Karthika Deepam 2 September 30th: సుమిత్ర మాటలకు దీప మనసు ముక్కలు.. కాంచనకు శ్రీధర్ సాయం
దీప, కార్తీక్‌లు మాట్లాడుకుంటూ ఉండగా పారు, జ్యోత్స్నలు వచ్చి వింటారు. అర్జెంట్‌గా బయటికి వెళ్లాలి కారు తీయమని కార్తీక్‌ను తీసుకెళ్తారు. నేరుగా శ్రీధర్ ఇంటికి వెళ్లి కాశీకి ఉద్యోగం చూస్తానని చెబుతుంది. దాంతో మా అల్లుడికి మేం చూసుకోగలమని శ్రీధర్ సెటైర్లు వేస్తాడు. బయట మా డ్రైవర్ ఉన్నాడు.. నా ఫోన్, పర్స్ తీసుకుని రమ్మని చెప్పమని స్వప్నతో అంటుంది జ్యోత్స్న. స్వప్న బయటికి వెళ్లి చూడగా అక్కడ కార్తీక్ ఉండటంతో షాకై.. జ్యోత్స్నకి గడ్డి పెడుతుంది. రాత్రి నుంచి ఏం తినకపోవడంతో దీప కళ్లు తిరిగి కిందపడిపోతుంది. అది గమనించిన సుమిత్ర.. ఆమెను నీళ్లు చల్లి లేపి వెంటనే కార్తీక్‌కు ఫోన్ చేస్తుంది. దీప ముందు భోజనం పెట్టి.. నీకు ప్లేట్‌లో మాత్రమే పెట్టగలను, చేతితో తినిపించలేనని అంటుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. మరి సెప్టెంబర్ 30వ తేదీ 476వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

దీప కళ్లు తెరిచిన వెంటనే ఆమె ముందు భోజనం ప్లేట్ పెట్టి తినమని చెబుతుంది. నీకు భోజనం పెట్టేంత మానవత్వం ఉంది కానీ, దానిని నా చేతితో తినిపించేంత ప్రేమ లేదని తేల్చేస్తుంది సుమిత్ర. నువ్వు ఈ ఇంట్లో పడకపోయినా, ఒకవేళ అందరి ముందు పడిపోయినా నేనింత కంగారుపడే దానిని కాదని అంటుంది. ఎందుకంటే నాకు బదులు ఇంకెవరో ఈ పని చేసేవారని, కానీ టైం చూశావా? ఎలా వచ్చిందో అని చెబుతుంది సుమిత్ర. ఇంట్లో నువ్వు, నేను తప్పించి ఎవరూ లేరని.. నువ్వంటే నాకు ఇష్టం ఉండదు కాబట్టి.. పడిపోయావని వదిలేద్దామని అనుకుంటే నేను ఒప్పుకున్నా, నాలో ఉన్న అమ్మతనం ఒప్పుకోదని చెబుతుంది సుమిత్ర.
నా బుద్ధి సరిగా పనిచేయని రోజుల్లో నిన్ను కూతురిలా చూసుకున్నానని గుర్తుచేసుకుంటుంది. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదని చెబుతుంది దీప. ఇప్పుడు నీకు ఏమైనా జరిగిందంటే ఇంట్లో నీతో పాటే ఉన్నది నేనే కాబట్టి.. నువ్వంటే నాకు నచ్చదు కాబట్టి, నిన్ను నేను ఏదో చేశానని అనుకుంటారని అంటుంది సుమిత్ర. ఈ మాట మీ మనసులో నుంచే వచ్చిందా అని దీప ప్రశ్నిస్తుంది. ఎక్కడి నుంచి వస్తే నీకెందుకు ముందు నువ్వు భోజనం చేయమని కోప్పడుతుంది సుమిత్ర. ఇదివరకు ఉన్న సుమిత్ర - దీప వేరని, వాళ్లిద్దరి మధ్య ఉన్న బంధం వేరని.. అప్పుడు దీపకు ఆవేశం, నిజాయితీ ఉండేదని.. ఇప్పుడున్న దీపకు ఆవేశం పోయి స్వార్ధం పెరిగిందని అంటుంది సుమిత్ర. నిజాయితీని వదిలేసి మోసం చేయడం మొదలుపెట్టిందని మండిపడుతుంది.
