»   » పోలీసు, న్యాయ వ్యవస్థలపై సెటైర్.. జాలీ ఎల్‌ఎల్‌బీ 2 మూవీ రివ్యూ

పోలీసు, న్యాయ వ్యవస్థలపై సెటైర్.. జాలీ ఎల్‌ఎల్‌బీ 2 మూవీ రివ్యూ

Posted By:
Subscribe to Filmibeat Telugu
Rating:
3.0/5

హాలీడే, బేబీ, ఎయిర్ లిఫ్ట్ చిత్రాలతో విభిన్న పాత్రలను పోషిస్తున్న నటుడిగా గుర్తింపు తెచ్చుకొన్న ఒకప్పటి యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ తాజాగా జాలీ ఎల్‌ఎల్‌బీ 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రం ఫిబ్రవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. న్యాయ, పోలీసు వ్యవస్థలోని లోపాలపై సినీ విమర్శనాస్త్రాన్ని ఎక్కువపెట్టి రూపొందించిన చిత్రానికి దర్శకుడు సుభాష్ కపూర్ దర్శకత్వం వహించారు. కోర్టు రూం డ్రామాగా తెరకెక్కిన చిత్రం ప్రేక్షకులను అలరించిందా? అక్షయ్ కుమార్ ఖాతాలో మరో విజయం చేరిందా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే.

జాలీ ఎల్‌ఎల్‌బీ 2 కథ ఇదీ..

జాలీ ఎల్‌ఎల్‌బీ 2 కథ ఇదీ..

కాన్పూర్‌కు చెందిన జగదీశ్వర్ మిశ్రా ఉరఫ్ జాలీ (అక్షయ్ కుమార్) ఓ లాయర్. లక్నోలో ప్రముఖ లాయర్ వద్ద అసిస్టెంట్‌గా పనిచేస్తుంటాడు. తండ్రి ఆకాంక్షల మేరకు గొప్ప లాయర్ కావాలనే కల ఉంటుంది. చాలా ఏండ్లుగా అసిస్టెంట్‌గానే ఉంటున్న జాలీ.. సొంతంగా ప్రాక్టీస్ ప్రారంభించాలని అనుకొంటాడు. అందుకోసం డబ్బు అవసరం అవుతుంది. ఆ సమయంలో న్యాయం కోసం కోర్టుకు వచ్చిన హీనా సిద్ధిఖీ (సయానీ గుప్తా) మోసగించి తనకు అవసరమైన డబ్బును జాలీ సంపాదిస్తాడు. జాలీ చేసిన మోసం గురించి తెలుసుకొని నిలదీస్తుంది. ఇక న్యాయం జరుగదనే బాధతో ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ ఘటన అతన్ని ఆవేదనకు గురిచేస్తుంది. ఆలోచింపచేస్తుంది. ఆమె కేసును బయటకు లాగి న్యాయపోరాటం చేయాలనుకుంటాడు. హీనాకు న్యాయం చేయాలని నిశ్చయించుకొని కోర్టులో బలమైన లాయర్ ప్రమోధ్ మథార్ (అన్ను కపూర్)ను ఎదుర్కోవడానికి సిద్ధమవుతాడు. అసలు హీనాకు అన్యాయం ఏమి జరిగింది. హీనా కుటుంబానికి న్యాయం చేయడం కోసం ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు. ప్రమోధ్ మాథూర్ ఎందుకు జాలీని అడ్డుకునే ప్రయత్నం చేశాడు? చివరికి జాలీ ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదురించాడు అనే ప్రశ్నలక సమాధానమే జాలీ ఎల్ఎల్‌బీ చిత్ర కథ.

సక్సెస్ బాటలో అక్షయ్ కుమార్

సక్సెస్ బాటలో అక్షయ్ కుమార్

అక్షయ్ కుమార్ తాజాగా మరో డిఫరెంట్ చిత్రం జాలీ ఎల్‌ఎల్‌బీ 2తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. జాలీ పాత్రలో అక్షయ్ ఒదిగిపోయాడు. న్యాయవాది పాత్రలో ఉత్తమ నటన ప్రదర్శించాడు. చిత్ర తొలిభాగంలో డబ్బు కోసం కక్కుర్తి పడే పాత్రలో జీవించాడు. ద్వితీయార్థంలో అన్యాయానికి గురైన వ్యక్తుల కోసం పోరాడే న్యాయవాదిగా ఆకట్టుకొన్నాడు. వెరసి అక్షయ్ స్టార్ కాకుండా ఉత్తమ నటుడిగా రుజువు చేసుకొనే క్రమంలో మరో ముందడుగు వేశాడు.

