twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అలాగే ఉంది... ('పోరా.. పోవే' రివ్యూ)

    By Srikanya
    |

    Rating:
    1.5/5

    సాధారణంగా కొన్ని సినిమాల టైటిల్స్ చూడగానే ఎక్కడో కొడుతూంటుంది. ఇదేంటి ఇలాంటి నెగిటివ్ టైటిల్ పెట్టారు...అని ఇంతకీ సినిమా చూడమంటారా...పొండిరా పొండి అంటారా అనే డౌట్ వస్తుంది. సరిగ్గా అలాంటి డౌటే ఈ చిత్రానికి వచ్చినా ఏమో సినిమాలో విషయం ఉందేమో...ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు కూడా బాగానే ఆడుతున్నాయి అని మనస్సుని సర్దిచెప్పుకుని వెళ్తే...నిరాశే మిగులుతుంది. మారుతి టైప్ ట్రైలర్ వదిలిన ఈ చిత్రంలో ఆ తరహా డైలాగులు తప్ప ఏమీ లేదు. దానికి తోడు రచయితే ..దర్శకుడు అయ్యాడు కదా అని ఏదన్నా మంచి కథ ఎన్నుకున్నాడు అనుకుంటే ..అసలు బేసిక్స్ కూడా ఈ కథకు లేకుండా జాగ్రత్తపడ్డాడు. క్లైమాక్స్ దాకా కథలో కాంప్లిక్ట్ జనరేట్ కాకుండా చూసి కాలం గడపటంతో ఈ మధ్య వస్తున్న చిత్రాలకు పోటి పడ్డాడు.

    ఇంజినీరింగ్ కాలేజీలో జాయిన్ అయ్యేవరకూ కో ఎడ్యుకేషన్ అంటే ఏమిటో తెలియని... వికాస్‌ (కరణ్‌), శ్రీచైతన్య (సౌమ్య సుకుమార్‌) కథ ఇది. వీరిద్దరూ రవీంద్రనాధ్ ఇంజినీరింగ్ కాలేజీలో చేరే వరకూ అప్పటివరకూ ప్రేమ వంటి వ్యవహారాలు ఉండవు. దాంతో ఒక్కసారిగా స్వేచ్చ వచ్చినట్లు ఫీలైన వీరిద్దరూ షరా మామూలుగా ప్రేమ(లేదా ఆకర్షణ) లో పడిపోతారు. అక్కడ నుంచి ఆ జంటకు ఆమె స్నేహితురాళ్ల నుంచి, ఆమె సోదరుడు నుంచి, బావ నుంచి సమస్యలు ఎదురయ్యి..బ్రేక్ అప్ లు అవుతాయి. వీటిని ఎలా అథిగమించి...ఎలా ఒకటయ్యారు అనేదే మిగతా కథ.

    Pora Pove..telugu Movie review

    'బెట్టింగ్‌ బంగార్రాజు', 'పూలరంగడు', 'ఆడు మగాడ్రా బుజ్జీ', 'నువ్వే నా బంగారం' తదితర చిత్రాలకు రచయితగా పనిచేసిన లంకపల్లి శ్రీనివాస్‌ దర్శకుడుగా మారి రూపొందించిన చిత్రం ఈ చిత్రాన్ని ఆద్యంతం ఎంటర్టైన్మెంట్ గా రూపొందించాలని ప్రయత్నం చేసాడు. అయితే అతనికి నిర్మాత సహకరించాడు కానీ, తను నమ్మి చేసుకున్న స్క్రిప్టు సహకరించలేదు.
    ముఖ్యంగా లీడ్ రోల్స్ చేసిన వారు ఇంప్రెసివ్ లా లేకపోవటం, వారి నటన కూడా చాలా సార్లు కృత్రిమంగా ఉన్నట్లు అనిపించటం జరిగింది. ఇక ఎత్తుకున్న పాయింటే చాలా చిత్రంగా ఉన్నట్లు అనిపిస్తుంది. హీరో,హీరోయిన్స్ ఇద్దరూ ఎప్పుడు ప్రేమలో పడిపోదామా అని ఎదురుచూస్తున్నట్లు అనిపిస్తూంటుంది. ముఖ్యంగా ఒక్కసారిగా స్వేచ్చ వచ్చి ...ప్రేమలో పడ్డారు అనటం కన్వీసింగ్ గా అనిపించదు. ఎందుకంటే ఈ రోజుల్లో కో ఎడ్యుకేషన్ కాకపోయినా...బయిట ఆడ,మగ కలుసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. పరిచయాలు అయ్యి...ప్రేమలో పడిన సంఘటనలు కోకొల్లలుగా మన నిత్య జీవితంలో తారసపడుతూ ఉంటాయి. దాంతో కో ఎడ్యుకేషన్ లేకపోవటం అనే అంశం చుట్టు అల్లిన ఈ కథనం తేలిపోయినట్లు ఉంటుంది. ఎప్పుడైతే కథలో బిలీవిబులిటీపోయిందో అప్పుడే విసుగు రావటం మొదలవుతుంది.

