Karthika Deepam 2 October 4th: కార్తీక్‌కు కొత్త శత్రువు.. తన హోటల్‌పైనే రైడ్ చేయించుకున్న జ్యోత్స్న
దీప మీద పగలు, ప్రతీకారాలు మానేసి కంపెనీని నష్టాల్లోంచి ఎలా బయటికి తీసుకురావొచ్చు అనేది ఆలోచించమని జ్యోత్స్నతో అంటాడు కార్తీక్. నువ్వు తెలివి తేటలతో మా అమ్మనాన్నలకు దీపను దగ్గర చేశావని అంటుంది జ్యోత్స్న. నువ్వు అదే తెలివి తేటలతో మీ అమ్మనాన్నలను విడగొట్టావు కదా అని అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. ఇంట్లో కార్తీక్ ఆత్మాభిమానం గురించి శ్రీధర్ మాట్లాడుతుండగా భోజనం చేస్తున్న కాశీ కోపంతో లేస్తాడు. దాంతో శ్రీధర్ తన అల్లుడిని కూర్చోమంటూ గట్టిగా కేకలు వేస్తాడు. ప్రతి విషయాన్ని నీతో కనెక్ట్ చేసుకుని భయపడొద్దు, దేన్నయినా గెలిసి సాధించాలని కాశీకి ధైర్యం చెబుతాడు.
అగ్రిమెంట్ నుంచి బయటికి రావడం నీకు ఇష్టం లేదా అని కార్తీక్‌ను కాంచన నిలదీస్తుంది. ఇంతలో శ్రీధర్ వచ్చి కొడుకుని బలవంతంగా బయటికి లాక్కెళ్తాడు. నువ్వు ఇన్ని కష్టాలు పడటానికి దీపే కారణమని మండిపడతాడు. నీ ప్రాణాలు కాపాడిందని ఆమెను పెళ్లి చేసుకుని, ఆమె బిడ్డకు తండ్రివి అయ్యావని అంటాడు. దీపం రుణం ఇంకా తీరలేదని.. అందుకే అగ్రిమెంట్ మీద సంతకం పెట్టానని కార్తీక్ చెప్పడంతో శ్రీధర్‌కి ఏం అర్ధం కాదు. కొడుకుని ఎంత అడిగినా చెప్పకపోవడంతో నేనే ఆ నిజం తెలుసుకుంటానని అంటాడు శ్రీధర్. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. మరి అక్టోబర్ 4వ తేదీ 480వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

ఈ ఇంట్లో నేను ఎలా ఉండాలని నువ్వు కోరుకున్నావో? ఆ రోజు తొందరలోనే వస్తుందని పారుతో అంటుంది జ్యోత్స్న. ఈ వేలం పాటతో నీ మనవరాలి జాతకమే మారిపోతుందని చెబుతుంది. కార్తీక్ గాడిని ఒక్కడిని కంట్రోల్ చేయగలిగితే చాలని అంటుంది పారిజాతం. అందుకే బావని వేలం పాటకి రానివ్వడం లేదని చెబుతుండగా దశరథ, శివన్నారాయణలు కూడా వేలానికి బయల్దేరుతుంటారు. ఇంతలో కార్తీక్ - దీపలు రావడంతో పారిజాతం, జ్యోత్స్నలు షాక్ అవుతారు.
ఇక్కడ గెలిచిన వాళ్లకంటే గెలవాలని ప్రయత్నించేవాళ్లకే శత్రువులు ఎక్కువని సుమిత్రతో అంటుంది జ్యోత్స్న. నీ ఆశీర్వాదం ఉంటే ఎలాంటి శత్రువునైనా ఎదిరించి పోరాడతానని నన్ను ఆశీర్వదించమని బ్లెస్సింగ్స్ తీసుకుంటుంది జ్యోత్స్న. మీ మరదలి హడావుడి ఎక్కువైందని కార్తీక్‌తో సెటైర్లు వేస్తుంది దీప. కార్తీక్‌తో వేలం పాటకు వెళ్దామని శివన్నారాయణ చెబుతాడు. డ్రైవర్ అక్కర్లేదని, కారు నేను డ్రైవ్ చేస్తానని చెబుతుంది జ్యోత్స్న. కారు నువ్వే డ్రైవ్ చేయ్, కానీ కార్తీక్ మనతో పాటే వస్తాడని .. అనుభవం ఉన్నవాళ్లు మనతో ఉంటే మంచిదని చెబుతారు శివన్నారాయణ, దశరథ.