యాక్షన్ నుంచి రూటు మార్చిన ఖిలాడీ

యాక్షన్ నుంచి రూటు మార్చిన ఖిలాడీ

తొలుత యాక్షన్, రొమాంటిక్, కామెడీ చిత్రాలతో అలరించిన అక్షయ్ తన వయస్సును గుర్తెరిగి ఇటీవల కాలంలో విభిన్న కథాంశాలను ఎంపిక చేసుకుంటూ విజయాలను సాధిస్తున్నాడు. ఆ క్రమంలో వచ్చినవే ఓ మైగాడ్, హాలీడే, బేబీ, ఎయిర్ లిఫ్ట్ చిత్రాలు.

వ్యవస్థలోని లోపాలపై సుభాష్ కపూర్ విమర్శనాస్త్రం

వ్యవస్థలోని లోపాలపై సుభాష్ కపూర్ విమర్శనాస్త్రం

వ్యవస్థలోని లోపాలను దర్శకుడు సుభాష్ కపూర్ కళ్లకు కట్టినట్టుగా చూపించేందుకు ప్రయత్నించాడు. సఫలమయ్యాడు కూడా. కథలో భాగంగా ఉద్వేగ సన్నివేశాలను తెరకెక్కించడంలో మరోసారి దర్శకుడు తన ప్రతిభను చాటుకొన్నాడు. ప్రధమార్థంలో న్యాయవ్యవస్థ తీరుతెన్నులను, ద్వితీయార్థంలో కోర్టు విచారణ, అందులో లోటుపాట్లను తెరపై చూపించాడు. సెకండాఫ్‌లో సుదీర్ఘంగా సాగే కోర్టు విచారణ కొంత ప్రేక్షకుడిని అసౌకర్యానికి గురిచేసినా.. జడ్జి త్రిపాఠి (సౌరభ్ శుక్లా) పాత్ర ద్వారా కామెడీతో ఆసక్తిని కలిగించాడు.భావోద్వేగ కథనంతో మెప్పించాడు.

పొలిటికల్ జర్నలిస్టు నుంచి డైరెక్టర్‌గా

పొలిటికల్ జర్నలిస్టు నుంచి డైరెక్టర్‌గా

దర్శకడు సుభాష్ కపూర్ పొలిటికల్ జర్నలిస్టు. 90వ దశకంలో ఉత్తర భారత దేశంలో జర్నలిస్టుగా పనిచేశాడు. అభిరుచి మేరకు ఆయన తీసిన షార్ట్ ఫిలింలకు విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి. దాంతో ఆయన సే సలాం ఇండియా చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి ప్రవేశించాడు. ఆ తర్వాత ఫస్ గయరే ఒబామా, జాలీ ఎల్ఎల్‌బీ చిత్రాలను రూపొందించిన ఆయనకు పరిశ్రమలో మంచి పేరు, గుర్తింపు లభించింది. మున్నాభాయ్ సిరీస్‌లో భాగంగా విధు వినోద్ చోప్రా తీసే మున్నాభాయ్ చలే ఢిల్లీ చిత్రానికి ఆయన దర్శకత్వం వహించనున్నారు.

మరోసారి ఆకట్టుకొన్న అన్నూ కపూర్

మరోసారి ఆకట్టుకొన్న అన్నూ కపూర్

న్యాయవ్యవస్థ అంటే తన చెప్పు చెత్తుల్లో ఉండే కీలుబొమ్మ అనే విధంగా వ్యవహరించే సీనియర్ న్యాయవాది ప్రమోద్ మాథూర్ పాత్రలో అన్ను కపూర్ కనిపించాడు. హీరో ఎత్తులకు పై ఎత్తు వేసే ప్రతినాయకుడి పాత్రను తనదైన శైలిలో పోషించాడు. చాలా కాలం తర్వాత మళ్లీ తెరపై కనిపించి అలరించాడు. హుందాతనాన్ని ప్రదర్శించే లాయర్ పాత్రకు న్యాయం చేశాడు.

హాస్యంతో అలరించిన సౌరభ్ శుక్లా

హాస్యంతో అలరించిన సౌరభ్ శుక్లా

చాలా సీరియస్‌గా నడిచే సినిమాలో హాస్యాన్ని పండించడంలో ప్రముఖ నటుడు సౌరభ్ శుక్లా సక్సెస్ అయ్యాడు. ఆయన త్రిపాఠి పాత్ర ద్వారా పలికించిన హావభావాలు ప్రేక్షకుల్లో నవ్వులు పూయించాయి. గంభీర సన్నివేశాల్లో ఆయన నటన భేష్ అనిపించే విధంగా ఉంది.

హ్యూమా ఖురేషి గ్లామర్ మెరుపులు ..

హ్యూమా ఖురేషి గ్లామర్ మెరుపులు ..

