twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్లోకం ప్రేక్షకులకు శోకం

    By Staff
    |

    Slokam
    -జోశ్యుల సూర్యప్రకాష్‌
    సినిమా: 'శ్లోకం'
    నటీనటులు: సాయి కుమార్‌, కె. విశ్వనాథ్‌, మధుశర్మ,
    బ్రహ్మానందం, రాజ్‌కుమార్‌, బుచ్చి దాస్‌ గౌడ్‌, నర్రా వెంకటేశ్వరరావు,
    రామిరెడ్డి, పిజె శర్మ తదితరులు.
    మాటలు: సాయినాథ్‌
    పాటలు: భారతి బాబు
    సంగీతం: లలిత్‌ సురేష్‌
    కెమెరా: చోట ఎం నాయుడు
    ఎడిటింగ్‌: ముత్యాల నాని
    ఫైట్స్‌: హార్స్‌మన్‌ బాబు
    కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: భరత్‌
    నిర్మాత : ఎం.యోగానంద శర్మ

    కొన్ని కాలేజి సీన్లు, వాటికి తోడు ఇమ్మెచ్యూర్‌ లవ్‌ సీన్స్‌, మితిమీరిన హింస బాక్సాఫీసు విజయ సూత్రాలని భ్రమపడి, రొటీన్‌ ఫ్యాక్షన్‌ చిత్రాల 'బాషా' తరహా స్క్రీన్‌ప్లేను ఎంచుకుని తీసిన సినిమా 'శ్లోకం'. వాస్తవాన్ని ఊహ డామినేట్‌ చేసినప్పుడు ఇటువంటి సినిమాలు వస్తాయి.

    కథ: అదో చిన్న టౌను. అక్కడికి వివేకానంద శర్మ (సాయి కుమార్‌) సనాతన బ్రాహ్మణ గెటప్‌లో తమకు బాగా తెలిసిన ప్రిన్సిపాల్‌ (రాంరెడ్డి) ఇంట్లో దిగుతాడు. ఆయనతో పాటు తల్లి, చెల్లెలు ఉంటారు. ప్రిన్సిపాల్‌ వారిని బాగా ఆదరించి, వివేకానందకు ప్యూన్‌ ఉద్యోగం ఇస్తాడు. వివేకానంద శర్మ తండ్రి హయగ్రీవాచారి (కె. విశ్వనాథ్‌) అంటే ప్రిన్సిపాల్‌కు గౌరవభావం. అప్పుడప్పుడు గుర్తు వచ్చినప్పుడల్లా వ్యక్తం చేస్తూ ఉంటాడు. వివేకానంద శర్మ అలియాస్‌ వివేక్‌ కూడా తండ్రి ఫోటోని చూసినప్పుడల్లా అతిగా ఆవేశపడుతుంటాడు. ( ఈ సీన్లు చూసి ఈ కుర్రాడి వెనుక ఫ్లాష్‌బ్యాక్‌ ఉందని ప్రేక్షకులు భయడుతుంటారు). కాలేజిలో పిడి ఒకడు విద్యార్ధినులతో అసభ్యంగా ప్రవర్తిస్తుంటే వివేక్‌ వివేకంతో మేల్కొంటాడు. లోకల్‌ గూండా గణేష్‌కి బుద్ది చెబుతాడు. హీరో టాలెంట్‌ గుర్తించిన కాలేజి యాజమాన్యం అతడిని ప్యూన్‌ నుంచి ఏకంగా పిడి పోస్టుకు ప్రమోట్‌ చేస్తుంది.

    పిడిగా హీరో గారి బాధలు ఎన్నో. ఒక విద్యార్ధి ప్రేమలో పడి బాక్సింగ్‌పై దృష్టి కేంద్రీకరించలేకపోవడం ఆయన దృష్టిలోకి వస్తుంది. అతను కౌన్సలింగ్‌ చేస్తాడు. అతను పెట్టిన పరీక్షలో నెగ్గడంతో ఆ కుర్రాడు నెగ్గుతాడు. ఆ పిల్ల తండ్రి ఈ పెళ్ళికి ఒప్పుకోడు. పెళ్ళిని వివేక చేయబోతుంటే గూండాలతో రంగంలోకి దిగుతాడు. వచ్చి చూస్తే వివేక్‌ వాళ్ళ పాత శత్రువే. బాగా తన్నులు తిన్న హీరో ఆస్పత్రిలో చేరి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్తాడు. ఫ్లాష్‌బ్యాక్‌ ఇది.... అతని తండ్రి హయగ్రీవాచారి (విశ్వనాథ్‌) నడిపే వేద పాఠశాలపై ఆ ఊరి విలన్‌ విజయరంగరాజు కన్ను పడుతుంది. వేదపాఠశాలను తొలగించి రిసార్ట్స్‌ కట్టించాలన్న ఉద్దేశంతో ఆ భూమిని దానం చేసిన జమీందారుని కలుస్తాడు. అందుకు ఒప్పుకోకపోవడంతో జమీందారుని కాల్చివేసి పిల్లలతో సహా ఆ వేద పాఠశాలను కాల్చివేస్తాడు. ఆ బాధతో హయగ్రీవాచారి మరణిస్తాడు. ఇంత గంద్రగోళం చాలదన్నట్టు విలన్‌ కూతురు హీరోని ప్రేమిస్తూ ఉంటుంది. వివేక్‌ ఏం నిర్ణయం తీసుకుంటాడో ఓపిక ఉంటే సినిమా చూసి తెలుసుకోవచ్చు.

    కె. విశ్వనాథ్‌ నటన సినిమాకు కొంత ఊపిరి పోసింది. లలిత్‌ సురేష్‌ బాణీలు ఎక్కడో విన్నట్టు అన్పించినా వినడానికి ఫర్వాలేదు. సహజత్వం లేని కథ, వెన్నెముక లేని ప్రధాన పాత్రలు, తలనొప్పి తెచ్చే స్క్రీన్‌ప్లే ఈ సినిమా అపజయ రహస్యాలు. హీరోయిన్‌ పాత్రలో మధుశర్మ ఏం చేసింది అని పరీక్ష పెట్టవచ్చు. స్క్రీన్‌ ప్లే లోపం వల్ల పరాజయం పాలైన చిత్రాల్లోకి 'శ్లోకం' చేరిపోతుంది. ఆచారి కొడుకు శర్మ ఎలా అవుతాడో తెలియని వారు కథ, మాటలు రాస్తే ఇలాగే ఉంటుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X