Karthika Deepam 2 October 6th: వేలం పాటలో జ్యోత్స్న ఓటమి.. కార్తీక్ - దీపలని గెంటేసిన శివన్నారాయణ
Photo Courtesy: JioHotstar
ఉదయాన్నే శివన్నారాయణ, దశరథలు రెడీ అయి జ్యోత్స్న దగ్గరికి వస్తారు. వేలం పాటకి వెళ్తుండటంతో నాకు అన్ని విజయాలు దక్కాలని తల్లి ఆశీర్వాదం తీసుకుంటుంది జ్యోత్స్న. కార్తీక్ రాకముందే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని పారుతో జ్యోత్స్న అంటుండగా.. ఇంతలో కార్తీక్, దీపలు అక్కడికి వస్తారు. మనతో పాటు గతంలో సీఈవోగా ఎంతో అనుభవం ఉన్న కార్తీక్ కూడా వేలం పాటకు వస్తాడని శివన్నారాయణ చెప్పడంతో జ్యోత్స్న మండిపడుతుంది.
నా మీద మీకు నమ్మకం లేదా అని ఆమె అడగ్గా.. మనం కోట్లలో బిజినెస్ చేస్తున్నామని.. ఏ చిన్న తప్పు చేసినా నష్టాన్ని భరించాల్సి వస్తుందని దశరథ అంటాడు. దాంతో చేసేదేం లేక కార్తీక్ రావడానికి ఒప్పుకుంటుంది జ్యోత్స్న. వేలం పాట దగ్గర దశరథకు శత్రువైన వైరా ఎదురుపడతాడు. నువ్వు చేసిన మోసాన్ని ఈ జన్మలో మరిచిపోలేనని అంటాడు దశరథ. వారు లోపలికి వెళ్లగానే జ్యోత్స్నని కలుస్తాడు వైరా. నష్టాల్లో ఉన్న మీ కంపెనీని నేనే కొంటానని చెప్పడంతో జ్యోత్స్న రగిలిపోతుంది. వేలం పాట నుంచి కార్తీక్, శివన్నారాయణ, దశరథలను బయటికి పంపేలా కుట్ర చేస్తుంది జ్యోత్స్న. మరి అక్టోబర్ 6వ తేదీ 481వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
నా కూతురు విజయం సాధించి ఇంటికొచ్చి ఆమెను ప్రేమగా ముద్దుపెడుతున్నప్పుడు, ఆమెతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు నువ్వు కళ్లు తిరిగి పడిపోతే మాకు ఇబ్బందిగా ఉంటుందని దీపని నానామాటలు అంటుంది సుమిత్ర. నా కూతురు జీవితంలోకి ఏ ఆనందం వచ్చినా నువ్వు తట్టుకోలేవు.. దానిని ఏదో విధంగా పాడు చేయడానికి ప్రయత్నిస్తావని చెబుతుంది. నన్ను ఈ ఒక్క పూటైనా కడుపు నిండుగా తినని అంటుంది సుమిత్ర. ఇంతలో దీపను పారు పిలిచి తినడానికి పచ్చి కూరగాయలు కావాలని అడుగుతుంది. ఇన్ని సదుపాయాలు ఉన్న మేమే భవిష్యత్ గురించి ఇంత భయపడుతుంటే.. దమ్మిడి ఆదాయం లేని మీరు ఎలా బతుకుతారని నిలదీస్తుంది పారు. అసలు మీరు ఏ ధైర్యంతో బతుకుతున్నారు? అని పారు ప్రశ్నించగా.. మా బావ ఉన్నాడనే ధైర్యంతో అని చెబుతుంది దీప. ఎలా పోషిస్తున్నాడో మా బావని అడిగితే చెబుతాడని కౌంటర్ వేస్తుంది.
రెస్టారెంట్‌కి వెళ్తూ కార్తీక్‌ను ఇక్కడే ఉండమని చెబుతాడు దశరథ. నాకేం టెన్షన్ లేదని, నేను కారు డ్రైవ్ చేస్తానని, పైగా ఆ వైరా ఇక్కడే ఉన్నాడని ఎవరో ఒకరు ఇక్కడే ఉండటం మంచిదని చెప్పి వెళ్లిపోతారు దశరథ, శివన్నారాయణ. ఉన్నట్లుండి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు రైడ్‌కి రావడం ఏంటీ? ఈ వైరాకి ఈ రైడ్‌కి సంబంధం ఉందా? లేక జ్యోత్స్న హస్తం ఉందా? అని ఆలోచిస్తుంటాడు కార్తీక్. వేలం పాట మొదలై వైరా, జ్యోత్స్నలు పోటాపోటీగా వేలం పాట పాడతారు. 14 కోట్ల రూపాయల వరకు పాట వెళ్లగా.. ఇంతకీ మించి పాడితే మీకే నష్టమని ఓ అమ్మాయి వచ్చి చెప్పినా జ్యోత్స్న పట్టించుకోదు. కార్తీక్ ఈ పాటను ఇక్కడితో ఆపాలని చూస్తాడు. ఇంతలో వైరా 15 కోట్ల వరకు వెళ్లగా.. దానికి పోటీగా జ్యోత్స్న 16 కోట్లకు పాడుతుంది.