    అయినా ఈ తరహా కథ,కథనాలు మొదలు పెట్టిన మారునే తన స్కూల్ మార్చుకుని క్లీమ్ సినిమాలకు వచ్చి నిలదొక్కుకుందామని ప్రయత్నాలు చేస్తూంటే ఆయన్ను ఆదర్శంగా తీసుకున్నట్లు ఇలాంటి కథలతో, యూత్ ని రెచ్చగొట్టే నాలుగు డైలాగులతో సినిమా తీయటం సాహసమే. ముఖ్యంగా రొటీన్ కాలేజీ సీన్స్, తాగుడు సీన్స్ బాగా చిరాకు తెప్పిస్తాయి. క్లైమాక్స్ వరకూ కథను బలవంతంగా లాక్కొచ్చిన ఫీలింగ్ ఉంటుంది. అనుభవమున్న ఈ రచయిత...స్క్రీన్ ప్లే సరిగ్గా రాసుకుని దర్శకుడుగా సక్సెస్ కాలేకపోయాడనిపిస్తుంది.

    ఈ సినిమాల్లో చెప్పుకోదగ్గ హైలెట్స్ సంగీతం, చిన్న సినిమాకు కల్పించిన మంచి ప్రొడక్షన్ విలువలు మాత్రమే. నటీనటులు నట విన్యాసాలు గురించి చెప్పుకోకోపోవటమే మంచిది. మిగతా విభాగాలు దర్శకుడు ప్రతిభకు తగ్గట్లే నాశిరకంగా ఉన్నాయి. డైలాగులు కూడా గొప్పగా లేకపోయినా ఓకే అనిపిస్తాయి. ఇక ప్రెష్ ప్రేమ కథా చిత్రమని ఊహరకొట్టిన ఈ చిత్రంలో ఆ లవ్ సీన్స్ మాత్రం ఎక్కడున్నాయో కనపడవు.

    చిత్రం: పోరా.. పోవే
    నటీనటులు: కరణ్‌, సౌమ్య సుకుమార్‌, అరవింద్‌, శ్రీనివాస్‌, చంటి ఎఫ్‌.ఎమ్‌ బాబాయ్‌ తదితరులు.
    సంగీతం: యాజమాన్య
    పాటలు:చంద్రబోస్,
    కెమెరా:జైపాల్‌రెడ్డి,
    ఆర్ట్:కృష్ణ,
    ఎడిటింగ్:ఎస్.బి.ఉద్ధవ్
    నిర్మాత: యెల్కిచర్ల వీరేందర్‌ రెడ్డి, శ్రీనివాస్‌ బింగమళ్ల
    దర్శకత్వం: లంకపల్లి శ్రీనివాస్
    విడుదల: 18-07-2014.

    ఏదైమైనా కొత్త దర్శకులు తమకున్న అమూల్యమైన అవకాశాలను ఇలాంటి పేలవమైన ప్రేమ కథల మీద వెచ్చించితే ఫలితం లేదు. ఎందుకంటే ఇలాంటి సినిమాలకు మహరాజ పోషకులు అనబడే యూత్ ఇలాంటి ప్రేమ కథలకు సాధ్యమైనంత దూరంగా ఉంటున్నారు. పోని టీనేజ్ బ్లూస్ ని అమ్ముదామని ప్రయత్నం చేస్తే ఆ దిసగా సినిమాను స్పష్టంగా తీయాలి. ఇలా అటూ ఇటూ కాని కథలు కష్టమనిపిస్తుంది.

    (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

    English summary
    Karan and Sowmya Kumar’s Pora Pove released today with negetive talk. This movie directed by Lankalapalli Srinivas and Produced by Yelkicharla, Srinivas Bingamalla under the banner of SV Movie Makers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X