ఒకప్పుడు సుమిత్రకి మానవత్వం ఎక్కువ, అందరికి ప్రేమను పంచేది. నీలో మార్పుకు నేను కారణం కాదు, కానీ నాలో మార్పుకి నువ్వే కారణమని అంటుంది. నువ్విలా తిండి మానేసి కళ్లు తిరిగి పడిపోయినంత మాత్రాన, నాకు నీ మీదున్న కోపం పోదని చెబుతుంది దీపతో చెబుతుంది సుమిత్ర. ఆ కోపం పోవాలంటే నా భర్తను నువ్వు కావాలనే షూట్ చేశానని ఒప్పుకోవాలని, కానీ నువ్వు ఒప్పుకోవు అంటుంది. నువ్వు ఒప్పుకోవడానికి సిద్ధమైనా నీ భర్త ఒప్పుకోనివ్వడని.. అలాగని నీకు మరో అవకాశం నేను ఇవ్వనని మండిపడుతుంది సుమిత్ర. నాకు, నా భర్తకు ఒక క్షమాపణ చెరపలేనంత దూరం ఉందని దానికి కారణం నువ్వేనని చెబుతుంది.
ఉప్పు తిన్నవాళ్లకి విశ్వాసం ఉంటుంది.. నువ్వు చూపించిన విశ్వాసానికి మా జీవితాలు ఈ పరిస్ధితికి వచ్చాయని అంటుంది సుమిత్ర. ఇంతకు మించిన విశ్వాసం నువ్వు చూపిస్తే మేం ఏమైపోతామోనని అనరాని మాటలు అంటుంది సుమిత్ర. నువ్వు మమ్మల్ని బాధపెడుతున్నావ్.. అది సరిపోదని నిన్ను నువ్వెందుకు బాధపెట్టుకుంటావని మండిపడుతుంది. మీరు నన్ను కొట్టినా కూడా ఆ దెబ్బలు నన్ను ఇంత బాధపెట్టవని కంటతడి పెడుతుంది దీప. ఇంతలో ఆమెకు ఎక్కిళ్లు రావడంతో సుమిత్ర కంగారుగా వెళ్లి వాటర్ తీసుకొచ్చి దీపకు తాగిస్తుంది. కార్తీక్, జ్యోత్స్న, పారులు ఇది చూసి షాక్ అవుతారు.
ఈసారి ఎప్పుడైనా భోజనం మానేస్తే నిన్నే పిలుస్తానులే అని సెటైర్లు వేస్తాడు కార్తీక్. పడిపోయిన మనిషిని అలా వదిలేయకూడదని భోజనం పెట్టానని.. అంతేకానీ మనసు కరిగిపోయి పెట్టలేదని చెబుతుంది సుమిత్ర. దీప నిజంగానే కళ్లు తిరిగి పడిపోయిందా? లేకపోతే నువ్వు నాటకం ఆడించావా? అని కార్తీక్‌ను నిలదీస్తుంది జ్యోత్స్న. నాటకాలు అలవాటైపోయి ఎవరేం చేసినా నాటకంలాగే కనిపిస్తుందని మండిపడతాడు కార్తీక్. ఆ వెంటనే దీప దగ్గరికి వెళ్లి.. మేం మజ్జిగ ఇచ్చినా తాగవు, మీ అమ్మ భోజనం పెడితే తింటావా అని సెటైర్లు వేస్తాడు కార్తీక్. తినకపోతే మా అమ్మ చంపేసేలా ఉందని దీప చెప్పడంతో అంత కోపం చూపిస్తే కానీ నువ్వు భోజనం చేయవు కదా అంటాడు. నీతో ఎలా భోజనం తినిపించాలా? అని నేను ఆలోచిస్తే ఆ పని నీ కన్నతల్లే చేసింది, అత్తకి నీ మీద కోపం ఉంది కానీ ఆవిడలో ఉన్న మంచితనం ఎక్కడికి పోలేదని అంటాడు కార్తీక్.
మా అమ్మ నాతో దారుణంగా మాట్లాడిందని దీప అనగా.. ఏదో రకంగా మాట్లాడిందని చెబుతాడు కార్తీక్. ఇంతకీ నువ్వెక్కడికి వెళ్లావని దీప అడగ్గా.. మా నాన్న దగ్గరికి తీసుకెళ్లారని అంటాడు కార్తీక్. దీప- సుమిత్రలు క్లోజ్ కావడంతో జ్యోత్స్న వణికిపోతుంది. నాకు భయం మొదలైందని పారుతో అంటుంది. ఈరోజు భోజనం తినిపించింది, కన్నీరు పెట్టుకుందని దగ్గరికి తీసుకుంటే అని టెన్షన్ పడుతుంది జ్యోత్న్స. ఇలాగే ఆ తల్లీకూతుళ్లు అని నోరుజారగా.. పారుకి అనుమానం వస్తుంది. గ్రానీకి నిజం తెలియదు కదా నేను నోరు జారకూడదని అనుకుంటుంది జ్యోత్స్న.