దాంతో కార్తీక్ నాశనం సర్వనాశనం అని టెన్షన్ పడతాడు. దాంతో ఒకేసారి 19 కోట్లకు పాటపాడుతుంది జ్యోత్స్న. ఈ అమాయకురాలు కోట్లు అనుకుంటే మామయ్య వేసుకునే కోట్లు అనుకుంటుందా అని కార్తీక్ కంగారు పడతాడు. నేను నాది అనుకుంటే అది నాదేనని మనసులో అనుకుంటుంది, నన్ను అనవసరంగా రెచ్చగొట్టావని అనుకుంటుంది జ్యోత్స్న. ఇంతకుమించి పాడొద్దని వైరాకు అతని ఫ్రెండ్ చెబుతాడు. దశరథ, శివన్నారాయణలతో పోటీ పడాలనుకుంటే వాళ్లు పారిపోయారని ఈ పిల్ల కుంక నన్ను రెచ్చగొడుతుందని మండిపడతాడు వైరా. 20 కోట్లు దాటించి వేలం ఆపేస్తానని, ఆపై దానిని చావు దెబ్బ కొడతానని చెబుతాడు వైరా.
చెప్పినట్లుగానే వైరా 20 కోట్లు పాడటంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. జ్యోత్స్న గ్రూప్‌కి కోలుకోలేని నష్టాలు తీసుకురావాలన్నదే ఈ వైరా గాడి ప్లాన్ అని కార్తీక్ అర్ధం చేసుకుంటాడు. వీడి స్ట్రాటజీగా ముందే జ్యోత్స్నని రెచ్చగొట్టాడని, మన మేడం గారికి ఆ సంగతి తెలియదు కదా రెచ్చిపోయిందని అనుకుంటాడు కార్తీక్. ఇక్కడితో మరదల్ని ఆపేయాలని లేకపోతే ఇంకా పాడుతుందని ఊహిస్తాడు. నువ్వు 20 అంటే నేను భయపడి వెనకడుగు వేస్తానని అనుకున్నావా? అని వైరాను చూస్తూ అనుకుంటుంది జ్యోత్స్న. నువ్వు వేయవని నాకు తెలుసు జ్యోత్స్న.. నాకు కావాల్సింది అదే .. 21 కోట్లు అంటే చాలు నేను సైలెంట్‌గా ఉంటాను, నువ్వు పూర్తిగా మునిగిపోతావని అనుకుంటాడు వైరా.
నా పాట దాటి ఇక్కడ పాడే సత్తా ఎవ్వరికీ లేదని చెబుతాడు వైరా. వీడు రెచ్చగొడుతున్నాడని, జ్యోత్స్నని ఆపాలని అనుకుని బయటికి వెళ్తాడు. నా పాటే ఖాయం చేసుకోండి, కొంతమంది కేవలం మాటలకే చేతలకి పనికిరారని, వైరా తుఫాన్ అని కొండల్ని కూడా కిందకి దించుతాడని రెచ్చగొడతాడు వైరా. జ్యోత్స్న పాట పాడుతుండగా ఆమెకు ఫోన్ రావడంతో షాక్‌లో ఆగిపోతుంది. నువ్వే గెలిచావని కోపంగా వెళ్లిపోతుంది. జ్యోత్స్న వెళ్లిపోవడంతో వైరా షాక్ అవుతాడు. జ్యోత్స్న బయటికి వెళ్తుండగా బయట కార్తీక్‌ని చూసి షాక్ అవుతుంది. నువ్వు ఇక్కడ ఉన్నావేంటీ? డాడీతో ఎందుకు వెళ్లలేదని అడుగుతుంది జ్యోత్స్న. కంపెనీని కాపాడటానికి అని చెబుతాడు కార్తీక్. అంటే నాకొచ్చిన ఫోన్ కాల్ అని జ్యోత్స్న అంటుండగా.. నేనే చేయించానని చెబుతాడు కార్తీక్.
అత్తయ్యని కాఫీ అడగలేక లోపలికి వెళ్లిపోతాడు కాశీ.. ఇది చూసిన శ్రీధర్.. స్వప్నని పిలిచి కాఫీని కాశీకి ఇవ్వమని చెబుతాడు. కాఫీ చూడగానే కాశీ ఎంతో సంతోషిస్తాడు. నేను కాఫీ తాగడానికి ముందు అడిగితేనే ఇస్తావా? అడక్కపోయినా ఇస్తావా? అని కావేరిని నిలదీస్తాడు శ్రీధర్. నువ్వు కూడా నీ భర్తకు అడగకుండానే కాఫీ ఇవ్వాలని స్వప్నకు చెబుతాడు శ్రీధర్. నేను ఖాళీగా లేనని న్యూస్ పేపర్‌లో జాబ్స్ గురించి సెర్చ్ చేస్తూ డిటెయిల్స్ కనుక్కుంటున్నానని చెబుతుంది స్వప్న. నువ్వు నీ భర్త కోసం కష్టపడుతున్నావ్.. కానీ అది నీకు ఒక్కదానికే అర్ధమైతే ఎలా అని శ్రీధర్ మండిపడతాడు. మీ అమ్మ నా విషయంలో ఎలా ఉంటుందో, నువ్వు నీ భర్త విషయంలో అలా ఉంటే చాలని అంటాడు. మరోసారి అల్లుడు కాఫీకి కానీ భోజనానికి కానీ ఇబ్బంది పడకూడదని.. జాబ్ చేసేటప్పుడు ఎలా చూశావో, ఇప్పుడు కూడా అలాగే చూడమని స్వప్నకి చెబుతాడు శ్రీధర్.
వేలంలో ఓడిపోవడంతో జ్యోత్స్న రంకెలు వేస్తుంది. ఇంట్లో నుంచి వెళ్లేటప్పుడే నీకు చెప్పాను .. నా గెలుపుని ఓర్చుకోలేని వారు నా చుట్టూనే ఉన్నారని దీప, కార్తీక్‌లపై మండిపడుతుంది. మా బావ ఏం చేసినా ఈ ఇంటి క్షేమం కోసమే చేస్తారని చెబుతుంది దీప. వేలం పాట చివరిలో ఉంది.. ఇంకో కోటి రూపాయలు పెట్టానంటే ఆ రెస్టారెంట్ మాది అయ్యేదని, నా కంపెనీని నష్టాల్లోంచి బయటపడేయటానికి నేను వేసుకున్న ప్లాన్లు నాశనం అయ్యాయని అంటుంది జ్యోత్స్న. నీతో మాట్లాడి అనవసరమని, అబద్ధం చెప్పి ఎందుకు వేలం పాట పాడనివ్వకుండా చేశావని నిలదీస్తుంది జ్యోత్స్న. నువ్వు ఆ వైరా గాడికి అమ్ముడు పోయావా? నీకు ఎంతిచ్చాడు అని ప్రశ్నించడంతో కార్తీక్ మండిపడతాడు.
ఇదంతా ఒక ట్రాప్ అని కార్తీక్ చెప్పబోతుండగా.. నువ్వు కలగజేసుకోకుండా ఉండి ఉంటే ఆ ఆస్తి మాది అయ్యేదని చెబుతుంది జ్యోత్స్న. బిజినెస్ నీకు మాత్రమే కాదు , నాకు కూడా తెలుసని అంటుంది. నిన్ను ఇంటి దగ్గరే వద్దు అన్నానని, మా తాతే నా మాట వినలేదని ఇందుకు మీరేం సమాధానం చెబుతారో చెప్పండి అని నిలదీస్తుంది. మీరైనా నేను ఎందుకు చేశారో అర్ధం చేసుకోమని కార్తీక్ చెప్పబోతుండగా శివన్నారాయణ కూడా కోప్పడతాడు. అసలు నా మనవరాలికి అబద్ధం చెప్పి పాట ఆపడానికి నువ్వు ఎవరు? పాపం తనేదో వేలం పాటలో తనను తాను నిరూపించుకోవాలని ట్రై చేస్తుంటే నువ్వు ఎవడ్రా ఆపడానికి అంటాడు.
అంటే బిజినెస్ గురించి మాకు తెలియదా? నీ దగ్గర మేం పాఠాలు నేర్చుకోవాలా? అని మండిపడతాడు. నీలాంటి వాళ్లు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదని, నువ్వెళ్లి అగ్రిమెంట్ తీసుకురా నేను వీడిని క్షమించనని జ్యోత్స్నకి ఆర్డర్ వేస్తాడు శివన్నారాయణ. దాంతో జ్యోత్స్న అగ్రిమెంట్ పేపర్స్ తీసుకురావడానికి వెళ్తుంది. నా కూతురు జీవితంలో ఎలాంటి సంతోషాన్ని వీరు రానివ్వరని సుమిత్ర నానామాటలు అంటుంది. జ్యోత్స్న పాట పాడకుండా ఆపాలని దీపే.. కార్తీక్‌కి చెప్పి ఉంటుందని మండిపడుతుంది పారు. నీ భార్యాభర్తలిద్దరూ ఇన్నాళ్లు మాకు చేసిన మంచి చాలని శివన్నారాయణ అంటాడు. వీళ్లు చేసిన దానికి ఊరికే వదిలేయాలా అని అడగ్గా.. మెడపట్టుకుని బయటికి గెంటేయాలని చెబుతుంది జ్యోత్స్న. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











