For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జర మిస్... ( ‘జబర్‌దస్త్' రివ్యూ)

  By Srikanya
  |

  ---సూర్య ప్రకాష్ జోశ్యుల
  'అలా మొదలైంది' చిత్రంతో పరిచయమైన దర్శకురాలు నందినీరెడ్డి కొత్త చిత్రం అంటే సమ్ థింగ్ స్పెషాలిటీ ఉంటుందని, మరోసారి ఓ కొత్త రొమాంటిక్ కామెడీని తెరపై ఆవిష్కరిస్తుందని అందరూ ఆశించారు. దానికి తోడు సమంత,సిద్దార్ద జోడి కూడా 'జబర్‌దస్త్' పై అంచనాలు పెంచాయి. అయితే హిందీలో వచ్చిన 'బ్యాండ్ బాజా బారాత్ ' కి ఫ్రీమేక్ కావటం, అదీ చీప్ కామెడీతో నవ్వించే ప్రయత్నం సినిమాలో చాలా చోట్ల జరగటం పూర్తిగా నిరాశపరిచింది. ముఖ్యంగా రొమాంటిక్ కామెడీల్లో ఉండాల్సిన బీట్స్ మిస్సై,సినిమాలో సెకండాఫ్ ని ..ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ తరహాలో లాగిన ఫీలింగ్ వచ్చింది. హిందీలో ఎమోషనల్ గా ఉన్న కథని ఫార్సికల్ కామెడీగా మార్చేసారు. క్లైమాక్స్ ని నీరసంగా,ప్రెడిక్టబుల్ గా, సినిమాటెక్ సెంటిమెంట్ తో ముంచేసారు.

  కథ చూస్తే... పెట్టిన ప్రతీ బిజినెస్ ఫెయిల్యూర్ అవుతూ, అందుకోసం..అందిన చోట్లల్లా అప్పులు చేస్తూ జీవితం గడిపే కుర్రాడు బైర్రాజు (సిద్ధార్థ్‌). మరో ప్రక్క శ్రియ (సమంత) వెడ్డింగ్ ప్లానర్ గా పెద్ద బిజినెస్ ఉమెన్ గా ఎదగాలనుకునే యువతి. పెళ్లి కూడా వద్దనుకుని ఆ బిజినెస్ కోసం తపనతో తిరుగుతున్న ఆమెకు అనుకోని పరిస్దితుల్లో బైర్రాజు తగులుతాడు. ఇద్దరూ కలిసి...వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీ స్టార్ట్ చేస్తారు. బిజినెస్ విస్తరించే క్రమంలో ఆమె బైర్రాజుతో ప్రేమలో పడుతుంది. కానీ బైర్రాజుకు ఆమె పై ఏ ఫీలింగ్స్ ఉండవు. ఈ లోగా ఓ గొడవ జరిగి ఇద్దరూ విడిపోతారు. బైర్రాజు వేరేగా స్వంతంగా వెడ్డింగ్ ప్లానర్ కంపెనీ పెట్టుకుంటాడు. విడిపోయిన వీరిద్దరూ ఎలా ఒకటయ్యారు...ఈ కథలో నిత్యా మీనన్ పాత్ర ఏమిటనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

  నిజానికి రొమాంటిక్ కామెడీల్లో హీరో,హీరోయిన్స్ ఇద్దరూ ఎలా కలిసారు..ఎలా విడిపోయారు..ఎలా ఒకరినొకరు పొందానే మూడు అంశాలు చుట్టూనే కథ తిరుగుతూంది. ఈ కథలో హీరో,హీరోయిన్స్ ఇద్దరూ దగ్గరవటం వరకూ బాగానే సీన్స్ చేసుకున్నారు కానీ..విడిపోయాక వారి ఫీలింగ్స్ ఏమిటి...ఎలా మళ్లీ ఒకరినొకరు పొందటానికి దారి తీసిన పరిస్ధితులు ఏమిటనేది సరిగ్గా ప్లాన్ చేసుకుని సీన్ల్ రాసుకోలేకపోయారు. ముఖ్యంగా హీరో,హీరోయిన్స్ మధ్య లవ్ కెమిస్ట్రీ పండకపోవటమే మైనస్ గా మారింది. దాంతో వారిద్దరూ విడిపోయినా ప్రేక్షకులకు పెద్దగా ఫీల్ కలగదు. అలాగే శాయీజీ షిండే పాత్రను ..అలా మొదలైంది చిత్రంలో అశిష్ విద్యార్ది తరహాలో ప్లాన్ చేసారు. కానీ ఆ సీన్స్ అసలు పండలేదు. ఇప్పటికే అలాంటి సీన్స్ ఎన్నో సినిమాల్లో రావటం కూడా ఇబ్బందిగా మారింది. రొమాంటిక్ కామెడీని సున్నితంగా నేరేట్ చెయ్యాల్సింది పోయి...రెగ్యులర్ కమర్షియల్ సినిమాల తరహాలో డీల్ చేయటంతో ఆ ఫీల్ కలగలేదు. నిత్యామీనన్ పాత్ర ...సెంటిమెంట్ గా పెట్టుకున్నారేమో కానీ సినిమాకు ఉపయోగపడలేదు.

  మిగతా రివ్యూ స్లైడ్ షోలో చదవండి...

  హిందీ చిత్రం 'బ్యాండ్ బాజా బారాత్ ' ఎమోషన్స్ తో నిండిన ప్రేమ కథ. దాన్ని తెలుగుకి తెచ్చేసరికి ఫార్సికల్ గా మార్చి కామెడీ చేసారు. దాంతో అటూ ఇటూ కాని కథలా మారి భరించలేని విధంగా తయారైంది.

