For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రెచ్చిపో..ప్రేక్షకుడు చచ్చిపో!!

  By Staff
  |

  -కులదీప్ రాయళ్ల

  చిత్రం: రెచ్చిపో
  తారాగణం: నితిన్, ఇలియానా, ఆహుతీ ప్రసాద్, ఎంఎస్ నారాయణ,
  సునీల్, రమాప్రభ, రఘుబాబు, వేణుమాధవ్ తదితరులు
  ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వర రావు
  ఫైట్స్: పెల్వ
  ఆర్ల్: బాబ్జీ
  కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్
  సంగీతం: మణి శర్మ
  నిర్మాత: జివి రమణ
  కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: పరుచూరి మురళి
  విడుదల తేదీ: సెపెంబరు 25, 2009.

  టాలీవుడ్ లో అలుపెరుగని ఫ్లాపుల యోధుడుగా పేరుతెచ్చుకున్న హీరో నితిన్, వరుస పరాజయాలతో సతమతమౌతున్న నితిన్ ఆ డిప్రెషన్ లో ఎలాంటి సినిమాలు చెయ్యాలో తెలీక ఏదో ఒక విధంగా తన ఉనికిని చాటుకోవడానికా అన్నట్టు ఇలాంటి సినిమాల్లో నటిస్తున్నాడని సినిమా చూసిన ఎవ్వరికైనా ఇట్టే అర్థమవుతుంది. వరుసగా 10 ఫ్లాపుల తర్వాత మరో ఫ్లాప్ చిత్రాన్ని ప్రేక్షకుల మీదకు వదలడానికి వీర లెవెల్లో రెచ్చిపోయాడనే చెప్పాలి. వరుస విజయాలతో దూసుకుపోతున్న నాయిక ఇలియానా పుణ్యమా అని ఓ మాదిరి ఓపెనింగ్స్ వచ్చినా, మొదటి ఆటతోనే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని ఆదరించడానికి ప్రేక్షకుడు సిద్ధంగా లేడని మలి రోజు కలెక్షన్లను చూసి చెప్పవచ్చు. లవర్ బాయ్ గా మంచి ఇమేజ్ తెచ్చుకొని, 'జయం', 'దిల్', 'సై' వంటి విజయాలను తన ఖాతాలో వేసుకున్న నితిన్ ఏ ముహూర్తాన యాక్షన్ చిత్రాలు చెయ్యనారంభించాడో ఏమో, ఆ తర్వాత ఏ చిత్రమూ కనీసం యావరేజీగా కూడా ఆడలేదు. అలాంటి సినిమాయే ఈ 'రెచ్చిపో' కూడా.

  కథ విషయానికి వస్తే శివ(నితిన్) ఓ అనాధ, అంతే కాకుండా ఓ మంచి దొంగ. మంచి దొంగ అంటే సినిమాలు బాగా చూసే వారికి ఈ పాటికి అర్థమయ్యే వుంటుంది. ధనవంతుల దగ్గర డబ్బు దొంగలించి పేదలకు పంచుతుంటాడు. అలాంటి దొంగను పట్టుకోమని హూమ్ మినిస్టర్(ఆహుతీ ప్రసాద్) చెప్పేవరకూ పట్టించుకోని సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ భానుచందర్. శివ గురించి బాగా తెలిసిన భానుచందర్ హూమ్ మినిస్టర్ ఇంట్లో వుండే 500 కోట్ల రూపాయల గురించి హింట్ ఇచ్చి, దాన్ని దోచుకోమని శివతో చెప్తాడు. దీంతో శివ రెచ్చిపోయి, చిన్న పిల్లల్ని బురిడీ కొట్టించినట్టు పోలీసులని మోసగించి ఆ డబ్బును దోచుకుంటాడు. అసలు విషయం ఏంటంటే ఆ డబ్బు దుబాయ్ లో వుంటూ ఇండియాలో క్రికెట్ బెట్టింగులు లాంటి మోసపూరిత పనులు చేస్తుండే గ్యాంగ్ స్టర్ సుకోర్ కు చెందింది.

  ఇదిలా వుంటే ఓ పెళ్లి లో కృష్ణవేణి(ఇలియానా)ని చూసిన శివ ఆమెను ప్రేమిస్తాడు. ఇంతకీ శివ అనాధ కదా ఎవరి పెళ్లికి వెళ్లాడా అనుకుంటున్నారా?? దీనికి సమాధానం సినిమాలో రమాప్రభ చెప్పింది. ఓపిక, భరించగలిగే శక్తి వుంటే సినిమాకెళ్లి తెలుసుకోవచ్చు. అలా శివ ప్రేమించిన కృష్ణవేణి హోమ్ మినిష్టర్ కూతురు. ఆ పెళ్లికి వచ్చిన హోమ్ మినిష్టర్ తను పట్టుకోమని పోలీసులకు ఆదేశించిన దొంగ శివ తన ముందే తిరుగుతున్నా తెలుసుకోలేడు. కానీ ఓ సారి తన పి.ఎ.(ఎంఎస్ నారాయణ) ద్వారా నిజం తెలుసుకుంటాడు. తను ప్రేమించిన వ్యక్తి దొంగ అని తెలిసి, అతన్ని మరచిపోవడానికి దుబాయ్ వెళ్తుంది కృష్ణవేణి, శివ జైలుకెళ్తాడు.

