Bigg Boss Ultimate గుడ్‌బై చెప్పిన కమల్ హాసన్.. అసలు కారణమేమిటంటే?
తమిళనాడులో మోస్ట్ రేటింగ్ రియాలిటీ షో బిగ్‌బాస్ తమిళ్ నుంచి హోస్ట్, విలక్షణ నటుడు కమల్ హాసన్ తప్పుకొన్నాడు. గత కొద్దికాలంగా వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ హోస్ట్‌గా వ్యవహరించడం లేదని కమల్ ఓ ప్రకటనను రిలీజ్ చేశాడు. బిగ్‌బాస్ షో నుంచి తప్పుకోవడం వెనుక కారణాలను వెల్లడిస్తూ సుదీర్ఘమైన లేఖను రాశారు. అందులో కమల్ అభిప్రాయాలను సవివరంగా తెలియజేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

ఇబ్బంది కలుగకూడదనే ఉద్దేశంతో
కరోనావైరస్, లాక్‌డౌన్ పరిస్థితుల కారణంగా ప్రభుత్వం విధించిన ఆంక్షలతో సినిమా పరిశ్రమ వ్యవహారాలు అస్తవ్యస్తంగా మారాయి. దాంతో విక్రమ్ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను రీ షెడ్యూల్ చేసుకోవాల్సి వచ్చింది. అయితే విక్రమ్ సినిమాను పూర్తి చేయడానికి ఊపిరి సలపనంతగా షెడ్యూల్ ప్లాన్ చేశాం. కాబట్టి బిగ్‌బాస్ షోతో ఉన్న నా కమిట్‌మెంట్ వల్ల నిర్వాహకులకు ఇబ్బంది జరుగకూడదని అనుకొన్నాను. నాకు కోవిడ్ కారణంగా ఆరోగ్యం దెబ్బ తిన్నది. నెగిటివ్ వచ్చిన తర్వాత బిగ్‌బాస్ షూట్‌లో పాల్గొన్నాను. ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. అందుచేత నా వల్ల ఎవరికీ ఇబ్బంది కలుగకూడదని భావించాను అని కమల్ హాసన్ తెలిపారు.

డిస్నీ+హాట్ స్టార్‌తో అనుబంధం
బిగ్‌బాస్ షో ద్వారా డిజిటల్ ఫ్లాట్‌ఫామ్‌లోకి ప్రవేశించే అవకాశాన్ని కల్పించిన నిర్వాహకులకు ధన్యవాదాలు. బిగ్‌బాస్ హోస్ట్‌గా వ్యవహరించడం గౌరవంగా భావిస్తున్నాను. వినోద పరిశ్రమలో వినూత్న పోకడలను ఆహ్వానించే తాను.. బిగ్‌బాస్ అల్టిమేట్ షోతో మమేకం అయ్యాను. కొత్త తరహా షోలకు, సృజనాత్మకతకు మారుపేరు అయిన డిస్నీ+హాట్ స్టార్ వినోదరంగంలో మార్గదర్శి అని భావిస్తాను. అలాంటి డిస్నీ+హాట్ స్టార్ కంపెనికి నేను బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించడాన్ని గర్వంగా ఫీలవుతుంటాను అని కమల్ హాసన్ తన లేఖలో పేర్కొన్నారు.

సినిమా, బిగ్‌బాస్ ఒకేసారి
కోవిడ్ పరిస్థితుల కారణంగా విక్రమ్ ప్రొడక్షన్ షెడ్యూల్స్ మార్చడం వల్ల బిగ్‌బాస్ అల్టిమేట్ షోకు డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టంగా మారింది. ఈ క్రమంలో విక్రమ్ షూటింగులో సినిమా పరిశ్రమకు చెందిన దిగ్గజ నటులతో కలిసి షూట్ చేయాల్సి ఉంది. దాంతో బిగ్‌బాస్, విక్రమ్ సినిమాను రెండు బ్యాలెన్స్ చేయడం అసాధ్యంగా మారింది. నా కోసం సినీ నటులను, సాంకేతిక నిపుణులను వెయిట్ చేయడం సరికాదని భావించాను. దాంతో నేను బిగ్‌బాస్ అల్టిమేట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకొన్నాను అని కమల్ హాసన్ తన ప్రకటనలో స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకోవడం చాలా కష్టంగా మారింది. ఎందుకంటే.. బిగ్‌బాస్ షో అంటే నాకు ప్యాషన్‌గా మారడమే అని కమల్ పేర్కొన్నారు.

తమిళ బిగ్‌బాస్ 6కు అందుబాటులో
అలాగే, విజయ్ టెలివిజన్‌తో నాకు సహృదయమైన, స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. ఈ షో ప్రసారమైన కాలంలో నాకు వారు అందించిన సహకారం, మద్దతు మాటల్లో చెప్పలేను. బిగ్‌బాస్ అల్టిమేట్ షో నుంచి తప్పుకోవాలని తీసుకొన్న నిర్ణయాన్ని వాళ్లు మంచి మనసులో గౌరవించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను. ఇక నుంచి బిగ్‌బాస్ తమిళ అల్టిమేట్‌కు అందుబాటులో ఉండను. కానీ బిగ్‌బాస్ తమిళ్ 6 నుంచి అందుబాటులో ఉంటాను అని కమల్ హాసన్ ఎమోషనల్‌గా స్పందించారు.

విక్రమ్‌లో నటీనటులు సాంకేతిక నిపుణులు
కమల్ హాసన్ నటిస్తున్న విక్రమ్ సినిమా విషయానికి వస్తే. తన సొంత బ్యానర్ రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్‌పై నిర్మించే చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకుడు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, శివానీ నారాయణ్ తదితరులు నటిస్తున్నారు.
నిర్మాతలు: కమల్ హాసన్, ఆర్ మహేంద్రన్
సినిమాటోగ్రఫి: గిరిష్ గంగాధరన్
ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్
మ్యూజిక్: అనిరుధ్ రవిచంద్రన్
రిలీజ్: 2022-03-31


Click it and Unblock the Notifications











