For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కరెంట్..ఆఫ్(రివ్యూ)

  By Staff
  |

  -జోశ్యుల సూర్యప్రకాష్
  సంస్థ: శ్రీనాగ్ కార్పొరేషన్
  నటీనటులు: సుశాంత్, స్నేహావుల్లాల్, చరణ్ రాజ్, తనికెళ్ల భరణి, సుధ, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్, షఫీ, రఘుబాబు తదితరులు.
  కెమెరా: విజయ్ .సి.కుమార్
  సంగీతం: దేవిశ్రీప్రసాద్
  ఫైట్స్: కనల్ కన్నన్
  సమర్పణ: అన్నపూర్ణ స్టూడియోస్
  నిర్మాత: చింతలపూడి శ్రీనివాసరావు, ఎ.నాగసుశీల
  దర్శకత్వం: సూర్యప్రతాప్‌
  విడుదల: 19,జూన్ 2009

  'కాళిదాసు'కెళ్ళాం ఖర్చయిపోయాం..ఈ రెండో సినిమా 'కరెంటు'కైనా కరుణిస్తాడా అంటే..అంత లక్ మీకు లేదు అని తేల్చేసాడు సుశాంత్. తన కజిన్ సుమంత్ లాగే సుశాంత్ కీ మంచి కథలు కొరతలాగుంది. అయినా ఇంటర్వెల్ పాయింటుని అనుకుని పైకీ,క్రిందకి కథ అల్లుకుంటే ఇలాంటి నెగిటివ్ ఫలితాలే వస్తాయనేది సుస్పష్టం.అలాగే డాన్స్ లు బాగానే చేసినా చాలా సన్నివేశాల్లో హీరో సుశాంత్ లో ఫేస్ ఫీలింగ్స్ పెద్ధగా పలకక పోవటం మరో ఇబ్బంది. ఇలా కథ, కథనాలు వీకైన ఈ చిత్రం యూత్ ని టార్గెట్ చేసినా ఏ వర్గాన్నీ ఆకర్షించేటట్లు కనపడటం లేదు.

  సుశాంత్(సుశాంత్)కి మొదటనుంచీ నిన్నటి గురించి ఆలోచించడం..రేపటి కోసం ఎదురు చూడటంనచ్చదు. అందుకు పూర్తి వ్యతిరేకం స్నేహ(స్నేహా వుల్లాల్). ప్రతీది ప్లానింగ్ ప్రకారం చేసుకుంటూ పోయే ఆమెకు కాలేజీలో సుశాంత్ తగులుతాడు. ఆమెను చూసిన మరుక్షణమే అందరి హీరోల్లాగే ప్రేమలో పడిపోతాడు. పడిందే తడువుగా ఆమె వెనుక పడతాడు. ఛీ..పొమ్మన్నా..నాటకాలు ఆడి మరీ ఆమెను ప్రేమలో పడేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె తండ్రి కూడా మోడ్రన్ గా ఆలోచించి కూతురు ప్రేమను ఏక్సెప్ట్ చేయటానికి రెడీ యి ఫలానా టైమ్ కి రమ్మని అపాయింట్ మెంట్ ఇస్తాడు. కానీ సుశాంత్ ఆ టైమ్ కి రాడు. ఎందుకు రాలేదు అంటే ఆ టైమ్ కి క్రికెట్ ఆడుతూంటాడు. ఇది చూసిన ఆమె నీకు భాద్యత లేదు..నీ ప్రేమ నాకు అక్కర్లేదు అని నిందిస్తుంది. అది విన్న మనవాడు నేను భాద్యత లేనివాడినని నా ప్రేమలో పడేటప్పుడు తెలియదా అని తెలివిగా చెప్పి కూల్ గా ఓకే మనం విడిపోదాం అంటాడు. మనం కంగారుపడి ఏంటిలా జరుగుతోంది..అతను ఆమెని నిజంగా ప్రేమించలేదా..అని విచిత్రంగా చూస్తుండగానే ఆమె వెళ్లిపోతుంది. కొద్ది రోజుల తర్వాత నిన్ను మర్చిపోలేకపోతున్నా..నువ్వే నాలో ప్రేమను పుట్టించావు కాబట్టి నువ్వే తీసెయ్యి అంటుంది. ఇదేంటి ఇలాంటి ట్విస్టు అనుకుంటుండగా హీరోగారు సరేనంటారు..అప్పుడు ఏం జరుగుతుంది అంటే తెరపై చూడాల్సిందే.

