Karthika Deepam 2 October 31st: తిరిగి ఇంట్లో అడుగుపెట్టిన సుమిత్ర.. జ్యోత్స్నని టార్గెట్ చేసిన శ్రీధర్
Photo Courtesy: JioHotstar
కార్తీక్, దశరథ మాటల్ని సుమిత్ర చాటుగా వింటుంది. ఇంతలో అత్తని చూసిన కార్తీక్.. ఆమె దగ్గరికి వెళ్లి మావయ్య దగ్గరికి వెళ్దామని అంటాడు. ఆయన నా ముందు తలదించుకుంటే నేను చూడలేనని అంటుంది. సుమిత్ర వెళ్లిపోబోతుండగా దశరథ వచ్చి ఆపుతాడు. నన్ను క్షమించి ఇంటికి వచ్చేయ్, నువ్వు లేకుండా ఉండలేనని అంటాడు. దశరథ - సుమిత్రలను ఏకాంతంగా వదిలిపెట్టి దీపకి ఫోన్ చేస్తాడు కార్తీక్. ఫోన్ జ్యోత్స్న ఎత్తి దీప, కాంచనలు పోలీస్ స్టేషన్‌లో ఉన్నారని చెబుతుంది. దాంతో కార్తీక్ షాక్ అవుతాడు.
మర్యాదగా మా అమ్మని, భార్యని ఇంట్లో వదిలిపెట్టమని వార్నింగ్ ఇస్తాడు. జ్యోత్స్న వినకపోవడంతో పావుగంటలో పోలీస్ స్టేషన్‌లో భూకంపం చూస్తావని చెబుతాడు. మర్యాదగా మా మమ్మీ ఎక్కడుందో చెప్పమని దీప, కాంచనలను అడుగుతుంది జ్యోత్స్న. దీప మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి.. సెల్‌లో చితకబాదమని పోలీసులకు చెబుతుంది. ఇంతలో శివన్నారాయణ, పారిజాతం సీరియస్‌గా పోలీస్ స్టేషన్ దగ్గరికి వస్తారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా జరిగింది. మరి అక్టోబర్ 31వ తేదీ 503వ ఎపిసోడ్‌లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
ఏ ఆధారంతో దీపని అరెస్ట్ చేశారని ఎస్ఐని శివన్నారాయణ ప్రశ్నిస్తాడు. జ్యోత్స్న ఆరోపించినట్లు సుమిత్ర ఆ ఇంట్లో కనిపించింది? సుమిత్ర ఆ ఇంట్లో ఉండటానికి సాక్ష్యం దొరికిందా? అని నిలదీస్తాడు. కంప్లయంట్ ఇచ్చారన్న ఒకే ఒక్క కారణంతో నా కూతురిని, నా కూతురి కోడల్ని ఎలా అరెస్ట్ చేస్తారని శివన్నారాయణ మండిపడతాడు. సమాధానం చెబుతారా? ఐజీకి కాల్ చేయమంటారా? అని శివన్నారాయణ ప్రశ్నించడంతో.. ఆ ఎస్ఐ క్షమాపణలు చెప్పి, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదని చెబుతాడు. దాంతో ఇప్పుడు ఎఫ్ఐఆర్ రాయమని అంటుంది జ్యోత్స్న. అయితే ఎఫ్ఐఆర్ రాయండి.. నేను పెట్టే కేసు కూడా రాయమని అంటాడు శివన్నారాయణ. నువ్వు నా కూతురి మీద కేసు పెట్టావు.. నేను నీ మీద కేసు పెడుతున్నానని అనడంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. నీ తల్లి కోసం నువ్వు నా కూతురిని స్టేషన్‌లో కూర్చోపెట్టావు.. నా కూతురి కోసం నిన్ను నేను సెల్‌లో వేయిస్తానని అంటాడు శివన్నారాయణ.
నువ్వు ఎస్ఐతో మాట్లాడితే నేను ఐజీతో మాట్లాడతాను? చూస్కుందామా? అని శివన్నారాయణ వార్నింగ్ ఇస్తాడు. అయితే మా మమ్మీ ఏమైంది అని జ్యోత్స్న అడగటంతో నా కోడలు సేఫ్‌గానే ఉందని చెబుతాడు శివన్నారాయణ. కార్తీక్ గాడు మీ తాతయ్యకి ఫోన్ చేసి సుమిత్ర ఎక్కడుందో చెప్పాడని పారిజాతం అంటుంది. మా సుమిత్రకి ఏం కాలేదు.. కాసేపట్లో మా ఇంటిలో ఉంటుందని ఎస్ఐతో చెబుతుంది పారు. నా మనవరాలు చేసిన తప్పుకు నేను మీకు సారీ చెబుతున్నాను, మీరు నా కూతురికి సారీ చెప్పమని ఎస్ఐతో అంటాడు శివన్నారాయణ. దాంతో కాంచనకి సారీ చెబుతాడు ఎస్ఐ. ఈసారి ఎవరి మాటలు నమ్మి తొండరపడొద్దని వెళ్లిపోతుంది కాంచన.
ఇంతలో కాంచనకి శ్రీధర్ ఫోన్ చేసి ... ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదని నిలదీస్తాడు. నేను పోలీస్ స్టేషన్‌కి వచ్చానని కాంచన చెప్పడంతో శ్రీధర్ షాక్ అవుతాడు. సుమిత్రను దీప కిడ్నాప్ చేసిందని కేసు పెడితే పోలీసులు అరెస్ట్ చేయడానికి ఇంటికొచ్చారని చెబుతుంది. దాంతో పారిజాతం ఫోన్ లాక్కొని.. అందరం మా ఇంటికి వెళ్తున్నామని చెబుతుంది. కాంచనపై కేసు పెట్టిన జ్యోత్స్నపై శ్రీధర్ రగిలిపోతాడు. నువ్వు నా భార్య జోలికి వచ్చావంటే నీకు చరమ గీతం పాడే రోజు వచ్చిందని అంటాడు.
ఇంటిలో జ్యోత్స్న పెద్ద గొడవ చేస్తుంది. మా డాడీకేమో కూతురి కంటే మేనల్లుడు ఎక్కువ, భార్య కంటే చెల్లెలు ఎక్కువ.. నీకేమో కొడుకు కంటే కూతురు ఎక్కువ, మనవరాలి కంటే మనవడు ఎక్కువ అని నిలదీస్తుంది. కేసు పెట్టానో లేదో, మనవడు ఫోన్ చేయగానే పరిగెత్తుకుంటూ స్టేషన్‌కు వచ్చావని మండిపడతాడు. స్టేషన్‌లో నన్ను అవమానించావని అంటుంది. దానిని అవమానించడం అనరని పద్దతి లేని నీ ప్రవర్తనని సరిదిద్దడం అంటారని అంటుంది జ్యోత్స్న. రెండ్రోజుల నుంచి మా మమ్మీ కనిపించకపోయినా మేం మాత్రం సైలెంట్‌గా ఉండాలా? అని ఫైర్ అవుతుంది. నీ కోడలి మీద అనుమానం రావడం కాదు, అదే నిజమని అంటుంది జ్యోత్స్న. బావ ఏం చెప్పినా అదే నమ్మే స్థితిలో నువ్వు ఉంటావని, కానీ బావకి నేనే కాల్ చేసినప్పుడు దీప అరెస్ట్ గురించి చెప్పానని అంటుంది. బావకి దీపని ఎలా కాపాడుకోవాలో తెలియక తన మీద కూడా నేనెక్కడ కేసు పెడతానోనని తెలివిగా నీకు కాల్ చేశాడని జ్యోత్స్న ఫైర్ అవుతుంది.