పుష్పా పాండే పాత్రలో అక్షయ్‌కు భార్యగా హ్యూమా ఖురేషి హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రంలో హ్యూమా పాత్రకు స్కొప్ లేదు. దాంతో పాత్ర పరిధి మేరకే కనిపించింది. అక్కడక్కడా గ్లామర్‌తో ఆకట్టుకున్నది. కొన్ని సన్నివేశాల్లో కనిపించినా హీనా సిద్ధిఖీ పాత్రలో సయానీ గుప్తా గుర్తుండిపోతుంది.

సాంకేతిక నిపుణుల పెర్ఫార్మెన్స్

సాంకేతిక నిపుణుల పెర్ఫార్మెన్స్

కమల్ జిత్ నేగి ఫొటోగ్రఫీ బాగుంది. కశ్మీర్‌‌లో చిత్రించిన సన్నివేశాలు బాగున్నాయి. ఈ చిత్రం ఎమోషనల్‌గా సాగడానికి మంజ్ ముసిక్, మీట్ బ్రదర్స్, చిరంతన్ భట్ సంగీతం ఉపయోగపడింది. పాటలకు ఈ చిత్రంలో అంతగా ప్రాధాన్యం లేకపోయింది. అయినా హోలీ నేపథ్యంగా పాట, ఎండ్ టైటిల్స్ పాట హుషారుగా ఉన్నది.

అసలు జాలీ.. చిత్రం ఎలా ఉంది..

అసలు జాలీ.. చిత్రం ఎలా ఉంది..

సమాజంలో ఎక్కడా న్యాయం జరుగకుంటే పౌరుడికి అండగా నిలిచేది కోర్టు. అనేక లోపాలు కనిపించినప్పటికి ఈ దేశ పౌరుడికి భరోసాను న్యాయవ్యవస్థనే కల్సిస్తుంది. అలాంటి వ్యవస్థలో భాగంగా కోర్టులో జరుగుతున్న కొన్ని అవకతవకలను, పలు అంశాలను ఈ చిత్రం కళ్లకు గట్టినట్టు చూపింది. ఉగ్రవాదుల పేరుతో పోలీసులు జరిపే బూటకపు ఎన్‌కౌంటర్లను చర్చించింది. మూస చిత్రాలకు భిన్నంగా విభిన్న చిత్రంగా రూపుదిద్దుకొన్నది. రెగ్యులర్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాలను ఆదరించే వారికి ఈ చిత్రం అంతగా నచ్చకపోవచ్చు. మంచి కంటెంట్, విభిన్నమైన చిత్రాలను చూసేవారికి ఈ చిత్రం తప్పక నచ్చుతుంది.

అక్షయ్‌కు జైపూర్ కోర్టు సమన్లు

అక్షయ్‌కు జైపూర్ కోర్టు సమన్లు

జాలీ ఎల్‌ఎల్‌బీ2లో హీరో పాత్ర పోషించిన అక్షయ్ కుమార్ కు ఈ నెల 6న జైపూర్ కోర్టు సమన్లు జారీ చేసింది. మార్చి 10వ తేదీన కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. న్యాయవాద వృత్తిని కించపరిచే విధంగా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయని పిటిషన్ దారు కోర్టుకు నివేదించారు.

బాంబే హైకోర్టులోనూ కేసు

బాంబే హైకోర్టులోనూ కేసు

భారత న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా ఈ చిత్రం రూపొందించారనే ఆరోపణలపై జాలీ ఎల్ఎల్‌బీ2 చిత్రంపై న్యాయవాది అజయ్ కుమార్ వాగ్మేరే బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ చిత్ర టైటిల్ నుంచి ఎల్ఎల్‌బీ పదాన్ని తొలగించాలని కోర్టును వేడుకొన్నారు. దాంతో ఈ చిత్రాన్ని వీక్షించేందుకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని కోర్టు నియమించింది. ఈ కమిటీలో చీఫ్ జస్టిస్ జేఎస్ ఖేహార్, జస్టిస్‌‌లు ఎన్వీ రమణ, డీవై చంద్రచూడ్ ఉన్నారు.

నటీనటులు: అక్షయ్ కుమార్, హ్యూమా ఖురేషి, అనుకపూర్, సౌరభ్ శుక్లా
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సుభాష్ కపూర్ః
నిర్మాత: ఫాక్స్ స్టార్ స్టూడియోస్
సంగీతం: మంజ్ ముసిక్, మీట్ బ్రదర్స్, చిరంతన్ భట్
ఫొటోగ్రఫీ: కమల్ జీత్ నేగి
చిత్ర నిడివి: 2 గంటల 19 నిమిషాలు

English summary
Jolly LLB2 is Satirical movie on Police and legal system. Akshay Kumar’s comic timing is the backbone of this story. With a fantastic support cast like Saurabh Shukla, Annu Kapoor Director Subhash Kapoor is command over the story, screenplay and direction.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu