twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'రామ రామ'...కృష్ణ కృష్ణ (రివ్యూ)

    By Srikanya
    |
    Rama Rama Krishna Krishna
    Rating
    -జోశ్యుల సూర్య ప్రకాష్
    బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
    నటీనటులు: రామ్, అర్జున్, ప్రియా ఆనంద్, బిందు మాధవి,
    నాసర్, శాయాజీ షిండే తదితరులు.
    యాక్షన్: విజయ్
    ఆర్ట్: ఎ.ఎస్. ప్రకాష్
    కెమెరా: శేఖర్.వి.జోశెఫ్
    మాటలు: ఎమ్.రత్నం
    ఎడిటింగ్: గౌతం రాజు
    పాటలు: అనంత శ్రీరామ్
    సంగీతం: ఎమ్.ఎమ్.కీరవాణి
    కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: శ్రీవాస్
    నిర్మాత: దిల్ రాజు
    విడుదల తేది: మే12, 2010
    'రామ రామ కృష్ణ కృష్ణ' చిత్రంతో ఓ సుఖం ఉంది. సినిమాలో ఎక్కువ భాగం గతంలో చూసిన సీన్లే, నలిగిన స్క్రీన్ ప్లే తోనే నడుస్తుంది కాబట్టి మెదుడుతో అస్సలు పని ఉండదు. అలాగే ఏదైనా అవాంతరం వచ్చి కొద్ది సేపు సినిమా ఫాలో అవక మిస్సయినా కన్ఫూజ్ కాము. ఇక రెగ్యులర్ గా తెలుగు సినిమాలు చూసేవారయితే నెక్ట్స్ పది సీన్స్ తర్వాత ఏమస్తుందో, ఎలాంటి ట్విస్ట్ వస్తుందో కూడా పసిగట్టేసి శక్తి కొలిది పందాలు కాసుకోవచ్చు. అయితే ఇంత ప్రెడిక్టిబుల్ ఫార్ములా ను ఫాలో అవుతూ చేసిన ఈ చిత్రం చూస్తున్నంతసేపూ బోరు కొట్టదు అంటే అది డైరక్టర్ గొప్పతనమే. స్క్రీన్ పై ఎప్పుడూ ఏదో ఒక కాంప్లిక్ట్ రన్ చేస్తూ మనల్ని ఎంగేజ్ చేస్తూంటాడు. మరో ప్రక్క పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేయటం ఇప్పుడిప్పుడే మానుకుంటున్న రామ్ తన ఎనర్జీతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాడు. బ్రహ్మానందం నవ్వులు, హీరో ఫైట్స్, పాటలుతో ఓవరాల్ గా ఓకే అనిపించుకుంటుంది. వేసవిలో టైమ్ కిల్ చేయటానికి సరిపోతుందనిపిస్తుంది.

    పల్లెటూరు కుర్రాడు అయిన రామ కృష్ణ(రామ్) మెళ్ళో ఓ వైపు రాముడు, మరోవైపు కృష్ణుడు ఉన్న బిళ్ళ ఉంటుంది. అవసరాన్ని బట్టి రామ, కృష్ణ అవతారాలు మారుస్తూ అన్యాయం చేసే వారి పని పనిపడుతూంటాడు. ఇక ఆ ఊళ్ళోకి ఐదు సంవత్సరాల క్రిందట అశోక్ దేవా(అర్జున్) తన ఇద్దరు చెల్లుళ్ళని తీసుకుని ముంబయి నుంచి వచ్చి గుట్టుగా బ్రతుకుతూంటాడు. ఇంతకీ అశోక్ దేవా ఎవరంటే...ముంబయిలో భాషా టైపులో ఓ డాన్ గా ఎదిగి వెలిగి, ఆ క్రమంలో తన భార్యని పోగొట్టుకుని అస్త్ర సన్యాసం పుచ్చుకుని ఈ పల్లెకు చేరుకున్న వ్యక్తి. అయితే అశోక్ చేతిలో దెబ్బతిన్న విలన్ ముంబై డాన్ పవార్ (వినీత్ కుమార్) ను మాత్రం పగతో రగులుతూంటాడు. ఈ క్రమంలో రామకృష్ణ అనుకోకుండా ముంబై వెళ్ళి ఈ విలన్ డాన్ తో తలపడతాడు. మరో ప్రక్క అశోక్ చెల్లిని(ప్రియా ఆనంద్) రామకృష్ణ ప్రేమిస్తాడు. చివరకు తమ ఉమ్మడి శత్రువైన డాన్ ని ఎలా అంతమొందించి, అశోక్ చెల్లిని వివాహం చేసుకున్నాడనేది మిగతా కథ.

