twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్లోగా... క్లాస్ గా (‘సీతమ్మవాకిట్లో...’ రివ్యూ)

    By Srikanya
    |

    -సూర్య ప్రకాష్ జోశ్యుల

    Rating:
    2.5/5
    హిట్ టాక్ వస్తే గానీ ఫ్యామిలీలు కదిలి సినిమాలకు రావటం లేదు. ముఖ్యంగా స్త్రీలు టీవి లు వదిలి వెండితెర వైపు చూడటం లేదు. దాంతో సినిమాకు మహారాజ పోషకులు యూత్... యూత్ కి నచ్చే కథాంశాలతో వచ్చే సినిమాలే ఆడతాయి... అందులోనూ బూతు ఉంటే మరింతగా వర్కవుట్ అవుతుంది అని ఇండస్ట్రీ బాగా నమ్మే సిట్యువేషన్ వచ్చేసింది. అటువంటి ఈ రోజుల్లో ట్రెండ్ ని విభేదిస్తూ.... ఉమ్మడి కుటుంబం, అన్నదమ్ములు, బంధాలు, బాంధవ్యాలు, సంప్రదాయలు వీటిచుట్టూ అల్లిన కథాంశంతో ఓ సినిమా తియ్యటం సాహసమే. అందులోనూ హీరోల ఫ్యాన్స్ ఎవేర్ నెస్ పెరిగిన నేపధ్యంలో ఎవరినీ నొప్పించకుండా మల్టి స్టారర్ చిత్రం రూపొందించి, ఒప్పించటం నిజంగా కత్తి మీద సామే. అటువంటి అరుదైన ఫీట్ చేసారు దిల్ రాజు. కొత్త బంగారులోకంతో పరిచయం అయిన దర్శకుడు అండతో తెరపై అందరూ మర్చిపోతున్న మన లోకాన్ని మరోసారి స్పృశించి, గుర్తు చేసే ప్రయత్నం చేసారు. అయితే మరీ స్లో నేరషన్ కావటం మైనస్ అయిన ఈ చిత్రానికి మహేష్, వెంకటేష్ ల మధ్య వచ్చే సన్నివేశాలే బలంగా నిలిచాయి. పూర్తి గోదావరి యాసతో రూపొందిన ఈ చిత్రం ఓ కొత్త అనుభూతిని ఇచ్చింది. కానీ మహేష్ రెగ్యులర్ చిత్రాల్లా కమర్షియల్ ఎలిమెంట్స్ ఆశించి వెళితే మాత్రం నిరాసే.

    బ్యానర్: శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్
    నటీనటులు: మహేష్ బాబు, వెంకటేష్, సమంత, అంజలి, ప్రకాష్ రాజ్, జయసుధ, కోట శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, రోహిణి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, రమా ప్రభ, రవిబాబు తదితరులు
    సంగీతం: మిక్కీజె మేయర్,
    ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్,
    సినిమాటోగ్రఫీ: గుహన్,
    ఫైట్స్: విజయ్,
    నిర్మాత: దిల్ రాజు,
    కధ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.
    విడుదల: 11, జనవరి 2012(శుక్రవారం).

    Seethamma Vakitlo Sirimalle Chettu

    రేలంగి ఊళ్లో మొదలయ్యే ఈ కథలో... ప్రక్కనున్న మనిషికి సాయం చేయడంలో ఉన్న సంతృప్తి డబ్బు సంపాదించడంలో ఉండదు అనుకునే ఓ ఆదర్శవంతమైన తండ్రి (ప్రకాష్‌ రాజ్‌). ఆయనకు ఇద్దరు కుమారులు. ఓ కుమార్తె. పెద్దోడు (వెంకటేష్‌) ఎవరితోనూ మాటపడకూడదనుకు... తనకి నచ్చినట్లు ఉండాలనుకునే తత్వం ఉన్నవాడు. ఇక చిన్నోడు (మహేష్‌ బాబు) మాటలతో నెగ్గుకొచ్చేగయలడు. పెద్దోడు ముక్కు సూటి తనంతో ఎక్కడా ఉద్యోగం చేయలేక, ఖాళీగా ఉండి.. ఊళ్లో... బంధువుల్లో ఓ టాపిక్ గా మారతాడు. మరో ప్రక్క పెద్దోడు మరదలు సీత(అంజలి).. చిన్నప్పుడే తల్లితండ్రులను పోగొట్టుకోవటంతో వాళ్ల ఇంట్లోనే ఉంటుంది. పెద్దోడికే ఇచ్చి సీతను పెళ్లి చేద్దామనుకుంటూంటారు. అయితే పెద్దోడుకి లౌక్యం తెలియదని, డబ్బు సంపాదించటం తెలియదని, సీత తండ్రి తరుపు వాళ్లు వివాహానికి ఒప్పుకోరు. మరో ప్రక్క... సీతకు చెల్లి వరస అయ్యే గీత (సమంత) ఓ పెళ్లిలో చూసి... చిన్నోడుకి మనసిచ్చేస్తుంది. ఈలోగా చెల్లి పెళ్లిలో జరిగిన ఓ సంఘటన ఈ కుటంబంలో కలతలు రేపుతుంది.... తమ ప్రేమలకు అడ్డుగా నిలుస్తుంది. ఆ సమస్యలను కేవలం మంచితనం అనే ఆయుధంతో ఈ కుటుంబం ఎలా ఎదుర్కొని... తమ ఆకాంక్షలను నెరవేర్చుకుని కుటుంబం సంతోషాన్ని సాధించింది అనేది మిగతా కథ.