  కథ ఇక్కడో సిల్లీ మలుపు తిరుగుతుంది. దుబాయ్ కి వెళ్లిన కృష్ణవేణిని గ్యాంగ్ స్టర్ సుకోర్ కిడ్నాప్ చేస్తాడు. దీంతో ఆ గ్యాంగ్ స్టర్ ను ఎదుర్కోనే సత్తా లేక మన పోలీసులు, హూమ్ మినిస్టర్ ఓ చిల్లర దొంగ సారీ సారీ ఇంటలిజెంట్ దొంగ శివను ఆశ్రయిస్తారు. దీంతో మన దొంగ కాస్త హీరో అయిపోయి ఏకంగా అండవరల్డ్ డాన్ డెన్ లోకే వెళ్లి ఆయన్నో గుద్దు గుద్ది కథానాయికను తీసుకొని పారిపోతాడు. ఇక అక్కడ నుండీ హీరో కథానాయికను ఎలా రక్షించి, విలన్లపై రెచ్చిపోయాడో తెలుసుకోవాలంటే సినిమాలో చూడాల్సిందే.

  ఇక నటీనటుల విషయానికి వస్తే నితిన్ ను యాక్షన్ హీరోగా చూడటానికి ప్రేక్షకుడు మొదటి నుండీ ఇబ్బంది పడుతూనే వున్నాడు. కానీ అదేమీ పట్టని నితిన్ మాత్రం తనని తాను యాక్షన్ హీరోగా నిరూపించుకోవడానికి రెచ్చిపోతూనే వున్నాడు. అలా మరో సారి ఈ చిత్రంలో కూడా రెచ్చిపోయాడు. అదేదో విలన్ల మీద రెచ్చిపోతే బాగుండేది, కానీ తన ఎక్స్ ప్రెషన్స్ తో డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుడిపై రెచ్చిపోయాడు. ఇదంతా భరించలేని ప్రేక్షకుడు బిక్కమొహం వేసాడు. ఎందుకిలా రెచ్చిపోయాడో తెలీక జుట్టుపీక్కున్నంత పనిచేసాడు. ఇక ఇలియానా సినిమాకు ఓపెనింగ్స్ రాబట్టడానికి బాగా ఉపయోగపడింది. ప్రేక్షకుడు నితిన్ కన్నా ఇలియానాకే ఎక్కువ మార్కులు వేశారు. తను కూడా తన పాత్రకు న్యాయం చేసింది, కానీ ఈ సినిమాను ఎన్నుకోవడం ద్వారా తప్పు చేసింది. ఇక మిగితా నటీనటుల్లో ఎంఎస్ నారాయణ, రఘుబాబు లు మాత్రమే ఫర్వాలేదనిపించుకున్నారు. మిగిలిన వారి గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది.

  ఇక దర్శకుడు పరుచూరి మురళి 'పెదబాబు', 'ఆంధ్రుడు' చిత్రాల తర్వాత ఇలాంటి నాసి రకం సినిమాలు కూడా చెయ్యగలనని నిరూపించుకున్నాడు. పాత చింతకాయ పచ్చడి లాంటి కథకు నాసి రకం స్ర్కీన్ ప్లేను జతచేసి ప్రేక్షకుడి మీదకు వదిలాడు. మణిశర్మ సంగీతం కూడా విసుగు తెప్పిస్తుంది. రెండు పాటలు ఫర్వాలేదనిపిస్తాయి. ఎడిటింగ్ ఈ చిత్రానికి పెద్ద మైనస్ పాయింట్. చాలా సన్నివేశాలు అతికించినట్టుగా అనిపించాయి. సరిగా ఎడిట్ చేసి వుంటే సినిమా రెండు గంటల్లో పూర్తయ్యేది. కథను రెండున్నర్ర గంట పాటు సాగదీయడానికా అన్నట్టు వుంటుంది కోటగిరి గారి ఎడిటింగ్. ఫైట్స్ లో పవర్ లేదు. సోసోగా వున్నాయి. కానీ నిర్మాత జివి రమణ తన యూనిట్ ను నమ్మి ఎక్కడా వెనుకాడకుండా డబ్బును మంచినీటి ప్రాయంగా ఖర్చు పెట్టాడు. కానీ ఈ చిత్ర బృందం ఆయన నమ్మకాన్ని నిలబెట్టలేకపోయారు.

  మొత్తానికి ఇంత మంది కలసి ఒకేసారి ప్రేక్షకుడి మీద రెచ్చిపోయే సరికి ఏం చెయ్యాలో తోచక, పెట్టిన డబ్బుకు బయటకు రాలేక థియేటర్లలోనే చచ్చినంత పనిచేసారు. కానీ డబ్బు గురించి ఆలోచించి బయటకు రాకుండా తల నొప్పితో తిరిగి మాత్రలకు డబ్బు పెట్టడానికంటే ముందుగానే బయటకు పరుగు తియ్యడమే ఉత్తమం అని చాలా మంది కమెంట్స్ చేసుకోవడం కనిపించింది. దీంతో నితిన్ తన 11వ ఫ్లాప్ చిత్రాన్ని విజయవంతంగా పూర్తి చేసాడు. ఇక పై కథల మీద దృష్టి పెట్టకపోతే ఆయన గారి సినిమాలంటే జనాలు భయపడే రోజులు మరెంతో దూరంగా లేవనిపిస్తుంది. బెటర్ లక్ నెక్ట్స్ టైం నితిన్...

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X