Bigg Boss Telugu 9: ఓడిపోయినోడ్ని జడ్జిగా పెడతారా? బిగ్‌బాస్ విన్నర్ కౌశల్ ధ్వజం
మరికొద్దిరోజుల్లో బిగ్‌బాస్ తెలుగు 9 సీజన్ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మరో 15 రోజుల్లో బిగ్‌బాస్ సీజన్ ప్రారంభం కానుండగా.. ఇంత వరకు కంటెస్టెంట్స్ ఎవరన్న దానిపై క్లారిటీ రాలేదంటే బిగ్‌బాస్ నిర్వాహకులు ఎంత గోప్యంగా ఉంచుతున్నారో అర్ధం చేసుకోవచ్చు. అయితే కొత్త సీజన్‌లో సిలబస్ పూర్తిగా మార్చేశానని నాగార్జున ఎప్పుడో హింట్ ఇచ్చారు. ఈసారి సామాన్యులకు కూడా బిగ్‌బాస్‌లో పాల్గొనే అవకాశం కల్పించారు నిర్వాహకులు. అయితే లక్షల్లో వచ్చిన దరఖాస్తుల నుంచి కేవలం ముగ్గురిని మాత్రమే ఎంపిక చేయడం నిర్వాహకులకు కత్తమీద సాములా మారింది.
ఉత్కంఠగా బిగ్‌బాస్ అగ్నిపరీక్ష
కామన్‌మెన్ల ఎంట్రీ కోసం బిగ్‌బాస్ అగ్నిపరీక్ష పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అన్ని రకాల వడపోతలు దాటి చివరికి 40 మంది సామాన్యులు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. ఇంటర్వ్యూలు, పలు రకాల టాస్క్‌లతో వీరిలో 15 మందిని తుది జాబితాకు ఎంపిక చేయనున్నారు. ఫైనల్‌గా ఎవరు సెలెక్ట్ అయ్యారు అన్నది బిగ్‌బాస్ లాంచ్ ఎపిసోడ్ నాడు చూడాల్సిందే. ఈ బిగ్‌బాస్ అగ్నిపరీక్ష కార్యక్రమానికి బిగ్‌బాస్ తెలుగు 4 విజేత అభిజిత్, బిగ్‌బాస్ నాన్ స్టాప్ ఓటీటీ విన్నర్ బిందు మాధవి, బిగ్‌బాస్ తెలుగు 1 సెకండ్ రన్నరప్ నవదీప్‌లు జడ్జిలుగా వ్యవహరిస్తుండగా... బిగ్‌బాస్ తెలుగు 3 సీజన్ రన్నరప్ శ్రీముఖి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.

ఎంతమంది సెలెక్ట్ అయ్యారంటే
ఆగస్ట్ 22 నుంచి బిగ్‌బాస్ అగ్నిపరీక్ష కార్యక్రమం ప్రారంభ కాగా. ఇప్పటి వరకు విజయవాడకు చెందిన దివ్య.. హైదరాబాద్‌కు చెందిన ప్రసన్న.. తణుకు చెందిన పవన్.. నెల్లూరుకు చెందిన శ్రేయ.. వరంగల్‌కు చెందిన అనూష, హైదరాబాద్‌కు చెందిన శ్వేతలు సెలెక్ట్ అయ్యారు. మరికొందరు హోల్డ్‌లో ఉండగా వీరిలో ఎవరు సెలక్ట్ అవుతారన్నది ఉత్కంఠగా మారింది. మొత్తం 15 మందికి గాను ఆరుగురు సెలెక్ట్ కాగా.. మరో 9 మంది ఎవరో తేలాల్సి ఉంది. అగ్నిపరీక్షకు జడ్జిలుగా వ్యవహరిస్తున్న ముగ్గురు తమ అనుభవంతో షోను బాగా రక్తి కట్టిస్తున్నారు. హీరో నవదీప్ బాగా చేస్తున్నట్లు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే నవదీప్‌ను జడ్జిగా పిలవడంపై బిగ్‌బాస్ సీజన్ 2 విజేత, సినీనటుడు కౌశల్ మందా ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు.