  అసలే తెలుగులో ప్లాప్ ల్లో ఉన్న సిద్దార్ధ ఈ చిత్రంలో అల్లరి నరేష్ లా కామెడీ చేద్దామని ట్రై చేసాడు. కానీ అతని లుక్ కి కామెడీ,మాస్ డైలాగ్స్ సూట్ కాలేదు. అయితే సమంతతో చేసిన కొన్ని సీన్స్ బాగున్నాయి. పాటల్లో వీరి పెయిర్ బాగుంది.

  హిందీలో అనూష్క శర్మతో పోల్చకుండా ఉంటే సమంత ఈ సినిమాని భుజాలమీద మోసే ప్రయత్నం చేసినట్లే. సమంతకు ఇది కొత్త క్యారెక్టరైజేషనే. ఆమె ఎమోషన్ సీన్స్ లో..రొమాంటిక్ సీన్స్ లో బాగా చేసింది. ముఖ్యంగా మేఘమాల పాటలో ఆమె చేసి బెల్లి డాన్స్ సినిమాకు హైలెట్ గా నిలిచింది.

  సమంతతో పోలిస్తే నిత్యామీనన్ పాత్ర చిన్నదే కానీ, క్యారెక్టర్ ట్విస్ట్ పేలింది. అయితే అది కథకు ఎంత మాత్రమూ ఉపయోగపడేది కాదు.

  శాయాజే షిండే పాత్ర కామెడీ కోసమే పెట్టారు కానీ, సీన్స్ ఫిల్ చేయటానికి తప్ప ఉపయోగపడలేదు. అలాగే ఫార్స్ కి పరాకాష్టలా..మలేషియా డాన్ గా శ్రీహరి పాత్ర పెట్టారు. ధర్మవరపు డాన్స్ మాస్టర్ పాత్ర గతంలో బ్రహ్మనందం దరువు,రచ్చ చిత్రాల్లో చేసిందే. సీనియర్ నటులు తెలంగాణ శకుంతల, సురేష్ ,దువ్వాసి మోహన్ తమ పాత్రలకు న్యాయం చేసారు. వెన్నెల కిషోర్, త్రాగుబోతు రమేష్ కాసేపు బాగానే నవ్వించారు.

  సినిమా పాటల్లో ..'తీన్ మార్', 'మేఘమాల' ,'అరేరే' ఆకట్టుకున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.

  సినిమాటోగ్రఫి సినిమా కు మైనస్ గా మారింది. ఈ మాత్రం వర్క్ చేయటానికి తమిళం నుంచి ఎందుకు అనిపిస్తుంది. కాస్ట్యూమ్స్, ఆర్ట్ డిపార్టమెంట్ వర్క్ బాగుంది.

  వెలిగొండ శ్రీనివాస్ డైలాగులు చాలా చోట్ల పేలాయి. ఎడిటింగ్ విషయానికి వస్తే మరింత షార్ప్ గా చేయాలనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ సరైన ప్లేస్ లో పడలేదు.

  క్లైమాక్స్ మరీ నీరసంగా, తప్పదు టైమ్ అయిపోయింది, సినిమా ముగించాలి అన్నట్లుగా హడావిడిగా సినిమా టెక్ సెంటిమెంట్ టచ్ తో ముగుస్తుంది.

  సంస్థ: శ్రీ సాయిగణేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి.
  నటీనటులు: సిద్దార్థ్‌, సమంత, నిత్య మీనన్‌,శ్రీహరి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సురేష్, తా.రమేష్, వేణు, కాశీవిశ్వనాథ్, వెనె్నల కిషోర్, దువ్వాసి మోహన్, షాయాజీషిండే, కాదంబరి కిరణ్‌కుమార్, ప్రగతి, సుష్మ, గీతాభగత్, సీతారెడ్డి తదితరులు.
  మాటలు: వెలిగొండ శ్రీనివాస్,
  పాటలు: రామజోగయ్యశాస్త్రి, లక్ష్మీభూపాల్, శ్రేష్ఠ,
  ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు,
  సంగీతం: థమన్,
  కెమెరా: మహేష్ ముత్తుస్వామి, సంజయ్‌లోక్‌నాథ్,
  నిర్మాతలు: బెల్లంకొండ సురేష్‌, బెల్లంకొండ గణేష్‌బాబు;
  కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: బి.వి.నందినీరెడ్డి.
  విడుదల: 22 పిభ్రవరి, 2013 ,శుక్రవారం

  ఫైనల్ గా ఈ చిత్రం కమర్షియల్ ఫార్మెట్ లో చేద్దామని ప్రయత్నించి, విఫలమైన రొమాంటిక్ కామెడీ. సమంత అబిమానులు మాత్రం ఓ సారి చూడొచ్చు. మిగతావారు తమ ఓపిక లెవిల్స్ ఏ రేంజిలో ఉన్నాయో పరీక్షించుకోవటం కోసం చూడచ్చు.

  (గమనిక: వినోదం, అసభ్యం లేకపోవటం, సాంకేతిక విలువలు, కథన నైపుణ్యం తదితర అంశాల ఆధారంగా మా రేటింగ్ ఉంటుంది)

  English summary
  Siddardha's Jabardasth relesed today with divide talk. It is a romantic comedy film written and directed by Nandini Reddy under the banner of Sri Sai Ganesh Productions. 
 The film seems to have been inspired by hit Hindi film Band Baaja Baaraat. It stars Siddharth and Samantha in the lead roles and Prince and Nithya Menen in important roles.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X