For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మిస్సమ్మ..ఒకే!

  By Staff
  |

  Missamma
  చిత్రం: మిస్సమ్మ

  నటీనటులు: భూమిక, శివాజీ, లయ, తనికెళ్ళ భరణి, శరత్‌ బాబు

  సంగీతం: వందేమాతరం శ్రీనివాస్‌

  నిర్మాత: బి.సత్యనారయణ

  కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: నీలకంఠ

  గత ఏడాది 'షో' చిత్రాని స్క్రీన్‌ ప్లే రచయితగా జాతీయ అవార్డు పొందిన నీలకంఠ మరోసారి తన స్క్రీన్‌ ప్లే ప్రతిభను ప్రదర్శించాడు. ఒక చిత్రాన్ని సాధారణంగా ప్రారంభించి..సినిమా సగం వచ్చేసరికి కథలో ప్రేక్షకుడిని లీనమయ్యేలా చేయడం గొప్ప కళ. ఆ టెక్నిక్‌ నీలకంఠకు బాగా తెలుసు. ఈ చిత్రం కథలోని ప్రధాన 'పాయింట్‌' రివీల్‌ చేయడం బాగోదు. ఆ పాయింట్‌ కొత్తది కాదు.

  'మధురస్వప్నం' వంటి పాతకాలం నాటి చిత్రాల నుంచి నేటి 'పెళ్ళాంతో పనేంటి' వరకు అనేకానేక చిత్రాల్లో వచ్చిందే. కాకపోతే, మోటివ్స్‌ వేరు. దాన్ని చాలా చక్కగా కామెడీతో (ఈ సమీక్షకుడికి అంతగా నవ్వురాకపోయినా, ప్రేక్షకులు బాగానే నవ్వుతున్నారు) అల్లుకుంటూ..చివర్లో బాంగ్‌ ఇచ్చి..సినిమాను నీలకంఠ నడిపించాడు. టెక్నిక్‌ పరంగా చెప్పాలంటే ఈ స్క్రీన్‌ ప్లే గొప్పతనం ఇందులో కన్పిస్తుంది, భూమిక నటన ఈ సినిమాకు ప్రాణం. ఇవి కాకుండా సినిమాలో ఏమైనా చెప్పుకోదగ్గ అంశం ఉందంటే లేదు. కాకపోతే..చూడదగ్గ చిత్రం.

  కథ: శివాజీ, లయ దంపతులు. శివాజీ తను పనిచేసే కంపెనీలో అకౌంటెంట్‌ నుంచి పెద్ద స్థాయి ఎదగాలని ప్రయత్నిస్తుంటాడు. ఆ కంపెనీ ఛైర్‌ పర్సన్‌ భూమిక ముంబై నుంచి హైదరాబాద్‌ బ్రాంచ్‌ కు వచ్చినప్పుడు ఆమెను ఆకర్షించి ప్రమోషన్‌ కోసం ప్రయత్నించాలని యత్నిస్తాడు. భూమిక..అతనికి ప్రమోషన్‌ ఇస్తానంటూనే రకరకాల పరీక్షలు పెడుతుంది. ఇంటిపని..వంటి సేవలు చేయించుకుంటుంది. తనను రెండో పెళ్ళి చేసుకోమని బ్లాక్‌ మెయిల్‌ చేస్తుంది. శివాజీ ససేమిరా అనడంతో..రకరకాలుగా మానసికంగా బ్లాక్‌ మెయిల్‌ చేసి పెళ్ళి చేసుకుంటుంది. లయ, శివాజీలు విడాకులు తీసుకునేలా చేస్తుంది. ఇక్కడే..అసలు భూమిక అలా ఎందుకు చేయాల్సింది అన్న పాయింట్‌ తో క్లైమాక్స్‌.

  ఒక గర్విష్టి లేడీబాస్‌ గా భూమిక నటన చాలా..చాలా..బాగుంది. చక్కటి నటన. సినిమా ఆమె వల్లే నడుస్తుంటుంది. శివాజీ ప్రతిసారి రాజేంద్రప్రసాద్‌ ను అనుకరించడం మానేస్తే బాగుంటుంది. లయ అలాంటి పాత్రలు చాలా చేసింది. తన జీతం తక్కువని పిల్లలు ఇప్పుడిప్పుడే వద్దనుకునే శివాజీ..ఒక అనాథను పెంచుకోవడం తర్కానికి అందదు. శివాజీని ఉద్యోగంలో నుంచి తీసివేయగానే..అంతగా సరెండర్‌ కావడం, భూమిక బ్లాక్‌ మెయిల్‌ కు లొంగడం..అనేది లాజిక్‌ కు అందదు..

  అలాంటివి పట్టించుకోకపోతేనే సినిమా నచ్చుతుంది. వందేమాతరం శ్రీనివాస్‌ రెండు మంచి పాటలిచ్చాడు. కానీ, రీరికార్డింగ్‌ తో ప్రేక్షకుల్ని భయపెట్టాడు. ఎంత గట్టిగా వాయిస్తే..అంతగొప్పగా రీరికార్డింగ్‌ ఇచ్చినట్లు అనే భ్రమలో మన సంగీతదర్శకులున్నట్లు కన్పిస్తోంది. ఇళయారాజా చిత్రాలు చూసి వీరి రీరికార్డింగ్‌ నేర్చుకుంటే ప్రేక్షకులకు రిలీఫ్‌..వారికీ మంచిది. నీలకంఠ గుడ్‌ షో!

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X