    కథలో అర్జున్ కో విలన్ ఉంటాడు. అతన్ని చంపటం, అర్జున్ ఆదరాబిమానాలు పొందటం హీరో రామ్ లక్ష్యంగా చిత్రం రూపొందింది. నిజానికి ఎంతో ఫవర్ ఫుల్ గా విలన్ ని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు వాడిని హీరో ముప్పు తిప్పలు పెట్టే సన్నివేశాలు కోసం ప్రేక్షకులు ఎదురుచూడటం సహజం. అయితే అదే ఈ చిత్రంలో మిస్సవుతుంది. విలన్ ధ్రెడ్ ని కేవలం హీరోని, మరో మెయిన్ పాత్ర అర్జున్ ని కలపటానికే వినియోగించుకున్నారు. ఇంటర్వెల్ దగ్గర, క్లైమాక్స్ ఫైట్ కే విలన్ ని పరిమితం చేసుకుని వృధా చేసారు. దాంతో మిగిలన సమయం హీరో అన్నయ్య పెళ్ళి చేయటం, పెద్దలని ఒప్పించటం అన్నదాని చుట్టూ తిప్పారు. అలాగే బ్రహ్మానందం పాత్రను విచిత్రంగా ఉపయోగించుకున్నారు. హీరో సొంత చిన్నాన్న అయిన బ్రహ్మానందాన్ని కేవలం లవ్ మ్యారేజ్ చేసుకున్నాడనే హీరో ఏడిపిస్తాడు. అయితే మళ్ళీ హీరో తన అన్నకి, తనకీ మాత్రం లవ్ మ్యారేజ్ ఆప్షన్ తీసుకుంటాడు. అలాగే హీరోని..మొదటి నుంచీ అర్జున్ ఎందుకని ద్వేషిస్తూంటాడో అర్ధం ఉండదు. ఇవన్నీ ఇలా ఉంచితే చిత్రంలో అర్జున్ భార్య(గ్రేసీ సింగ్) ని చంపే ఎపిసోడ్ రీసెంట్ గా జగపతి బాబు సిద్దంలో చూసాం. ఇక అర్జున్ పాత్ర భాషా నుంచి లిప్ట్ చేసిందే. బాలకృష్ణ బంగారుబుల్లోడుని గుర్తు చేస్తూ క్లైమాక్స్ వరకూ విలన్స్ హీరో కోసం పల్లెలని గాలిస్తూంటారు.

    ఇక ఈ చిత్రం ప్లస్ ల విషయానికి వస్తే..హీరో రామ్ ఇప్పుడున్న మోడ్రన్ పల్లె కుర్రాడుగా అలరిస్తాడు. ఇక అర్జున్ విషయానికి వస్తే ఎప్పటిలాగే ప్రూవ్ చేసుకున్నారు. హీరోయిన్స్ లో బిందు మాధవి పాత్ర కేవలం గ్లామర్ కే పరిమితం చేస్తే, ప్రియా ఆనంద్ ని కాస్త రొమాంటిక్ టచ్ తో ముందుకు తీసుకెళ్ళారు. విలన్ గా వినీత్ కుమార్ బాగా చేసారు. తెలుగులో మరిన్ని ఆఫర్స్ వస్తాయి. బ్రహ్మానందాన్నే సరిగా ఉపయోగించుకోలేదనిపిస్తుంది. ఇక నిర్మాణపరంగా దిల్ రాజు బాగా ఖర్చుపెట్టారని ప్రతీ ఫ్రేమ్ లో అర్ధమవుతూంటుంది. దర్శకుడుగా మరింత మంచి కథ ఎంచుకుంటే మేలనిపిస్తుంది. కెమెరా పల్లె, గోదావరి అందాలను చక్కగా పట్టిస్తే...ఎడిటింగ్ మరింత లెంగ్త్ ని కట్ చేస్తే బాగుండనని కొన్ని సన్నివేశాల్లో అనిపిస్తుంది. కీరవాణి కూర్చిన పాటలు ఇప్పటికే మార్కెట్లో ఆదరణ పొందాయి..కొత్తగా చెప్పేదేమీ లేదు. రత్నం డైలాగులు రాజమౌళి సినిమాలుకు రాసినట్లే మంచి మాస్ మసాలాతో రాసారు.

    ఏదైమైనా ఎక్సపెక్ట్ చేయకుండా వెళ్తే రామ్ గత చిత్రాలు గణేష్, మస్కాల కన్నా బాగుందనిపిస్తుంది. అలాగే మనకి ఎంత తక్కువ జ్ఞాపక శక్తి తక్కువ ఉందనే విషయంపై ఈ సినిమాని ఎంజాయి చేయటం అనే విషయం ఆధారపడి ఉంటుంది. రామ్ కి మరో పెద్ద హిట్టు అనలేముగానీ ప్లాప్ నుంచి తప్పించుకున్న చిత్రం అనొచ్చు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X