twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరో 'వరుడు'(మొగుడు రివ్యూ)

    By Srikanya
    |

    -జోశ్యుల సూర్య ప్రకాష్
    సంస్ద: లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్
    నటీనటులు: గోపీచంద్, తాప్సీ, శ్రద్దాదాస్, రాజేంద్రప్రసాద్, రోజా, నరేష్, గీతాంజలి, మహర్షి రాఘవ తదితరులు
    సంగీతం: బాబూ శంకర్
    కెమెరా: శ్రీకాంత్
    ఎడిటింగ్: గౌతం రాజు
    నిర్మాత: నల్లమలుపు శ్రీనివాస్
    కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కృష్ణవంశీ

    ఆ మధ్యన తెలుగువారి సంప్రదాయాలు,కుటుంబ బంధాలు అంటూ ఆర్బాటంగా వచ్చిన వరుడు(అల్లు అర్జున్)చిత్రం మిగిల్చిన చేదు అనుభూతిని మెల్లి మెల్లిగా మర్చిపోతూంటే అలాంటి బ్రాండింగ్ తోనే 'మొగుడు'చిత్రం వచ్చి పాత గాయాన్ని మళ్లీ రేపినట్లైంది.బలమైన కుటుంబం మరియు మానవ సంబంధాల నేపధ్యం అంటూ ప్రేక్షకులను ఆకట్టుకుని ఓపినింగ్స్ ని రాబట్టుకున్న ఈ చిత్రం బలహీనమైన కథ,మెలోడ్రామా మానవ సంభందాలతో చతికిలపడింది.భారతీయ వివహ వ్యవస్ధలో భాగమైన తాళి గొప్పతనం చెప్పబోయి ఎగతాళి అయిపోయింది.

    బుజ్జి(గోపీచంద్)తొలిచూపులోనే రాజి(తాప్సి)తో ప్రేమలో పడిపోతాడు.దానికి అతని తండ్రి ఆంజనేయ ప్రసాద్(రాజేంద్రప్రసాద్)వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రాజి తల్లి,రాష్ట్ర మంత్రి అయిన అఖిలాండేశ్వరి(రోజా)తో మాట్లాడి పెళ్లి ఘనంగా జరిపిస్తాడు.అయితే పెళ్లంతా అయిన తర్వాత గౌరి దేవి విగ్రహాన్ని పెళ్లి కూతురుతో పాటు తీసుకెళ్లాలనే సంప్రదాయం వద్ద ఇరు కుటుంబాలకి గొడవ వస్తుంది.చిన్నగా మొదలైన ఆ గొడవ పెద్దదై రాజీ తన మెళ్లో తాళిని విసిరి బుజ్జి పైకి విసిరికొట్టేవరకూ వెళ్తుంది.అలా పీటల మీదే పెళ్లి పెటాకులయ్యి విడాకుల వరకూ వెళ్తుంది.అప్పుడు ఆ జంట పరిస్ధితి ఏమిటి..చివరకు వారు ఎలా ఒకటయ్యారు అనేది మిగతా కథ.

    కేవలం కథనాన్ని నమ్ముకుని 'పెద్దల మాట పట్టింపులతో విడిపోయిన ఓ కొత్త దంపతులు'అనే ఓ చిన్న లైన్ ని తెరపై రెండు గంటల సినిమాగా మార్చారు కృష్ణవంశీ.వివాహం,తాళి ప్రాముఖ్యత,ఉమ్మడి కుటుంబం వంటి ఎన్నో అంశాలు దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని తీర్చిదిద్దానని ఆయన ఇంటర్వూలలో చెప్పుకొచ్చారు.అయితే అవి కేవలం డైలాగుల్లో మాత్రమే వినిపించే పరిస్ధితి సెకండాఫ్ సరిగ్గా అల్లుకోకపోవటంతో ఎదురైంది.కథలో ఉన్న కాంప్లిక్ట్(సంఘర్షణ)కేవలం చిన్న మాట పట్టింపు.దానికి ఇరుకుటుంబాలు రాజీ పడితే సరిపోతుంది కదా అనిపిస్తుంది.ఎందుకంటే సాధారణంగా అన్ని వివాహాల్లోనూ ఇలాంటి మాట పట్టింపులు,చిన్న చిన్న గొడవలు చూస్తూనే ఉంటాం.అయితే అవి ఇంతలా పెరిగిపోయి పెళ్లి పీటల మీదే ఆగిపోయే స్ధితి మాత్రం ఎక్కడా కనపడదు.కానీ దాన్నే సాగతీసి,మళ్లీ విడిపోయిన జంటే వచ్చి తమ పెద్దలతో పోరాడి తమ బంధం నిలబెట్టుకోవాల్సిన పరిస్ధితి సినిమాలో చూపెట్టడం విచిత్రంగా ఉంటుంది.