ఇది కోట్లలో జరిగే బిజినెస్, లాభాలొస్తే అందరూ హ్యాపీ.. నష్టాలొస్తే మనమే భరించాలని, కొన్నిసార్లు మనకంటే చిన్నవాళ్ల సలహాలు కూడా పనిచేస్తాయని చెబుతాడు దశరథ. సుమిత్ర ఎదురురావడంతో అందరూ వేలానికి బయల్దేరుతుండగా కార్తీక్‌కి దీప ఆల్ ది బెస్ట్ చెబుతుంది. ఇది ఎందుకు ఇంతలా మురిసిపోతోందని దీపని అడుగుతుంది పారిజాతం. నేను వెళ్లాను కాబట్టి జ్యోత్స్న ధైర్యంగా వేలం పాట పాడింది, గెలిచిందని చెప్పుడానికి మీ బావ వెళ్లాడని అంటుంది పారు. ఒకరి విజయాన్ని తన ఖాతాలో వేసుకునే మనిషి కాదు మా బావ, తన నమ్మకం ఏంటంటే మా బావ వెళితే అక్కడ ఏ చెడు జరగదని అంటుంది దీప.
నా మనవరాలు గెలుస్తుందని మీ అందరికీ కుళ్లు.. అది ఓడిపోగానే మీ బావని కంపెనీకి సీఈవోని చేయాలని నువ్వు దశరథని కాకాపడుతున్నావని నాకు తెలుసని అంటుంది పారిజాతం. చెల్లెలి గురించి, చెల్లెలి కొడుకు గురించి తప్పించి కూతురు గురించి దశరథ ఆలోచించడం లేదని చెబుతుంది. నా మనవరాలు గెలిచి ఇంటికి వస్తుందని, ఎర్రనీళ్లతో దిష్టి తీయడానికి సిద్ధంగా ఉండమని చెబుతుంది పారిజాతం. వేలం పాట దగ్గరికి వైరా వచ్చి శివన్నారాయణ, దశరథలకు ఎదురుపడతాడు. మీ నాన్నకి నా మీద కోపం పోలేదా? బిజినెస్‌లో పార్ట్‌నర్‌షిప్ కుదరక విడిపోయామని దశరథతో అంటాడు వైరా. మనం విడిపోయింది పార్ట్‌నర్‌షిప్ కుదరక కాదు, నువ్వు చేసిన మోసం బయటపడటం వల్ల మన స్నేహం కూడా పదేళ్ల కిందటే చచ్చిపోయిందని చెబుతాడు దశరథ. నువ్వు చేస్తున్న అక్రమ వ్యాపారాలన్నీ నాకు తెలుసని, ఇప్పుడైనా ఎవరినీ మోసం చేయకుండా బతకమని అంటాడు వైరా.
నా ఓటమిని చూడాలనే కదా నువ్వు వేలానికి వచ్చింది అని కార్తీక్‌ని అడుగుతుంది జ్యోత్స్న. గెలవడం ఇంపార్టెంట్ కాదూ.. ఆ ప్రాపర్టీని ఎంతకు కొంటున్నామన్నదే ఇంపార్టెంట్ అని చెబుతాడు కార్తీక్. దాని అంతు కూడా చూద్దామని కార్తీక్, జ్యోత్స్నలు లోపలికి వెళ్తుండగా వైరా ఎదురై ఆమెను పిలుస్తాడు. నేను మీ నాన్నగారి ఫ్రెండ్‌నని పరిచయం చేసుకుంటాడు. కార్తీక్ లోపలికి వెళ్తుండగా.. ఎవరతను, ఎక్కడో చూసినట్లుగా ఉందని జ్యోత్స్నతో చెబుతాడు కార్తీక్.
మీరు జ్యోత్స్న గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈవో అని నాకు తెలుసు.. కొన్నేళ్ల క్రితం నేను కూడా రెస్టారెంట్ బిజినెస్‌లో ఉన్నానని, కానీ కొన్ని కారణాలతో ఆ బిజినెస్‌ను వదిలేశాననని అంటాడు వైరా. మళ్లీ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నానని, ఈ ప్రాపర్టీని వేలంలో కొనడానికి అందుకే వచ్చానని చెబుతాడు. మీరే గెలుస్తానని అనుకుంటున్నారా అని జ్యోత్స్న అడగ్గా.. మీకు ఓటమి అలవాటే కాదని సెటైర్లు వేస్తాడు వైరా. మీ రెస్టారెంట్‌ల గ్రాస్ పడిపోవడానికి మీరే కారణమని విన్నాను, నష్టాల్లో ఎన్నాళ్లని బిజినెస్ రన్ చేస్తారు? మీ రెస్టారెంట్స్‌ని నేను టేకోవర్ చేస్తానని వైరా చెప్పడంతో జ్యోత్స్న రగిలిపోతుంది.
నేను తుఫాన్ లాంటి వాడిని, దేన్నయినా నాశనం చేయగలనని చెబుతాడు వైరా. తుఫాన్లకు చెట్లు కదులుతాయేమో కానీ పర్వతాలు కాదని ఘాటుగా ఆన్సర్ ఇస్తుంది జ్యోత్స్న. ఇక్కడి నుంచి మీరు ఓడిపోయే వెళ్తారని అంటుంది జ్యోత్స్న. వేలం పాట మొదలవుతుండగా వైరా ఎవరని దశరథని అడుగుతాడు కార్తీక్. అతని గురించి నీకెలా తెలుసని దశరథ అడగ్గా.. జ్యోత్స్నతో మాట్లాడాడని అంటాడు కార్తీక్. వాడి గురించి నేను నీకు తర్వాత చెబుతానని దశరథ అంటాడు. కార్తీక్, దశరథలు తన గురించే మాట్లాడుకుంటున్నారని జ్యోత్స్న టెన్షన్ పడుతుంది. మరీ పోటీకి వెళ్లొద్దని, ఎప్పుడు ఎక్కడ ఆగాలో నేను చెబుతానని అంటాడు శివన్నారాయణ.
బావ నన్ను డమ్మీని చేయడానికి వీరిద్దరినీ కంట్రోల్‌లో పెట్టుకున్నాడు.. నేనేమైనా చిన్నపిల్లనా? వేలం ఎంత పడాలో నాకు తెలియదా? వీళ్లని చూస్తుంటే ఆ వైరా గాడి ముందు తలదించుకునే పరిస్ధితి తీసుకొచ్చేలా ఉన్నారని అనుకుంటుంది జ్యోత్స్న. వీళ్లు ఇక్కడే ఉంటే నన్ను వేలం పాడనివ్వరని, వీళ్లని పంపించేయాలని ప్లాన్ చేస్తుంది. వేలం మొదలవ్వడానికి ముందు దశరథకు ఫోన్ వస్తుంది. మన రెస్టారెంట్ మీద ఫుడ్ సేఫ్టీ వాళ్లు రైడ్ చేశారని అక్కడి నుంచి వెళ్లిపోదామని శివన్నారాయణను తీసుకుని వెళ్లిపోతాడు దశరథ. వెళ్తూ వెళ్తూ.. వైరాను కోపం చూస్తాడు దశరథ.
కార్తీక్‌ను కూడా తమతో పాటే వచ్చేయమని శివన్నారాయణ అంటాడు. నేను ఇక్కడే ఉంటానని, మీరు వెళ్లండని చెబుతాడు కార్తీక్. ఇప్పుడున్న టెన్షన్‌లో వీడు డ్రైవింగ్ చేయలేడని, వీడికి కూడా రాదని నన్ను తీసుకెళ్లాల్సింది నువ్వేనని చెబుతాడు శివన్నారాయణ. నా స్ట్రాటజీ మార్చానని అనుకున్న దాని కోసం ఎంత దూరమైనా వెళ్తానని అనుకుంటుంది జ్యోత్స్న. సుమిత్రకు కాఫీ తీసుకుని వస్తుంది దీప. చాలారోజుల తర్వాత నాకు చాలా ఆనందంగా ఉందని సాంబార్ పెడితే హాయిగా తినాలని ఉందని చెబుతుంది సుమిత్ర. నువ్వు టిఫిన్ చేశావా? అని సుమిత్ర అడగ్గా.. చేశానని అంటుంది దీప. నిజం చెబుతున్నావా? అబద్ధం చెబుతున్నావా? అని సుమిత్ర అడుగుతుంది. మీతో అబద్ధం ఎందుకు చెబుతానని దీప అనగా.. అది నీకు అలవాటే కదా అని అంటుంది సుమిత్ర. అబద్ధాలు చెప్పి చెప్పి అదే నీ జీవితం అయిపోయిందని అనడంతో దీప షాక్ అవుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











