twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'గోదావరి' ప్రేమానందం

    By Staff
    |

    Godavari
    సినిమా: గోదావరి
    నటీనటులు: సుమంత్‌, కమలినీ ముఖర్జినీ, నితూచంద్ర,
    కమల్‌ కామరాజ్‌, తనికెళ్ల భరణి, సివియల్‌,
    మాస్టర్‌ శివ, రాజేంద్ర, జప్పా (కుక్క) తదితరులు
    సంగీతం: కె.యం. రాధాకృష్ణ
    కెమెరా: విజయ్‌ సి. కుమార్‌
    ఎడిటర్‌: మార్తాండ్‌ కె. వెంకటేష్‌
    పాటలు: వేటూరి
    కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శేఖర్‌ కమ్ముల
    నిర్మాత: జి.వి.జి. రాజు

    'ఆనంద్‌'తో అచ్చ తెలుగు దర్శకుడని అనిపించుకున్న శేఖర్‌ కమ్ముల 'గోదావరి' సాక్షిగా తీసిన ప్రేమ కథా చిత్రం ఇది. అలనాటి 'అందాల రాముడు' ప్రేరణతో ఆ బ్యాక్‌డ్రాప్‌ తీసుకున్నా ప్రతీ ఫ్రేమ్‌లో కొత్తదనం, తెలుగుదనం ఉండేలా జాగ్రత్త పడి తీయటం అభినందనీయం. ఫస్టాఫ్‌ అద్భుతంగా పండి సెకండాఫ్‌ సైడ్‌ ట్రాక్‌లతో నిండి కొద్దిగా సాగింది. అయినా అసభ్యత, హింస లేకుండా సున్నితంగా మానవ విలువలను స్పృశిస్తూ తీసిన ఈ చిత్రం కుటుంబసమేతంగా చూడదగింది.

    ఈ రోమాంటిక్‌ కామెడీ ముఖ్యంగా సీత (కమలినీ ముఖర్జిని), రాము (సుమంత్‌) పాత్రల చుట్టూ తిరుగుతుంది. స్వయంశక్తితో ఎదగాలనుకున్న సీత, ప్రజలకు మేలు చేయాలని తపించే రాముల పరిచయం ప్రేమగా మారి ఎలా పెళ్లికి దారి తీసిందన్నదే మొత్తం కథ. సీతకి ఓ సంబంధం వచ్చి 'ఫాస్ట్‌ పిల్ల' చేసుకోమని వెళ్లిపోతారు. ఆమె అలిగి భద్రాచలం రాముడ్ని దర్శిస్తానని ఒంటరిగా బయలుదేరుతుంది. మరోపక్క రాము తన మరదలు రాజీ (నీతూచంద్ర)ని చిన్నతనం నుండి ఇష్టపడతాడు. రాజీ తండ్రి ఆమెకు వెంకట్‌ ఐపియస్‌ (కమల్‌ కామరాజ్‌)తో వివాహం నిశ్చయం చేస్తాడు. భద్రాచలంలో పెళ్లి ఏర్పాటు చేయడంతో అక్కడికి అంతా అక్కడికి లాంచీలో బయలుదేరుతారు. ఆ ప్రయాణంలో రాముకి సీత తారసపడుతుంది. గోదావరి సాక్షిగా ప్రేమ ప్రయాణం మొదలవుతుంది. ఆ ప్రేమ కథని తెరపై చూస్తేనే కన్నుల పండుగగా వుంటుంది.

