twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చక్కటి షో!

    By Staff
    |

    Show
    -జలపతి గూడెల్లి
    చిత్రం: షో
    నటీనటులు: మంజుల, సూర్య
    సంగీతం: రాజ్‌
    ఫోటోగ్రఫీ: రవియాదవ్‌
    నిర్మాత: మంజుల
    కథ, మాటలు, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: నీలకంఠ

    ఈ ఏడాది ఉత్తమ స్క్రీన్‌ ప్లే అవార్డుతో పాటు తెలుగులో ఉత్తమ చిత్రంగా ఎంపికైన షో నిజంగా సరికొత్త తరహాలో రూపొందించిన ఉత్తమ చిత్రమే. కృష్ణ కూతురు మంజుల నటించి, నిర్మించిన ఈ చిత్రం పూర్తిగా టెక్నీషియన్స్‌ చిత్రం. మెలోడ్రామా, సినిమాటిక్‌ అంశాలు లేకుండా..కేవలం సినిమాను ఒక 'షో'లా చూడదగ్గట్లు దర్శకుడు నీలకంఠ రూపొందించాడు. రెండే రెండు క్యారక్టర్స్‌ తో రెండు గంటల పాటు సినిమాను రూపొందించడం అంటే చాలా కష్టం. అదీ బోర్‌ కొట్టకుండా తీయడం అంటే పెద్ద సాహసం. కానీ ఈ షోలో మనకు ఎక్కడా బోర్‌ కొట్టదు కదా..సినిమాలో రెండే పాత్రలున్నాయన్న విషయం కూడా తోచదు. ఆ విధంగా స్క్రీన్‌ ప్లే రూపొందించిన నీలకంఠ నిజంగా అభినందనీయుడు. అయితే, రెండు పాత్రలతో సినిమా తీస్తున్నప్పుడు అందరి కన్నా అధికంగా కష్టపడేది సినిమాటోగ్రఫరే.

    ఎందుకంటే ఈ సినిమా అంతా ఒక ఇంట్లో..ఆ ఇంటి ఆవరణలో..చుట్టుపక్కల పరిసరాల్లోనే..తీశారు. ఇలాంటి పరిమిత లోకేషన్స్‌, సబ్జెక్ట్స్‌ తో రెండు గంటల పాటు ప్రేక్షకులను బోర్‌ కొట్టించకుండా తీయాలంటే...ఫోటోగ్రఫర్‌ తన ఇమేజినేషన్‌ కు పనిచెప్పకతప్పదు. రవియాదవ్‌ అడవి బ్యాక్‌ డ్రాప్‌ ను, జంతువులను...ఉపయోగించుకొని ..అద్భుతమైన కెమెరా పనితనంతో ఈ సినిమాకు సంపూర్ణన్యాయం చేశాడు. మదనపల్లి, తడా అడవుల పచ్చని అందాలతో తెరకు నిండుదనం తీసుకువచ్చాడు. ఇక కృష్ణ కూతురు మంజుల తొలి చిత్రంలోనే మంచి నటినని నిరూపించుకొంది. చాలా సహజంగా, తన వయసుకు తగ్గట్లు నటించింది. జీవితంలో ఓడిపోయి, ప్రస్టేషన్‌ తో గడుపుతున్న పాత్రలో సూర్య అద్భుతమైన నటనను ప్రదర్శించాడు. డైలాగ్‌ సరిగా సింక్‌ కాకపోవడం వంటి చిన్న లోపాలను పక్కన పెడితే, ఈ సినిమా మంచి చిత్రం. చక్కటి ప్రయోగం. తెలుగులో సరికొత్త చిత్రం.

    మంజుల ఓ ఫార్మాస్యూటికల్‌ కంపెనీలో మేనేజర్‌. మదనపల్లి అడవుల్లో క్యాన్సర్‌ కు మందును కనుక్కొన్న ఓ ప్రొఫెషర్‌ దగ్గరికి ఢిల్లీ నుంచి వస్తుంది. ఆయన ఇల్లు అడవిలో దూరంగా విసర్జించినట్లుగా ఉంటుంది. ఉదయాన్నే వచ్చిన ప్రొఫెషర్‌ ఇంటికి వచ్చిన మంజులకు తాళం వేసిన ఇళ్ళే ఆహ్వానం పలుకుతుంది. పక్క ఊరికి పనిమీద అర్జెంట్‌ గా వెళుతున్నాను, నాలుగు గంటల్లో వచ్చేస్తాను..అప్పటివరకు వెయిట్‌ చేయమని ఒక లెటర్‌, తాళం పెట్టి వెళుతాడు. పేటేంట్‌ ఒప్పందాలను చూసేందుకు జూనియర్‌ లాయర్‌ సూర్య కూడా ఇంటికి ఉదయాన్నే వస్తాడు. ప్రొఫెషర్‌ ఇంట్లో లేడని తెలిసి చిరాకు పడిపోతాడు. చేసేదేమీ లేక ఈ అపరిచితులు ఇద్దరూ ఈ ఇంట్లో ఒక దినమంతా గడపేందుకు సిద్దమవుతారు. అడవిలో ఎటువంటి మానవ సంచారం, కాలక్షేపానికి ఏమీ లేని ఆ ఇంట్లో వారు ఎలా టైంపాస్‌ చేస్తారు? టైంపాస్‌ కోసం వారు ఆడిన ఓ నాటకం..ఇద్దరి జీవితాల్లోని మరో కోణాన్ని ఆవిష్కరింపచేయడంతో...సినిమా ముగుస్తుంది.

    జీవితంలోని అబ్సరిడిటీని చాలా ప్లెయిన్‌ గా, సింపుల్‌ గా ఎటువంటి ఆర్టిస్టిక్‌ లుక్‌ లేకుండా అద్భుతంగా చిత్రీకరించాడు దర్శకుడు నీలకంఠ. ఈ చిత్రంలో మూడో పాత్ర ప్రొఫెషర్‌ ది. చారుహాసన్‌ నటించన ఈ పాత్ర చిత్రంలో మూడే సార్లు వస్తుంది చిత్రంలో. మిగతా రెండు గంటలు మంజుల, సూర్య తమ 'నటనాచాతర్యుం'తో ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో మరో ప్రసంశసించదగ్గ అంశం - నేపథ్య సంగీతం. చిత్రం ఆసాంతం సంగీత దర్శకుడు రాజ్‌ చక్కటి రీరికార్డింగ్‌ తో సినిమాకు క్యాలిటీని అందచేశాడు. పాటలు లేని ఈ చిత్రంలో రాజ్‌ నేపథ్య సంగీతం హాయిగా ఉంది. కేవలం 26 లక్షల రూపాయలతో ఇంత చక్కటి క్యాలిటీ చిత్రాన్ని రూపొందించిన నిర్మాత మంజుల సాహసాన్ని మెచ్చుకోవాల్సిందే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X