For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'యముడు'...మాస్ ని పడతాడు ( రివ్యూ)

  By Srikanya
  |

  Yamudu
  Rating

  -జోశ్యుల సూర్య ప్రకాష్

  సంస్థ: స్టూడియో గ్రీన్‌

  నటీనటులు: సూర్య, అనూష్క, ప్రకాష్ రాజ్, రాధారవి, నాసర్, వివేక్ తదితరులు.

  మాటలు: శశాంక్ వెన్నెలకంటి

  ఎడిటింగ్: వి.టి.విజయన్

  కెమెరా: ప్రియన్

  సంగీతం: దేవిశ్రీ ప్రసాద్

  కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హరి

  నిర్మాత: కె.ఇ.జ్ఞాన్‌ వేల్‌

  విడుదల తేదీ: 02, జూలై 2010

  తమిళ 'సింగం' డబ్బింగ్ వెర్షన్ గా వచ్చిన సూర్య చిత్రం 'యముడు' తెలుగువారికి నచ్చేటట్లే కనపుడుతోంది. 'గజనీ' వచ్చిన నాటినుంచీ తమిళ హీరో సూర్య మన జనానికి లోకల్ హీరోలాగనే కనిపిస్తున్నాడు. దానికి తగ్గట్లే అతని చిత్రాలు మంచి ఓపినింగ్స్ తో ఊహించని క్రేజ్ తో ఇక్కడ విడుదల అవుతున్నాయి. ఇక తాజా చిత్రం యముడుకి తెలుగువారికి బాగా పరిచయం ఉన్న అనూష్క, దేవిశ్రీ ప్రసాద్ పనిచేయటం బాగా కలిసివచ్చిన అంశం. మరో ప్రక్క దర్శకుడు హరి రొటీన్ కథనే తీసుకున్నా పక్కా మాస్ మశాలా ఫార్మెట్ లోకి వెళ్ళి ఎక్కడా ఆపకుండా బోర్ కొట్టకుండా యమ స్పీడుగా లాక్కెళ్ళిపోయాడు. యాక్షన్, లవ్, కామిడీ ఏదీ వదిలిపెట్టకుండా వరసగా సీన్స్ వేసుకుంటూ పంచ్ మీద పంచ్ ఇస్తూ కథనాన్ని పరుగెత్తించాడు.

  సొంత ఊరైన రాజోలులో నరసింహ (సూర్య) ఓ సబ్ ఇన్సపెక్టర్ గా పనిచేస్తూ తన ఊరి వాళ్ళకు తలలో నాలుకలా ఉంటూంటాడు. పనిలో పనిగా సిటీ నుంచి తాతగారి ఊరికి వచ్చిన కావ్య(అనూష్క)తో ప్రేమలో పడతాడు. మరో ప్రక్క పురుషోత్తం(ప్రకాష్ రాజ్) వైజాగ్ లో పెద్ద దాదా. రియల్ ఎస్టేట్ వ్యాపారాలనుంచి కిడ్నాప్ లదాకా డీల్ చేసే అతను అనుకోని విధంగా ఓ కేసులో ఇరుక్కుని రాజోలు వచ్చి సంతకం పెట్టి వెళ్ళాల్సిన పరిస్ధితి వస్తుంది. ఆ క్రమంలో నరసింహకు అతనికి తగువు అవుతుంది. అది దృష్టిలో పెట్టుకున్న పురుషోత్తం...నరసింహను ప్రమేషన్ ఇప్పించి వైజాగ్ ట్రాన్సఫర్ అయ్యేలా చేసి ఏడ్పించాలనుకుంటాడు. తన ఊరిని వదిలి వెళ్ళటానికి ఇష్టపడని నరసింహా..వైజాగ్ వెళ్ళి పురుషోత్తాన్ని ఎట్లా నాశనం చేసాడు. తను ప్రేమించే అమ్మాయి తండ్రి(నాసర్) ని ఎలా ఒప్పించి పెళ్ళి చేసుకున్నాడనేది మిగతా కధ.

