Karthika Deepam 2 October 11th: వైరాకి కార్తీక్ మాస్ వార్నింగ్... దీప పుట్టుకపై దాస్‌ని నిలదీసిన శ్రీధర్
Photo Courtesy: JioHotstar
కంపెనీ నష్టాల్లో ఉన్నందున మేం ఇకపై కొనసాగాలని అనుకోవడం లేదని, కంపెనీలో ఉన్న 50 శాతం వాటాను మరొకరికి అమ్మేయాలని అనుకుంటున్నట్లు చెబుతారు బోర్డు మెంబర్స్. ఎవరికి అమ్మాలని అనుకుంటున్నారని దశరథ అడగ్గా.... వైరా ఎంట్రీ ఇస్తాడు. అతనిని చూసి శివన్నారాయణ, దశరథ, జ్యోత్స్నలు షాక్ అవుతారు. మీరు ఎవరికైనా షేర్స్ అమ్ముకోవచ్చు కానీ ఇతనికి మాత్రం వద్దని చెబుతాడు దశరథ.
కంపెనీ చేజారిపోయేలా ఉండటంతో మేనేజర్ వెళ్లి కార్తీక్‌కి చెబుతాడు. దాంతో కార్తీక్ తనని లోపలికి పిలవాల్సిందిగా స్లిప్ మీద రాసి శివన్నారాయణకి ఇవ్వమని చెబుతాడు. అది చూసిన శివన్నారాయణ వెంటనే కార్తీక్‌ని లోపలికి రమ్మని పిలుస్తాడు. బోర్డ్ నియమ నిబంధనల గురించి కార్తీక్ భయపెట్టడంతో బోర్డ్ మెంబర్స్ షేర్స్ అమ్మడానికి వెనుకంజ వేస్తారు. తనని ఫూల్‌ని చేశారని జ్యోత్స్న రగిలిపోతూ ఉంటుంది.. ఆఫీస్ బయట కార్తీక్‌తో వైరా మాట్లాడతాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి అక్టోబర్ 11వ తేదీ 486వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
నీతో నాకు ఎలాంటి వైరం లేదని, దశరథతో నేను తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయని నువ్వు అడ్డు పడొద్దని కార్తీక్‌కి వార్నింగ్ ఇస్తాడు వైరా. పడితే అని కార్తీక్ అడగ్గా... నువ్వు వెళ్తున్న కారుని లారీ గుద్దొచ్చు, నీ ఫ్యామిలీ మీద ఎవరైనా అటాక్ చేయొచ్చు, నీకు ఓ చిన్న కూతురు ఉందని విన్నాను.... కానీ మనం చేసే పనులకి ఫ్యామిలీ ఎఫెక్ట్ కాకూడదు కదా అని చెబుతాడు వైరా. నువ్వంటే భయపడే నలుగురిని చూసి అందరూ ఇలాగే ఉంటారని ఇలాంటి అంచనాకు వచ్చినట్లుగా ఉన్నావని, నా లాంటోడు నీకింకా తగల్లేదని అంటాడు కార్తీక్. నువ్వు నా కూతురు గురించి మాట్లాడావు కదా? ఊరికి పోతురాజు ఎలాగో నా ఫ్యామిలీకి నేను అలాగే అంటాడు కార్తీక్.
ఊరి జోలికి వస్తే పోతురాజు కత్తి వాడతాడో లేదో కానీ నా ఫ్యామిలీ జోలికి వస్తే ఈ పోతురాజు కత్తి వాడతాడని వార్నింగ్ ఇస్తాడు. ఫ్యామిలీ అంటే నా అన్నవాళ్లంతా అందులో ఉంటారు, కంపెనీ ఎంప్లాయిస్‌తో సహా అని చెబుతాడు కార్తీక్. నేను డ్రైవర్‌ని కారుని నడుపుతాను, కంపెనీని నడుపుతానని అంటాడు. తేడా వస్తే కారుని రిపేర్ చేస్తాను, కంపెనీని రిపేర్ చేస్తాను.. నీ లాంటి వాళ్లు ఏదో చేయాలని, ఎవరినో గెలవాలని వస్తే వాళ్లందరికీ సెండాఫ్ ఇవ్వడానికి కార్తీక్ అనే వాడు సిద్ధంగా ఉంటాడని చెబుతాడు.
