»   » దట్స్ తెలుగు ప్రత్యేకం: నా పేరు ఖాన్- నేను ఉగ్రవాదిని కాను (మైనేమ్ ఈజ్ ఖాన్ రివ్యూ)

దట్స్ తెలుగు ప్రత్యేకం: నా పేరు ఖాన్- నేను ఉగ్రవాదిని కాను (మైనేమ్ ఈజ్ ఖాన్ రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ హిట్ ఫెయిర్ షారూఖ్ ఖాన్, కాజోల్ జంటగా కరణ్ జోహార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మై నేమ్ ఈజే ఖాన్'. పాకిస్తాన్ క్రికెటర్ల గురించి షారూఖ్ చేసిన వ్యాఖ్యలు, దీనికి శివసైనికుల వార్నింగులతో ఈ సినిమా అంతటా చర్చనీయాంశం అయింది. ఈ సినిమా ప్రదర్శనను అడ్డుకుంటామని శివసేన కార్యకర్తల వార్నింగుల నడుమ ఈ సినిమా ఈ నెల 12వ తేదీన విడుదల అవుతోంది. కాగా ఇటీవలే ఈ సినిమా ప్రీమియర్ షో జరిగింది. ఈ షో చూసిన వారందరూ షారూఖ్-కాజోల్ జోడీకి ఈ సినిమా మరో సూపర్ హిట్ చిత్రం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదని వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే మేమిద్దం చెట్ల వెంబట, పుట్ల వెంబట తిరుగుతూ డ్యూయెట్లు పాడుకోవడానికి మా ఇద్దరి వయస్సేమీ 16 ఏళ్లు కాదని ఇటీవల కాజోల్ ఈ సినిమాను ఉద్దేశించి అన్న మాటలకు తగ్గట్టుగానే ఇదేమీ రొమాంటిక్ ప్రేమ కథమీ కాదు. ముస్లింలు అంటే ఉగ్రవాది సమాజంలో వున్న ఏహ్యభావన సరికాదని, ప్రతీ ముస్లిం టెర్రరిస్టు కాదనే కథాంశంతో సినిమా రూపొందింది. ఇందుకోసం కరణ్ జోహార్ ఉగ్రవాదులు దాడిలో దారుణంగా దెబ్బతిన్న అమెరికానే కేంద్రబిందువుగా ఎన్నుకున్నాడు. సెప్టెంబరు 11 దాడుల తర్వాత అమెరికాలో ముస్లింల పరిస్థితిని ఎంతో హృద్యంగా తెరకెక్కించారు కరణ్ జోహార్.

ఇక కథ రిజ్వాన్ ఖాన్ (షారూఖ్ ఖాన్) అమెరికాలోని శాన్ ప్రాన్సిస్కోకి వెళ్లడంతో మొదలవుతుంది. అక్కడ రిజ్వాన్ తన సోదరుడు (జిమ్మీ షెర్గిల్), అతని భార్య (సోనియా జెహన్) తో కలసి వుంటాడు. రిజ్వాన్ ది ఇతరులతో అంత సులభంగా కలసిపోయే మనస్థత్వం కాదు. అలాంటి అతను మందిరా(కాజోల్)ను చూసి ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. తన సోదరుడికి ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా వారిద్దరూ పెళ్లిచేసుకుని ఓ చిన్న బిజినెస్ ను ప్రారంభించి హాయిగా వుంటారు.

సరిగ్గా అప్పుడే సెప్టెంబరు 11వ తేదీన అమెరికాలోని ట్విన్ టవర్స్ మీద ఉగ్రవాదుల దాడి జరుగుతుంది, అప్పటి వరకూ చాలా సంతోషంగా వున్న ఖాన్ కు బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది. మందిర అతనికి దూరం అవుతుంది. అలాగే అమెరికాలో ముస్లింల మీద ఏహ్యభావం మొదలవుతుంది. తన భార్య తనకు దూరం అవ్వడంతో తట్టుకోలేని ఖాన్ ఆమె కోసం అమెరికాలో అన్వేషణ మొదలు పెడతాడు. ఇతరులతో సరగా మాట్లాడటానికి కూడా ఇబ్బందిపడే షారూఖ్ ముస్లింలు అంటేన్ అసహ్యించుకొనే అమెరికన్ ల మధ్య ఎలా ప్రయాణం సాగించి, తన భార్యను గెలుచుకోవడమే కాకుండా ముస్లింలు అంతా ఉగ్రవాదులు కాదని, వారిలోని మంచి వారుంటారనే సందేశాన్ని సమాజానికి తెలి చెప్పాడు అనేది మిగిలిన కథ.

సినిమా మొదటి సన్నివేశం నుండీ వేగంగా జరుగుతుంది కాబట్టి ఒకటి అరా సీన్లు మిస్ అయినా కథలో లిక్ ను మిస్ అయ్యే అవకాశాలు వున్నాయి కాబట్టి సినిమాను మొదటి సీన్ నుండీ చూడటం ఉత్తమం అని నా సలహా. ఇక సినిమాలో షారూఖ్-కాజోల్ ల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. ముఖ్యంగా షారూఖ్, కాజోల్ వారి పిల్లల మధ్య వచ్చే సన్నివేశాలు చాలా సహజంగా వున్నాయి. ఉగ్రవాదుల దాడి వల్ల వీరు విడిపోయినప్పుటి సన్నివేశం ఖచ్చితంగా మీ హృదయాన్ని తాకుతుంది.

నటీనటుల అభినయం విషయానికి వస్తే ఖాన్ గా షారూఖ్ ఖాన్ అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా ఆస్పర్జస్ సిండ్రోమ్(Asperger's syndrome)గా అతని నటన ఆకట్టుకుంటుంది. ఈ సినిమాతో ఈ బాలీవుడ్ బాద్షా తాను కింగ్ అని నిరూపించుకున్నాడు. కథానాయిక కాజోల్ విషయానికి వస్తే ఆమె తప్ప మరెవ్వరూ ఈ పాత్రకు సరితూగరు అనిపించేలా నటించింది. వయసుకు తగ్గ పాత్రలో పరిణితి చెందిన నటనతో మిమ్మల్ని అలరిస్తుంది. భార్యాభర్తలు విడిపోయినప్పటి సన్నివేశాల్లో ఆమె నటన అద్భుతం.

కరణ్ జోహార్ ఈ సినిమాతో మరో సారి తన దర్శకత్వ ప్రతిభను చాటి చెప్పాడు. ఈ తరంలో బెస్ట్ నెరేటర్ అనిపించుకున్నాడు. శంకర్-ఇషాన్-లాయ్ సంగీతం సినిమాకు తగ్గట్టుగా వుంది. సిబానీ బతిజా స్క్రీన్ ప్లే, డైలాగులు ఆకట్టుకుంటాయి. మొత్తంగా ఇది నేటి సమాజాన్ని ప్రతిబింబించే అద్భుతమైన ప్రేమకథా చిత్రం. కొన్ని ముస్లిం దేశాల్లో ఉగ్రవాదులు వున్నంత మాత్రానా ప్రతీ ముస్లిం ఉగ్రవాది కాదని చాటిచెప్పే సినిమా.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu