For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Skylab movie review నిత్య మీనన్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా.. మూవీ ఎలా ఉందంటే?

  |

  Rating: 2.5/5

  నటీనటులు: నిత్య మీనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ, తులసి, తనికెళ్ల భరణి తదితరులు
  దర్శకుడు: విశ్వక్ ఖండేరావు
  నిర్మాత: పృథ్వీ పిన్నంరాజు
  సహ నిర్మాత: నిత్య మీనన్
  సమర్పణ: డాక్టర్ కే రవికిరణ్
  సినిమాటోగ్రఫి: ఆదిత్య
  ఎడిటింగ్: రవి తేజ గిరిజాల
  మ్యూజిక్: ప్రశాంత్ ఆర్ విహారి
  బ్యానర్స్: నిత్య మీనన్ కంపెనీ, బైట్ ఫీచర్స్
  రిలీజ్ డేట్: 2021-12-04

  విశ్వ పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన తొలి అమెరికా స్పేస్ స్టేషన్ స్కైలాబ్. 1973 నుంచి 1974 మధ్య దాదాపు 24 వారాలపాటు విశ్వంలో పనిచేసింది. అయితే స్కైలాబ్ ప్రయోగం విఫలం కావడంతో 1979 జూలై 11వ తేదీన హిందూ మహాసముద్రం, పశ్చిమ ఆస్ట్రేలియాలో కుప్పకూలింది. అయితే స్కైలాబ్ భూమివైపు దూసుకొస్తుందనే వార్తలతో దేశవ్యాప్తంగా ప్రజలు ఆందోళనకు గురయ్యారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు భావోద్వేగానికి లోనయ్యారు. అలాంటి కథకు కరీంనగర్‌లోని బండలింగం పల్లి గ్రామాన్ని నేపథ్యంగా చేసుకొని దర్శకుడు విశ్వక్ స్కైలాబ్ చిత్రాన్ని రూపొందించారు. కథ ఆకట్టుకోవడంతో నిత్యమీనన్ నిర్మాతగా మారారు. అయితే ఈ సినిమా కథకు ప్రేక్షకులు పట్టం కట్టారా అనే విషయంలోకి వెళితే..

  జర్నలిస్టుగా రాణించాలనే తపనతో గౌరి ( నిత్యమీనన్) కథలు రాస్తుంటారు. కానీ తను రాసిన కథలు ప్రచురణకు నోచుకోలేకపోతుంటాయి. డాక్టర్‌ చదువులు చదివిన ఆనంద్ (సత్యదేవ్) వృత్తిని కొనసాగించడానికి లైసెన్స్ కోసం 5 వేలు డబ్బుల కట్టలేక బాధపడుతుంటాడు. గొప్ప కుటుంబ నేపథ్యం ఉన్న సుబేదార్ రామారావు (రాహుల్ రామకృష్ణ) అప్పుల్లో కూరుకుపోయి జీవితాన్ని సమస్యల బండి మీద లాగిస్తుంటాడు. అనేక మూడ నమ్మకాలు ఉన్న గ్రామంలో తాము సొంత కాళ్లపై నిలబడాలనే లక్ష్యంతో డాక్టర్, ఆనంద్ హాస్పిటల్‌ను తెరుస్తారు. ఆ క్రమంలోనే స్కైలాబ్ పడుతుందనే వార్తలను ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తాయి?

  Nithya Menens Skylab movie review and Rating: Miss fired like skylab

  గొప్ప జర్నలిస్టుగా రాణించాలని ప్రయత్నిస్తున్న గౌరీ లక్ష్యం నెరవేరిందా? స్కైలాబ్ ఘటన ఆమె కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పింది? గ్రామంలో మూడ నమ్మకాల మధ్య ఆనంద్ డాక్టర్‌గా సెటిల్ అయ్యాడా? అప్పులా బారిన పడిన సుబేదార్ రామారావు జీవితంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకొన్నాయి? స్కైలాబ్ ఘటన గ్రామ ప్రజల ఆలోచనల్లోను, జీవనశైలిలో ఎలాంటి మార్పులు తెచ్చిందనే ప్రశ్నలకు సమాధానమే స్కైలాబ్ సినిమా కథ.

