For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  యమ బోరుడు ('యుముడికి మొగుడు' రివ్యూ)

  By Srikanya
  |

  - సూర్య ప్రకాష్ జోశ్యుల

  Rating:
  1.5/5
  కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు ఉన్నప్పుడు లోకాంతర వివాహాలు ఎందుకు ఉండకూడదు అని ప్రశ్నిస్తూ వచ్చిన చిత్రం ఇది. యముడుకి, మానవుడికి మధ్య జరిగే కలహాల కామెడీలతో ఎన్టీఆర్ 'దేవాంతకుడు' నాటి నుంచి మొన్న 'యమాయ నమహ' వరకూ, ఎన్నో సోషియో ఫాంటసీ చిత్రాలు తెలుగులో వచ్చాయి. అయితే వాటిల్లో యమగోల, యమలీల,యమదొంగ వంటి కొన్ని చిత్రాలు కథ, కథనంలో ప్రత్యేకతను చూపుతూ ఘన విజయం సాధించాయి. అయితే తాజాగా వచ్చిన యముడుకి మొగుడు మాత్రం స్క్రిప్టుపై సరైన శ్రద్ద పెట్టకపోవటంతో నిరాశనే మిగిల్చిందని చెప్పాలి. ఫస్టాఫ్ డైలాగులతో ఫన్ చేసి, సెకండాఫ్ బోర్ తో రన్ చేసారు. ముఖ్యంగా క్లైమాక్స్ చాలా డల్ గా పేలవంగా తేలిపోవటం పెద్ద మైనస్ గా మారింది.

  బ్రహ్మ తప్పిదం వల్ల పుట్టిన నరేష్‌ (నరేష్‌) కి నుదిట రాత అనేది ఉండదు. దాంతో అతను దైవుళ్ళతో సమానంగా ఏది కోరుకుంటే అది జరుగే శక్తి పుట్టకతోనే వస్తుంది. కానీ ఆ విషయం అతనికి తెలియదు. ఈలోగా నారదుడు మాయ వల్ల యముడి (సాయాజీ షిండే) కూతురు యమజ (రిచా పనయ్‌) భూమి మీదకు వచ్చి... నరేష్ చేత మెళ్లో పూల దండ వేయించుకుంటుంది. దాంతో పూల దండ వేసిన వాడే తన భర్త అని ఫీలవుతూ అతని వెనక పడుతూంటుంది. నారద మాయ తెలియని నరేష్ ఆమెను వెళ్లగొట్టాలనుకుని ఆ ప్రాసెస్ లో ఆమెతో ప్రేమలో పడతాడు. అయితే తన కూతురు ఓ మానవుడుతో జీవితం పంచుకుంటోందని తెలిసిన యముడు... భూమి మీదకు వచ్చి ఆమెను తనతో తమ లోకానికి తీసుకు వెళ్లతాడు. అప్పుడు నరేష్ ఏం చేసాడు. యమలోకం వెళ్లి తన ప్రేమను గెలిపించుకున్నాడా? లేదా? అనేది మిగతా కథ.

  సంస్థ: ఫ్రెండ్లీ మూవీస్‌
  నటీనటులు: నరేష్‌, రిచా పనయ్‌, సాయాజీ షిండే, రమ్యకృష్ణ, చంద్రమోహన్‌, నరేష్‌, చలపతిరావు, కృష్ణభగవాన్‌, భరత్‌, రఘుబాబు తదితరులు.
  మూలకథ: జయసిద్ధు,
  మాటలు: క్రాంతిరెడ్డి సకినాల,
  సంగీతం: కోటి,
  కెమెరా: కె.రవీంద్రబాబు.
  నిర్మాత: చంటి అడ్డాల
  దర్శకత్వం: ఇ.సత్తిబాబు
  విడుదల: 27-12-2012( గురువారం).

  నరేష్ ఇప్పటివరకూ యమలోకం బ్యాక్ డ్రాప్ లో సినిమా చెయ్యలేదు..చేసేద్దా అని అప్పటికప్పుడు అనుకుని రాసుకున్నట్లున్న ఈ కథలో హీరోకి..యముడుతో సమానంగా దైవ శక్తుల ఇవ్వటంతోనే సగం ఆసక్తి పోయింది. ఎప్పుడైతే హీరోకి తన ప్రత్యర్ధితో సమానంగా శక్తులు కలిగి ఉన్నాడని తెలుస్తుందో అప్పుడే కథలో సంఘర్షణ తగ్గిపోతుంది. కాంప్లిక్ట్ పండదు. ఓ మామూలు మానవుడు...అఖండమైన శక్తులు ఉన్న యముడుతో పోరాడి గెలిచాడు అంటే ఎలా పోరాడాడు అనేది ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. అలాగే యముడు కూతురు అయిన యమజ కి అసలు వ్యక్తిత్వం ఉన్నట్లు చూపలేదు. ఆమె మెళ్లో దండపడింది కాబట్టి..తనకి పెళ్లైంది అని పిక్స్ అవుతూ హీరోనే దైవం అన్నట్లు తిరుగుతూంటుంది. దీనికి తోడు... ఇన్నాళ్లూ సినిమాల్లో యముడు పాత్ర అంటే గంభీరంగా, భూమిమీదకు వచ్చినప్పుడు కాస్త అమాయకంగా ఉంటూ నవ్విస్తూ...మనకు నచ్చుతాడు. అయితే ఈ సినిమాలో యుముడు మరీ సినీ లిబర్టీస్ తో స్త్రీ లోలుడుగా...పాపులుగా వచ్చిన స్త్రీలకు లైన్ వేస్తూ, మందు కొడుతూ మత్తులో పడుతూంటాడు. చిత్ర గుప్తుడు పాత్ర అయితే ద్వంద్వార్దాలు పలకటమే జీవితాశయం అన్నట్లు రెచ్చిపోతూంటుంది. కథ,కథలో పాయింట్ కామెడీగా ఉండాలి కానీ మరీ పాత్రలను కామెడీకోసం ఇలా దిగజారిస్తే సినిమా డెప్త్ తగ్గిపోయి...తేలిపోతుంది. ఇవన్నీ ప్రక్కన పెడితే...ప్రీ క్లైమాక్స్ నుంచీ టీవి సీరియల్ సెంటిమెంట్ క్రియేట్ చేయటం మరీ సహన పరీక్షలో పరాకాష్టకు చేర్చింది.