  కథగా చెప్పుకోవటానికి ఏమీ లేని ఈ చిత్రంలో స్క్రీన్ ప్లేనే బాగా వర్కవుట్ అయ్యిందని చెప్పాలి. హీరో, విలన్ ఎత్తుకు పై ఎత్తులు సినిమాను నిలబెట్టాయి. హీరోయిజం వల్ల విలన్ సఫరయ్యే సీన్స్ బాగా పండాయి. అలాగే ఎవరికీ దొరకకుండా క్రైమ్ లు చెయ్యాలని ఆలోచించే ప్రకాష్ రాజ్ క్యారక్టరైజేషన్ కొత్తగా ఉండటం ప్లస్ అయింది. అలాగే హీరోని కావాలని తనుండే సిటీకి ట్రాన్సఫర్ చేయించుకుని తన పతనాన్ని తానే తెచ్చుపెట్టుకోవటం కూడా వెరైటీగా ఉంది. ఇక అనూష్క పాత్ర చాలా పాతదే అయినా దానిమీద పెద్దగా కాన్సర్టేషన్ లేకపోవటంతో ఇబ్బంది రాలేదు. అందులోనూ వివేక్ కామిడి మాస్ కి బాగా పడుతుంది. దేవిశ్రీ ప్రసాద్ సాంగ్స్ ఎక్కడో విన్న ఫీలింగ్ ఇస్తూ సాగాయి.

  అలాగే చిత్రాన్ని సెకెండాఫ్ లో ఓ పదిహేను నిముషాలపాటు ట్రిమ్ చేస్తే బావుండేది. ఇక డబ్బింగ్ విషయానికి వస్తే డైలాగులు బాగానే పవర్ ఫుల్ గా రాసారు గానీ ప్రకాష్ రాజ్ సొంతు గొంతుతో డబ్బింగ్ చెప్పిస్తే ఇంకా పండేదనటంలో సందేహం లేదు. ఇదంతా ఒకెత్తు అయితే ఇది నిస్సందేహంగా సూర్య సినిమా. సినిమా మొత్తం తానై మోసాడు. ఈ చిత్రం సూర్యకు టైలర్ మేడ్ సబ్జెక్ట్ అనే కన్నా అతని టాలెంట్స్ కు ఓ ట్రైలర్ గా ఉందని అనటం సబబేమో. అనూష్క కేవలం పాటలకు పరిమితమైనా అంతకు మించి కథకు అనవసరమనే ఫిక్సయ్యేలా తీర్చిదిద్దారు. పల్లె జనం అంతా వచ్చి సూర్యకు సపోర్ట్ చేయటం, అదే విలన్ కు, హీరోకు మధ్య తగువుకి లీడ్ చేయటం అనే మంచి స్క్రిప్టు వర్క్ గా చెప్పవచ్చు. మైనస్ లలో చిత్రంలో అరవ అతి ఎక్కువ అవటం, హీరో కేకలు పెడుతూ డైలాగులుచెప్పటం కొంచెం ఇబ్బంది పెడతాయి. అలాగే ఫైట్స్ కూడా ఒక్కోసారి సందర్భం పెద్దగా లేకపోయినా వచ్చేస్తూండటం విసుగిస్తుంది. టెక్నికల్ గా బారీ చిత్రాల స్ధాయిలో మంచి స్టాండర్డ్స్ లోనే ఉంది.

  సూర్య ఫాన్స్, యాక్షన్ చిత్రాలు బాగా ఇష్టపడేవారికే కాక, మాంచి మశాలా చిత్రం చూద్దామని ఆశపడేవారు మిస్ కాకూడని చిత్రం ఇది. అనూష్క ఉంది కాబట్టి మహిళలు కూడా ఓ కన్నేసే అవకాశం ఉంది. కొత్తదనం ఆశించకుండా వెళ్తే మరీ చెత్త చిత్రం చూసామన్న ఫీలింగ్ మాత్రం ఇవ్వదు. ఈ చిత్రం ఎ సెంటర్స్ లో ఎలా ఉన్నా బి, సి సెంటర్లలో మంచి కలెక్షన్స్ సాధిస్తుందనిపిస్తుంది.

   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X