twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంద్ర- ఫర్వాలేదు

    By Staff
    |

    Indra
    చిత్రం: ఇంద్ర
    నటీనటులు: చిరంజీవి, సోనాలి బెంద్రే, ఆర్తి అగర్వాల్‌,
    ముఖేష్‌ రుషి, ప్రకాష్‌ రాజ్‌, పునీత్‌ ఇస్సార్‌
    కథ: చిన్నికృష్ణ
    మాటలు: పరుచూరి బ్రదర్స్‌
    సంగీతం: మణిశర్మ
    నిర్మాత: అశ్వనీదత్‌
    దర్శకత్వం: బి.గోపాల్‌

    రాయలసీమ ముఠాకక్షల నేపథ్యంతో వస్తోన్న అనేక చిత్రాల్లో ఇంద్ర కూడా ఒకటి. అయితే, ఆకట్టుకునే కథనం వల్ల ఈ చిత్రం వైవిధ్యంగా కనిపిస్తుంది. నరసింహనాయుడు, భాషా చిత్రాల మాదరిగా ఫ్లాష్‌ బ్యాక్‌ లతోనే కథ నడిచినా, చిరంజీవి తన సహజ ధోరణిలో పవర్‌ ఫుల్‌ మాస్‌ పాత్రను రక్తికట్టించాడు. చిరంజీవి డైహర్డ్‌ ఫ్యాన్స్‌ కు విపరీతంగా నచ్చే రీతిలో రూపొందించిన ఈ చిత్రంలో కొత్తదనం తక్కువ. బి.గోపాల్‌ మూసధోరణి సీన్లే ఎక్కువ. అయితే, సక్సెస్‌ ఫుల్‌ ఫార్మూలాను వీడకుండా రూపొందించారు ఈ చిత్రం. దాంతో బోర్‌ కొట్టే పాలు తక్కువే. చిరంజీవికి ఫ్యాక్షన్‌ లీడర్‌ పాత్ర కొత్తే కానీ తన నటనతో ఈ చిత్రంలోని లోపాలను కప్పిపుచ్చాడు. నరసింహనాయుడు, సమరసింహరెడ్డి చిత్రాల మాదరిగానే, ఈ సినిమా కూడా ఊరు కాని ఊర్లో హీరో తలదాచుకున్న వైనంతో ప్రారంభమవుతుంది. ఈ చిత్రానికి కాశీ నేపథ్యంగా ఎంచుకున్నారు.

    శంకర్‌ నారయణ్‌(చిరంజీవి) కాశీలో ఒక టాక్సీడ్రైవర్‌. అతనికి ఇద్దరు అనుచరులు ఉంటారు. యూపీ గవర్నర్‌ చెన్నకేశవరెడ్డి(ప్రకాష్‌ రాజ్‌) కూతురు సోనాలి బెంద్రే చిరంజీవి ప్రేమలో పడుతుంది. సోనాలి, చిరంజీవి మరదలు నందిని ఇద్దరూ క్లాస్‌ మేట్స్‌. చిరంజీవితో డ్యూయట్లు పాడుకున్నాక, ఇక అతనితోనే సెటిల్‌ అయిపోవాలని సోనాలి నిశ్చయించుకుంటుంది. కూతరు కోసం అన్వేషణ ప్రకాష్‌ రాజ్‌ అన్వేషణ సాగిస్తాడు. ఆమె చిరంజీవి వద్ద ఉందని తెలుసుకుంటాడు. చిరంజీవిని చూడగానే ప్రకాష్‌ రాజ్‌ ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే..చిరంజీవి ఎవరో కాదు ఇంద్రసేనరెడ్డి. ఇక ఫ్లాష్‌ బ్యాక్‌...ఇంద్రసేనరెడ్డి కుటుంబానికి, వీరకేశవరెడ్డి కుటుంబానికి 'తాతల కాలం' నుంచి తగాదాలు.

    ఇంద్ర శాంతికాముకుడు. రాయలసీమ ప్రజలకు తాగునీటిని అందించేందుకు యాగాలు చేస్తుంటాడు. జలయజ్ఞాన్ని అడుకునేందుకు ప్రయత్నించిన వీరకేశవరెడ్డని ఇంద్ర చంపేస్తాడు. సీమలో ఓ రిజర్వాయర్‌ ను కట్టించాలని ఇంద్ర కల. అందుకోసం భూసేకరణ కోసం ప్రయత్నిస్తాడు. రిజర్వాయర్‌ కు కావాల్సిన స్థలమంతా వీరకేశవరెడ్డి కుమారుల చేతిలో ఉంటుంది. 'ఇంద్రసేనరెడ్డి తన ఆస్తిని అంతా వదిలేసుకొని...రాయలసీమ వదిలి వెళితే...రిజర్వాయర్‌ కు కావాల్సిన భూమి ఇస్తామని' వీరకేశవరెడ్డి కుమారులు అంటారు. 'ప్రజల కోసం ఏమైనా చేసే' ఇంద్ర...అన్ని వదిలేసుకొని కాశీకి వెళుతాడు. వారి చెల్లెలు ఆర్తి అగర్వాల్‌ ను పెళ్ళిచేసుకోవడం కూడా ఈ ఒప్పందంలో భాగం. రిజర్వాయర్‌ ను ఎలా కట్టిస్తాడు? ఎవర్ని పెళ్ళిచేసుకుంటాడు అనేది క్లైమక్స్‌.

    చిరంజీవి ఫ్యాక్షన్‌ నాయకుడిగా బాగానే నటించినా....అతని గెటప్‌ లలో ఒక పద్దతి అంటూ లేకపోవడం పెద్ద లోపం. మేకప్‌ లో జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేది. సోనాలి కన్నా ఆర్తి అగర్వాల్‌ బాగా నటించింది. ఇక బ్రహ్మనందం, ఎం.ఎస్‌.నారయణలు ప్రథమార్థంలో వినోదాన్ని పంచేందుకు ప్రయత్నించినా పెద్దగా పండలేదు. ఈ చిత్రానికి పెద్ద ఎస్సెట్‌ స్క్రీన్‌ ప్లే, పరుచూరి డైలాగ్స్‌. అలాగే మణిశర్మ సంగీతం. మూడు పాటలు బాగున్నాయి. చిరంజీవి డాన్స్‌ లు కూడా కొత్త తరహాలో ఉన్నాయి. ప్రకాష్‌ రాజ్‌ మనుషుల చిరంజీవిని కార్లలో వెంబండించే సీన్స్‌, కాశీ పట్టణ దృశ్యాలను సీనియర్‌ ఫోటోగ్రాఫర్‌ వి.ఎస్‌.ఆర్‌ స్వామి బాగా చిత్రీకరించారు. ఈ తరహా చిత్రాలకు తనే సాటి అని నిరూపించుకున్నారు. మొత్తమ్మీద, సీమ స్పెషలిస్ట్‌ లు బి.గోపాల్‌, చిన్నికృష్ణలు కొత్తగా ఏమీ చెప్పలేకపోయారు. చిరంజీవితో మాస్‌ తరహా వినోదాన్ని అందివ్వడం మినహా. కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే నచ్చే సినిమా ఇది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X