Karthika Deepam 2 October 16th: కుప్పకూలిన శివన్నారాయణ.. జ్యోత్స్న, పారులని కడిగిపారేసిన కాంచన
Photo Courtesy: JioHotstar
కార్తీక్ - దీపలు డ్యూటీకి బయల్దేరుతుండగా అనసూయ వచ్చి దీపను పెంచిన ఆమె ఫోటోను ఇస్తుంది. అలాగే ఊరి నుంచి వస్తూ ఒక ఆడపిల్ల బొమ్మని తీసుకొస్తుంది. నేను ముత్యాలమ్మ అమ్మవారిని ఓ కోరిక కోరానని.. నువ్వు శౌర్యకి చెల్లెలిని కానీ, తమ్ముడిని కానీ ఇవ్వాలని.. కార్తీక్ బాబుకి కూడా ఓ బిడ్డ ఉండాలని దీపని అడుగుతుంది అనసూయ. మీ ఇద్దరి కోరిక తప్పకుండా తీరుతుందని అంటుంది దీప. వీరి మాటల్ని విన్న కార్తీక్ సిగ్గుపడతాడు.
శివన్నారాయణ ఇంటికి కార్తీక్ - దీపలు వెళ్లేసరికి ఇంట్లో అంతా టెన్షన్ పడుతుంటారు. ఏం జరిగింది? ఎందుకలా ఉన్నారని కార్తీక్ అడగ్గా... సుమిత్ర ఇల్లు వదిలి వెళ్లిపోయిందని అంటుంది పారిజాతం. దాంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. బాధలో ఉన్న మనిషికి తోడుగా ఉండాలి కానీ ఇలా చేస్తారా అని పారు, జ్యోత్స్నలపై సీరియస్ అవుతుంది దీప. రాత్రి సుమిత్ర వెళ్లడం జ్యోత్స్న చూసిందని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. రాత్రి ఎవరో బయటికి వెళ్లినట్లుగా ఉందని, కానీ అది మమ్మీ అని తెలియలేదని అంటుంది జ్యోత్స్న. కాశీ తనకు ఉద్యోగం వచ్చినట్లు అపాయింట్‌మెంట్ లెటర్ చూపించడంతో శ్రీధర్, కావేరి, స్వప్నలు సంతోషపడతారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి అక్టోబర్ 16వ తేదీ 490వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
సుమిత్ర కనిపించడం లేదన్న విషయాన్ని కాంచనకి చెబుతాడు శ్రీధర్. ఆ మాట వినగానే కాంచన షాక్ అవుతుంది. వదినకి ఏమైంది? వదిన కనిపించకపోవడం ఏంటీ? అని కాంచన అడుగుతుంది. గత కొద్దిరోజులుగా బావ, సుమిత్ర మాట్లాడుకోవడం లేదు కదా? ఆ విషయం మీదే ఏదో గొడవ జరిగి ఉంటుందని అంటాడు శ్రీధర్. సుమిత్రకి నీలాగే పట్టుదల ఎక్కువ.. ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయింది, నేను వెళ్లి చుట్టుపక్కల వెతుకుతానని చెబుతాడు. దాంతో కాంచన కన్నీళ్లు పెట్టుకుంటుంది. అన్నయ్యకి, వదినకి అంత పెద్ద గొడవ ఏం జరిగింది? అసలు అన్నయ్య ఎలా వెళ్లనిచ్చాడని ఆలోచిస్తుంది.
సుమిత్ర కోసం దశరథ, కార్తీక్‌లు ఊరంతా వెతుకుతారు. ఇంతలో సుమిత్రను తాను అన్న మాటలు గుర్తొచ్చి దశరథ బాధపడతాడు. తను ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి కారణం నేనే, నాకెందుకు ఇంత మొండిపట్టుదల అని కార్తీక్‌తో అంటాడు దశరథ. తను నాతో మాట్లాడుతున్నప్పుడు నేను కూడా మాట్లాడొచ్చు కదా... ఒక శత్రువుని చూసినట్లు చూశానని, కలిసి భోజనం చేసి ఎన్ని రోజులైందో గుర్తులేదని అంటాడు. మాట మనిషి ఇంకెంత నలిగిపోయిందోనని దశరథ కంటతడి పెడతాడు. సుమిత్ర ఏం చేసుకుంటుందోనని భయంగా ఉందని దశరథ అనగా... అత్తకేం కాదని కార్తీక్ ధైర్యం చెబుతాడు.
ఇంతలో కార్తీక్‌కి జ్యోత్స్న ఫోన్ చేసి.. తాత కిందపడిపోయాడని చెబుతుంది. మీరంతా ఇంటి దగ్గరే ఉన్నారు కదా? ఏం చేస్తున్నారని కార్తీక్ మండిపడతాడు. ఎంత లేపుతున్నా తాత స్పృహలోకి రావడం లేదని, భయమేసి నీకు కాల్ చేశానని చెబుతుంది జ్యోత్స్న. కాంచన ఏడుస్తుండగా.. శ్రీధర్ వచ్చి మనం అర్జెంట్‌గా మీ ఇంటికి వెళ్లాలని కంగారుగా చెబుతాడు. వదినకేం కాలేదు కదా అని కాంచన అడగ్గా.. సుమిత్రకేం కాలేదని, కానీ మావయ్య గారికే అని శ్రీధర్ చెప్పబోతుండగా కాంచన కంగారు పడుతుంది. బాగా టెన్షన్‌తో బీపీ ఎక్కువై పడిపోయారని... ఆయనని జాగ్రత్తగా చూసుకోకపోతే పెద్దాయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని చెబుతాడు డాక్టర్. ఆ మాటలతో కాంచన, పారు, కార్తీక్, దశరథ అంతా షాక్ అవుతారు.
మమ్మీ కనిపించిందా? అని జ్యోత్స్న అడగ్గా.. ఎక్కడా కనిపించలేదని చెబుతాడు దశరథ. నేను నా మాటలతో ఆమెను నిలువునా చీల్చేసిన తర్వాత ఎలా కనిపిస్తుందని అంటాడు. నాన్న అప్పటికీ చెబుతూనే ఉన్నాడని, నేనే వినలేదని.. మాటతో పోయేదానిని మనిషిని పోగొట్టుకునే వరకు తెచ్చుకున్నానని బాధపడతాడు దశరథ. మీ నాన్నని ఇలా చూడటం కష్టంగా ఉందని, జ్యోత్స్న నిశ్చితార్ధం ఆగిపోయిన దగ్గరి నుంచి ఏదో ఇంటికి దెయ్యం పట్టినట్లు ఎవరో ఒకరికి నష్టం కలుగుతూనే ఉందని బాధపడుతుంది పారు. డాడీ దగ్గర గ్రానీ సింపతీ ట్రై చేస్తున్నట్లుగా ఉందని మనసులో అనుకుంటుంది.
తప్పు నాదేనని, నాన్న కోసం ఏదైనా చేస్తానని నమ్మేవాడు.. చివరికి నా వల్లే నాన్నకి ఈ పరిస్ధితి వచ్చిందని దశరథ కంటతడి పెడతాడు. కోపం, ఆవేశం మనిషి జీవితాన్ని ఎంత కుదిపేస్తాయో నా కళ్లారా చూశానని అంటాడు. దీప ఎక్కడ అని కార్తీక్ అడగ్గా.. నువ్వు, డాడీ బయటికి వెళ్లిన తర్వాత తను బయటికి వెళ్లిందని చెబుతుంది దీప. అమ్మ కనిపించకపోయేసరికి దీప ఎలా తట్టుకుంటుందో? తను కూడా వెతకడానికి వెళ్లి ఉంటుందని అనుకుంటాడు కార్తీక్. తల్లి కోసం దీప వెతుకుతుండగా రోడ్డు మీద అమ్మవారి ఆలయం కనిపించేసరికి .. ఓ తల్లిని పురిట్లోనే దూరం చేశావు? మరొక తల్లిని చిన్నప్పుడే తీసుకెళ్లిపోయావు? సుమిత్ర - దశరథ్‌లే నా అమ్మనాన్నలని తెలియజేసి ... అమ్మనాన్నల మీద ఆశలు పెంచావని కంటతడి పెడుతుంది దీప.
మా బావ నా జీవితంలోకి వచ్చాక.. ఇక చాలు అనుకునేలోపు, నా కన్నవాళ్లు ఉన్నారని తెలిసింది... నేను వాళ్లతో లేకపోయినా నేను బాగుంటే చాలు అనుకున్నానని ఏడుస్తుంది దీప. ఏదైనా ఒకటి జరుతుందంటే దానికి కారణం ఉందని అంటారు, మా అమ్మ కనిపించకుండా పోవడానికి కారణం ఏంటీ? దీనిని ఎలా అర్ధం చేసుకోవాలని అమ్మవారిని అడుగుతుంది. ఇంతలో దీపకి జాతకం చెప్పిన స్వామిజీ అక్కడికి వస్తాడు. దీప ఏడుస్తుండటంతో ఏం జరిగిందని అడుగుతాడు. నువ్వు చేయని తప్పుకు నింద పడటమే కాదు... ఎవరో చేసిన తప్పుకి కూడా నిందపడుతున్నావని అంటాడు. నీ రక్తపాశం నిన్ను వదిలిపెట్టినా... నువ్వు మాత్రం వదలవు, ఇప్పుడు నువ్వు వెతుక్కుంటూ వెళ్లేది కూడా దాని గురించేనని స్వామిజీ చెబుతాడు.
నా రక్తపాశం నీకు దొరుకుతుందని, ముందున్నవన్నీ చెడ్డదారులేనని ... కానీ కష్టాలకు సిద్దంగా ఉండాలని అంటాడు. నువ్వు తెలియకూడదు అనుకుంటున్న నిజం అందరికీ తెలిసే రోజు వచ్చిందని చెబుతాడు. దానిని ఎవ్వరూ ఆపలేరని అంటాడు. జరగబోయే కల్లోలం ఏంటీ? నేను ఏం కాపాడుకుంటాను? నేను ఏం పొగొట్టుకుంటాను? అని దీప అమ్మవారిని అడుగుతుంది. మంచంపై పడివున్న తండ్రిని చూసి కాంచన కంటతడి పెడుతుంది. నాన్నకి ఏం కాదని దశరథ ధైర్యం చెప్పబోతుండగా.... సుమిత్ర వదిన ఎక్కడ? అని నాన్న అడిగితే ఏం చెబుతావని అడుగుతుంది కాంచన.
ఇదంతా నా వల్లే జరిగిందని దశరథ కంటతడి పెడుతుండగా... నా లాంటి వాడు ఒక మాట తూలాడంటే ఎవ్వరూ పట్టించుకోరు, కానీ ఎప్పుడూ ఒక మాట తప్పుగా మాట్లాడని నీలాంటి వాడు అనకూడని మాటంటే అది వదిలేసేంత తేలిగ్గా ఉండదని చెబుతాడు శ్రీధర్. సుమిత్ర బాగా మెతక మనిషి, ఇన్నేళ్ల జీవితంలో ఆ తాళి తీయడం తప్పించి చెల్లెమ్మ ఏ తప్పూ చేయలేదని.. అదే ఆవిడ జీవితానికి శాపమైందని అంటాడు. అర్ధం చేసుకోవాల్సిన నువ్వు కూడా దూరం పెట్టేసరికి తను తట్టుకోలేకపోయిందని చెబుతాడు శ్రీధర్.
మావయ్య అత్తని సరిదిద్దాలని అన్న మాటలే కానీ, వాళ్లిద్దరి మధ్య పగ, ప్రతీకారాలు లేవని అంటాడు కార్తీక్. కూర్చొని మాట్లాడుకుంటే అయేపోయే చిన్న విషయమే... కానీ మీరు నాతో ఎందుకు మాట్లాడరని అత్త గట్టిగా నిలదీసి అడగలేదని చెబుతాడు. తనను ఇంత దూరం ఎందుకు పెట్టాలి? తనకంటూ ఉన్నది నేనొక్కడినే కదా అని మావయ్య ఆలోచించలేదని అంటాడు కార్తీక్. కొందరు కళ్లముందు ఉన్నప్పుడు మనసు సరిగా పనిచేయదని జ్యోత్స్న అనగా కాంచన మండిపడుతుంది. నీకు సిగ్గుగా లేదా? మీ అమ్మ నీ కళ్లెదురుగానే గేటు దాటిపోతుంటే ఆపకుండా తప్పు చేసింది నువ్వు అని ఫైర్ అవుతుంది. నిన్ను అందరి ముందు తిట్టడం ఎందుకని నేను కామ్‌గా ఉంటే... నువ్వు అనవసరమైన విషయాలు మాట్లాడుతున్నావని మండిపడుతుంది.
దాన్ని కాదు.. పెద్దదానివి ముందు నిన్ను ఛీ అనాలని పారిజాతంపై రగిలిపోతుంది. పిన్ని అంటే తల్లి తర్వాత తల్లి లాంటిది.. నా తల్లి బతికుంటే కోడల్ని ఇలా పోనిచ్చేదా? మనవరాల్ని ఇలా పెంచేదా? అని ప్రశ్నిస్తుంది కాంచన. కళ్లు కనిపించక చేసిన తప్పే కానీ, కావాలని చేయలేదని అంటుంది పారిజాతం. కళ్లజోడు అప్పుడే తీసి శుభ్రం చేసుకుంటున్నానని... కళ్లజోడు పెట్టుకుని చూస్తే ఎవ్వరూ కనిపించలేదని చెబుతుంది. లేదంటే ఈ ఇంటికి ఇలాంటి పరిస్ధితి రానిస్తానా? అని పారిజాతం కంటతడి పెడుతుంది. ఈయన నీకు తండ్రయితే, నాకు భర్త అని చెబుతుంది. ఇంతలో శివన్నారాయణ స్పృహలోకి వచ్చి సుమిత్ర గురించి అడుగుతాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