వేలం పాటలో కూడా నేను నష్టపోవడానికి కారణం నువ్వేనని తెలుసుకున్నానని, నేను దేనిని అంత తేలిగ్గా వదలనని వార్నింగ్ ఇస్తాడు వైరా. ట్రాన్స్‌ఫార్మర్‌ని ముట్టుకుంటే చస్తారు... ఇప్పుడు నువ్వు ట్రాన్స్‌ఫార్మర్ ముందే ఉన్నావని వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. తెలియకుండానే నేను గేమ్ మొదలుపెడితే 10 కోట్లు నష్టం వచ్చింది.. ఇప్పుడు తెలిసి గేమ్ ఆడితే ఈసారి నష్టం డబ్బు రూపంలో ఉండదని వార్నింగ్ ఇస్తాడు కార్తీక్. మనం కలవడం ఇదే ఆఖరిసారి అయితే నీకు ఇదే మంచిదని చెబుతాడు.
జ్యోత్స్న అక్క నిన్నెందుకు కలిసిందని దాస్‌ని అడుగుతాడు కాశీ. బయట ఫోన్‌లో మాట్లాడుతుంటే తనే ఎదురైంది.. కాశీ జాబ్ గురించి అడిగిందని అంటాడు దాస్. నీ మాటలు అస్సలు నమ్మేలా లేవని... జ్యోత్స్న అక్క నీ చేతుల్ని పట్టుకుని ఎందుకు బతిమలాడుతుందని ప్రశ్నిస్తాడు కాశీ. నేను నీ మాటలు వినలేదని, ఏం మాట్లాడుకున్నారో అడిగేవాడిని కాదని చెబుతాడు. జ్యోత్స్న అక్క ఎలాంటిదో నాకు తెలుసు.... తనకు అవసరం ఉంటేనే ఎవరితోనైనా మాట్లాడుతుందని, మనుషుల్ని అవసరానికి వాడుకుంటుందని... నేను ఆమె ట్రాప్‌లో బలి అయ్యానని అంటాడు కాశీ. కానీ నిన్ను చూసి జ్యోత్స్న అక్క భయపడటం ఏంటీ? తనతో నువ్వేం మాట్లాడావని ప్రశ్నిస్తాడు.
ఖాళీగా ఉంటే ప్రతి విషయం గురించి ఆరా తీయాలనిపిస్తుందని..... ముందు ఉద్యోగం సంగతి చూడమని కొడుక్కి చెబుతాడు దాస్. నాకు ఉద్యోగం లేదని ఇకపై వస్తుందన్న నమ్మకం కూడా లేదని కానీ నన్ను నమ్ముతున్న వ్యక్తివి నువ్వు ఒక్కడివే అనుకున్నానని బాధపడతాడు కాశీ. నాకు జాబ్ లేదు... ఇంట్లో విలువ లేదు, నేనెందుకు పనికిరాని వాడినని మా ఆవిడ అనుకుంటుందని... కానీ నువ్వు కూడా అలాగే అనుకుంటున్నావని మండిపడతాడు. నీ కోపం మనుషుల మీద కాదు... ఉద్యోగం మీద చూపించు... ఊరికే భార్యని, మామగారిని ఆడిపోసుకోవద్దని ఫైర్ అవుతాడు దాస్. వాళ్లు మంచోళ్లు కాబట్టే నీకు ఉద్యోగం లేకపోయినా నిన్ను ఇంట్లోనే ఉంచుకున్నారని చెబుతాడు.