  ఇద్దరు సైంటిస్టులు (తరుణ్ భాస్కర్ ఒకరు)‌పై స్టోరిని సరైన లాంచ్ చేయడం బాగానే అనిపిస్తుంది. కానీ టేకాఫ్ తర్వాత కథ సవివరంగా చెప్పడం, పాత్రలను పరిచయం చేయడంలో మరీ సాగదీయడం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టినట్టు అనిపిస్తుంది. అయితే నిత్య మీనన్, రాహుల్ రామకృష్ణ, తనికెళ్ల భరణి (డాక్టర్ ఆనంద్ తాత) పాత్రలు, వాటి ఫెర్ఫార్మెన్స్ సినిమాను కొంత ఆహ్లాదకరంగా మారుస్తాయి. బలహీనమైన స్క్రిప్టును కూడా నిత్య మీనన్ తన యాక్టింగ్ స్కిల్స్‌తో మరో రేంజ్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అయితే తన పాత్రల చుట్టు అల్లిన సన్నివేశాల్లో బలం లేకపోవడం వల్ల ప్రతీ సారీ సినిమాను ముందుకు తీసుకెళ్లే పాత్ర కేవలం నిత్యమీనన్‌పైనే పడిండి. సత్యదేవ్ పాత్రలో చాలా పెయిన్ ఉంటుంది. కానీ ఆ పాత్రను సరిగా ఎలివేట్ చేయడంలోను, కథను ఎమోషనల్‌గా మార్చడంలోను దర్శకుడు తడబాటు పడ్డారనే విషయం ఫస్టాఫ్‌లో స్పష్టంగా తెలుస్తుంది.

  ఇక సెకండాఫ్‌లో స్కైలాబ్ పడుతుందనే విషయంలో ఫన్, ఎమోషన్స్ రెండు ఉంటాయి. కానీ ఆ రెండు అంశాలను తెర మీద చూపించడంలో విఫలం కావడం సినిమాకు మైనస్‌గా మారింది. శిల్పి పాత్ర, చిన్న పిల్లాడి రోల్, అలాగే నిత్యమీన్ ఇంట్లో పనివాడు (విష్ణు) క్యారెక్టర్లలో మంచి సరుకు ఉన్నా పూర్తిస్థాయిలో బయటకు చూపించలేకపోయారు. అలాగే సుబేదార్ వంశంలోని గొప్పలతో ఉండే సన్నివేశాల్లో కూడా దమ్ము ఉంది. ఇక ప్రెగ్నెంట్ డెలివరీ సన్నివేశాన్ని కూడా బాగా చూపించవచ్చు. కానీ స్లో నేరేషన్ కారణంగా, ఎమోషనల్‌గా సీన్లు రాసుకోలేకపోవడం వల్ల స్కైలాబ్ సినిమా తీయడం వెనుక ప్రయోజనాలు నెరవేరలేదనే చెప్పవచ్చు. ఇక కుల వివక్ష విషయంలో శిల్పి పాత్రను చూపించిన అంశం ఆకట్టుకొనేలా ఉంది. దర్శకుడు ఆలోచన, విజన్ స్క్రిప్టు స్థాయిలో బాగా ఉండవచ్చు. కానీ తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నంలో ఏదో లోపం ఉన్నట్టు అనిపిస్తుంది.