మా మమ్మీ సేఫ్‌గా ఉంది అనడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా అని నిలదీయగా.. ఇంతలో శ్రీధర్ వచ్చి నా భార్య మీ అమ్మని కిడ్నాప్ చేసింది అనడానికి నీ దగ్గర సాక్ష్యం ఉందా అని నిలదీస్తాడు. మా మమ్మీ కనపడకుండా పోవడానికి కారణం దీప అని అంటుంది జ్యోత్స్న. కాంచన ఇంట్లో సుమిత్ర కనిపించిందా? అని శ్రీధర్ అడగ్గా.. మా ఇంట్లో సుమిత్ర లేదని అత్తని చెప్పమని అని అంటుంది జ్యోత్స్న. సుమిత్రమ్మ గారు మా ఇంట్లో లేరని అత్త మీద ఒట్టేసి చెప్పమను అని అనడంతో దీప, కాంచనలు షాక్ అవుతారు. నీ అనుమానం కార్తీక్ భార్య మీద అయితే నా భార్యను ఎందుకు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లావని నిలదీస్తాడు శ్రీధర్. ఈ మధ్య జ్యోత్స్నకి మతిస్థిమితం సరిగా లేదని అంటాడు శివన్నారాయణ. ఆ మాటలతో జ్యోత్స్న, పారిజాతం షాక్ అవుతారు.
తాతంటే నీకు గౌరవం ఉందా? ఈ ఇంటి పెద్దరికానికి విలువ ఉందా? అని శివన్నారాయణ అంటాడు. నేను తప్పు చేశాను ఒప్పుకుంటాను.. మరి మా మమ్మీ సేఫ్‌గానే ఉంది అన్నావు కదా? ఎక్కడుందని నిలదీస్తుంది దీప. ఇంతలో కార్తీక్ వచ్చి నువ్వు వెళ్లి ఎర్రనీళ్లు తీసుకురా అంటాడు. ఎవరికో అర్ధం కాలేదా అయితే ఇలా ఒకసారి చూడండి అని దశరథ, సుమిత్రలను చూపిస్తాడు కార్తీక్. నేను దిష్టి తీస్తానని పారిజాతం వెళ్తుండగా ఆమెను ఆపి దీపనే తీయమంటాడు శివన్నారాయణ. ఈరోజు మీ పెళ్లయిన రోజు.. ఒకప్పుడు కొత్త కోడలిగా ఈ ఇంటి గడప ఎలా దాటి వచ్చావో... ఇప్పుడు అలాగే దాటి రమ్మని అంటాడు కార్తీక్. మమ్మల్ని ఎప్పుడూ విడిచిపెట్టి పోవద్దని సుమిత్రకు చెబుతాడు.
ఇంట్లోకి వెళ్లి శివన్నారాయణ కోడలిపై పడి క్షమాపణలు చెబుతుంది సుమిత్ర. ఈ ఇంటి గౌరవాన్ని, మర్యాదని కాపాడాల్సిన కోడల్ని అవేవీ ఆలోచించకుండా వెళ్లిపోవడం నా తప్పేనని అంటుంది. కష్టం వచ్చినప్పుడు మనతో ఎవరో నిలబడతారో తెలుస్తుందని అంటాడు. నీకు అండగా ఈ కుటుంబం మొత్తం నిలబడిందని చెబుతాడు శివన్నారాయణ. నీ ఆరోగ్యం ఎలా ఉందని అడగ్గా.. మెడిసిన్ లాంటి నా మనవడు పక్కనే ఉంటే నాకేమవుతుందని కార్తీక్‌ను పట్టుకుని చెబుతాడు. ఆ మాటలతో జ్యోత్స్న, పారిజాతంలు రగిలిపోతారు. వీడు సర్వరోగ నివారిణి, వాడొక సంజీవని అనడంతో జ్యోత్స్న కోపంగా వెళ్లిపోతుంది. మీ అమ్మ తిరిగి వచ్చిందని పారిజాతం చెప్పగా.. దానికి కారణం నేను కదా అంటుంది జ్యోత్స్న. మా అమ్మ నా వైపు కూడా చూడలేదని జ్యోత్స్న చెప్పగా.. అంత గ్యాప్ కార్తీక్ గాడు ఎక్కడ ఇచ్చాడని అంటుంది పారిజాతం. మార్నింగ్ డాడీతో నేను కూడా వెళ్తానంటే నువ్వే ఆపావు.. నేను వెళ్లుంటే బావ ఏం చేస్తున్నాడో తెలిసిపోయేదని చెబుతుంది జ్యోత్స్న. తప్పంతా నీదేనని.. నీకు నేను ఎందుకు సపోర్ట్ చేయాలని నిలదీస్తుంది పారిజాతం. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











