For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మనసు పాడు చేసే ''మనసు పడ్డాను కానీ...''

  By Staff
  |

  Manasupaddanu Kani
  -సౌమిత్‌

  సినిమా పేరే ''మనసు పడ్డాను కానీ...''. పేరు వినగానే ప్రేమను వ్యక్తం చేయలేకపోయిన వారి కథ అన్న అర్ధం స్ఫురిస్తుంది. దానికి తగ్గట్లే ఒక అబ్బాయి ఇద్దరమ్మాయిల మధ్య ఒకరిపై ఒకరికి కలిగిన ప్రేమ భావంతో ఈ చిత్రాన్ని రూపొందించారు దర్శకులు వీరు.కె. అయితే టైటిల్‌ని పెట్టడంలో చూపెట్టినంత పొయెటిక్‌ భావాన్ని వెండితెరపై ఆవిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యారని, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాత్రకు పాటల్ని మాటల్లా వాడిన తీరు విభిన్నంగా ఉంటుందని దర్శక నిర్మాతలు భావించారేమోగాని థియేటర్స్‌లో మాత్రం రివర్స్‌ అయి ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టింది. పతాక సన్నివేశాల్లో ఆ పాత్ర కరుణరసాన్ని ఒలకబోసినా జరగాల్సిన డామేజ్‌ ముందే జరిగిపోవడంతో సామాన్య పాత్రగానే మిగిలిపోతుంది.

  సినిమా విషయానికి వస్తే కథా వస్తువుగా నృత్యాన్ని ఎంచుకున్నారు. కథా నాయకుడు వేణు, రమ్యకృష్ణ డాన్స్‌ ట్రూప్‌లో చేరడానికి విశ్శ ప్రయత్నం చేసి రాశి సహాయంతో చేరతాడు. రమ్యకృష్ణపై మనసు పారేసుకున్న వేణు ఆ విషయాన్ని ఆమెకు ధైర్యంగా చెప్పలేకపోతాడు. అదే విధంగా రాశితో చనువుగా ఉండటమే కాకుండా, ఆమె తండ్రి బాలుని గురువుగా భావిస్తాడు. వేణుని ఆరాధిస్తుంది రాశి. అయితే ఆమె కూడా తన భావాల్ని వ్యక్తం చేయలేకపోతుంది. మరో వైపు రమ్యకృష్ణ ఉన్నత స్థితికి కారకుడైన నాగబాబు కూడా రమ్యకృష్ణను ప్రేమిస్తూ, అడ్డుతగులు తున్నాడని భావించి వేణుని దూరం చేయడానికి ప్రయత్నిస్తుంటాడు.

  రాశితో వేణు పెళ్లి చేయాలని భావించిన బాలుకి తాను ప్రేమిస్తున్నది రమ్యకృష్ణనన్న నిజం చెప్పడంతోపాటు తాను సామాన్య వ్యక్తిని కాదని జమిందారు మనవడినని, రమ్యకృష్ణ కోసమే ఈ ఊరు వచ్చానని చెబుతాడు వేణు. నృత్య కళాకారిణిగా ప్రపంచ ప్రఖ్యాతి చెందాలని భావించే రమ్యకృష్ణ వేణు ప్రేమను త్రోసి పుచ్చుతుంది. ఈ లోపు మంచం పట్టిన జమీందారు విశ్వనాద్‌ కోసం ప్రేమించిన అమ్మాయిగా రాశిని తెచ్చి పరిచయం చేస్తాడు వేణు. ప్రోగ్రామ్స్‌ కోసం దుబాయ్‌ వెళ్ళిన రమ్యకృష్ణ అక్కడ జరిగిన సంఘటనతో వేణుని తనవాడిని చేసుకోవాలని ఇండియాకు తిరిగి వస్తుంది. ఆ తర్వాత కథ అనేక మలుపులు తిరుగుతుంది. చివరికి ఎవరు ఎవరిని చేసుకొంటారన్నది సస్పెన్స్‌గా సాగినప్పటికీ వేణు రాశిని పెళ్లాడటంతో చిత్రం ముగుస్తుంది.

  బ్రహ్మానందం, అలీ, గుండు హనుమంతరావు కామెడీ ఒక్కటే ఈ చిత్రానికి రిలీఫ్‌ ఇచ్చే అంశం. వేణు పాటల్లో చూపించినంత ఈజ్‌ నటనలో చూపెట్టలేకపోయాడు. రమ్యకృష్ణ, రాశి తమ పాత్రల మేరకు బాగానే చేసినా తెరపై లావుగా కనిపించడంతో నృత్య భంగిమలను చూసే ప్రేక్షకులు ఇబ్బంది పడతారు. విశ్వనాద్‌ పోషించినలాంటి పాత్రల్ని గతంలో మన అగ్రనటులెంతో మంది చేసి ఉండటంతో పాత్ర అంతగా రిజిస్టర్‌ అవదు. సంభాషణల పరంగా కూడా పరుచూరి బ్రదర్స్‌ వాడివేడి ఏదీ లేదీ చిత్రంలో.

  సంగీత దర్శకుడిగా వీరు.కె కనీసం పాస్‌మార్కులు కూడా సంపాదించుకోలేక పోయాడన్నది కఠినమైన వాస్తవం. సినిమాలు తగ్గిపోతున్నాయి, సక్సెస్‌ శాతం తగ్గుతోంది అని అందరూ గగ్గోలు పెడుతున్నటువంటి సమయంలో ధైర్యంగా ముందుకు వచ్చి సినిమాలు తీసే ఈ చిత్ర నిర్మాతల వంటివారు మళ్ళీ అటువంటి సాహసం చేసే ధైర్యాన్ని కోల్పోయేలా చేస్తుందీ చిత్రం. ఈ విషయంలో వీరు.కె క్షమార్హుడు కాడు. ఇలా అయితే వినోభాగౌడ్‌ లాంటి నిర్మాతల్ని , చిత్ర పరిశ్రమను భగవంతుడే కాపాడాలి.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X