శివబాలాజీగారిని పిలవాల్సింది
బిగ్‌బాస్ సీజన్ 9కు ముందు అగ్నిపరీక్ష బాగుంది.. కామన్‌మెన్‌కు అవకాశం ఇవ్వడం బాగుంది. కానీ జడ్జెస్ విషయమే నాకు నచ్చలేదు.. అభిజిత్ సీజన్ 4 విన్నర్, ఇంకొకరు బిందు మాధవి ఓటీటీ సీజన్ విన్నర్, మరొకరు నవదీప్ గారు.. ఈయన సీజన్ 1లో థర్డ్ ప్లేస్ వచ్చినట్లున్నారు. మూడో జడ్జి ప్లేస్‌లోనూ ఓడిపోయిన వాళ్లని కాకుండా, ఆ సీజన్ విన్నర్ని అంటే శివబాలాజీ గారిని తీసుకొస్తే బాగుండేదని కౌశల్ అభిప్రాయపడ్డారు.
ఇష్టం లేకుండా గెలిపించారు
ఇక తనను జడ్జిగా పిలవకపోవడంపైనా, సీజన్ 2లో తనను విజేతగా గెలిపించిన తీరుపైనా కౌశల్ ఇన్‌డైరెక్ట్‌గా పంచ్‌లు వేశారు. కౌశల్‌ను పిలిస్తే ఇంకేమైనా ఉందా? మనది అసలే పెద్ద కాంట్రవర్షియల్ సీజన్.. ఒక ఇష్టం లేని బిగ్‌బాస్ టీమ్‌కి ఇష్టం లేని కంటెస్టెంట్‌ని గెలిపించాల్సి వచ్చింది. అది కూడా ఆడియన్స్ ఎంకరేజ్‌మెంట్‌తో, వాళ్లు చేసిన రచ్చతోనే నేను గెలిచా. మీరు లేకపోతే మనం ఎంత కష్టపడి ఆడినా గెలిచే వాళ్లం కాదు. ఎందుకంటే ఓటింగ్‌లో నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది కాబట్టే నన్ను విజేతగా ప్రకటించక తప్పలేదు. నన్ను గెలిపించడం ఇష్టం లేదు కాబట్టే ఇప్పటికీ నన్ను దూరం పెట్టారు బిగ్‌బాస్.
నా చేయి కూడా పైకెత్తలేదు
ఏ సీజన్‌కి నన్ను లోపలికి పిలవలేదు.. అయినా మనం న్యాయంగా ఆడాం, గెలిచాం. బిగ్‌బాస్ హిస్టరీలోనే ఎవ్వరికీ జరగని విధంగా నాకు జరిగింది.. వాళ్లకు నన్ను గెలిపించడం ఇష్టం లేదు కాబట్టి నా సీజన్‌కు హోస్ట్‌గా చేసిన వారు కూడా నా చెయ్యి పైకెత్తి పట్టుకునే ఆనవాయితీని పక్కనపెట్టి మానిటర్‌లో చూపించి గెలిచానని ప్రకటించారు. ఫైనల్‌గా నేను చెప్పేది ఏంటంటే నవదీప్ గారి ప్లేస్‌లో శివబాలాజీ గారిని జడ్జిగా పెడితే బాగుండేది. అగ్నిపరీక్షలో గెలిచినవాళ్లలో బెస్ట్ కామన్‌మెన్, బెస్ట్ కంటెస్టెంట్‌గా బిగ్‌బాస్ 9లోకి వెళ్లాలని కోరుకుంటున్నానని కౌశల్ ముగించారు. ప్రస్తుతం ఆయన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. కౌశల్‌పై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











