Bigg Boss: బిగ్‌బాస్ షోను నిలిపివేయండి.. నిర్వాహకులకు ప్రభుత్వం సంచలన ఆదేశాలు
భారతీయ టెలివిజన్ రంగంలో ఎన్నో రియాలిటీ షోలు ఉన్నాయి. హిందీతో పాటు దేశంలోని అన్ని ప్రాంతీయ భాషలలో రకరకాల రియాలిటీ షోలు ప్రజలకు వినోదాన్ని పంచుతున్నాయి. కానీ వీటన్నింటిలో బిగ్‌బాస్ ఓ సంచలనం. సరికొత్త థీమ్‌తో వచ్చిన ఈ కార్యక్రమం.. దేశంలో రియాలిటీ షో లెక్కలనే మార్చేసింది. విదేశాల్లో పాపులైన బిగ్ బ్రదర్ కాన్సెప్ట్‌తో తొలుత హిందీలో ప్రారంభమైన ఈ మెగా షో తర్వాత దేశంలోని మిగిలిన ప్రాంతీయ భాషలకు కూడా విస్తరించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. మిగిలిన భాషల సంగతేమో కానీ తెలుగులో మాత్రం బిగ్‌బాస్ షోకు ఉన్న క్రేజ్ నెక్ట్స్ లెవల్ అని చెప్పుకోవచ్చు. భారీ టీఆర్పీలతో పాటు కాంట్రవర్సీలకు కూడా ఈ కార్యక్రమం కారణమైంది.
బిగ్‌బాస్ షోకు తగ్గని క్రేజ్
ఎన్ని వివాదాలు వచ్చినప్పటికీ, సాంప్రదాయ వాదులు వద్దని వారించినప్టపికీ దేశంలో చిన్నారుల నుంచి పెద్దల వరకు బిగ్‌బాస్ మంచి ఆదరణ దక్కించుకుంటోంది. మొదట్లో ఈ గేమ్ అర్ధం కావడానికి టైం పట్టినప్పటికీ తర్వాత ప్రేక్షకులు దీనిని ఓన్ చేసుకున్నారు. బిగ్‌బాస్ మొదలు అవుతుందంటేనే ఆ సందడి, హడావుడి మామూలుగా ఉండదు. కార్యక్రమం గ్రాండ్ లాంచ్ కావడానికి నెల రోజుల ముందు నుంచే కంటెస్టెంట్స్ ఎవరు? ఈసారి హోస్టింగ్ ఎవరు చేస్తున్నారు? అంటూ సోషల్ మీడియాలో, మీడియాలో రకరకాల గాసిప్స్ వస్తాయి.

హిందీ సహా అన్ని భాషల్లో బిగ్‌బాస్ ప్రారంభం
ఈ ఏడాది కూడా హిందీ సహా దేశంలోని పలు ప్రాంతీయ భాషలలో బిగ్‌బాస్ సీజన్ ప్రారంభమైంది. హిందీలో బిగ్‌బాస్ 19ను బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తుండగా.. తెలుగులో బిగ్‌బాస్ 9ని కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ చేస్తున్నారు. తమిళంలో బిగ్‌బాస్ 9కి విజయ్ సేతుపతి, మలయాళంలో బిగ్‌బాస్ 7కి సూపర్‌స్టార్ మోహన్ లాల్, కన్నడంలో 12వ సీజన్‌కు కిచ్చా సుదీప్ హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా కన్నడ బిగ్‌బాస్ ప్రసారానికి సంబంధించిన కీలక మలుపు తిరిగింది.
బిగ్‌బాస్ కన్నడలో 19 మంది కంటెస్టెంట్
బిగ్‌బాస్ కన్నడ 12 సీజన్ సెప్టెంబర్ 25 నుంచి టెలికాస్ట్ అవుతోంది. ఈసారి మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లో అడుగుపెట్టారు. వారు.. అభిషేక్, అశ్వినీ ఎస్, అశ్వినీ జీ, చంద్రప్రభ, సుధీర్, సతీష్, ధనుష్, ధ్రువంత్, గిల్లి నట, జాన్వీ, కావ్య, మల్లమ్మ, మాలు ఎన్, మంజు భాషిణి, రాశిక, రక్షిత, స్పందన, ఆర్జే అమిత్, కరిబసప్ప. వీరిలో తొలి వారం ఆర్జే అమిత్, కరిబసప్పలు ఎలిమినేట్ కగా.. రక్షితను హౌస్‌మేట్స్ ఎలిమినేట్ చేశారు. ప్రస్తుతం సీజన్ 12 హాట్ హాట్‌గా సాగుతున్న దశలో బిగ్‌బాస్ నిర్వాహకులకు కర్ణాటక ప్రభుత్వం షాకిచ్చింది.
బిగ్‌బాస్ కన్నడను నిలిపివేయండి
బిగ్‌బాస్ కన్నడ 12ను తక్షణం నిలిపివేయాలని కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (కేఎస్‌పీసీబీ) నోటీసులు జారీ చేసింది. బెంగళూరు శివార్లలోని బిడడి హోబ్లిలోని జాలీవుడ్ స్టూడియోస్ అండ్ అడ్వెంచర్స్‌లో ప్రస్తుతం బిగ్‌బాస్ సెట్‌ను నిర్మించారు. అయితే బిగ్‌బాస్ హౌస్ నుంచి శుద్ధి చేయని మురుగునీటిని విడుదల చేస్తున్నారని, ఈ కారణంగా పర్యావరణ కాలుష్యం జరుగుతోందని పొల్యూషన్ బోర్డ్ తన నోటీసులో తెలిపింది.
పవర్ కట్‌కు ఆదేశాలు
మురుగునీటి శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేసినట్లు బిగ్‌బాస్ నిర్వాహకులు చెబుతున్నప్పటికీ.. డ్రైనేజీ నిర్వాహణ సరిగా లేదని అధికారుల తనిఖీల్లో తేలింది. వ్యర్ధాలు సేకరించకపోవడంతో పాటు 625 KVA, 500 KVA వంటి భారీ డీజిల్ జనరేటర్లను అక్కడ ఏర్పాటు చేయడం పర్యావరణానికి మరింత ప్రమాదంలోకి నెడుతుందని బోర్డ్ పేర్కొంది. దాంతో వెంటనే బిగ్‌బాస్ కన్నడ 12 సీజన్‌ను తక్షణం నిలిపివేయాలని కర్ణాటక కాలుష్య నియంత్రణ మండలి ఆదేశించింది, అలాగే విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేయాలని విద్యుత్ శాఖకు సూచించింది. దీంతో బిగ్‌బాస్ ప్రేక్షకులు షాక్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











