For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పసలేని 'పార్టీ'

  By Staff
  |

  Party
  జోశ్యుల సూర్యప్రకాష్‌

  సినిమా: 'పార్టీ'

  విడుదల తేదీ: 24-03-06

  నటీనటులు: అల్లరి నరేష్‌, శశాంక్‌, మధుశర్మ, బ్రహ్మానందం,

  చలపతిరావు, రవిబాబు, రవిప్రకాశ్‌, వేణుమాధవ్‌, కృష్ణ భగవాన్‌ తదితరులు

  మాటలు: నివాస్‌

  రచన, దర్శకత్వం: రవిబాబు

  కెమెరా: ఎంబి జోషి

  సంగీతం: చక్రి

  నిర్మాత: కుమార్‌ కట్నేని

  స్క్రీన్‌ప్లే: సత్యానంద్‌

  విషయం లేకుండా వరదలా వచ్చే సీన్లతో ప్రేక్షకులకు 'పార్టీ' చేద్దామనుకుని బోల్తాపడిన చిత్రమిది. 'అల్లరి' విజయానంతరం వెనుకబడ్డ నరేష్‌కి రీ ఎంట్రీ ఇస్తూ అదే దర్శకుడు పగలబడి నవ్విద్దామనుకున్న ప్రయత్నం నవ్వుల పాలయింది. కామెడీల్లో సస్పెన్స్‌కి చోటులేదన్న మౌలిక సిద్ధాంతాన్ని మార్చిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు మరిచిపోవడం ఖాయం.

  నానీ (అల్లరి నరేష్‌), బుజ్జి (శశాంక్‌)లు కాలేజీ మిత్రులు వ్యవసనాలకు అలవాటు పడి పరీక్ష పేపర్లు లీక్‌ చేసి అమ్ముకుంటారు. ఈ విషయం ఫ్రెండు ద్వారా లీకయి పరీక్షల నుంచి డిబార్‌ అవుతారు (పోలీసుల దాకా వెళ్లదు ఆ విషయం). ఈ లీకయిన పేపర్లు కొని అమ్మిన సూర్య అనే గుండా వీరికి తాను లాస్‌ అయిన కోటి రూపాయలు కట్టమని నెల రోజుల గడువు ఇస్తాడు. మరోపక్క దివాళాకు సిద్ధంగా వున్న అండర్‌వేర్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ యజమాని రాజేంద్ర ప్రసాద్‌ (బ్రహ్మానందం), ఆయన కూతురు మధుశర్మ ఆ కంపెనీలో ఫోన్‌ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్‌ అయిన వ్యక్తి నానీ, బుజ్జీల మిత్రుడు. ఆ ఫ్రెండ్‌ను కిడ్నాప్‌ చేసి ఆ ఇద్దరు ఆ ఒక్క పోస్టులోకి (?) దూరుతారు. ఇది చాలదన్నట్టు బ్రహ్మానందానికి ఆఫీసులో శత్రువులుంటారు. వీటన్నింటికీ తోడు బ్రహ్మానందం తననే చంపమని ఓ ప్రొఫెషనల్‌ కిల్లర్‌ జేమ్స్‌ (రవిబాబు)కి డబ్బు ఇస్తాడు. ఇలా గజిబిజిగా కథ నడుస్తుంది. చివరకు హీరోలిద్దరూ ఆ సమస్య నుంచి ఎలా బయటపడతారు, బ్రహ్మానందం మిస్టరీ ఏమిటన్నది తెర మీద చూడవచ్చు.

  ఇంగ్లీష్‌ సినిమాలను తెలుగు తెరకు అనువదించడం కొత్త విషయమేమీ కాదు. కానీ గంటన్నర సినిమాని పాటలు, ఫైట్‌లతో రెండు గంటలకు పైగా సాగదీయాల్సి రావడంతోనే సమస్యంతా వస్తుంది. సరిగ్గా ఇదే సమస్యను పార్టీ ఎదుర్కుంది. ఇంటర్వెల్‌ వరకు కథ లేకుండా సెటప్‌ సీనులతోనే సరిపెట్టారు. కామెడీ సినిమా అని చూసుకోకుండా కథకు సస్పెన్స్‌ పెట్టారు. పాత్రల మధ్య సస్పెన్స్‌ ఉండి, ప్రేక్షకులకు విషయం రివీల్‌ అయితే ఎంజాయ్‌ చేస్తారనే ప్రాథమిక సూత్రాన్ని కూడా మరిచారు. ఇది పూర్తిగా స్క్రీన్‌ప్లే లోపం. కథ హీరోల వైపు నుంచి కాకుండా బ్రహ్మానందం వైపు నుంచి నడపడం కథ ఔచిత్యాన్ని దెబ్బ తీసింది. దాంతో ప్రేక్షకులకు అసహనం తప్పదు. ఫ్రేమింగ్‌, షాట్‌ డివిజన్‌ పరంగా దర్శకునికి మంచి అవగాహన ఉన్నా కథా కథనాలు దాన్ని పూర్తిగా దెబ్బ తీసింది. దాంతో మాటలు కూడా పేలలేదు. నటీనటులకు నటించే అవకాశం ఎక్కడా దొరకలేదు. సంగీతం ఓ మాదిరిగానే వుంది. టైటిల్‌ సాంగ్‌ బాగుంది. కెమెరా పనితనం ఫరవా లేదు. మంచి స్క్రిప్ట్‌ వుంటే రవిబాబు మంచి దర్శకుడై వుండేవారు. అతిథులుగా వచ్చిన కృష్ణ భగవాన్‌, వేణుమాధవ్‌ల కామెడీ పనికి రాకుండా పోయింది.

  ఏది ఏమైనా ఏ వర్గం కూడా ఎంజాయ్‌ చేసే సినిమా కాదు పార్టీ.

  గమనిక: వినోదం, అసభ్యత లేకపోవడం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్‌ ఉంటుంది. సినిమా జయాపజయాలకు రేటింగ్‌కు సంబంధం ఉండనవసరం లేదు.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X