అసలు కొడుకు కోసం నువ్వేం చేశావో ఆలోచించమని నిలదీస్తాడు కాశీ. మా మామగారు తన కొడుకుని వదిలేశాడు, నువ్వు నీ కొడుకుని వదిలేశావ్... నువ్వు కూడా చేతకానీ తండ్రివేనని అనడంతో కాశీని కొట్టబోతాడు దాస్. ఇంతలో శ్రీధర్ వచ్చి దాస్‌ని ఆపుతాడు. ఈ మధ్య మా ఆయన గారికి కోపం వస్తోందని... ఏం మాట్లాడినా ఆయనకి జాబ్ లేకపోవడం వల్లనే అనే అపోహలో ఉన్నాడని అంటుంది స్వప్న. మనం చేసిన పని ఎంతమందిని బాధపెడుతుందో చూశావా? అని కాశీకి క్లాస్ పీకుతాడు శ్రీధర్. దాస్ చాలా మంచోడని... అలాంటి వ్యక్తికి చేయ్యెత్తి కొట్టేంత కోపం వచ్చిందంటే నీ మాట అతని మనసుని ఎంతలా గాయపరిచిందో అర్ధం చేసుకున్నావా? అని అడుగుతాడు శ్రీధర్. నువ్వు నా కోసం ఏం చేశావని ఏ తండ్రిని అడిగినా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేడని... నీకు కొడుకు పుట్టి, వాడు నీ అంత అయిన తర్వాత ఇదే ప్రశ్న నిన్ను అడిగితే నువ్వు తట్టుకోలేవని చెబుతాడు శ్రీధర్. మీ నాన్నకి నువ్వు తప్ప ఎవరూ లేరని చెప్పడంతో కాశీ బాధపడతాడు.
ఒక వారంలో మీటింగ్ పెట్టుకుందామని బోర్డ్ మెంబర్స్‌కి చెప్పానని జ్యోత్స్నతో అంటాడు శివన్నారాయణ. కంపెనీ తిరిగి లాభాల్లోకి రావాలంటే ఓ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని చెబుతాడు. సీఈవోగా నువ్వు కంపెనీని నడిపించలేవని అందరికీ అర్ధమైపోయిందని శివన్నారాయణ చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. బోర్డ్ మెంబర్స్ వద్దు అని చెప్పేలోగా... నువ్వే రాజీనామా చేయమని అనడంతో పారు, జ్యోత్స్న, సుమిత్రలు షాక్ అవుతారు. వ్యాపారాలు చేసేటప్పుడు నష్టాలు, లాభాలు రెండూ ఉంటాయని ... మీరిద్దరూ కంపెనీని నడిపినప్పుడు, బావ సీఈవోగా ఉన్నప్పుడు నష్టాలు రాలేదా? అని జ్యోత్స్న ప్రశ్నిస్తుంది. నష్టాలొచ్చినా కంపెనీ గ్రాఫ్ పడిపోలేదని, నిలబెట్టుకున్నామని చెబుతాడు దశరథ.
నేను కూడా నిలబెట్టుకుంటానని జ్యోత్స్న చెప్పగా... అలాంటి నమ్మకం మన బోర్డ్ మెంబర్స్‌కి కనిపించడం లేదని అంటాడు దశరథ. మీ మనవరాలిని మీరే ప్రమోట్ చేయకపోతే అది మీకే అవమానం కాదా? అని అడుగుతుంది జ్యోత్స్న. మీరంతా బావ ట్రాప్‌లో పడిపోయారని అనగా... ఈరోజు వాడే మనల్ని సేవ్ చేశాడని దశరథ చెబుతాడు. నీకు నీ కూతురు కంటే నీ మేనల్లుడే గొప్పగా కనిపిస్తాడని జ్యోత్స్న అనడంతో దశరథ అవునని అంటాడు. మన శత్రువు కంపెనీలోకి అడుగుపెట్టి మన మీద పగ తీర్చుకోవాలని చూస్తున్నాడని చెబుతాడు. 50 పర్సంట్ షేర్స్ తీసుకోమని నువ్వే వాడికి వెల్‌కమ్ పలికావని, కానీ కార్తీక్ కంపెనీ వైరా చేతుల్లోకి వెళ్లకుండా చేశాడని దశరథ అంటాడు.
