»   »  నిజం

నిజం

Subscribe to Filmibeat Telugu
Nijam
చిత్రం: నిజం
నటీనటులు: మహేష్‌ బాబు, రక్షిత, రంగనాథ్‌,
తాళ్లూరి రామేశ్వరి, రాశి, గోపిచంద్‌, ప్రకాష్‌ రాజ్‌
సంగీతం: ఆర్పీపట్నాయక్‌
కథ, స్క్రీన్‌ ప్లే, నిర్మాత, దర్శకత్వం: తేజ

హిట్‌ చిత్రాల దర్శకుడు, 'ఒక్కడు' విజయంతో ఊపులో ఉన్న హీరో మహేష్‌ బాబు కలయికలో రూపొందిన ఈ తొలి చిత్రం ఫర్వాలేదనే చెప్పవచ్చు. మహేష్‌ బాబు, గోపిచంద్‌, తాళ్లూరి రామేశ్వరిల అద్భుతమైన నటన, స్లిక్‌ యాక్షన్‌ సన్నివేశాలు అబ్బురపరిస్తే, సుదీర్ఘమైన కథనం, పాటలు చీకాకు పరుస్తాయి. చాలా సింపుల్‌ కథతో-ఇంకా చెప్పాలంటే పగ, ప్రతీకారం అనే వెనుకటి కాలపు కథ- దర్శకుడు తేజ, మహేష్‌ తో ఈ యాక్షన్‌-సెంటిమెంట్‌ సినిమా ప్రయోగం చేశాడు. కొన్ని సన్నివేశాల రూపకల్పన అలరిస్తే, కొన్ని సన్నివేశాలు బోర్‌ కొట్టిస్తాయి.

చందమామ రావే పాటతో మొదలైన చిత్రం దర్శకుడి వాయస్‌ ఓవర్‌ లో 'చందమామ రాకున్నా..చిన్నప్పుట్నుంచే అబద్దాలు తల్లులు నూరిపోస్తార'నే సిద్దాంత ప్రతిపాదన సాగుతుంది. చందమామ దృశ్యాల చిత్రీకరణ బాగున్నా, ఆ తర్వాత చిత్రం కొద్దిగా సా...గుతూ నడుస్తుంటుంది. ప్రథమార్థం అంతా హీరో ఈ సినిమాలో సాధించేబోయే లక్ష్యాన్ని ఎస్టాబ్లిష్‌ చేసేందుకే ప్రయత్నించాడు దర్శకుడు.

జయప్రకాష్‌ మాఫియా నాయకుడు. అతని అనుచరుడు గోపీచంద్‌. గోపీచంద్‌ కీప్‌ - రాశి. రాశిపై కన్నేసిన జయప్రకాష్‌ ను రాశి తమ్ముడిచే గోపీచంద్‌ చంపివేస్తాడు. ఆ తర్వాత గోపీచంద్‌ నాయకుడిగా ఎదిగి, తన గెటప్‌, సెటప్‌ మార్చి రాజ్యాన్ని ఏలుతుంటాడు. అగ్నిమాపకదళంలో పనిచేసే రంగనాథ్‌ ఒక సారి గోపిచంద్‌ అకృత్యాలను అడ్డుకుంటాడు. సో..గోపీచంద్‌ రంగనాథ్‌ ను చంపవల్సిందిగా తన అనుచరులను ఆదేశిస్తారు. వారు పొరపాటున రాశి తమ్ముడిని చంపుతారు.

వీడిని రంగనాథ్‌ చంపాడని కేసులో ఇరికించి జైలు పాల్జేస్తారు. విషయం తెలుసుకున్న రంగనాథ్‌ కుమారుడు మహేష్‌ బాబు, తండ్రి ని రక్షించుకునేందుకు 'న్యాయపరమైన' మార్గాన్ని అనుసరించి ఫెయిల్‌ అవుతాడు. అనంతరం తన తల్లి ప్లాన్‌ ప్రకారం, ఒక బండి కొనుక్కొన్ని ఒక్కొక్కరిని మట్టుబెట్టి ప్రతీకారం తీర్చుకుంటాడు.

మహేష్‌ నటన అతి పెద్ద హైలెట్‌ ఈ సినిమాకు. తల్లి పాత్రలో తాళ్ళూరి రామేశ్వరి చక్కగా నటించారు. కేవలం హావాభావాలతోనే మహేష్‌ కు ఆదేశాలు ఇవ్వడం, వీరిద్దరి మధ్య సీన్లు బాగా పండాయి. ప్రథమార్థంలో కొద్దిగా కామెడీ ఉన్నా, సెకండాఫ్‌ లో పూర్తిగా యాక్షన్‌ మీద దృష్టి పెట్టడంతో కాస్తా బోర్‌ కొడుతుంది. సినిమా మూడు గంటలకుపైగా సాగడం కూడా చికాకును కలిగిస్తుంది. తొమ్మిది పాటలున్న ఈ చిత్రంలో రక్షిత (మహేష్‌ మరదలి పాత్రలో) పాత్ర టిటిలేషన్‌ కోసమే అన్నట్లుగా ఉండగా, గోపిచంద్‌ తన గుండు గెటప్‌ తో భయపెట్టేందుకు ప్రయత్నించాడు.

సమీర్‌ రెడ్డి ఫోటోగ్రఫీ ఫర్వాలేదు. సినిమాను మరింత బిగువుగా రూపొందించి ఉంటే బాగుండేది. మొత్తమ్మీద ఫర్వాలేదనిపించే చిత్రం. తేజ చిత్రాలు అన్నీ సాధారణంగా ఉన్నా విజయం సాధిస్తున్నాయి. మరి ఈ సినిమా కూడా అలానే హిట్‌ అవుతుందో లేదో చూడాలి.

Please Wait while comments are loading...