For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  చూస్తే 'దడ'(రివ్యూ)

  By Srikanya
  |

  --జోశ్యుల సూర్య ప్రకాష్

  సంస్థ: శ్రీకామాక్షి ఎంటర్‌ప్రైజెస్‌
  నటీనటులు: నాగచైతన్య, కాజల్‌, శ్రీరామ్‌, సమీక్ష, బ్రహ్మానందం, అలీ, రాహుల్‌దేవ్‌, ముఖేష్‌రుషి, కెల్లీ డార్జ్‌, తనికెళ్ల భరణి, వేణుమాధవ్‌ తదితరులు
  సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌
  నిర్మాత: డి.శివప్రసాద్‌రెడ్డి
  దర్శకత్వం: అజయ్‌ భుయాన్‌
  విడుదల: 11,ఆగస్టు 2011

  "నా గత సినిమాలలో ఈ విధంగా యాక్షన్ చేయలేదు. గత సినిమాలకూ ఈ సినిమాకూ ఎలాటి పోలికా లేదు" అంటూ నాగచైతన్య 'దడ'గురించి ముందే హెచ్చరించారు. అయితే చైతూ చెప్పిన మాటలు నిజమని చూస్తే కానీ అర్దం కాలేదు. ఈ సినిమాతో పోలిస్తే... చైతన్య మిగతా చిత్రాలు జోష్ తో సహా చాలా బాగుంటాయేనే ఫీలింగ్ వస్తుంది. అలాగే సినిమాలో విలన్ కి హీరో దడ పుట్టిస్తాడనుకుంటే తన ప్యాసివ్ క్యారెక్టరైజేషన్ తో ప్రేక్షకులకు దడ పుట్టిస్తాడు. ఇక దర్శకుడు అజయ్ భుయాన్ వాస్తవికతకు దగ్గరగా రియలిస్టిక్ గా ఈ చిత్రం తీసారంటున్నాడు కానీ నిజానికి నేటివిటికి దూరంగా తీసి పరాయి బాషా చిత్రం చూస్తున్న అనుభూతి కలిగించాడు.

  న్యూయార్క్ లో ఉండే విశ్వ (నాగచైతన్య) తెలుగు హీరోలా ఎప్పుడూ ఏదో ఒక అన్యాయాన్నో, అక్రమాన్నో ఎదుర్కుంటూ ఏదో గొడవలో ఇరుక్కుంటూ ఉంటూంటాడు. చదువు పూర్తి చేసుకున్న అతను ఇండియా తిరిగి వెళ్లిపోదామనుకున్న సమయంలో రియా (కాజల్‌)పరిచయమై, అది ప్రేమకు దారితీస్తుంది. ఇక అక్కడ సిటిలో ఆర్.డి(రాహుల్ దేవ్), కెల్లి (కెల్లి) అనే ఇద్దరు డాన్ లు ఇంటర్నేషనల్ ప్రాసిట్యూషన్ రింగ్ ని నడిపిస్తూంటారు. అనుకోకుండా విశ్వ వారి వ్యాపారానికి అడ్డుపడి వారి హ్యాండోవర్ లో ఉన్న అమ్మాయిల్ని తప్పిస్తాడు. దాంతో మండిపడ్డ ఆర్.డి, కెల్లి ఏం చేసారు. విశ్వ ప్రేమ కథ సక్సెస్ అయ్యిందా అనే విషయాలు చుట్టూ కథ తిరుగుతూంటుంది.

  కథ గా చెప్పుకోవటానికి ఏమీలేకపోయినా చాలా సినిమాలు కథనంతో లాక్కొచ్చేస్తాయి. అయితే ఈ చిత్రానికి కథ సరిగ్గా లేదు.. అంతకుమించి కథనం అస్సలు కుదరలేదు. విలన్స్ కి హీరో ఎవరన్నది తెలిసేసరికి సినిమా చాలా బాగం అయిపోతుంది. ఇక హీరోకి విలన్ ఫలానావాడు అని స్పష్టత వచ్చే సరికి ప్రి క్లైమాక్స్ దగ్గరకు వచ్చేస్తుంది. దాంతో హీరో, విలన్ కి మధ్య జరగాల్సిన కథ, కథనం మిస్సైంది. సినిమా మొత్తం హీరోని వెతకటమే విలన్ వృత్తి అయిపోయింది. హీరోకేమో తను ప్రేమించిన అమ్మాయి వెనకపడటమే పెద్ద పనైపోయింది. వీటికి తోడు కథకు అస్సలు సంభంధం లేకుండా బ్రహ్మానందం, అలీ కామెడీ ట్రాకు కావాలనుకున్నప్పుడల్లా వచ్చి నవ్వించేందుకు విఫల ప్రయత్నం చేస్తాయి. విలన్ రాహుల్ దేవ్ పాత్ర అయితే అచ్చం నాగార్జున మాస్ సినిమాలోదే..

  ఇది చాలాదా అన్నట్లు కాజల్ క్యారెక్టర్ కి అయితే అస్సలు ఉషారనేదే లేకుండా సినిమా మొత్తం సాడ్ ఆర్.ఆర్ తో ఏడుపు ఫేస్ పెట్టుకుని ఉంటుంది. ఇన్ని నసలు ఉన్నప్పుడు తను మాత్రం ఎందుకు మంచి మ్యూజిక్ ఇవ్వాలి అనుకున్నాడో ఏమో కానీ దేవిశ్రీ ప్రసాద్ కూడా మైనస్ గా మారాడు. టెక్నికల్ గా కొన్ని చోట్ల బాగున్నా అదే సినిమాకు తెలుగుతనానికి దూరం చేసింది. అయితే ఈ సినిమాలో ప్లస్ పాయింట్లు నాగచైతన్య డాన్స్ లు, స్టైలిష్ గా తీసిన దర్శకుడు ప్రతిభ. సినిమాలో హీరోకి, అతని అన్నకి మధ్య వచ్చే ఫ్లాష్ బ్యాకులు జర్క్ లేకుండా తీయటం. డైలాగులు విషయానికి వస్తే బొమ్మరిల్లు వంటి చిత్రానికి రాసిన అబ్బూరి రవి ఈ చిత్రానికి రాసాడంటే అస్సలు ఎవరూ నమ్మనంత దారుణంగా ఉన్నాయి. కెమెరా, ఎడిటింగ్ డిపార్టమెంట్ లు మాత్రం సమర్ధవంతంగా పనిచేసాయి.

  ఎంత సాంకేతికంగా ఉన్నతంగా ఉన్నా కథ,కథనం లేని సినిమా రసహీనంగా ఉంటుందని దడ చిత్రం మరోసారి నిరూపిస్తుంది. అలాగే హీరోని ఫైట్ తో ఇంట్రడక్షన్ చేసి వెంటనే పాట పెట్టి, అలా పాట, ఫైట్, కామిడీ అన్న స్కీమ్ తో వెళితే కమర్షియల్ సినిమా అనుకోవటం తప్పని ఈ చిత్రం గుణపాఠం చెప్తుంది. ఇక అబిమానులకు తప్ప మిగతా వారికి ఈ సినిమాలో మెచ్చి నచ్చే అంశాలు లేవు కాబట్టి వెళ్ళేముందు ఆలోచించుకోవటం మంచింది

  English summary
  Naga Chaitanya’s ‘Dhada’ is relesed today with divide talk. The film has recently undergone Censor and bagged U/A certificate.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X