  నువ్వే ప్రేమలో దించావు కాబట్టి నువ్వే దాన్ని తీసెయ్యి అనటం నావెల్టీగా చెప్పుకోవటానికి బావుండి ఉండవచ్చు. అయితే సినిమాకు దాన్ని స్క్రిప్టు గా మార్చేటప్పుడు...హీరో..ప్రేమను ఆమె నుంచి తొలిగించే సన్నివేశాలు అద్బుతంగా ఉండేటట్లు ఖచ్చితంగా చూసుకోవాలి. అలా కాకుండా సుశాంత్ తాతగారు నాగేశ్వర రావు కాలంనాటి ప్రేమాభిషేకం సన్నివేశాలు (త్రాగటం,వ్యభిచారిణి దగ్గరకెళ్లటం)రిపీట్ అయితే ఫలితమేముంటుంది. అయినా అక్కడ హీరో చచ్చిపోతాడు కాబట్టి ప్రేమను త్యాగం చేయటానికి హీరోయిన్ శ్రీదేవి మనస్సులోంచి ఆమెను తీసెయ్యటానికి ఈ డ్రామా ఆడి సానుభూతి సంపాదించి శభాష్ అనిపించుకుంటాడు. అదే ఇక్కడ మిస్సయింది. సానుభూతి మొత్తం మొదట హీరోయిన్ మీదకు ట్రాన్స్ ఫర్ అవుతుంది (ఆ తరువాత మన మీద మనకే కలుగుతుందనుకోండి అది వేరే సంగతి). అలా కాకుండా ఆమెలో ప్రేమను తొలిగించే క్రమంలో హీరో నిజమైన ప్రేమ కనుగొంటే ఇంకా బావుండేది.

  ఇక ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ కోసం పస్టాఫ్ మొత్తం విషయం లేకుండా నడపాల్సి రావటం మరో దురదృష్టం. దాంతో ప్రక్క క్యారెక్టర్ల సోది ఎక్కువయి..బోర్ మొదలయ్యింది.కామెడీ కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. బ్రహ్మానందం ఉన్నా పెద్దగా ఫలితం లేకుండా పోయింది. దర్శకత్వ పరంగా కూడా కొత్త దర్శకుడి నుంచి ఆశించే మెరుపులు ఏమీ కనపడలేదు. అయితే నిర్మాతలను మాత్రం బాగా మెచ్చుకోవాలి. దేవీశ్రీప్రసాద్ వంటి సంగీత దర్సకుడుని తెచ్చి మరీ బాగానే ఖర్చుపెట్టారు. ఇక దేవీ సంగీతం ఎప్పటిలాగే బావుంది. అదే ఈ సినిమాకి ఉన్నంతలో ప్లస్. నటుడుగా సుశాంత్ మొదటి సినిమా కన్నా బెటర్. స్నేహ ఉల్లాల్ లావెక్కింది కానీ నటనలో మాత్రం ఎప్పటిలాగే ఉంది. హీరో తండ్రిగా తణికెళ్ళ,తల్లిగా సుధ అవే పాత్రలను మళ్ళీ బాగా చేసారు. ఎడిటింగ్ మరింత షార్ప్ గా ఉంటే బావుండేది. కెమెరా..దర్శకుడి టేస్ట్ కి తగ్గట్లే ఉంది.డైలాగులు కూడా చాలా వీక్ గా ఉన్నాయి. అక్కడక్కడా తప్ప పేలలేదు. వెన్నెల ఫేమ్ కిషోర్ కామెడీ బాగానే చేసాడు..కానీ ఆల్రెడీ ఆ ట్రాక్ చాలా సినిమాల్లో వచ్చిందే కాబట్టి పెద్దగా పంచ్ ఇవ్వలేదు.

  ఏదైమైనా కథ, కథనాలు బావుంటే మిగతా డిపార్ట్ మెంట్లు ఎలా పనిచేసినా కొట్టుకుపోతుందనేది నిజం. అలాగే మంచి ప్రొడక్షన్ విలవులు ఉంటే సరిపోవు..అంతకు తగ్గ విజన్ కూడా ఉండాలని ఈ చిత్రం నిరూపిస్తుంది. సుశాంత్ నెక్ట్స్ టైమ్ బెటర్ లక్. స్నేహ ఉల్లాల్ తెలుగులో నిలదొక్కాలంటే..ఈ పోటీలో ఈ నటన చాలదు. దర్శకుడు నెక్ట్స్ దొరికినా స్క్రిప్టు మీద కుస్తీ పట్టకపోతే నిలబడటం కష్టం. ఇక ప్రేక్షకులుకు ఈ కరెంట్ జోలికి వెళితే ఫీజ్ కొట్టిన ఫీలింగ్ కలుగే అవకాశం ఉంది.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X