Jolly LLB 3: థియేటర్‌లలోకి అక్షయ్ కుమార్ మూవీ.. ఢిల్లీ హైకోర్ట్ షాకింగ్ డెసిషన్
బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ జాలీ ఎల్ఎల్‌బీ 3. గతంలో వచ్చిన జాలీ ఎల్ఎల్‌బీ, జాలీ ఎల్ఎల్బీ 2కి సీక్వెల్‌లో ఈ మూవీ తెరకెక్కింది. సుభాష్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అర్ష్ వార్సీ, సౌరభ్ శుక్లా, హ్యుమా ఖురేషి, అమృతరావు, సీమా బిశ్వాస్, శిల్పా శుక్లా తదితరులు కీలకపాత్రలు పోషించారు. సెప్టెంబర్ 19న జాలీ ఎల్ఎల్‌బీ 3 వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయ్యింది. ఈ నేపథ్యంలో రిలీజ్‌కు కొద్దిగంటల ముందు ఢిల్లీ హైకోర్ట్ సంచలన ఆదేశాలు జారీ చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..
జాలీ ఎల్ఎల్‌బీ సిరీస్‌లో మూడో చిత్రం
జాలీ ఎల్ఎల్బీ 3కి అమన్ పటేల్, అనురాగ్ సైకియా, విక్రమ్ మోన్‌ట్రోస్, మంగేష్ దక్డేలు సంగీతం అందించగా.. రంగరాజన్ రాంభద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. స్టార్ స్టూడియో 18, కంగ్రా టాకీస్ బ్యానర్‌లపై అలోక్ జైన్, అజిత్ అంధారేలు సంయుక్తంగా జాలీ ఎల్ఎల్‌బీ 3ని నిర్మించారు. అయితే విడుదలకు ముందే ఈ సినిమాపై పలు వివాదాలు చోటు చేసుకుని విషయం కోర్టుల వరకు వెళ్లింది. జాలీ ఎల్ఎల్‌బీ 2 ట్రైలర్‌తో పాటు భాయ్ వకీల్ హాయ్ అనే సాంగ్‌లోని పదాలు భారతదేశ న్యాయ వ్యవస్ధను కించపరిచేలా ఉన్నాయని పలువురు కోర్టులను ఆశ్రయించారు. అలహాబాద్ హైకోర్ట్, బాంబే హైకోర్ట్, మధ్యప్రదేశ్ హైకోర్టులలో పలు పిటిషన్‌లు దాఖలయ్యాయి. అయితే వాటిని ఆయా కోర్టులు తిరస్కరించాయి.

పైరసీతో చిత్ర పరిశ్రమ ఇబ్బందులు
కాగా.. సినీ పరిశ్రమను దెబ్బతీస్తోన్న అంశాల్లో పైరసి రక్కసి ఒకటి. దశాబ్ధాలుగా సినీ పరిశ్రమ, పోలీసులు, ప్రభుత్వం ఇతర విభాగాలు ఎంతగా కట్టడి చేస్తున్నా పైరసి భూతాన్ని అడ్డుకోలేకపోతున్నారు. గతంలో సినిమా రిలీజైన రోజే డీవీడీలు, వీసీడీల రూపంలో థియేటర్ ప్రింట్లు బజారులో దొరికేవి. ప్రస్తుతం డిజిటల్ యుగంలో సినిమా రిలీజ్ అయిన క్షణాల్లోనే ఆన్‌లైన్‌లో హెచ్‌డీ ప్రింట్‌లు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఈ భూమ్మీద ఏ ప్రాంతంలో నుంచైనా ఈ సినిమాలను స్ట్రీమింగ్ చేసే వెసులుబాటు ఉండటంతో కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.
పైరసీ వల్ల వేలకోట్ల నష్టం..
పైరసీ కారణంగా ప్రతియేటా వేల కోట్లలో సినీ పరిశ్రమ నష్టపోతోంది. ఒక్క టాలీవుడ్‌నే చూసుకుంటే 2024లో దాదాపు 3700 కోట్ల రూపాయల నష్టం జరిగిందని ఫిలిం ఛాంబర్ తెలిపింది. మన దగ్గరే ఇలా ఉంటే కోలీవుడ్, బాలీవుడ్ సహా మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమ ఏ స్థాయిలో పైరసీ కారణంగా నష్టాలను ఎదుర్కొంటుందో ఊహించుకోవడమే కష్టంగా ఉంది. పైరసీని కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా కఠిన చట్టాలు ఉన్నా.. అవి కాగితాలకే పరిమితం అయ్యాయి. ఇటీవల టాలీవుడ్ నుంచి రిలీజైన పుష్ప 2, కల్కి 2898 డీ, గేమ్ ఛేంజర్, సింగిల్, తండేల్, కన్నప్ప తదితర సినిమాలు పైరసీ కారణంగా తీవ్రంగా నష్టపోయాయి. పైరసీని కనుక కట్టడి చేయకుంటే భారతీయ డిజిటల్ పరిశ్రమ 2029 నాటికి 20 వేల కోట్ల రూపాయలకు పైగా నష్టాలను ఎదుర్కొంటుందని నిపుణుల అంచనా.
ఢిల్లీ హైకోర్ట్ సంచలన ఆదేశాలు
తాజాగా విడుదలకు కొద్దిగంటల ముందు కూడా జాలీ ఎల్ఎల్‌బీ 3 గురించి ఢిల్లీ హైకోర్టులో కీలక విచారణ జరిగింది. అక్షయ్ కుమార్ మూవీ పైరసీ కాకుండా కోర్ట్ సంచలన ఆదేశాలు జారీ చేసింది. జాలీ ఎల్ఎల్‌బీ 3 పైరసీ వెర్షన్ ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ కాకుండా నిరోధించడానికి గాను 20కి పైగా వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయాలని న్యాయ స్థానం ఆదేశించింది. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఆయా సైట్‌లను బ్లాక్ చేయాలని, అలాగే డొమైన్ కంపెనీలు 72 గంటల్లోపు వాటిని మూసివేయాలని కోర్ట్ ఆదేశించింది. అలాగే ఈ వెబ్‌సైట్‌ల యజమానులకు సంబంధించిన వివరాలను రెండు వారాల్లోగా కోర్టుకు అందించాలని సూచించింది. సినీ పరిశ్రమకు పైరసీ కారణంగా భారీ నష్టం కలుగుతుందన్న కోర్ట్.. తదుపరి విచారను వచ్చే ఏడాది జనవరి 20వ తేదీకి వాయిదా వేసింది.


Click it and Unblock the Notifications