    నిజానికి ఇలాంటి కథలు తెలుగు తెరకు కొత్తేం కాదు... అయితే ఈ చిత్రం కోసం దర్శకుడు అల్లుకున్న చాలా సీన్స్ మాత్రం కొత్తగా, హార్ట్ టచ్చింగ్ గా ఉన్నాయి. దర్శకుడు కష్టం ప్రతీ ఫ్రేమ్ లోనూ కనపడుతుంది. కానీ రెగ్యులర్ కమర్షియల్ హీరోలు నటించిన చిత్రం కావటంతో వారిపై ఓ అంచనాలతో వచ్చే ప్రేక్షకుడుకి ఎక్కడా ఫైట్ కానీ, మాస్ మసాలా డైలాగ్ కానీ, ఇంకా చెప్పాలంటే నాటు ఐటం సాంగ్ కానీ లేకపోవటం ఊహించని ట్విస్టులా ఉంటుంది. దానికితోడు దర్శకుడు ఎమోషన్స్ రిజిస్టర్ చేయటానికనేమో కానీ... స్లో నేరేషన్ ని ఎంచుకున్నాడు. సెకండాఫ్ లో ఎంచుకున్న కాంఫ్లిక్ట్ ని పూర్తిగా రైజ్ చెయ్యకపోవటంతో మరీ స్లోగా నడుస్తున్న ఫీలింగ్ వచ్చింది. అయితే మహేష్ బాబు పూర్తి గోదావరి యాసతో చెప్పే డైలాగ్స్ కి మాత్రం అద్బుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఓ కొత్త మహేష్ ని ఆవిష్కరించినట్లైంది. వెంకటేష్ అయితే ఇలాంటి సెంటిమెంట్ సీన్స్ చాలా సార్లు పలికించాడు. ఆయనే నటించిన సంక్రాంతి చిత్రంలో కూడా ఆయన అన్నగా ఏడిపించాడు. అయితే ఇక్కడ కొంచెం కోపం, మొండితనం, ఉన్న పెద్ద కొడుకుగా కనిపిస్తాడు.. కానీ సాధారణంగా పెద్ద కొడుకు భాధ్యత తీసుకుంటూంటారు.. కానీ ఎందుకో ఈ సినిమాలో పెద్దోడు పాత్రకు భాధ్యత అనే ఎలిమెంట్ ని ఇవ్వలేదు. అలాగే సినిమాలో ఎంతసేపూ మహేష్, వెంకటేష్ మధ్య వచ్చే సీన్స్ చూసుకున్నారు కానీ.... వారి చెల్లెలు కథలో కీలకం.. అయినా ఆమెను చెల్లిగా కూడా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. మొదటే ఇద్దరే అన్నదమ్ములు అనుకుంటా అనుకుంటే... తర్వాత వారికో చెల్లె ఉందని చెప్తాడు. ఎడిటింగ్ లో ఆ సీన్స్ పోయాయో లేక స్క్రిప్టులోనే రాసుకోలేదో కానీ అది లోపమే అనిపిస్తుంది.

    గ్లోబులైజేషన్ నేపధ్యంలో జీవితాలల్లో పెరిగిన స్పీడు సినిమాల్లో కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా హాలీవుడ్ చిత్రాల ప్రభావం, మాస్ ని మాత్రమే టార్గెట్ చేయాలనే తాపత్రయంతో చేసే సినిమాల్లో కుటుంబం అనే కాన్సెప్ట్ ని వదిలేసారు. వెంకటేష్ వంటి హీరోలు అప్పుడప్పుడూ సంక్రాంతి వంటి చిత్రాలుతో వచ్చి హిట్ కొడుతూనే ఉన్నారు. అయితే మరే యంగ్ హీరో ఇలాంటి కథతో ధైర్యం చేయటం లేదు. కానీ అతడు వంటి చిత్రాలతో ఫ్యామిలీలలో మంచి గుర్తింపు తెచ్చుకున్న మహేష్ తన స్ధానాన్ని పదిలపరుకుని మరింతగా ఫ్యామిలీలను ఆకట్టుకోవటానికి ఈ కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లున్నారు. ఆయన స్ట్రాటజీ కరెక్టే అనిపిస్తోంది. ఈ చిత్రం ఫ్యామిలీలను ఆకట్టుకునే వాతావరణం కనిపిస్తోంది. తెలుగు అమ్మాయి అంజలి... సినిమాలో హైలట్స్ గా ఒకటిగా నిలిచింది. తన హావభావాలతో, డైలాగ్ డెలవరితో సూపర్బ్ అనిపించుకుంది. సమంత ఎప్పటిలాగే నవ్వుతోనే మైమరిపించే ప్రయత్నం చేసింది. ప్రకాష్ రాజ్... ఢిఫెరెంట్ గా ప్రయత్నిస్తూ... రెగ్యులర్ గా చేస్తూ.. ఎప్పుడూ పెదాలపై చిరునవ్వు చెరగని భోళా శంకరుడుగా తన పాత్రకు న్యాయం చేసారు. తణికెళ్ల, రవిబాబు రెగ్యులర్ విలనీ చేస్తే.. రావు రమేష్ కొత్త తరహా విలనీతో కథని కాంప్లిక్ట్ లో పడేసాడు.