    రెగ్యులర్‌ రోమాంటిక్‌ కామెడీల్లో ప్రధాన పాత్రలు ఇరువైపుల నుంచి సమస్యలు తీసుకుంటారు. ఖుషీలో లాగా ఇగో సమస్య కావచ్చు, ఆనంద్‌ లాగా ప్రేమ తండ్రి చేతిలో యాక్సిడెంట్‌ అయిన కుటుంబం కావచ్చు, అలాగే గోదావరిలోనూ హీరోకి మరదలుతో ప్రేమ సమస్య పెట్టారు. కానీ హీరోయిన్‌ వైపు నుంచి పూర్తి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. దాంతో ఇంటర్వెల్‌ తర్వాత కథ లేక ఫాక్షన్‌కు బుద్ధి చెప్పడం, కుక్కతో కామెడీ, బుడగ కోసం వచ్చిన పిల్లోడితో ఎపిసోడ్స్‌లు పెట్టాల్సి వచ్చింది. అయినా దర్శకుడు పూర్తి ప్రేమకథను చెప్పడంలో సఫలీకృతుడయ్యాడనే చెప్సాలి. హీరోహీరోయిన్ల మధ్య వచ్చే ప్రేమ సీన్లు, డైలాగ్‌లు కొత్తగా ఉండి ఆనందింపజేస్తాయి. క్లాసిక్‌ నెరేషన్‌లో స్క్రీన్‌ప్లే బాగానే ఉంది. హీరో పాత్ర చివరలో సినిమాటిక్‌గా యాక్టివ్‌ కావటం కొద్దిగా లోపం. సీత పాత్ర ఆనంద్‌లో రూపను దాటి పోలేదు. కుక్కతో ఉన్న సీన్‌లు పిల్లలను బాగా అలరిస్తాయి. అందాల రాముడి నాటి పుల్లమ్మ పుల్లట్లు పాత్ర సినిమాలో కలవలేదు. చింతామణి లాంచీ ఓనర్‌ (తనికెళ్ల) బాగానే నేటివిటీ తీసుకొచ్చాడు. హీరోయిన్‌ లుక్‌ ఇవ్వమని హీరోను అడిగే సీన్‌ బాగా పండింది. ట్రెజర్‌ హంట్‌ సీన్‌ మంచి రోమాన్స్‌ను అందించింది. చిప్స్‌ ప్యాక్‌ సీన్‌ మంచి కామెడీ. ఇలా కొత్త సీన్స్‌ను బాగా కన్సీవ్‌ చేయడం ప్లస్‌ పాయింట్‌ అయింది. ఏది ఏమైనా సెకండాఫ్‌లో కూడా హీరోహీరోయిన్ల ప్రేమ విడిపోవడం, పొందటం అనే రొమాంటిక్‌ కామెడీ లక్షణాలపై దృష్టి పెడితే మరింత రాణించేది. పాటలు శాస్త్రీయ సంగీతం టచ్‌తో సాగినా ఆనంద్‌ను గుర్తుకు తెస్తాయి. గోదావరిని బ్యాక్‌డ్రాప్‌గా కాకుండా కథలో భాగంగా ఉంటే మరింత నిండుతనం వచ్చి వుండేది. కమలినీ ముఖర్జీ నటన ప్రశంసనీయంగా ఉంది. సుమంత్‌ హీరో వర్షిప్‌ను వదిలేసి పాత్రలో జీవించాడు. హీరో పాత్రకి మొదట్లో చెప్పిన లక్ష్యం చివరకు నెరవేరిస్తే మొత్తం మీద పరిపూర్ణత వచ్చేది. వేటూరి పాటలు బాగున్నాయి. కెమెరా, రీరికార్డింగ్‌ బాగున్నాయి. ఎడిటింగ్‌ మరింత షార్ప్‌గా ఉండాల్సింది. దర్శకుడిగానే కాక రచయితగా కూడా శేఖర్‌ కమ్ముల రాణించాడు.

    మొత్తం మీద క్లాస్‌ ప్రేక్షకుల కోసం తీసిన ఈ చిత్రం వారిని నిరాశపరచదు. కమ్ముల శేఖర్‌ యధావిధిగా ఒక ప్రశాంత చిత్తానికి అవసరమైన సినిమాను తెలుగు ప్రేక్షకులకు మరోసారి అందించాడు.

    గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X