నువ్వు వెంటనే సీఈవో పోస్ట్‌కి రిజైన్ చేయమని దశరథ చెప్పగా... చేయనని అంటుంది జ్యోత్స్న. నేను నీకిచ్చిన టైంలో రెండు వారాలు గడిచిపోయాయని, నెక్ట్స్ బోర్డ్ మీటింగ్‌లో కొత్త సీఈవోని అనౌన్స్ చేస్తానని శివన్నారాయణ చెప్పడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. బోర్డ్ ఎవరినైతే సీఈవోగా నిర్ణయిస్తుందో.... వాళ్లే ఈ సంస్థను నడిపిస్తారని చెబుతాడు. అప్పటి వరకు నాకు టైం కావాలని జ్యోత్స్న అడగటంతో శివన్నారాయణ సరేనంటాడు. నువ్వే సీఈవోగా రాజీనామా చేస్తే మంచిదని దశరథ హితవు పలుకుతాడు. పరువు పొగొట్టుకోవడం కంటే పదవి పోగొట్టుకోవడమే బెటర్ అని సుమిత్ర కూడా చెబుతుంది.
కాశీ అన్న మాటలతో బాధపడుతున్న దాస్ దగ్గరికి శ్రీధర్ వచ్చి కాఫీ ఇస్తాడు. కార్తీక్ గురించే నా బెంగంతా అని శ్రీధర్ చెప్పడంతో వాడు బంగారమని అంటాడు దాస్. వాడేం చేసినా కారణం లేకుండా చేయడని దాస్ చెప్పడంతో ఆ కారణం నీకు తెలుసా అని శ్రీధర్ ప్రశ్నిస్తాడు. నా కొడుకు శివన్నారాయణ గారింట్లో ఊడిగం చేయడానికి కారణం ఏంటని అడిగితే దీప అని అంటున్నాడు, అగ్రిమెంట్ బ్రేక్ చేయకుండా ఎందుకు ఉంటున్నాడో తెలియడం లేదని బాధపడతాడు. దీప... కార్తీక్ - సుమిత్రల కూతురని... ఆ ఇంటి వారసురాలిని ఆ ఇంటికి చేర్చడానికి కార్తీక్ చేస్తున్న పోరాటమని మనసులో అనుకుంటాడు దాస్. జ్యోత్స్న నిన్నెందుకు కలిసిందని నిలదీస్తాడు శ్రీధర్.
నీ కూతురు కళ్యాణికి కూతురు పుట్టి పురిట్లోనే చనిపోయింది, జ్యోత్స్న పుట్టిన హాస్పిటల్‌లోనే కళ్యాణికి ఆడబిడ్డ పుట్టిందని అడుగుతాడు శ్రీధర్. నేను హాస్పిటల్‌కి వెళ్లేసరికి బిడ్డ చనిపోయిందని మా అమ్మ చెప్పిందని అంటాడు దాస్. బావకి అనుమానం మొదలైందని దీనిని నేను ఆపలేనని మనసులో అనుకుంటాడు దాస్. కార్తీక్‌ని శివన్నారాయణ పిలిచి నేను భయపడటం చూశావా? అని అడుగుతాడు. నాకు తెలిసి నువ్వు కూడా చూసుండవని అంటాడు కార్తీక్. కానీ ఈరోజు నాలో భయాన్ని మొదటిసారి చూశానని, తల తీసుకోవడానికైనా సిద్ధపడతాను కానీ... ఓటమిని మాత్రం వదులుకోనని అంటాడు శివన్నారాయణ. యుద్ధాన్ని గెలిపించడానికి నువ్వు నా పక్కన నిలబడతావా? నన్ను యుద్ధంలో గెలిపిస్తావా? అని అడుగుతాడు. ఈ సముద్రాన్ని నేను ఈదలేను, ఇప్పుడు నాకొక ప్లేయర్ కావాలని చెబుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