    హైలెట్స్ లో మహేష్ చెప్పే డైలాగులు మొదటి స్ధానంలో వస్తాయి. అలాగే మహేష్ కు, అతని నాయనమ్మకి మధ్య వచ్చే సన్నివేశాలు చాలా మందికి తమ నాయనమ్మలను గుర్తు చేస్తాయనటంతో సందేహం లేదు. వెంకటేష్ మారని వ్యక్తిత్వం కథకి అవసరమైనా.. ఏమీ చేయకుండా వెంకటేష్ అలా కుటుంబానికి ఓ సమస్యలా మారటం కొంచెం అనీజీగా అనిపిస్తుంది. సహజ నటి జయసుధ... సహజనటే ఆమె గురించి చెప్పేదేముంది. కోట శ్రీనివాసరావు పాత్రను పెద్దగా వాడుకోలేదనిపిస్తుంది. అసలు ఇద్దరు స్టార్ హీరోలు తమ స్టార్ డమ్ ని ప్రక్కన పెట్టి ఇలా పాత్రలో ఒదిగిపోవటం మాత్రం ఆశ్చర్యమే అనిపిస్తుంది.

    ఇక ఈ సినిమాలో భావోద్వేగాలకు ఇచ్చినంత ప్రాధాన్యత కమర్షియల్ ఎలిమెంట్స్ కు ఇవ్వలేదు. అది ఓ వర్గం ప్రేక్షకుడుకి కొద్దిగా ఇబ్బందే. ఇక ఎడిటింగ్ పరంగా... సెకండాఫ్ ఇంకొంచెం ట్రిమ్ చేసి, స్పీడ్ చేసి ఉంటే బావుండేది. ఈ సినిమా హైలెట్స్ లో మొదటి క్రెడిట్... కెమెరామెన్ గుహన్ కి చెందుతుంది. సినిమాని ఓ విజువల్ ట్రీట్ గా డిజైన్ చేయటంలో సఫలీకృతుడయ్యాడు. ఇక మిక్కిజీ మేయర్ సంగీతంలో రెండు సాంగ్స్ ఇప్పటికే ఆడియోలో హిట్ అయ్యాయి. థియోటర్ లోనూ వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే వాటిని చిత్రీకరించిన విధానమే బాగోలేదు. మణిశర్మ ఎప్పటిలాగే తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సినిమాకి ప్రాణం పోసాడు. గణేష్ పాత్రో డైలాగ్స్ లో పంచ్ కొరవడినా... నేటివిటీ టచ్ తో అద్బుతంగా ఉన్నాయి. ఇద్దరు పెద్ద హీరోలు ఉన్నా ఎక్కడా తడపడకుండా దర్శకుడుగా శ్రీకాంత్ తను అనుకున్నది తెరకెక్కించారని అర్దమవుతోంది. అయితే కథకుడిగా మరింతగా కథని పదుని పెట్టాల్సింది. దిల్ రాజు నిర్మాతగా ఎప్పుడూ నిర్మాణ విలువలలో ఫెయిల్ కాలేదు. అదే ఈ సినిమాలోనూ కనపడుతుంది.

    మహేష్ చేసిన సినిమా కదా... అని పోకిరి, బిజినెస్ మ్యాన్ తరహాలో యాక్షన్ ఎపిసోడ్స్, పంచ్ డైలాగులు ఆసించి వెళ్ళకుండా ఉంటే ఈ సినిమా ఖచ్చితంగా హత్తుకుంటుంది. ఇక వెంకటేష్ కు ఇలాంటి సినిమాలు కామనే కాబట్టి ఆయన అభిమానులకు నో ప్లాబ్లం. ఇక చిత్రంలో ఎక్కడా అసభ్యత, హింస వంటివి లేవు కాబట్టి ఈ సంక్రాంతికి కుటుంబాలతో ఈ సినిమాకు వెళ్లి ఎంజాయ్ చేయవచ్చు.

    English summary
    The multi-starrer Seethamma Vakitlo Sirimalle Chettu relesed today with average talk. It is a complete family entertainer, which is based on brother sentiment. The story of the film revolves around the relationship between father and sons. The producers say that it has a simple story, but it is very beautiful and interesting. Directed by Srikanth Addala, the film features Superstar Mahesh Babu, Victory Venkatesh, Anjali and Samantha in the lead roles. Prakash Raj and Jayasudha will appear in some important roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X