దీప అడ్రస్ లేని అనాథ అని పారు అనగా.. నేను కూడా అనాథనే అని, నువ్వు ఇదివరకటిలా నాతో ఉండటం లేదని అంటుంది జ్యోత్స్న. ఎంత మరిచిపోదామని అనుకున్నా నువ్వు చేసిన పనులు అలాంటివని మండిపడుతుంది పారు. చిన్నప్పుడు నన్నెందుకు మార్చావు.. నన్ను మా అమ్మ దగ్గరే వదిలేయాల్సింది అని అంటుంది జ్యోత్స్న. పిల్లల్ని మార్చింది నువ్వే.. గట్టిగా మాట్లాడితే నిన్ను ఇరికిస్తానని బ్లాక్‌మెయిల్ చేస్తున్నావా? అని మండిపడుతుంది పారు. నువ్వు ఇరుక్కుంటే నేను కూడా ఇరుక్కున్నట్లే, నష్టం జరిగితే ఇద్దరికీ జరుగుతుందని చెబుతుంది జ్యోత్స్న.
నీ మనవడిని, నీ కొడుకుని నేను పట్టించుకుంటాను.. నువ్వు నన్ను పట్టించుకోమ్మని చెబుతుంది. నేను మారిపోలేదని.. ఈ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు ఏ లక్ష్యంతో ఉన్నానో, ఇప్పుడు కూడా అదే లక్ష్యంతో ఉన్నానని అంటుంది పారిజాతం. దీప వల్లే ఈ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయ్ కాబట్టి, నువ్వు సైలెంట్‌గా ఉండమని జ్యోత్స్నతో చెబుతుంది పారు. నువ్వు ఎప్పటికీ ఈ ఇంటి వారసురాలిగానే ఉంటావని అనగా.. దీప ఉండగా అది జరగదని మనసులో అనుకుంటుంది జ్యోత్స్న.
కాంచన దగ్గరికి వచ్చిన శ్రీధర్ కొన్ని సరుకులు, డబ్బులు తీసుకొచ్చి ఇస్తాడు. ఆ సరుకులు, డబ్బు నాకు వద్దు అని చెబుతుంది కాంచన. ఇది నా కుటుంబం అని నా కొడుకు ఇప్పటికే చెప్పాడు కదా అని బదులిస్తుంది. నా కొడుకు, నేను కలిసిపోయామని చెబుతాడు. పాత విషయాలు మనసులో పెట్టుకుని నా సాయం వద్దని చెప్పొద్దని, ప్రస్తుతం మీ ఆర్ధిక పరిస్ధితి ఏమాత్రం బాలేదని అంటాడు శ్రీధర్. వాడికి నీలాగే ఆత్మాభిమానం ఎక్కువని అంటుండగా.. కార్తీక్ వచ్చే సమయం అయ్యిందని వాడు చూస్తే బాగోదని చెబుతుంది కాంచన. మీ నుంచి నేనేం ఆశించడం లేదని చెప్పగా.. మీ నుంచి నేను ప్రేమను ఆశిస్తున్నానని అంటాడు శ్రీధర్.
జీతం లేని పనివాడిలా నా కొడుకు నీ పుట్టింటిలో వెట్టి చాకిరీ చేస్తున్నాడని చెబుతాడు శ్రీధర్. రూపాయి లేకపోతే ఇంట్లో ఏం జరగదని అనగా.. నా కొడుకు ఏదో ఒకటి చేసి ఈ కుటుంబాన్ని పోషిస్తున్నాడు, వాడు సమర్ధుడని అంటాడు. ఏదైనా పెద్ద అవసరం వస్తే ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి పరిగెడతాడని అడుగుతాడు శ్రీధర్. డబ్బు ఇచ్చే ధైర్యం ఏది ఇవ్వదని, నీకు అవసరమైతే ఎవరినో ఒకరిని సాయం అడుగుతావ్ కదా? ఆ ఎవరినో నేనే అనుకోమ్మని అంటాడు. నీ అవసరానికి మించి నీ దగ్గర డబ్బులు ఉన్న రోజున నాకు తిరిగి ఇచ్చేయ్, కానీ ఈ విషయం కార్తీక్‌కి చెప్పొద్దని అంటాడు శ్రీధర్. కార్తీక్ రావడం చూసిన కాంచన ఆ డబ్బుని చీరలో దాచేస్తుంది. ఈ సరుకులు ఎవరు తీసుకొచ్చారని కార్తీక్ అడగ్గా.. మీ నాన్నగారేనని అనసూయ అంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