  స్కైలాబ్ సినిమాకు నిత్యమీన్ కర్త, కర్మ, క్రియ. గౌరీ పాత్రలో ఎమోషన్స్, పెయిన్‌ను చక్కగా పలికించింది. గ్లామర్‌గా కూడా తెర మీద ఆకట్టుకొన్నారు. 70 దశకంలో ఉండే అలంకారాలు, దుస్తులు విషయంలో నిత్య మీనన్ చాలా జాగ్రత్తలు తీసుకొన్నట్టు కనిపిస్తుంది. ఇక సత్యదేవ్‌ది కథ వరకు వస్తే బలమైన పాత్రే. కానీ తెర మీద బలమైన సన్నివేశాలు లేకపోవడం ఆనంద్ పాత్ర తేలిపోయింది. ఆ పాత్రలో ఇంటెన్స్ కనిపించలేకపోవడం వల్ల సత్యదేవ్ పాత్ర హైలెట్ కాలేకపోయిందనే చెప్పవచ్చు. రాహుల్ రామకృష్ణ, తనికెళ్ళ భరణి, కమెడియన్ విష్ణు పాత్రలు ఆకట్టుకొంటాయి. ముఖ్యంగా నిత్య మీనన్ తల్లిగా తులసి పాత్ర స్పెషల్ ఎట్రాక్షన్. ఎమోషన్స్‌తోపాటు ఫన్ కూడా క్రియేట్ చేసింది. నిత్యమీనన్ తండ్రిగా నారాయణ రావు పాత్ర మిస్ కాస్ట్. మిగితా పాత్రల్లో నటించిన వారు పర్వాలేదనిపించారు.

  స్కైలాబ్ సినిమాకు సాంకేతిక నిపుణుల పనితీరు అత్యంత బలం. ఆర్ట్ విభాగం, క్యాస్ట్యూమ్ టీమ్‌కు నూటికి నూరు మార్కులు వేయాల్సింది. నేటివిటీని ప్రతిబింబించడంలో వందశాతం సఫలమయ్యారు. డైలాగ్స కూడా చాలా బాగున్నాయి. కథ ఎప్పుడైనా చదువొచ్చు.. రాయవచ్చు.. ఆ కథలో నీవు ఉండాలి అంటూ చెప్పే డైలాగ్స్ బాగుంటాయి. ఆదిత్య అందించిన సినిమాటోగ్రఫి 70 దశకంలోని మూడ్‌ను ఎలివేట్ చేసింది. నిత్య మీనన్ చెప్పినట్టే ప్రశాంత్ ఆర్ విహారి అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు అదనపు ఆకర్షణ. రవి తేజ గిరిజాల ఎడిటింగ్ విషయానికి వస్తే.. ఇంకా ఏదో చేయాల్సిన పని ఉంది. సినిమాలో సన్నివేశాల నిడివి కొన్ని చోట్ల తగ్గించి ఉంటే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ మరింత పెరిగి ఉండేవి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.

  ఫైనల్‌గా స్కైలాబ్ సినిమా విషయానికి వస్తే.. డిఫరెంట్ కాన్సెప్ట్, నేటివిటి, ఎమోషన్స్‌తో కలిసిన గ్రామీణ నేపథ్యం ఉన్న చిత్రమని చెప్పవచ్చు. కమర్షియల్ హంగులకు దూరంగా వాస్తవ జీవితాలను కథగా చెప్పే చిత్రంగా రూపొందింది. రొటిన్‌కు భిన్నంగా కొత్త వాతావరణం ప్రేక్షకులను ఆకట్టుకొనేలా ఉంటుంది. నిత్యమీనన్, రాహుల్ రామకృష్ణ, కమెడియన్ విష్ణు, చిన్నపిల్లాడు, తనికెళ్ల భరణి, ఇతర పాత్రలు నిత్యం మనచుట్టు తిరిగే మట్టి మనుషుల జీవితాన్ని తెలిపే విధంగా కనిపిస్తాయి. ఆ అంశాలే సినిమాను మెప్పించేలా చేస్తాయి. విభిన్నమైన కథ, విలక్షణ పాత్రలతో ఉన్న సినిమాను చూడాలనుకొనే వారికి స్కైలాబ్ నచ్చుతుంది. అంచనాలు లేకుండా వెళితే.. రెండున్నర గంటలపాటు ఓ కొత్త అనుభూతిని మిగుల్చుతుందనే గ్యారెంటీ.

  ట్యాగ్‌లైన్: లక్ష్యాన్ని ఛేదించని సినీ స్కైలాబ్

  English summary
  Skylab movie review: Nithya Menen's lates movie Skylab. She become producer for this movie. This movie hits the screen on December 04th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X