాగతానికి బలయ్యాడని తెలుసుకుని విలన్‌ని హీరో చంపేస్తాడు.‌

    సాదాసీదాగా సాగిన ఈ కథలో విలన్‌ చెల్లెలు (అంజలి)పాత్రను సృష్టించి, ఆమెతో అసలు హీరోయిన్‌కు పోటీ పెట్టి , పాటలు పెట్టి రొమాన్సు నడిపాడు దర్శకుడు. ఈ చిత్రంలో కథ లక్ష్యం ఫ్యాక్టరీ తెరిపించి కార్మికులను ఆదుకోవడం. హీరో లక్ష్యం మరికటి ఉంది తన తండ్రి సమాధిని కాపాడు కోవడం. ఈ రెండు లక్ష్యాలు క్లాష్‌ కావడం వల్ల కథ సహజంగానే బలహీన పడింది.‌

    హీరోయిన్లు ఇద్దరినీ చిన్న నాటి స్నేహితులుగా పరిచయం చేసి పెద్దయ్యాక వాళ్ళు స్నేహంగా ప్రవర్తించకుండా డైరెక్టుగా ప్రేమలో పడడం డైరెక్టరు తప్పు కాదు. మన మూస ఫార్ములాల ప్రభావం. చంటి తండ్రిని విలన్‌ చంపడం వసంత లక్ష్మి ప్రత్యక్షంగా చూస్తుంది కానీ ఏమాత్రం ఫీలింగ్‌ ఆమెలో కన్పించదు.‌

    స్క్రిప్టులో అనేక వీక్‌ లింక్స్‌ కారణంగా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. రవితేజ మేక ప్‌ వైఫల్యం కారణంగా అతను తెర మీద గ్లామరస్‌గా కన్పించలేదు. విలన్‌ అతుల్‌ కులకర్ణి బాగా నటించాడు. వేణుమాధవ్‌ చేసింది ఒక్క సీన్‌ అయినా బాగా పండింది. మొత్తం మీద అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న సామెతను తలపించే సినిమా ఇది. లోపమంతా కథ, స్క్రీన్‌ ప్లేలోనే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X