  నటీనటుల్లో.. నరేష్ తనదైన శైలిలో ఎప్పటిలాగే కామెడీ పండించటానికి ప్రయత్నించాడు. చాలా చోట్ల పంచ్ లు బాగానే పేలాయి. రమ్యకృష్ణ బాగా ఒళ్లు చేసి అల్లుడా మజాకాలో అత్తో..అత్తమ్మ కూతురో పాటకు స్టెప్ట్ వేసినా జనం బాగానే ఎంజాయ్ చేసారు. హీరోయిన్ రిచా పనయ్ కి ఓ ప్రత్యేకత ఉంది... దాదాపు ఒకే ఎక్సప్రెషన్ తో సినిమా మొత్తం లాగేసింది. షాయోజీ షిండే వన్ పర్శంట్ కూడా యముడుగా నప్పలేదు. ముఖ్యంగా వచ్చిరాని తెలుగులో యముడుగా డైలాగులు చెప్తూంటే మనం నిజంగానే నరకంలో ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. హీరో తండ్రిగా చంద్రమోహన్ రెగ్యులర్ పాత్రకు రెగ్యులర్ నటన చేస్తే, తణికెళ్ల భరిణి రొయ్యలనాయుడు అనే నెగిటివ్ పాత్ర మరీ ఓవర్ డోసేజ్ గా ఉంది. రఘుబాబు పాత్ర ఒకటిరెండు సార్లు పేలింది కానీ కానీ పెద్దగా నవ్వించలేకపోయింది. మాస్టర్ భరత్..ఇప్పుడు యంగ్ భరత్ అయ్యాడు... బొద్దుగా ఉన్నప్పుడు చూసినట్లుగా ఇప్పుడు చూడలేకపోతున్నాం. డైలుగులు విషయానికి వస్తే కాస్త ద్వంద్వార్దాలు తగ్గిస్తే బాగుండేది. ఎందుకంటే అల్లరి నరేష్ చిత్రాలుకు ప్యామిలీలు కూడా వెళ్తూంటారు కదా. దర్శకుడు..కేవలం యముడ్ని అడ్డం పెట్టుకుని సినిమాని పూర్తి చేద్దామనుకోకుండా..మరికాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే మంచి సినిమా వచ్చి ఉండేది. కెమెరా వర్క్ సోసోగా ఉంది. ఎడిటింగ్...సెకండాఫ్ మరింత ట్రిమ్ చేయవచ్చేమో అనిపించింది. సంగీతంలో రెండు పాటలు బాగున్నాయి. . 'అల్లుడా మజాకా'లోని 'అత్తో అత్తమ్మ కూతురో' రీమిక్స్ అనుకున్నంత కిక్ తేలేకపోయింది. గ్రాఫిక్స్ వర్క్ బాగుంది. ఇక నరేష్ చివరలో మేరానామ్ జోకర్ గా కనిపించే పాట అయితే జనం లేచి వెళ్లిపోతున్నారు. ఆడపిల్ల గెటప్ లో మాత్రం నరేష్ బాగానే నవ్వించాడు.

  ఫైనల్ గా ఈ యమ చిత్రం చూసిన వాళ్లకు మొగుడులా తయారైంది . అయితే ఫస్టాఫ్ నవ్వుకున్నాం కదా...ఆ ఉత్సాహంతో మిగతా సెకండాఫ్ ని తట్టుకోగల శక్తి మాకుంది అని సరిపెట్టుకోగల ధైర్యం ఉంటే ఈ సినిమా చూసే ధైర్యం చేయవచ్చు.

  English summary
  Following the smashing success of Sudigadu, the expectations surrounding Allari Naresh starrer, Yamudiki Mogudu have sky rocketed. But the Film released with Divide talk. In this movie Naresh is smitten by Yama's daughter, played by Richa. And all hell breaks loose.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X