    దాంతో కథలో చెప్పే పాయింట్ కీ, జరిగే కథనానికి,మన నమ్మకాలకి సంభందం లేకుండా పోయి మెలోడ్రామా ఎక్కువైపోయి సహన పరీక్ష పెట్టింది.దానికి తోడు సినిమాలో సెంటిమెంట్ కోసం అని హీరోయిన్ చేత విషం తాగించి,దాన్నుంచి రక్షించే హీరో ని వంటి సీన్స్ పెట్టారు.అంటే విషం త్రాగి గానీ తమ బంధాన్ని నిలబెట్టుకోలేనంత బలహీనంగా ఉన్నారా ఇవాల్టి అమ్మాయిలు అనే డౌట్ వస్తుంది.అలాగే గౌరీ ప్రతిమ పుట్టింటి నుంచి పట్టుకెళ్లటం వంటి సంప్రదాయాలు వివాహ బంధాన్ని నాశనం చేస్తున్నాయనే రాంగ్ మెసేజ్ కూడా ఇచ్చినట్లైంది.ముఖ్యంగా ఎంతగానో ఎమోషన్ తో గుండెలు బరువెక్కుతాయనుకున్న ఇంటర్వెల్ సీన్..నవ్వులు కురిపించి నవ్వులు పాలై రిజల్టుని చెప్పకనే అక్కడే చెప్పేసింది.

    నిజానికి యాక్షన్ సినిమాలు చేసే గోపీచంద్ ఇలాంటి సాప్ట్ రోల్ లో ఒప్పుకోవటం అతనిలోని నటుడుని తృప్తి పరుచుకోవటానికే అనిపిస్తుంది.అందుకు తగినట్లే గోపీచంద్ చాలా చోట్ల అండర్ ప్లే చేస్తూ కనపడతాడు.ఇక ఇన్నాళ్లూ అందాల బొమ్మే అనిపించుకున్న తాప్సీ కూడా నటన కూడా చేయగలను అనిపించుకుంది.ఇక శ్రద్దాదాస్ ఎప్పటిలాగే అందాలు ఆరబోసే ప్రయత్నం చేసింది.ముఖ్యంగా రాజేంద్రప్రసాద్ తండ్రి రోల్ చేస్తూ చాలా సార్లు సీన్ లో మిగతా ఆర్టిస్టుల పైనుంచి దృష్టి తనపైకి లాగేసుకున్నారు.దర్శకుడుగా కృష్ణవంశీ ఇంకా మురారి,నిన్నే పెళ్లాడతా వద్దే తచ్చాడుతున్నారనిపిస్తుంది.కెమెరా, ఎడిటింగ్ ఓకే అనిపిస్తాయి.ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఎక్కడా నిర్మాత రాజీ పడలేదని చెప్తూంటాయి.ఇక బాబూ శంకర్ పాటల్లో ఓ రెండు చాలా బాగున్నాయి.డైలాగులు విషయానికి వస్తే సినిమాలో ఈ డైలాగు ఇక్కడ ఈ పాత్ర ఫలానా విధంగా మాట్లాడాలి తప్పదు అన్నట్లు కొన్ని చోట్ల రాసారు.ముఖ్యంగా తన కూతురు తాప్సీతో తల్లి రోజా...వాడి దగ్గర పడుకున్నావా అని నిలదీస్తే...ఏం నువ్వు మీ మొగుడు దగ్గర పడుకోవట్లేలేదా వంటివి తల్లి కూతురుని అడుగుతుంటి అంటేనే వినటానికే ఓ రకంగా ఉన్నాయి. అయితే పాటల చిత్రీకరణ మాత్రం ఎప్పటిలాగే కృష్ణవంశీ తన మార్కుతో అదరకొట్టాడనే చెప్పాలి.

    పైనల్ గా కృష్ణవంశీ అభిమానులనే కాక గోపీచంద్ అబిమానులను సైతం నిరాశపరిచే చిత్రం ఇది.పోస్టర్స్,ప్రమోల నుండి వరుడు చిత్రాన్ని గుర్తు చేస్తూ సాగిన ఈ చిత్రం రిజల్ట్ కూడా దాన్నే అనుసరించే అవకాశం ఉందనిపిస్తోంది.కేవలం తాప్సీ అందాల మీదే ఈ చిత్రం రిజల్టు ఇప్పుడు ఆధారపడి ఉంది.

    English summary
    Mogudu drives home the theme that a good husband is someone who is responsible.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X